తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన పబ్లిక్‌ డేటా బేస్‌ అందుబాటులో లేదా? డేటా ఎప్పటి కప్పుడు అప్‌డేట్‌ కావడం లేదా? ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత లోపిస్తోందా? ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో సందిగ్ధం తలెత్తుతోందా? పథకాల అమలులో, లబ్ధ్దిదారుల  కోతలో ఈ అంశం సర్కారుకు సాకుగా మారనుందా? అందుకే ఇప్పుడు పబ్లిక్‌ డేటా బేస్‌ అంశం తెరపైకి వస్తోందా? గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? అప్పటి డేటా ఎందుకు అప్‌డేట్‌ కాలేదు. ప్రపంచంలోనే రికార్డు సృష్టించామని గొప్పలు చెప్పుకున్న గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రూపకల్పన చేసిన సమగ్ర కుటుంబ సర్వే డేటాబేస్‌ ఎక్కడికి వెళ్లింది? ఆ డేటా ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏ సర్వర్‌లో దాన్ని నిక్షిప్తం చేశారు? ఇవన్నీ యక్షప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయా? ప్రస్తుత ప్రభుత్వానికి అదంతా ఓ మిస్టరీగా మారిపోతుందా? అనేవి విశ్లేషకులనే కాదు.. తెలంగాణ సమాజాన్ని కూడా ఆలోచింపజేస్తున్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అప్పటి ఉద్యమ పార్టీ  తెలంగాణ రాష్ట్ర సమితి (ఆ తర్వాత  భారత రాష్ట్ర సమితి) ప్రభుత్వం పదేళ్లపాటు అధికారం చలాయించింది. ఆ  పాల నంతా అస్తవ్యస్థమయమనే అభిప్రాయం ఉంది. ఖజానా మొత్తం పరుల పాలయ్యిందన్న ఆరోపణలు, అంతులేని అధికార దుర్వినియోగం జరిగినట్లు తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. అంతేకాదు..రాష్ట్ర ప్రజల అధికారిక డేటాను కూడా రాజకీయ ప్రయోజనాలకే వాడుకున్నారన్న ప్రచారం ఉంది. చంద్రశేఖరరావు  ముఖ్యమంత్రి కాగానే, సమగ్ర కుటుంబసర్వే అంటూ ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఆ సర్వేలో నమోదైతేనే మనిషి ఉన్నట్లు లెక్కని,  లేదంటే అసలు తెలంగాణ నివాసితులే కాదు.. అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనే కాదు..  విదేశాల్లో ఉన్న తెలంగాణవాసులను కూడా కేవలం సమగ్ర కుటుంబసర్వే కోసమే స్వస్థలాలకు రప్పించారు. కొన్నాళ్లపాటు ఇది పెద్ద చర్చనీయాంశమైంది.కానీ,  ‘కొండంతరాగం తీసి..’ అన్నట్టుగా ఆ అంశాన్ని ముగించేశారు. కనీసం ఆ ప్రస్తావన కూడా గడిచిన పదేళ్లలో ఎప్పుడూ చేయలేదు. విపక్షాలు, ప్రజాసంఘాలు, విశ్లేషకులు లేవనెత్తితే బీఆర్‌ఎస్‌ పెద్దలు అంతెత్తున విరుచుకు పడ్డారు. కానీ, అప్పటి డేటా మాత్రం ఏమయ్యిందో చెప్పలేదు. ప్రభుత్వ రికార్డుల్లోకి కూడా చేర్చలేదు.

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎక్కడ?

2014 ఆగస్టు 19వ తేదీన ఒకే రోజులో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలు, వారి కేటగిరీ, భూముల వివరాలు, ఇళ్లు  తదితర  వివరాలు సేకరించారు. ఉద్యోగం, వ్యాపారం, ఆదాయాలకు సంబంధించి ప్రతి  కుటుంబంలోని పూర్తి సమాచారం సేకరిం చింది. కానీ, ఆ సర్వే వివరాలను అప్పటి ప్రభుత్వం బయటపెట్టలేదు.  సర్వే నివేదకి  వివరాలు కూడా ఎక్కడా బయటకు రాలేదు. అంతేకాదు.. ఆ సమగ్ర కుటుంబ సర్వే డేటాపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా స్పష్టత  లేదు.

