ఈ ఏడాది దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, దంత వైద్యకళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్ష అనేక వివాదాలకు దారి తీసింది. చివరకు ప్రశ్నపత్రం లీక్ సంగతి బయటపడి సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రశ్నపత్రం బహిర్గతం కావటం దగ్గర నుంచి, ఎక్కువ మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు రావటం వరకు అనేక అంశాలు ఇందులో వివాదాస్పదమయ్యాయి. పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని బాధ్యతల నుంచి తప్పించాలని విపక్షాలు, విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించటంతో పాటు ఎన్టీఏను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది. మరోవైపు నీట్ పరీక్ష రద్దుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో జులై 6 నుంచి కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగుతుంది. అలాగే సుప్రీంకోర్టులో విచారణ జూలై 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ఏడాది మే 5వ తేదీన నిర్వహించిన నీట్-యూజీ పరీక్షపైన ఆరోపణల నేపథ్యంలో, వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ‘‘ పరీక్ష నిర్వహణలో పారదర్శకత కోసం, సమీక్ష అనంతరం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’’ అని కేంద్ర విద్యా మంతిత్వ్ర శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తర్వాత ఎన్టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది. అసలు ఎన్టీఏకు లోపాల్లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందా లేదా తేల్చుకునేవరకూ పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నీట్-పీజీ పరీక్షను వాయిదా వేశారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశంసించింది.
భవిష్యత్తులో డాక్టర్లు కావాలనే అందమైన కలను నిజం చేసుకోవటానికి లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతూంటారు. ఏటేటా వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మే5వ తేదీన నిర్వహించిన పరీక్షకు దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన తేదీ కంటే 10 రోజుల ముందు అంటే ఈ నెల 4వ తేదీన ఫలితాలు ప్రకటించారు. యావద్దేశం ఎన్నికల ఫలితాలపైన ఆసక్తిని ప్రదర్శిస్తున్న వేళ చడీచప్పుడూ లేకుండా ఈ ఫలితాలు విడుదలకావటంపైన కూడా ఆరోపణలొచ్చాయి. వాటితోపాటు ఇతర ఆరోపణలు ఇలా ఉన్నాయి.
టాపర్ల మార్కులపై సందేహాలు
ఈ ఏడాది టాపర్లకు వచ్చిన మార్కులపైన సందేహాలు ముసురుకున్నాయి. 2020లో కేవలం ఇద్దరు విద్యార్థులకే పూర్తి మార్కులు 720 వచ్చాయి. మరుసటి సంవత్సరం వారి సంఖ్య మూడుకి చేరింది. 2022లో ఒక్క విద్యార్థికి కూడా పూర్తి మార్కులు రాలేదు. అప్పుడు టాపర్ సాధించిన మార్కులు 715. గత ఏడాది ఇద్దరు విద్యార్థులు పూర్తి స్కోరు సాధించారు. ఈ ఏడాది 67 మంది విద్యార్ధులు పూర్తి మార్కులు సాధించారు. ఇంత ఎక్కువ మంది ర్యాంకుసాధించటం ఒకటయితే.. హరియాణాలోని బహదూర్ ఘడ్‌లో హర్ దయాళ్ పబ్లిక్ స్కూలు పరీక్ష కేంద్రం నుంచి హాజరయిన ఆర్గురు (ఐదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) విద్యార్థు లకు అత్యధిక మార్కులు వచ్చాయి. ఈ 67 మంది విద్యార్థుల్లో 44 మందికి గ్రేస్ మార్కులు కలపటం వల్ల ఆ ఘనతను సాధించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ
బిహార్‌కి చెందిన ఒక ముఠా ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకూ తీసుకుని పరీక్షకు ఒక రోజు ముందుగానే నీట్ ప్రశ్నాపత్రాలను లీకేజీ చేసిందన్న వార్తలొచ్చాయి. దీనిపై బిహార్ ఆర్థిక నియంత్రణ విభాగం 14 మందిని అరెస్టు చేసి వివరాలను రాబట్టింది. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు రుజువయ్యింది. ఈ ముఠా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రశ్నాపత్రాలను లీక్ చేసిందన్న వార్తలపైన కూడా దర్యాప్తు సాగుతోంది. గుజరాత్ లోని గోద్రాలో ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరీక్ష కేంద్రం నిర్వాహకునితో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడ్డాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పరీక్ష కేంద్రాన్ని ఎంచుకున్నారు. మాస్ కాపీయింగ్‌కు ఇక్కడ పక్కా ఏర్పాట్లు చేశారని, దీని వెనక రూ.12 కోట్ల లావాదేవీలు సాగాయని ఆరోపణ లొచ్చాయి. ‘మీకు తెలిసిన ప్రశ్నలు మాత్రమే రాయండి. మిగిలిన వాటి కోసం తగిన ఏర్పాట్లు ఉన్నాయి’ అని అక్కడ పరీక్ష రాసే విద్యార్థులకు చెప్పినట్టుగా సమాచారం.
