సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి జ్యేష్ఠ బహుళ దశమి – 01 జూలై 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‘పగలు యాంటీ నాచ్‌, రాత్రి ప్రోనాచ్‌. సొంతూళ్లో యాంటీ నాచ్‌, పొరుగూరు పోతే అక్కడ ప్రోనాచ్‌…అవకాశం లేకపోతే యాంటీ నాచ్‌, ఉంటే ప్రోనాచ్‌..’ మహా రచయిత గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకశాస్త్రి చెప్పిన భాష్యం ఇది. ప్రోనాచ్‌, యాంటీ నాచ్‌ అంటే అర్ధం తెలిసిందే. వేశ్యా సంపర్కానికి అనుకూలం, వ్యతిరేకం. సంస్కర్త వేషధారులు ఎంత కృతకంగా ఉంటారో గురజాడ వారి ఈ మాటలు వెల్లడిస్తాయి. మన దేశంలో చాలామంది మేధావులు, రచయితలు, ఉదారవాదులు సరిగ్గా ఇలాంటి వాళ్లే. వీళ్ల బుద్ధి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని బట్టి మారిపోతూ ఉంటుంది. దృష్టి రంగు మార్చుకుంటుంది. పత్రికను బట్టి రాసిన వ్యాసంలో ‘గొంతు’ను కూడా మార్చగల రచయితలు ఉన్నారు. చానల్‌ను బట్టి వాగ్ధోరణిని మలిచే ఉదారవాదులు, మేధావులు కూడా కోకొల్లలు. వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం..ఏమైనా.. అధికారంలో ఉన్న పార్టీని బట్టి ఈ మేధావుల చూపు, మాట, నోటి తీట సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. బీజేపీ ఉంటే ఒక రకం. కాంగ్రెస్‌ ఉంటే వేరే రకం. అటూ ఇటూ కాని ప్రభుత్వం ఉంటే అప్పుడు మరో రకం.

అరుంధతీరాయ్‌ అనే రచయిత్రి పదిహేనేళ్ల క్రితం ప్రదర్శించిన మేధో పైత్యానికి చట్టం ప్రకారం ఇప్పుడైనా మందు వేయవచ్చునని ఢల్లీి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి జారీ చేశారు. ఇంకేముంది! చాలామంది వాక్‌ స్వాతంత్య్రం, దాని పవిత్రత, ఘనత, చరిత్రల గురించి భారత ప్రజానీకానికి పాఠాలు చెప్పడానికి బెత్తాలు పుచ్చుకుని మరొకసారి దేశం మీద పడ్డారు. మేధావి/రచయిత/వామపక్షవాది/ ఉదారవాది వగైరా బిరుదుల పుట్ట అనదగ్గ ఒకరు ఇదే అంశం మీద రాసిన వ్యాసం తెలుగు అనువాదాన్ని ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఈమధ్య ప్రచురించింది. ఈ బాపతు వ్యాసాలలో దీని సంఖ్య ఎంతో కూడా చెప్పడం కష్టం. చరిత్ర మరువలేని, జాత్యహంకారానికి కొండగుర్తు వంటి జలియన్‌వాలా బాగ్‌ ఘాతుకానికి పాల్పడిన బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల నిరసన ప్రకటించడానికి ఆ కాలం భారతీయులకు ఉన్న హక్కు ఎలాంటిది? అని అడిగితే ఎవరైనా ఆ నిరసన హక్కు సహజమైనదనే అంటారు. గాంధీజీ ‘యంగ్‌ ఇండియా’లో (మార్చి 18,1922) ఇదే హక్కును తిరుగులేకుండా బలపరిచినట్టు కూడా ఆ రచయితే స్పష్టం చేశారు. గాంధీజీ ‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తాను’ అన్నారట. ఆ ‘అసంతృప్తి’ ఎలా ఉండాలో కూడా ఆయనే చెప్పారట. అదీ చూద్దాం. ‘ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి హింసను తలవనంతవరకు హింసను ప్రోత్సహించనంత వరకు తన అనిష్టతను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ ఉండాలి’. ఇంతవరకు బాగానే ఉంది.

