సినారె… శివశంకరి
‘విశ్వంభర’ జాతీయ పురస్కారం
ఈ మూడూ అంశాలూ తెలుగు, తమిళ ప్రాంతాలతోపాటు దేశ విదేశాల్లోని సాహితీప్రియుల మానసవీణలను మధుర మనోహరంగా పలికిస్తున్నాయి. జులై 29న భాగ్యనగరంలోని రవీంద్రభారతి వేదికగా సి.నారాయణరెడ్డి పేరిట ‘విశ్వంభర’ జాతీయ పురస్కారం ఆమెకు ప్రదానం. సారస్వత ఆరాధకులందరికీ నేత్రానందం, శ్రవణసుందరం (మునుపే సరస్వతీ సమ్మాన్ స్వీకర్త ఆ రచయిత్రి).
ఈ సందర్భంలోనే ఆయన ‘ఆత్మసూక్తం’ మదిలో మెదులుతుంది. గణం కంటే గుణం ముఖ్యం, రాశికన్నా రమ్యత శ్రేష్ఠం అన్నారు ఏనాడో. అభ్యాస ఫలం రాశి, సౌందర్య చిహ్నం రమ్యత. అంతర్గతంగా ఆకృతి ఒకటి, ఆత్మ ప్రకృతి మరొకటి. హిమబిందువు ఉత్సాహం, తారాజువ్వ ఉల్లాసం కలగలిస్తే మెరుపు దిశగా ఉజ్వలదశ తథ్యమే కదా!
త్రి నక్షత్రాల అక్షరాలు ఆయనవి. పంచాక్షరిని తలపించే పేరు ఆమెది. జ్ఞానపీఠం నారాయణరెడ్డిది, వికాసదీపం శివశంకరిది. అన్నట్లు, సినారె తమ ‘విశ్వంభర’ కావ్య విభాగాలూ ఐదు. కవి హృదయం కాబట్టి ` నాదంగా ఎగిసి, పదంగా నడిచి, కాంతిరేఖలా మెరిసి, మూర్తి రూపాలై నిలిచి, కలం అణువణువునా లయలొలికించింది. జిజ్ఞాస పురోగమిస్తున్నా, సత్య రహస్వాదన చేస్తున్నా, పిపాస మాత్రం ఇంకా ఇంకా తీరనిదే!
ఎప్పటికైనా మనిషిని దిద్దితీర్చేది మనసే. విశ్వ దర్శనమంతా ఇందులోనే. దర్శనం ఒక్కటే కాదు… స్వరముద్రణ భాగ్యమూ ఇదివరలోనే కలిగింది శివశంకరికి. ఎలా అంటే` యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ (ఆఫ్ కాంగ్రెస్) కోరడం వల్ల. ఆ విజేత సాహితీవేత్త వయసు ఇపుడు ఎనిమిది పదులకు పైమాటే. అయినప్పటికీ, నేటికీ తనది శక్తి సంపన్న తత్వమే.
పేరులో మహోదయం, తీరులో స్థిర సంకల్పం ఉన్నందునే ప్రతిష్ఠాత్మక బహూకృతికి ఎంపిక. చెన్నైలో ఉంటున్న ఆమె హైదరాబాద వచ్చి వెళ్లే దారి పొడవునా అక్షర సందర్శనలెన్నెన్నో!
‘నవ్వని పువ్వు’` ఇది సినారె తొలి పుస్తకం. ‘నా రణం మరణంపైనే’ అని ప్రకటించింది మలి కావ్యంలో. ఆయన ఉన్నంత కాలమూ రాస్తూనే వచ్చారు. పదుల సంఖ్య ప్రక్రియల్లో అక్షర సేద్యం చేసిన తపస్వి, మనస్వి. పద్య రచనలకు పరిపాటిగా చారిత్రక కథానీయ కావ్యాలనేకం వెలువరించారు.
అక్షరాల గవాక్షాలు, జలపాతం, తేజస్సు నా తపస్సు, ఇంటి పేరు చైతన్యం, మార్పు నా తీర్పు, కవిత నా చిరునామా, ఉదయం నా హృదయం `ఈ అన్ని పుస్తకాల పేర్లూ ఆయన వ్యక్తిత్వ మూర్తిమత్వాలకు ఆసాంతం వర్తిస్తాయి. మా ఊరు మాట్లాడిరది, విశ్వం నాలో ఉన్నపుడు, నా చూపు రేపటివైపు, అలలెత్తి అడుగులు… వంటివి తన అంతరంగ తరంగాలను ప్రస్ఫుటపరుస్తాయి. వీటితోపాటు మానవ ఇతిహాస రచనలూ అసంఖ్యాకం.