ఓఎంఆర్ షీట్లు
పరీక్ష ఫలితాలను ప్రకటించకముందు నిర్వాహకులు ఓఎంఆర్ షీట్లను విడుదల చేశారు. దీని ప్రకారం విద్యార్థులు తాము పరీక్షలో రాసిన సమాధానాలను పోల్చుకుని తమకు ఎన్ని మార్కులు వస్తాయనేది అంచనా వేసుకున్నారు. కానీ తుది ఫలితాలు విడుదలయిన తర్వాత చాలా మంది విద్యార్థులకు పొంతన లేకుండా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. కొందరికి దాదాపు 80 మార్కులు వరకూ తేడా వచ్చిన విషయాన్ని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ వెలుగులోకి తెచ్చింది. ఒకరిద్దరి విషయంలో కాకుండా చాలా మంది విషయంలో పరిస్థితి ఇలాగే ఉండటాన్ని బట్టి చూస్తుంటే అవతవకలు తేటతెల్లమవుతాయని, నీట్ పరీక్షను రద్దు చేయాలని అసోసియేషన్ కోరుతోంది.
తప్పుల తడకగా ఎన్టీఏ తీరు
దేశంలోని అన్ని మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నీట్. గతంలో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) ఉండేది. దానితో పాటు ఆయా రాష్ట్రాల మెడికల్ కాలేజీలు కూడా పరీక్షలు నిర్వహించేవి. 2013లో నీట్ ను ప్రవేశపెట్టారు. మొదట్లో కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు దానిని వ్యతిరేకించాయి. దాంతో చాలా సంవత్సరాలు పట్టింది. 2016లో మొదటిసారిగా నీట్ పరీక్ష నిర్వహించారు. మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను సీబీఎస్‌ఈ నిర్వహించింది. 2019 తర్వాత పరీక్షల నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించారు. వాస్తవానికి ఈ స్వతంత్ర సంస్థను నవంబరు 2017, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తూ తన స్వతంత్రతను కాపాడుకుంటుందని అందరూ భావించారు. కానీ నీట్ విషయంలో ఆ సంస్థ తమ అభిప్రాయం తల్లకిందులు చేసిందని అంతా విమర్శిస్తున్నారు.
పరీక్ష నిర్వహణకు ముందు నుంచి వివాదాలు మొదలయ్యాయి. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి9, 2024న ఎన్టీఏ రిజిస్ట్రేషన్ ను ప్రారంభించింది. సాధారణంగా ఈ గడువు నెలరోజులు ఉంటుంది. ఆ గడువు ముగిసే మార్చి 9న మరో వారం గడువు పెంచింది. కానీ అనూహ్యంగా ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 10 వరకూ రిజిస్ట్రేషన్ లింక్ మళ్లీ తెరుచుకుంది. ‘భాగస్వామ్య పక్షాల’ విన్నపం మేరకు అని ప్రకటించారు. ఆ తర్వాత సవరణల విండోని అనుమతించారు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 15 వరకూ ఇది అందుబాటులో ఉంది.