కానీ, రాజకీయంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తన సొంత సర్వే మాదిరిగా వివిధ రకాలుగా ఆ సమాచారాన్ని వాడుకుందనే విమర్శలు ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల సమాచారం సేకరించి.. కులాల వారీగా పథకాలు అమలు చేయడానికి, తద్వారా కేసీఆర్‌ సొంత పార్టీకి మాత్రమే ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకునేందుకు మాత్రమే ఆ సర్వే ఉపయోగ పడిరదనే విమర్శలున్నాయి. అయితే, ఇప్పుడు ఆ డేటాను కూడా పరిశీలించాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ, ఒకవేళ ఆ డేటా దొరికినా..  ఈ పదేళ్లలో జరిగిన మార్పులు, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగునంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న  ఏ సమాచారం ఇప్పుడు ఉపయోగపడుతుందో కూడా తేల్చాలని అధికారులకు చెప్పినట్లు తెలిసింది.

మరోసారి సమగ్ర సర్వే ప్రతిపాదన

ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి సమగ్ర సర్వే చేపట్టాలన్న ఆలోచనలో ఉంది. త్వరలోనే ఆ పబ్లిక్‌ డేటా బేస్‌ రూపొందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారంటున్నారు. రాష్ట్ర ప్రజల సమగ్ర సమాచారంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలకే కాకుండా..ప్రభుత్వ విధానాలకు ఈ డేటాయే కీలకంగా ఉంటుంది. అందుకే రేవంత్‌ ప్రభుత్వం డేటాబేస్‌పై దృష్టిసారించిందంటున్నారు. ప్రధానంగా రేషన్‌ కార్డులకు సంబంధించి డేటా ఎప్పుడో రాష్ట్రం ఏర్పడకముందు  రూపొందినది మాత్రమే అందుబాటులో ఉంది. అప్పటి డేటా ఆధారంగానే రేషన్‌కార్డులు అమల్లో ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను రేషన్‌ డేటాకు ఏమాత్రం వినియోగించ లేదు. అందుకే అసలు రేషన్‌ డేటా అప్‌డేట్‌ కావడం లేదు. గడిచిన ఐదేళ్లుగా అసలు ప్రభుత్వ డేటా అప్‌డేట్‌ కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మకంగా.. భారీ ఖర్చుతో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు పథకాలకు గానీ, ప్రభుత్వ విధానాలకు గానీ పనికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమగ్ర డేటాబేస్‌ను సిద్ధం  చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి, సర్కారు విధానాలను రూపొందిం చడానికి  ఈ డేటాబేస్‌ మాత్రమే కీలకంగా ఉంటుంది.  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ అంశాన్ని గాలికి వదిలేసిందన్న విషయం ఇప్పుడు ప్రభుత్వ సమీక్షల్లో బయట పడుతోంది. అయితే, భవిష్యత్‌లో డేటాబేస్‌ ఆధారంగానే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటోంది రేవంత్‌ సర్కారు.  రాష్ట్రానికి సంబంధించి పూర్తి డేటాబేస్‌ అందుబాటులో ఉంటే అనర్హులు, అర్హుల లెక్క తేల్చడంతో పాటు ఏ వర్గానికి ఏం మేలు చేయవచ్చనేది కూడా స్పష్టత రానుంది. దీంతో ఇప్పటికే వివిధ రకాలుగా ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తోంది.

పథకాలకు, డేటాతో లింకు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా, ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. దాని అమలుకు సిద్ధమయ్యారు. రుణమాఫీని అట్టహాసంగా ప్రారంభించారు కూడా.. అయితే, క్షేత్రస్థాయిలో ఇప్పుడీ అంశం ప్రహసనంగా మారింది. అనర్హులు, అర్హుల విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి విడుదలైన జాబితాల్లో అర్హులతో పాటు.. అనర్హులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. అర్హుల్లోనూ వాళ్ల తీసుకున్న రుణం మొత్తం మాఫీ కాకుండా.. ఎంతో కొంత మాత్రమే సర్కారు ఖజానా నుంచి విడుదలైంది. దీనికి కారణం ప్రభుత్వం.. రుణమాఫీకి సంబంధించి కుటుంబాల నిర్ధారణకు రేషన్‌ కార్డు డేటాను ప్రామణికంగా తీసుకోవడమే.అయితే, ఆ రేషన్‌ కార్డుల డేటా పూర్తి స్థాయిలో ఆప్‌డేట్‌ కాకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిరది. దీంతో, ప్రభుత్వం రాష్ట్రంలోని కుటుంబాలు, ఆయా కేటగిరీల వారీగా ప్రజల సమాచారం రెడీ చేయాలనుకుంటోంది. ఇప్పటికే ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులుగా మారిన రేషన్‌ కార్డులు, గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే, సీసీఎల్‌ఏ దగ్గర ఉన్న రైతుల సమాచారం, ప్రజాపాలనలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న అప్లికేషన్ల డేటాతో పాటు.. వివిధ శాఖల దగ్గర సంబంధిత సమాచారం ఉంది. కానీ, ఇన్నిరకాల డేటాను పరిశీలించి నప్పటికీ వీటిల్లో దేంట్లోనూ పూర్తి స్థాయి అధికారిక డేటా లేదు. ఇప్పుడు రేషన్‌ కార్డు డ్రైవ్‌ తీసుకుంటే ఆ రకంగానైనా క్లారిటీ వస్తుందని ప్రతిపాదనుల ఉన్నాయి. ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఎక్కడ ఎన్ని కుటుంబాలున్నాయో తెలిస్తే..విధాన రూపకల్పన సులభం అవుతుందని, స్కీముల అమలు పక్కాగా ఉంటుందని సర్కార్‌ భావిస్తోంది.