మట్టి, మనిషి ఆకాశం భూమికలను ఉదాహరణలుగా నిశ్చయించవచ్చు. అన్నింటినీ మించి ‘విశ్వంభర.’ మానవ ఉపనిషత్తు. మానవుడే నాయకుడు. ప్రకృతే నేపథ్యం. మనిషి రూపాలను, విభిన్న ప్రవృత్తులను, అనేకానేక ప్రస్థానాలను విపులీకరించారు ఇందులో. మొత్తం మీద విశ్వాన్ని భరించడమే ఇతివృత్తం. ప్రత్యేకించి నేల విశిష్టతను నింగినంటేలా చాటి చెప్పడం. ఈ విశిష్ట పద్య రాజానికి జ్ఞానపీఠం లభించి ఇప్పటికి మూడున్నర దశాబ్దాలు పైనే! పుస్తకం ముద్రితమై (తొలిగా) నేటికి 44 సంవత్సరాలవుతోంది. ఇదే అనేక విశ్వ విద్యాలయాలకు స్నాతకోత్తర స్థాయి పాఠ్య గ్రంథం. డాక్టరేట్ పరిశోధనలూ పుష్కలం. జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమవడం అగ్రేతర స్థాయిని నిరూపిస్తోంది.
ఎవరు ఏ సాధన సాగించినా మూడు విధాలు అన్నారాయన. కళాత్మకం, ఆధ్యాత్మికం, వైజ్ఞానికం. ఈ అన్నింటి సమాలోచనల సమగ్ర అవలోకనం కావ్య ఆది, పునాదిగా నిలిచింది. అక్షరోదాహరణ ఇదీ..
వేయి తోటలను నరికిన చేయి
పూయిస్తుందా ఒక్క పువ్వును?
ఉర్వీతలాన్ని వణికించిన శక్తి
ఒక్క హృదయాన్నయినా జయిస్తుందా?
అంటూనే ఇలా ముక్తాయించారు…
మనసుకు తొడుగు మనిషి
మనిషికి ఉడుపు జగతి
ఇదే విశ్వంభరా తత్వం
ఇదే అనంత జీవిత సత్యం
ఈ విశ్వంభర అనేది మనశ్శక్తి వ్యక్తిగా సాగడం. సమష్టిగా సమాజ చరితను సృజించడం. దీనిలో భారతీయత మాత్రమే కాదు, విశ్వమానవ వికాస పరిపూర్ణత ఉంది. భూగోళంలోని మానవ వికాస పరిణామక్రమముంది. ఇదంతా ఆత్మ / అనుభవాత్మక గాథ, నవ అభివ్యక్త కథ.
సరిగ్గా ఇటువంటి విశాలత్వమే శివశంకరి రచనల్లోనూ ప్రతిఫలిస్తుంది. భాష తమిళమైనా, భారతీయాత్మ ప్రతిబింబిస్తుంది. మద్రాసులో పుట్టిన ఆమె శారదా విద్యాలయ, రామకృష్ణమిషన్ పాఠశాలల్లో చదివారు. ప్రజా సంబంధాలు అధికారిగా పనిచేశారు. సమాజం, పరిణామాలు, ప్రజల మనోభావాల గురించే ఆలోచనలన్నీ! అధ్యయనం, పరిశోధన, సాధన, బోధన, విశ్లేషణ, పర్యవేక్షణలన్నీ ఇందులోని భాగాలు.
దశాబ్దాల తరబడి కొనసాగుతున్న సాక్షరసేవ ఆమెది. పదుల సంఖ్యలో నవలలు, కథలు, నవలికలు, కథానికలు ప్రచురించారు. జీవిత చరిత్రలెన్నో రచించారు. వృద్ధాప్య సమస్యల పరిష్కారం మీద చూపు సారించారు. సమాచార, ప్రచార, ప్రసార, ఇతరత్రా మాధ్యమాల ద్వారా భావాభిప్రాయాలు వెల్లడిరచారు. యాత్రా కథనాలు, పరిశోధక వ్యాసాలు, స్పందన రచనలు అనేకం.
వాటిల్లో పలు ప్రక్రియలను ఉక్రేనియన్ భాషలోకీ అనువదించడం మరింత విశేషం. ఆదర్శ, వాస్తవిక వాదాలను త్రికరణశుద్ధిగా విశ్వసించే ఆమె నేత్ర వైద్యం,దానం, వితరణ గురించిన అంశాలనూ సృజించారు. ఆ సారాంశాన్ని కవిత్వీకరిస్తే `
శివశంకరి నవలా రచనలు చలన చిత్రాలుగా, చిన్నతెర ధారావాహికలుగా రూపుదిద్దుకున్నాయి. స్త్రీ సమస్యలకు పరిష్కారాల చిత్రీకరణ, సంప్రదాయ విలువలకు అసలైన పరిరక్షణ, కుటుంబ స్థితిగతుల పరిశీలన, ఆరోగ్య సంరక్షణకు ముందు జాగ్రత్తలు వీటిల్లో కనిపిస్తాయి.
పదాల పొందిక, భావగాంభీర్యం ఆమె పుస్తకాల్లో వర్థిల్లుతుంటాయి. వాక్య నిర్మాణం, సన్నివేశ విశదీకరణం, సంభాషణ చాతుర్యం, కథాగమన చాకచక్యం ప్రస్ఫుటమవుతూనే ఉంటాయి. నిదర్శనంగా ` ఒక మనిషి కథ. ఇదే రచన తమిళ సుప్రసిద్ధ పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది. రచనాంశాల మీద కొన్ని పరిశోధనలనూ కొనసాగించిన అన్వేషకురాలు ఆమె. సామాజిక దురన్యాయాలను కలంబలంతో ప్రతిఘటించిన సాహసికురాలు. వ్యసనాలూ, వ్యాధుల పోలికలను, అంతరాలను తేటతెల్లంచేసిన శాస్త్ర కోవిదురాలు ` కూడా.
‘రచనలతో సంచలనం’ గురించి…
- కావాల్సింది ఆలోచనల అలలు. కేవలం సంచ లనాలు కావు.
- నాకు తారసపడిన వ్యక్తుల అంతరంగాల్లోకి తొంగిచూస్తాను. వాటి నుంచే కథా వస్తువులను సందర్భానుసారం ఎంచుకుంటాను.
- మార్పు తప్పదు అని భావిస్తాను, అదే శాశ్వత మనీ అనుకుంటాను.
- విశ్వాసాల గాఢతను అన్ని కోణాల నుంచీ గమనిస్తుంటాను.
- చదువరుల స్పందనను ఎంతగానో కోరు కుంటాను. అలా అని, ఆ స్పందనలను ఆశించి రచనల్లో మలుపులు తిప్పను.
- కొన్ని పాత్రలంటే జాలి / ఆ అశక్తతలే కారణం.
- మనసుతో మథనం నా అలవాటు (కవచంతో కదనం అనే సినారె పద ప్రయోగం మనకు ఇక్కడ గుర్తుకొస్తుంది.)
- కవుల/ కవయిత్రుల రచయితల/రచయిత్రుల బాధ్యతలు ఎంతో కీలకమని నా భావన. అక్షరాల్లో వ్యక్తమయ్యేదీ ఆ తత్వమే.
- సందేశాలు / ఉపదేశాల కోసమే రాయాలని ఉండదు నాకు. నా మనసులో / ఉన్నది కాగితం పైకి ప్రసరించాలని మాత్రమే ఉంటుంది. అందుకు ఎంతగానో పరిశ్రమిస్తాను. కష్టంతో కాదు, ఎంతెంతో ఇష్టంతో! రాయడం మొదల య్యాక ఎక్కడా ఆగదు.
- ఎంత రాస్తానో అంతకుమించి చదువు తాను. రెండూ అవసరమే.
మరింత వివరంగా ఆమె మాటల్లోనే…
ప్రతీ రచనకీ పరమార్థం ఉండాల్సిందే. నిబద్ధత లేనిదే ఉత్తమ రచన రాదు, వెలువడదు. నా కథల్లో కొన్ని తెలుగులోకి అనువాదమయ్యాయి. కృతజ్ఞు రాలిని. ఏది రాయాలన్నా ముందుగా నేరుగా వెళ్లి పరిశీలిస్తాను. సంగతీ సందర్భాలన్నీ ముందుగానే తెలుసుకుంటాను.పెద్దలూ చిన్నలూ అందరితోనూ వివరంగా మాట్లాడతాను. ఆ తర్వాతే కథగానో నవలగానో రూపుదిద్దుతాను. ఎప్పుడూ అంతే!
ఆడియో, వీడియోలతోనూ పాఠక వీక్షకుల ముందుంటా. ఆ సాంకేతికతను ఎంత వేగంగా అందుకోగలిగితే అంత సామాజిక ప్రయోజనం. నా ప్రత్యక్ష యాత్రా చరిత్రలు జపనీస్ భాషలో కూడా వెలువడ్డాయి. రాయడంతోనే కర్తవ్యం పూర్తయిందని అనుకోకూడదు. క్షేత్ర స్థాయి వాస్తవాలు ప్రత్యక్ష పర్యటనలతోనే తెలుస్తుంటాయి. సేవాభిలాషతో కొన్ని సేవా కేంద్రాలనీ ఏర్పాటు చేశాను. వాటిని మహత్తర మని, బృహత్తరమనీ అనను. నా పని నేను చేస్తా నంతే! ఆమె ఎంతగానో పరిశ్రమించినందునే అపురూప రచనలన్నో వెలువడ్డాయి. విశేష పురస్కారా లనీ సంపాదించి పెట్టాయి. వాటిల్లో భారతీయ భాషా పరిషత్ పురస్కృతి ఒకటి. ప్రేమ చంద్, గోపీచంద్ అవార్డులూ లభించాయి.
విశేషించి ‘సరస్వతీ సమ్మాన్’ పురస్కారం అందుకున్నారు. దేశంలోని అన్ని భాషల్లోనూ ఒక మహోత్తమ సాహిత్య రచనకు అందే వార్షిక బహూకృతి. రెండేళ్ల కిందటనే శివశంకరి ‘సూర్యవంశం’ ఇంతటి విశిష్టతకు పాత్రమైంది. జ్వలిస్తున్న సూర్యుని తనయ ` ఇందులోని ఇతివృత్త సారాంశం. అంతా జ్ఞాపకాల చిత్రీకరణం. రెండు సంపుటాలుగా ఉంది. వ్యక్తిగత, సమాజ సంబంధ పరివర్తన క్రమం కథనాంశం.
ఇప్పుడు ఆమె విశ్వంభర పేరిటి పురస్కారం అందుకుంటున్న తరుణాన… దీటు ప్రశ్నలకు ధాటి సమాధానాలు ఇవీ :
ఉత్తమ సాహిత్యం అంటే?
నిర్మాణాత్మక ఆలోచనను పెంచేది.
అది ఎటువంటిది?
అద్దంలో ఎవరివి వారు చూసుకుని సరిదిద్దు కోవడం లాంటిది.
‘ఆత్మకథ’కు మీ నిర్వచనం?
సూర్యవంశమే! ఉన్నది ఉన్నట్లు రాశానందులో.
మరిప్పుడు సినారె ‘విశ్వంభర’ గురించి?
మహాత్తర, బృహత్తర రచనం. దీర్ఘ ఘనకావ్యం. జ్ఞానపీఠం వరించిన అక్షరోద్యమం. ఆయనే ప్రకటించినట్లు ` ఆదిమ మొదలు ఆధునికం దాకా మానవుడు ప్రస్థాన ప్రకరణల విపులీకరణం. ప్రదాత సంస్థ సుశీలా నారాయణరెడ్డి ట్రస్టుకు నా అక్షరాభివాదం.
ఇంకా మీకు ఏం అనిపిస్తోంది?
ఆయన ‘విశ్వం నాలో ఉన్నపుడు’లోని ‘ఎన్నెన్నో జ్ఞాపకాలు’లో అన్నట్లు…
‘ఒకనాటి మహోద్యమాల నేపథ్యాన్ని
ఎదుట సాక్షాత్కరింపచేసిన ఆ జ్ఞాపకాలను
అక్షరాల నివాళులు సమర్పించినపుడే
మన వ్యక్తిత్వాలకు సార్థకత’
ఇదీ శివశంకరి అంతరంగ తరంగ ధ్యానం!
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్