నేపాల్‌లో కనిపిస్తున్నది రాజకీయ సంక్షోభం అనే కంటే వామపక్ష తమాషా అంటే సబబుగా ఉంటుంది. పుష్పకమాల్ దహాల్ (ప్రచండ), కొత్త ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలి ఇద్దరూ కమ్యూనిస్టులే. ప్రచండ మావోయిస్టు. నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్టు లెనిస్ట్ (సీపీఎన్`యూఎంఎల్) పార్టీ నేత ఓలీ. ఈయనే నేపాలీ కాంగ్రెస్‌తో కలసి, ప్రచండను విశ్వాస పరీక్షలో ఓడిరచి ప్రధాని పీఠం అధిష్టించారు. జూలై 15న ప్రధానిగా నాలుగో సారి ప్రమాణం చేశారు. ప్రచండ 18 మాసాల వ్యవధిలో నాలుగు పర్యాయాలు విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. జూలై 12న ప్రచండ విశ్వాస పరీక్షలో ఓడిన కొన్ని గంటలకే దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాజకీయ పార్టీలను కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచారు. మావోయిస్టు నాయకుడు ప్రచండ అనేక సంకీర్ణాలలో పనిచేశాడు. ఏ సంకీర్ణమైనా కొద్దికాలమే కాపురం. ఎందుకంటే సంకీర్ణ భాగస్వామిని మారిస్తే మరింత ‘ప్రగతి’ సాధించవచ్చునని ఆయన నమ్మకమట. అలాంటి పిచ్చి నమ్మకంతోనే ఈ సంవత్సరం మార్చి 4న నేపాలీ కాంగ్రెస్ అనే సంకీర్ణ భాగస్వామికి తన్ని తగలేశాడు. పార్లమెంట్‌లో మెజారిటీ పార్టీ అదే. గడచిన 15 సంవత్సరాలుగా కాపురం సాగించాడు. బుర్రలో ఉన్న ఎర్రపురుగు ఏం చేసిందో మరి! మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని వదిలిపెట్టేసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్`యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీతో జత కట్టాడు. దీని నాయకుడు కేపీ ఓలి. ఇందులో 13 పార్టీలు ఉన్నాయి. అంటే ఇదీ ఒక కూటమే. కాంగ్రెస్‌ను వదిలేసి, కమ్యూనిస్టు కూటమితో జట్టు కట్టడం పెద్ద పురోగమన చర్యగా భావించాడు ప్రచండ. కాంగ్రెస్ ప్రగతి నిరోధక పార్టీ అని ప్రచండ నమ్మకం. మార్చి 13న జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన గట్టెక్కాడు. దీనికి తోడు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. మొత్తానికి 275 స్థానాలు ఉన్న పార్లమెంట్‌లో ప్రచండకు 157 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు అప్పుడు తేలింది. ప్రచండ ప్రధాని కాగా, నలుగురు ఉపప్రధానులను నియమించాడు.ఇతడు ప్రభుత్వానికి సమస్య అయిపోయాడు. 275 మంది సభ్యులు ఉన్న నేపాల్ పార్లమెంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 మంది సభ్యులు ఉండాలి. సభలో అతి పెద్ద పక్షం నేపాలీ కాంగ్రెస్ (89). దీని నాయకుడు షేర్ బహదూర్ దేవ్‌బా. ఓలీ వర్గం బలం 78. ఈరెండు పార్టీల బలం 167. విశ్వాస పరీక్షలో ప్రచండకు అనుకూ లంగా 63, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. చిన్నాచితకా పార్టీలు కూడా ఓలీని సమర్ధించాయి. ఇది ప్రచండకు అవమానకరమైన ఓటమి. జూలై 3న ప్రచండ పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్న ఓలీ, జూలై 9న నేపాలీ కాంగ్రెస్ నేత దేవ్‌బాతో చేతులు కలిపారు. ఏడుగురు సభ్యులు ఉన్న అశోక్ రాయ్ జనతా సమాజ్‌వాదీ పార్టీ కూడా ప్రచండకు మద్దతు ఉపసంహరించు కుంది. నిజానికి ప్రచండ ప్రభుత్వ పతనంలో కేవలం అధికార పోటీ ఒక్కటే లేదని విధానపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నది.
ప్రచండ తీసుకువచ్చిన మావోయిస్టు విప్లవం, తద్వారా 16 ఏళ్ల క్రితం వచ్చిన సెక్యులరిజం నేపాలీలకు సరిపడలేదు. కొద్దికాలంగా మళ్లీ హిందూదేశంగా మనుగడ ప్రారంభించడం, రాచరిక పునరుద్ధరణ వంటి నినాదాలు వినిపిస్తున్నా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అవి కాస్త పదునెక్కాయి. మావోయిస్టులతో కలసి పాలక కూటమిలో ఉన్నప్పుడే కొందరు నేపాలీ కాంగ్రెస్ సభ్యులు హిందూ దేశం నినాదంతో సంతకాల ఉద్యమం ఆరంభించారు. 2007లో రాజ్యాంగంలో చేర్చిన సెక్యులర్ పదానికి వ్యతిరేకంగా వారు ఫిబ్రవరి 16, 2024న ఉద్యమం ఆరంభించారు. నిజానికి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 2017లోనే హిందూదేశం నినాదానికి మద్దతుగా నిలిచింది. 2020లో ఈ వర్గం పెద్ద ర్యాలీ నిర్వహిం చింది. అలాగే క్రైస్తవం వేగంగా విస్తరిస్తున్న దేశంగా కూడా నేపాల్ నిలిచింది. ఈ మార్పు ప్రచండకు తెలుసు. ఆయన కూడా హిందూ అనుకూల వైఖరిని ప్రారంభించారు. దీనికి రుజువు జూన్ 2,2023న ఈ మావోయిస్టు భారత్ వచ్చి ఉజ్జయినిలో మహా కాలుడిని దర్శించుకున్నారు. 14 ఏళ్ల క్రితం తాను ప్రధాని అయిన తరువాత పశుపతినాథ్ ఆలయం లోని భారత పూజారులను తొలగించి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.ఈ పరిణామాలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు మీద ప్రభావం చూపాయి.
కొత్త కూటమి ఇటు భారత్‌కు, అటు చైనాకు సమదూరం పాటించక తప్పదు. ఓలీ నాయకత్వంలో నేపాల్‌ను పొరుగు దేశం మీద ప్రయోగించే ఆయుధంగా ఉపయోగించుకోలేరని, అయితే భారత్‌తో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆయన భారత్‌తో మాట్లాడతారని పార్టీ వర్గాలు చెప్పాయి. క్రితంసారి ఓలీ ప్రధాని పదవిలో ఉండగా ఆ దేశం విడుదల చేసి మ్యాప్ తీవ్ర విభేదాలను సృష్టించింది. అందులో ఉత్తరాఖండ్‌ను ఆ దేశ భూభాగంగా చూపించారు. నిజానికి ఇప్పుడు భారత్‌తో భేదాభిప్రాయాలు నేపాల్‌కు చేటు చేస్తాయి. అలాగే భారత్ కూడా ఆయనను చైనా అనుకూల నాయకుడన్న పేరుతో వ్యవహరించదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇందుకు కారణం ఒక్కటే, భారత్ అనుకూల పార్టీగా చెప్పే నేపాలీ కాంగ్రెస్‌తో కలసి ఆయన ప్రభుత్వం నడుస్తుంది. ఓలీ పార్టీ (సీపీఎన్`యూఎంఎల్) విదేశ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, స్థాయీ సంఘం అధిపతి డాక్టర్ రాజన్ భట్టరాయ్ దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం భారత్ అనుకూల విధానంతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. భారత్`నేపాల్ సంబంధాలను తమ నాయకుడు పరాకాష్టకు తీసుకువెళతారని కూడా ఆయన అన్నారు. ఎక్కడైనా కమ్యూనిస్టులు చేసేది విధ్వంసమే. అందులోను ఆసియా ఖండంలోని పరమనాటు కమ్యూనిస్టులైతే ముందు విధ్వంసం, తరువాత నిర్మాణం అంటూ ఒక పనికిమాలిన నినాదం ఎత్తుకుని ప్రజలకు నిత్యనరకం చూపిస్తారు. దేశాన్ని రాజకీయ ఆస్థిరత్వంలోకి నెట్టి పడేస్తారు. నేపాల్ అనే ప్రపంచ ఏకైక హిందూ రాజ్యంలో కనిపిస్తున్నది ఇదే. అక్కడ మావోయిస్టులు చెలరేగి రాచరికాన్ని కూల్చారు. కానీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అంత చిన్న దేశంలో, పేదరి కంలో కొట్టుమిట్టాడుతున్న దేశంలో 13 ఏళ్లలో 16 ప్రభుత్వాలు మారితే ఏమిటి దాని భవిష్యత్తు. ఇదంతా పుష్పకుమార్ దహాల్ అనే ప్రచండ అనే మావోయిస్టు నాయకుడి నిర్వాకమే. 16వ సారి అతడినే ఇప్పుడు పార్లమెంట్ పదవీచ్యుతుడిని చేసింది.
ఉన్న పేదరికానికి తోడు రాజకీయ పార్టీల ప్రయోగాలతో నేపాల్ ఆర్థిక వ్యవస్థ మరీ చితికి పోయింది. న్యాయవ్యవస్థ అంతా ఆయా పార్టీల అస్మదీయులతో నిండిపోయింది. అంతటా అవినీతి. అవినీతి మచ్చలేని నాయకుడు దుర్భిణి వేసినా కనిపించని పరిస్థితి. లేదా రాజకీయ నేతలంతా నేరగాళ్లు అనుకున్నా అభ్యంతరం ఉండదు. ఫలితం ఏమిటి? ఇటీవల ప్రచండ పదవీచ్యుతుడైన తరువాత వినిపించిన పెద్ద నినాదం, రాజు జ్ఞానేంద్రషాను మళ్లీ రాజును చేయాలి. నేపాల్‌ను మళ్లీ హిందూ దేశం చేయాలి. ఇవన్నీ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వెల్లడిరచింది.