వీటితో పాటు..ప్రస్తుత రేషన్‌ కార్డుల్లోనూ అరకొర సమాచారం ఉన్నట్లు అధికారుల సమీక్షల్లో తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 90 లక్షలకు పైగా ఫుడ్‌ సెక్యురిటీ కార్డులు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డుల సమాచారాన్ని ఒక్కసారి కూడా అప్‌ డేట్‌ చేయలేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు అయి.. వారికి పిల్లలు పుట్టినా కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదు. కుటుంబంలో అన్నదమ్ములు, తల్లిదండ్రులు.. కుమారులు.. పెళ్లయి, వేరుపడినోళ్లకు కూడా కొత్త కార్డులు రాలేదు. కొంతమంది చనిపోయినా వారి పేర్లు కూడా రేషన్‌ కార్డులలో కొనసాగుతున్నాయి. అదే సమయంలో అనర్హులకు చాలామందికి రేషన్‌ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో రేషన్‌ కార్డుల విషయంలో ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌ తప్పనిసరి చేయడంతో.. ఇప్పుడు ఈ కార్డులకు మరింత ప్రాధాన్యత ఏర్ప డిరది. కొత్త కార్డులకోసం దాదాపు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పైగా ఆరోగ్యశ్రీకి రేషన్‌ కార్డు లింక్‌ను కూడా తొలగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో మళ్లీ రేషన్‌ కార్డు డ్రైవ్‌ చేపడితే.. డేటా అంతా ప్యూరిఫికేషన్‌ అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో కోటి 30 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కుటుంబాలు, కుటుంబ సభ్యుల వివరాలను కూడా తీసుకున్నారు. ఆయా గ్యారంటీలకోసం సర్కారు మార్గదర్శకాల మేరకు కుటుంబాల వారీగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే అప్లికేషన్‌ల డేటాను.. ఇతర డేటాతో పోల్చి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం దగ్గర పక్కా ఆప్‌డేటేడ్‌ సమాచారం లేదు.  దీంతో గ్యారంటీల్లో కొన్ని కొందరికి డబుల్‌ అందేలా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది మొదటికే మోసం తెస్తుందని.. ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో కుటుంబాల వారీగా పూర్తి డేటా తీసుకోవాలని..  తొందరగా సమాచారం సేకరించే విషయమై ఆలోచన చేయాలని  అధికారులకు ఆదేశాలు అందాయంటున్నారు.

మరోసారి ఇబ్బందులా…!?

ప్రభుత్వం సర్వే చేస్తుంది సరే.. కానీ, ప్రజల చెవిలో మరోసారి పువ్వులు పెడతారా? ఇబ్బందుల పాలు చేస్తారా? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశ, విదేశాల నుంచి కూడా వేలాది రూపాయలు ఖర్చు. చేసుకొని తెలంగాణ వాసులను సొంతూళ్లకు రప్పించిన చరిత్ర ఉంది. అప్పుడు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి రాగా, స్థానికంగా  జనం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన రోజు అన్ని పనులు మానుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ, దానిద్వారా వీసమెత్తు ప్రయోజనం కూడా చేకూరలేదు. కనీసం ప్రభుత్వ డేటాబేస్‌లో కూడా ఆ వివరాలు అప్‌లోడ్‌ చేయలేదు. బీఆర్‌ఎస్‌ పార్టీ తమ సొంత ప్రయోజనం కోసమే ఆ డేటాను వాడుకుందన్న  ఆరోపణలు ఉన్నాయి. మరి.. ఇప్పుడు కాంగ్రెస్‌ పభ్రుత్వం మరోసారి డేటాబేస్‌ నినాదం ఎత్తుకుంది. ఈసారి కూడా అలాగే జనాన్ని ఇబ్బందులకు గురిచేసి డేటా సేకరిస్తారా? ఈసారి అయినా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లు చెప్పి డేటాను పక్కన పడేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

– సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE