జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దివస్‌గా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక పుస్తకం వెలువడడం యాదృచ్ఛికమే అయినా, లోతైన చర్చకు అవకాశం కల్పించింది. 1970 దశకం నాటి రాజకీయ పరిణామాల వెల్లువను జాతిజనులకు గుర్తు చేసింది. అదే నగర్వాలా కేసు. ఇందిరాగాంధీ జీవితం, అత్యవసర పరిస్థితి పరిణామాల మీద వచ్చిన వందలాది పుస్తకాలు ఈ కేసును ప్రస్తావించాయి. కానీ ఈ విషయమే ప్రధానంగా బహుశా మొదటిగా వచ్చిన పుస్తకం ఇదే కావచ్చు. ఆ దశకంలోనే అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి ప్రకటనకి దారి తీయించిన పరిణామాలలో నగర్వాలా కేసూ ఉంటుంది. ఈ ఉదంతం ఇందిరాగాంధీ రాజకీయ జీవితం బీటలు వారడానికి దోహదం చేసిందంటే అతిశయోక్తి కాదు. ప్రకాశ్ పాత్రా, రషీద్ కిద్వాయ్ రాసిన ‘ది స్కామ్ దట్ షుక్ ఏ నేషన్’ (దేశాన్ని కదిపిన ఓ స్కామ్). దేశంలో చాలా ఆర్థిక అవకతవకలు బయటపడినా నగర్వాలా ఆర్థిక స్కామ్ మాత్రం చాలా లోతైనది. పెను సంచలనం. చరిత్ర, నేరకోణం, దాని చుట్టూ అల్లుకున్న నాటకీయతతో కూడిన రాజకీయం పాఠకుడిని 1970 నాటి ఇందిర కాలపు సామాజిక రాజకీయ దృశ్యంలో భాగస్వామిని చేస్తాయి. పాకిస్తాన్ మీద యుద్ధం నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన రాజకీయవేత్తగా ఆమె జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిన తరుణంలో ఈ అవినీతి వ్యవహారం ఒక పిడుగులా పడిరది.
ఈ ఉదంతాన్ని రుస్తుమ్ సొహెరాబ్ నగర్వాలా చుట్టూ పరిభ్రమించే పరిణామంగా గ్రంథకర్తలు చిత్రించారు. భారత సైన్యం నుంచి కెప్టెన్ హోదాలో పదవీ విరమణ చేసిన ఇతడు 1971లో ఊహకు అందనంత ఒక పెద్ద అబద్ధం ద్వారా కలకలం సృష్టించాడు. మే 24, 1971న పార్లమెంట్ స్ట్రీట్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న వేద్‌ప్రకాశ్ మల్హోత్రాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వారు ప్రధాని కార్యాలయం నుంచి మాట్టాడుతున్నట్టు చెప్పారు. ఆ గొంతు ఇలా చెప్పింది. ‘తూర్పు పాకిస్తాన్ (ఇవాళ్టి బంగ్లాదేశ్)కు సంబంధించి ఒక రహస్య కార్యక్రమం కోసం రూ 60 లక్షలు ఒక కొరియర్ ద్వారా పంపండి’. దీని క్రమం ఆసక్తికరంగా ఉంటుంది. పీఎన్ హక్సర్ (అప్పటి ప్రధాని కార్యాలయం ప్రిన్సిపల్ కార్యదర్శి) మాట్లాడుతున్నట్టు చెప్పి, ఫోన్ ప్రధానికి ఇస్తున్నట్టు ఆ గొంతు చెప్పింది. ఒక వ్యక్తి ‘బంగాదేశ్ కి బాబు’ అనే సంకేతనామం చెబుతాడని, అతడికి డబ్బు ఇచ్చి పంపమని ‘ఇందిర చెప్పారు’.అతడికి బార్‌ఎట్‌లా అని సమాధానం ఇవ్వాలి. తరువాత డబ్బు ఇవ్వాలి. మీరు ఎలా చెబితే అలాగే అమ్మా అన్నాడు వేద్‌ప్రకాశ్ మల్హోత్రా. తరువాత వేద్‌ప్రకాశ్ అరవై లక్షలు ఒక పెట్టెలో పెట్టమని డిప్యూటీ చీఫ్ క్యాషియర్ రామ్‌ప్రకాశ్ భాత్రాకు చెప్పాడు.ఆ పెట్టెను ఇద్దరు కూలీలతో టాక్సీలో పెట్టించి తానే స్వయంగా తీసుకువెళ్లాడు మల్హోత్రా. డబ్బు బయటకు తీసుకుపోతున్నట్టు ఓచర్ మీద సంతకం కూడా అతడే చేశాడు. అయితే టాక్సీ కొంతదూరం వెళ్లగానే ఒక పొడుగు మనిషి కారు ఆపాడు. కోడ్ చెప్పాడు. పంచశీల్ మార్గ్‌లో నగర్వాలా డబ్బు తీసుకున్నాడు. పైగా ప్రధాని కార్యా లయానికి వెళ్లి ఓచర్ తీసుకోమని సూచించాడు. వేద్‌ప్రకాశ్ మల్హోత్రా ప్రధాని కార్యాలయానికి వెళ్లి పీఎన్ హక్సర్‌ను సంప్రదించాడు. అలాంటి ఆదేశాలు ఏవీ ప్రధాని కార్యాలయం నుంచి వెళ్లలేదని బాంబు పేల్చాడు హక్సర్.
రచయితలు చెప్పినట్టు 1971లో రూ. 60 లక్షలంటే సాధారణ విషయం కాదు. 2024 నాటి విలువతో పోలిస్తే రూ. 170.62 కోట్లు. అయితే తాను ప్రధాని ఆదేశాలను అమలు చేస్తున్నానని వేద్‌ప్రకాశ్ అనుకున్నారు.
తరువాత ఈ విషయం మీద చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ హరిదేవ్ చాలా వేగంగా స్పందించి ఢల్లీి విమానా శ్రయానికి చేరుకున్న నగార్వాలాను పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి వద్ద చాలా ధనం ఉంది. తరువాత ఏమైంది? నగర్వాలా నాలుగేళ్లు తిహార్ జైలులో ఉన్నాడు. హఠాత్తుగా చనిపోయాడు. దీనితో సహజంగానే అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. అంతేకాదు, ఆ అనుమానాలు, ప్రశ్నలు మరింత పదునెక్కి అత్యున్నత స్థాయి అధికార కేంద్రాల వైపు వేలెత్తి చూపడానికి అవకాశం ఇస్తూ మరొక పరిణామం జరిగింది. అదే డీకే కాశ్యప్ అనుమానాస్పద మరణం. నగర్వాలా కేసును దర్యాప్తు చేసిన అధికారి ఆయనే మరి. పైగా ఇందిర ఈ వరస ఘటనలమీద పెదవి విప్పకపోవడం అత్యున్నత అధికార పీఠాలమీద మరిన్ని అనుమానాలు చెల రేగాయి. ఈ మొత్తం ఉదంతం మీద దర్యాప్తు చేయడానికి 1978లో మొరార్జీ దేశాయ్ నాయ కత్వంలోని జనతా ప్రభుత్వం జస్టిస్ జగన్‌మోహన్‌రెడ్డి కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 820 పేజీల నివేదిక సమర్పించింది. నగర్వాలా మే 24, 1971న ఆ బ్యాంక్ శాఖ సొమ్ము తీసుకున్నాడు. ఆ సొమ్ము పద్దులు లేకుండా బ్యాంకులో ఉంచినదని అనుకోవడానికి అవకాశాలు ఎక్కువ అని, అదే సమయంలో ఆ డబ్బు ఇందిరకు చెందినది అని చెప్పడానికి అవకాశం లేదని కమిషన్ తేల్చింది. అయితే నాడు హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ఇందిర ఈ కేసు మీద సరైన దర్యాప్తు చేయించక పోవడాన్ని మాత్రం కమిషన్ తప్పు పట్టింది. కేసును సాధ్యమైనంత త్వరగా మూసివేయించడానికి ప్రధాని కార్యాలయం నుంచి పోలీసులకు ఆదేశాలు రావడం గురించి కమిషన్ నివేదిక ప్రస్తావించింది. అధికారులు, ఉద్యోగులు కూడా బ్యాంక్‌లో లెక్కాపత్రం లేని కొన్ని వస్తువులను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచే వారని కూడా తెలియచేసింది. ఏమైనా ఇందిర ప్రధానిగా ఉండగా ఆమె కార్యాలయంలో పనిచేసిన కొందరు అధికారులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే కమిషన్ అభిప్రాయపడిరది. అదీ కాకుండా ఈ కేసులో సీఐఏ ప్రమేయం ఉన్నదా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే పని కూడా రచయితలు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఒక బ్యాంకు శాఖ నుంచి రూ. 60 లక్షలు లూటీ చేశారని, క్రైమ్ వార్తలు సేకరించే ఒక విలేకరికి, ఒక పోలీస్ స్టేషన్ అధికారి సర్వ సాధారణ విషయమన్నట్టు ఫోన్‌లో చెప్పాడని అనేవారు. దీనితో వేట మొదలయింది. అదే రాత్రి 9.45కి నగర్వాలాను ఢల్లీి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్టు వార్త కూడా వచ్చేసింది.
ఈ పుస్తకంలో 11వ అధ్యాయం నగర్వాలా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు నమోదు చేసింది. అతడు ఆసుపత్రిలో ఉండగా ఇంటికి రాసిన ఉత్తరాలు కుటుంబం మీద అతడికి ఉన్న మమతానురాగాలను వ్యక్తం చేసేవని రచయితలు చెప్పారు. ఆ ఉత్తరాలన్నీ అతడు తన తల్లి గూల్‌బాయికి రాశాడు. గూల్‌బాయి కూడా ఒకసారి ప్రధాని ఇందిరకు ఉత్తరం రాస్తూ తమను క్షమించాలని వేడుకున్నారు. ఒక తల్లి మరొక తల్లికి చేస్తున్న అభ్యర్థనగా తన ఉత్తరాలను పరిగణించమని గూల్‌బాయి వేడుకున్నారు. అయినా ఇందిర స్పందించలేదు.
1970 దశకం అనేక ముఖ్య ఘట్టాల వేదిక. కాంగ్రెస్ ఆటుపోట్లు ఎదుర్కొన్న కాలం కూడా అదే. పాక్ నుంచి బంగ్లా విడివడిరది. భారత్ అణు పరీక్ష జరిపింది. దేశంలో కొన్ని పార్టీలు కలసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అవినీతి రహిత సమాజం కోసమంటూ ఉద్యమించవలసి వచ్చింది. ఆ సమయంలో నగర్వాలా ఉదంతం వెలుగుచూసింది. నిజానికి ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్‌కు అప్పుడు ఏర్పడిన ప్రతికూల వాతావరణానికి నగర్వాలా కేసు తోడై, ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఇందిర ప్రతిష్టను మసకబార్చింది. వీటి పరాకాష్ట అత్యవసర పరిస్థితి ప్రకటన (1975).
భారతదేశ రాజకీయ ప్రస్థానం, అందులో అవినీతి జాడ వంటి వాటి పట్ల లోతైన అవగాహన కోరుకుంటున్నవారు ఈ పుస్తకం చదవాలి. ఇందులో ఉన్న నేరకోణం, న్యాయ సంబంధం అంశాలు కూడా పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయి. పోలీసు రికార్డులు, పత్రికల నివేదికలు వంటి విశేషంగా పరిశీలించిన తరువాత రాసిన పుస్తకమిది. కాబట్టి ఇదొక చారిత్రక, రాజకీయ పరిణామంగానే కాకుండా, స్వతంత్ర భారతంలోని అనుమానాస్పద ఉదంతంతో పరిచయం ఏర్పరుస్తుంది. హార్పర్ కోలిన్స్ ప్రచురణ సంస్థ వెలువరించిన ఈ పుస్తకం ధర రూ. 399.
- జాగృతి డెస్క్