ఇక ఫలితాలు ప్రకటించిన జూన్4 నుంచి అసలు వినోదం ప్రారంభమైంది. నీట్ పరీక్షలో ‘బహుళ ఎంపిక ప్రశ్నలు (ఎంసీక్యూ) విధానాన్ని అనుసరిస్తుంది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం అన్న నాలుగు సబ్జక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ప్రతి సబ్జక్టులో 50 ప్రశ్నలుంటాయి. అందులో 45 ప్రశ్నలను ప్రయత్నించాలి. అంటే మొత్తం 200 ప్రశ్నల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు రాయవలసి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు వస్తే, తప్పు రాస్తే ఒక మార్కు కోత పడుతుంది. మొత్తం 3గంటల 20 నిమిషాల సమయం ఇస్తారు. విద్యార్థులు సాధించగలిగిన అత్యధిక మార్కులు 720. పరీక్షల ఫలితాల్లో 67 మంది విద్యార్థులు ఈ మార్కులను సంపాదించారు. అంటే అందరికీ ఫస్ట్ ర్యాంక్. అంతకు ముందెప్పుడూ ఇది సాధ్యం కానిది ఇప్పుడే ఎలా? అని అందరినీ ఆశ్చర్యానికి లోను చేసిన ప్రశ్న. దీనికి ఎన్టీఏ అధికారులు విచిత్ర మైన సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ప్రశ్నపత్రం చాలా సులువుగా ఉందని, అందుకే ఎక్కువ మందికి పూర్తి మార్కులొచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ పరీక్ష ఫలితాల ప్రకటనకు ముందు ప్రశ్నపత్రం కఠినంగా ఉందని నిపుణులు, విద్యార్థులు చెప్పటమే కాదు. ఈసారి సగటు స్కోరు బాగా తగ్గుతుందని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, అధిక విద్యార్థులు ఉంటంతో స్కోరు కూడా అధికమైందని ఎన్డీఏ అంటోంది. గత ఏడాదితో పోలిస్తే 3 లక్షల మంది అధికంగా పరీక్షకొచ్చారని పేర్కొంది. ఎన్టీఏ చెప్పిన మూడో అంశం ఇంకా ఆసక్తికరం. ఇందులో ఎక్కువ మందికి ఆల్ ఇండియా ర్యాంకు 1 రావటానికి కారణాన్ని వెల్లడించింది. ‘‘ఈ 67మందిలో 50 మందికి గ్రేస్ మార్కులిచ్చాం. అందులో 44 మంది సమాధాన పత్రాల్లో వ్యత్యాసం ఉండటం వల్ల వారికి గ్రేస్ మార్కులివ్వవలసి వచ్చింది. మిగిలిన ఆరుగురికి సమయానికి సంబంధించిన అంశంలో గ్రేస్ మార్కులిచ్చాం. పోతే ఫిజిక్స్‌కి సంబంధించిన ప్రశ్నల్లో ఒక దానికి రెండు సరైన సమాధానాలు ఉన్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ పాత, కొత్త పుస్తకాల్లో ఈ ప్రశ్నకి రెండూ భిన్నమైన సమాధానాలు ఉంటాయి. అందుకే రెండు ఐచ్ఛికాలను సరైనవిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచించారు’’ అని చెప్పు కొచ్చింది. ఎలాంటి ప్రశ్నలు ఇచ్చామనేది పరిశీలించుకోకుండా జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించటం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గ్రేస్ మార్కులు పొంది 75శాతం మంది టాపర్లు పూర్తి మార్కులు సాధించటం హాస్యాస్పదం కాదా అని నిలదీస్తున్నారు.
ఎన్టీఏ ప్రస్తావించిన ఈ మూడు కారణాలు అసంబద్ధంగా, లొసుగులతో కూడినవిగా ఉన్నాయి. తర్వాత ప్రశ్న సమయం సరిపోవటం వల్ల గ్రేస్ మార్కులు పొందిన 6గురు విద్యార్థులు మాటేమిటి? ఈ ఆర్గురు ఒకే పరీక్ష కేంద్రంలోని వారా? అందుకు అవకాశం ఉంది. సమయం కోల్పోవటం వల్ల అదనంగా గ్రేస్ మార్కులు పొందిన 1563 మందిలో ఈ ఆర్గురు టాపర్లు. మిగిలిన వారిలో కొందరు 720కి 718, 719 మార్కులు తెచ్చుకున్నారు. సాంకేతికంగా ఇది అసాధ్యం. ఎందుకంటే మీరు సరైన సమాధానం రాస్తే నాలుగు మార్కులు పొందుతారు. తప్పు చేస్తే ఒక మార్కు కోల్పోతారు. దాంతో సాధారణ పరిస్థితుల్లో ఒక విద్యార్థి 720 సాధిస్తారు లేకపోతే 716 గానీ 715 గానీ తెచ్చుకుంటారు. అంతే తప్ప 718, 719 సాధ్యమయ్యే పని కాదు. ఈ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు కూడా ఆర్గురు టాపర్లు ఉన్న పరీక్ష కేంద్రానికి చెందిన వాళ్లే. గ్రేస్ మార్కులు ఇవ్వటానికి కారణం గురించి ప్రశ్నించినప్పుడు, నీట్ విద్యార్థులు కొందరు పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో పిటీషన్లు వేశారని.. పరీక్ష సమయం తగ్గిపోవటంతో తాము ఇబ్బందులను ఎదుర్కొన్నా మని విద్యార్థులు ఫిర్యాదుచేశారని ఎన్టీఏ చెప్పు కొచ్చింది. తాము కోల్పోయిన సమయానికి ఎంత గ్రేస్ మార్కులివ్వాలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా గ్రేసు మార్కులు ఇచ్చామని తెలిపింది. ‘‘ప్రామాణిక పద్ధతిని సాధారణీకరించాలి. అందరికీ సమాన అవకాశం దక్కాలి’’ అని ఆ తీర్పు చెబుతోంది. నిజానికి ఈ తీర్పు లా ప్రవేశాలకి సంబంధించిన ‘క్లాట్’ పరీక్షకు చెందినది. మెడికల్, ఇంజనీరింగ్ ఇతర విద్యాసంస్థల ప్రవేశానికి ఇది వర్తించదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటిది ఎన్టీఏ దానిని నీట్ కు ఎలా వర్తింప చేసిందనేది ఇక్కడ ప్రశ్న. అలాగే ఎన్ని గ్రేస్ మార్కులు కలిపారు? ఏ పద్ధతిని అనుసరించారు అనేది బాహ్యప్రపంచానికి తెలియదు. ఒకవేళ పరీక్ష ఆలస్యమయితే దానికి తగ్గట్టుగా ఇంకో 10-20 నిముషాలు అదనపు సమయం ఇవ్వవచ్చు కదా? గ్రేస్ మార్కులపైన ఆధారపడటం ఎందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఇక్కడే అవినీతికి బీజం పడిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ పైన కూడా ఎన్టీఏ విచిత్రంగా స్పందించింది. బిహార్‌లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయన్న విమర్శలకు సమాధానంగా.. పేపరు లీకయి ఉంటే అక్కడ నుంచి ఎక్కువ మంది టాపర్లు ఉండాలి కదా అని అడ్డగోలు ప్రశ్నలు వేస్తోంది. ‘బిహార్ నుంచి ఒక్కరే టాపర్ ఉన్నారు. ఆ రాష్ట్రం నుంచి అర్హత సాధించిన వాళ్లు కూడా జాతీయ సగటు కంటే తక్కువ’ అని ఎన్డీఏ అధికారి ఒకరు వాదించారు. పాత పరీక్షను రద్దు చేసి కొత్తగా నిర్వహించాలని, నిర్వహణ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
సుప్రీం డైరక్షన్
‘నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన పవిత్రత దెబ్బతింది. కనుక మాకు సమాధానాలు కావాలి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీట్‌లో అక్రమాలు, పేపరు లీక్ పై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ మొత్తం ఏడు రిట్ పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను వినటానికి సుప్రీంకోర్టు అంగీక రించింది. అదే సమయంలో నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేయటానికి నిరాకరించింది. జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ నిర్వహించింది. ఇందులో ప్రధానంగా ఒడిశా, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 16 మంది విద్యార్థులు పరీక్ష రాయటానికి గుజారాత్‌లోని గోద్రా కేంద్రాన్ని ఎంచుకున్నారని, మంచి మార్కుల కోసం ఒక్కొక్కరు రూ.10 లక్షల వంతున చెల్లించారని పిటీషనర్ ఆరోపించారు. సుప్రీం తదుపరి విచారణ జులై 8వ తేదీన చేపడుతోంది.
ప్రభుత్వం సీరియస్
నీట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ అయిన రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాకు ఎన్టీఏ అదనపు బాధ్యతలు అప్పగించారు. సుబోధ్ కుమార్ సింగ్ దాదాపు 1500 విద్యార్థులకు గ్రేస్ మార్కులిచ్చి ఈ విషయంలో వివాదాలకు తెరతీశారు. నీట్‌తో పాటు యూజీసీ నెట్ ప్రశ్న పత్రాలు లీక్ కావటంతో జూన్ 23న జరగవలసిన నీట్-పీజీ ప్రవేశపరీక్షను వాయిదా వేశారు. దాంతో పాటు ఎన్టీఏ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిర్ణయించారు. ఇస్రో మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణ నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించారు. రెండు నెలల్లో ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఇందులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ బీజేరావు, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరక్టర్ రణదీప్ గులేరియా, ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ రమణమూర్తి, ఢిల్లీ ఐఐటీకి చెందిన ఫ్రొఫెసర్ ఆదిత్య వి.మిట్టల్ విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైశ్వాల్, కె.పంకజ్ బన్సాల్ కూడా ఉన్నారు. పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచటంలో ఇది తొలిఅడుగు అని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, ఇక లొసుగులకు ఎలాంటి ఆస్కారం ఉండదని ఆయన పేర్కొన్నారు.
మరో వైపు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నీట్ ప్రశ్న పత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్ ముఖియాకు అత్రి సన్నిహితుడు. నోయిడాకు చెందిన అత్రి తాజా కేసులో మధ్యవర్తిగా వ్యవహరించాడని, గతంలోనూ పేపర్ లీకేజీలో అరెస్టయ్యాడని పోలీసులు చెప్పుకొచ్చారు. ముఖియా కోసం పోలీసులు వెతుకుతున్నారు. బిహార్‌లో తీగలాగితే నీట్ డొంక కదిలింది. అక్కడ ఆర్థికనేరాల నియంత్రణ విభాగం దీనిని సీరియస్‌గా తీసుకుంది. ప్రశ్నపత్రాలను లీక్ చేశారన్న ఆరోపణపై 13 మందిని అరెస్టు చేసి కీలకమైన అంశాలను రాబట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం బిహార్ ముఠా నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిందని స్పష్టం చేసింది. బిహార్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ జూనియ
ర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ ఈ అక్రమాలకు సూత్రధారిగా భావిస్తున్నారు. ఈ బృందంలో ఒకరయిన నితీష్ కుమార్ బిహార్ టీచర్ల నియామక పరీక్షలో అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. అమిత్ ఆనంద్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ముసుగులో సికిందర్, నితీష్ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తోంది.
ఇకపోతే గ్రేస్ మార్కులను ఉపసంహరించాలని నిర్ణయించటంతో అదనంగా మార్కులు కలిపిన 1563 మందికి జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించారు. అందులో కేవలం 813 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వారికి కొత్తగా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మిగిలిన విద్యార్థులకు గ్రేస్ మార్కులను మినహాయించి వచ్చిన మార్కులను లెక్కలోకి తీసుకుంటారు. ఈ ఫలితాలు జూన్ 30వ తేదీన విడుదలవుతాయి. అనంతరం ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సులకు కౌన్సిలింగ్ జులై 6వ తేదీన ప్రారంభమవుతుంది.
– డాక్టర్ పార్థసారథి చిరువోలు
సీనియర్ జర్నలిస్ట్