కానీ ఈ మేధావులు, ఒక వర్గం పత్రికా రచయితలు ఎవరిని సమర్థించే క్రమంలో వాక్‌ స్వాతంత్య్రం గురించి వదరుతున్నారు? ఆమె అరుంధతీరాయ్‌. ఆమె మావోయిస్టులను సమర్ధించారు. కశ్మీర్‌ భారత్‌లో ఏనాడూ అంతర్భాగం కాదంటూ అక్కడ వేలాది మంది సామాన్య పౌరులను హిందువుల పేరుతో అనాగరికంగా చంపేసిన పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు మద్దతిచ్చే మాటలు మాట్లాడారు. ఆ రక్తపాతానికి, ఘాతుకాలకు నైతిక మద్దతు ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందన్నది మావోయిస్టుల నమ్మకం, సిద్ధాంతం. గొట్టం నుంచి పొగ వస్తుంది. నేల మీద భద్రతా బలగాలదో, అమాయకులదో నెత్తురు పారుతుంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల ధ్యేయమే కశ్మీర్‌ లోయలో హిందూ జనాభాను ఏరివేయడం. నక్సల్స్‌ని భద్రతాదళాలు చంపడం, లేదా భద్రతాదళాలను నక్సల్స్‌ మట్టుపెట్టడం, కశ్మీరీ హిందువులను మతం కారణంగా ఊచకోత కోయడం వీటిలో దేనినీ సమర్ధించడం గాంధీజీ జీవిత లక్ష్యం లేదా సిద్ధాంతం ఉద్దేశం కాదని ఆయన మాటలు, చేతలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.   మరి అరుంధతీరాయ్‌ హింసామార్గాన్ని గాంధీజీ 1922లో చెప్పిన పరిపూర్ణ అహింసా సిద్ధాంతంతో ఆ వ్యాస రచయిత ఎలా తూకం వేశాడో అర్ధమే కాదు. అలాంటి మేధావుల మీద సాధారణంగా ఉండే పెగ్గు ప్రభావం దిగక ముందే తొందరపడి రాసి ఉండాలి. లేకుంటే ఆ ‘యంగ్‌ ఇండియా’ మాటలు జలియన్‌వాలా బాగ్‌ నేపథ్యంలో శ్వేతజాతి దురహంకార ప్రభుత్వం మీద గాంధీజీ వ్యక్తం చేసిన అభిప్రాయమన్న సంగతి ఎలా మరచిపోతారు? ఆ నిర్వచనమే స్వతంత్ర భారత ప్రభుత్వానికి కూడా వర్తింప చేయవచ్చునని గాఢాతి గాఢమైన మత్తులో ఉంటే తప్ప ఎలా రాయగలరు?

అరుంధతీరాయ్‌ కూడా సదా మత్తులో తూగుతూ ఉంటారు కాబోలు. మావోయిస్టులలో గాంధేయులను చూశారామె. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయ డానికి ప్రభుత్వం విరామం లేకుండా ప్రయత్నిస్తుంటే రక్షించి, నిజాయితీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నవారు ఎవరైనా ఉన్నారూ అంటే, వారు నక్సలైట్లేనని తేల్చి పారేశారు. మరి, తమ రెండు చేతులు అడ్డుపెట్టి రాజ్యాంగాన్ని రక్షిస్తున్న నక్సలైట్లు ప్రభుత్వంతో చర్చలకు మధ్యవర్తిగా ఉండమంటే రాయ్‌ పారిపోయినట్టు? 2001 నాటి పార్లమెంటు మీద దాడి ఘటన విచారణలో చాలా లోపాలు ఉన్నాయట. నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకో వడం వీటన్నిటికి పరాకాష్టలాంటి  విషాదమని కూడా  ప్రకటించారామె.

భారతీయ జనతా పార్టీని విమర్శించే క్రమంలో, శాపనార్థాలకు లంఘించుకునే క్రమంలో ఇలాంటి నిరంతర మత్తుజీవులు భారతదేశాన్ని అపఖ్యాత పాల్జేస్తున్న సంగతి ప్రతిక్షణం తట్టి గుర్తు చేయకతప్పదు. కశ్మీర్‌ ఉగ్రవాదులు కానీ, మావోయిస్టులు కానీ తాము శాంతియుత పంథాను నమ్ముతామని, రాజ్యాంగాన్ని రక్షిస్తామని, బుద్ధిగా ఆచరిస్తామని ఏనాడూ చెప్పినవాళ్లు కాదు. వాళ్లు తిరుగులేని రక్తపిపాసులు. వాళ్లలో గాంధీజీ అంతేవాసులను చూడడం మహాపరాధం. బీజేపీ మీద వ్యతిరేకతతో ఇలాంటి అంధత్వాన్ని ఆశ్రయిస్తే ఎలా? మీ బుద్ధి ఎంత కుంచించుకుపోయిందో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ కాదా!

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE