–  జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

ప్రధాని నరేంద్రమోదీ రష్యాలో ఇటీవల జరిపిన రెండు రోజుల పర్యటన ప్రపంచదేశాలలో, ముఖ్యంగా పశ్చిమదేశాల్లో ఎంతో ఆసక్తిని రేపింది. 2019 తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే ప్రథమం. రెండు దేశాల మధ్య గత 25 సంవత్సరాలుగా ద్వైపాక్షిక సంబంధాలు, 22 సంవత్సరాలుగా పరస్పర చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇప్పటి సమావేశంపైనే ప్రపంచం దృష్టిపెట్టడం గమనార్హం. గత పదేళ్ల కాలంలో నరేంద్రమోదీ`పుతిన్‌లు 17సార్లు కలుసుకున్నారు. ఈసారి పుతిన్‌ ప్రధాని నరేంద్రమోదీని ఒక విద్యుత్‌ కారులో తన అధికార నివాసం ‘‘నోవో ఒగార్యోవో’’ చుట్టూ తిప్పి చూపించడం ఇద్దరు నేతల మధ్య స్నేహబంధానికి నిదర్శనం.

రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో జరిగిన మోదీ పర్యటన ‘సంక్లిష్ట సంకేతాలకు’ కారణమైందని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కై, ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనను తీవ్రంగా ఖండిరచ డమే కాదు ‘శాంతి యత్నాలకు తీవ్ర విఘాతం కలిగించే చర్య’ అని పేర్కొనడంలో పెద్దగా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. ఇక అమెరికా రాయబారి గార్సెట్టి ‘‘ఒక దేశం నియమానుగత క్రమాన్ని అనుస రించనప్పుడు, భారత్‌`అమెరికాలు ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టేందుకు కృషిచేయాలి’’ అని వ్యాఖ్యానించారు. ఇది ఒకరకంగా భారత్‌కు హెచ్చరికే అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదార్లు అజిత్‌ దోవల్‌, జాక్‌ సులీవాన్‌ల మధ్య ఫోన్‌లో సంప్రదింపులు జరగడం అమెరికా ఈ పర్యటనను తీవ్రంగా పరిగణిస్తున్నదన డానికి సంకేతం.

ఒత్తిడికి గురవుతున్న సంబంధాలు

నిజం చెప్పాలంటే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో భారత్‌`రష్యాల మధ్య సంబంధాలు కొంత ఒత్తిడికి లోనవుతున్నా యన్నది సత్యం. ఉక్రెయిన్‌ సంక్షోభం తర్వాత యుఎస్‌`రష్యాల మధ్య తీవ్రమైన విభేదాలు, చైనా`యుఎస్‌ల మధ్య పెరుగుతున్న సంఘర్షణ వాతావరణం, మరో పక్క భారత్‌`చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ ప్రస్తుత రష్యా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిరది. రష్యా పరంగా చూస్తే ఒకవైపు చైనాతో ‘పరిమితిలేని స్నేహం’, మరోవైపు గత ఆరు దశాబ్దాలుగా భారత్‌లో పెంచుకుంటూ వచ్చిన పలుకుబడిని రక్షించుకోవడం అనే సమస్యలు ఇర కాటంలోకి నెట్టేస్తున్నాయి. వర్తమాన ప్రపంచ రాజకీయాలను పరిశీలిస్తే భవిష్యత్తులో రష్యా సైనికంగా చైనాపై మరింత అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొనవచ్చు. అదే జరిగితే ఇది భారత్‌`రష్యాల మధ్య సంబంధాలకు అవరోధంగా మారగలదు. భవిష్యత్తులో భారత్‌`చైనాల మధ్య సరిహద్దు సంఘ ర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారితే రష్యా మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనక తప్పదు.

వాణిజ్యం – ఆత్మనిర్భర్‌ భారత్‌

రష్యా నుంచి క్రూడాయిల్‌ దిగుమతుల విలువ 2021లో 2.5బిలియన్‌ డాలర్లు కాగా 2023 నాటికి ఇవి ఏకంగా 46.5బిలియన్‌ డాలర్లకు చేరు కున్నాయి. 2025 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరో 30 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. 2030 నాటికి దీన్ని 100 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని మోదీ`పుతిన్‌లు నిర్ణయించారు. కాగా, మనదేశ సైన్యం వద్ద ఉన్న ఆయుధాల్లో 60`70శాతం రష్యావే కనుక ఎప్పటికప్పుడు వాటి నిర్వహణను ఆధునికీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియను మరే ఇతర భాగస్వామితో కలసి పూర్తి చేయడం సాధ్యంకాదు.

ముఖ్యంగా మెటలర్జీ (లోహశాస్త్రం), సూపర్‌ కాంపొనెంట్స్‌, సాగర జలాల్లో భద్రతకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానం, బాలిస్టిక్‌ మిస్సైల్‌ టెక్నాలజీ రంగాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద, ఉమ్మడిగా మన దేశంలోనే ఆయుధాల విడిభాగాల తయారీని చేపట్టే విషయంలో భారత్‌`రష్యాల మధ్య ఇంటర్‌ గవర్నమెంటల్‌ కమిషన్‌ రాబోయే సమావేశంలో చర్చించనుంది. ఇదే సమయంలో భారత్‌ స్వయంగా జెట్‌ ఇంజిన్‌ టెక్నాలజీని అభివృద్ధి పరచు కోవాలన్న ఉద్దేశంతో ఉంది. రష్యా ప్రస్తుతం ఎస్‌యు-57 యుద్ధ విమానాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక ఇంజిన్‌ పరిజ్ఞానం విషయంలో పరస్పర సహకారానికి అవగాహనకు రాగలిగితే వీటిని దేశీయంగా తయారు చేయడానికి అద్భుత అవకాశంగా పరిగణించవచ్చు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపునకు సంబంధించి రెండు దేశాల మధ్య టి-90 ట్యాంకులు, ఎస్‌యు-30 ఎంకెఐ యుద్ధ విమానాలు, ఎ.కె-203 రైఫిల్స్‌, బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీకి సంబంధించి రష్యా మనకు లైసెన్స్‌ ఇచ్చింది. మిగ్‌`29, కామోస్‌ హెలికాప్టర్లు, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య విమాన వాహక యుద్ధ నౌక, ఎస్‌`400 క్షిపణి వ్యవస్థలను మనదేశానికి సరఫరా చేసింది. ఇక పౌర అణుసహకారం విషయానికి వస్తే రష్యా దిగ్గజ అణుశక్తి సంస్థ రోస్తమ్‌ ఒక ప్రకటన చేస్తూ ‘భారత్‌లో మరో ఆరు అణువిద్యుత్‌ కేంద్రాలను నిర్మించేందుకు వీలుగా చర్చలు జరుగుతున్నాయి’ అని తెలిపింది. అంతేకాకుండా రష్యా నుంచి ప్రస్తుతం మాదిరిగానే తక్కువ ధరకు చమురు సరఫరా కొనసాగించేందుకు దీర్ఘకాల ఒప్పందంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను వెనక్కి పంపేందుకు రష్యా అంగీకరించింది.

రవాణా మార్గాల అభివృద్ధి

 తూర్పు సముద్రంలో చెన్నై నుంచి వ్లాడివోస్టాక్‌ కారిడార్‌, ఇంటర్నేషనల్‌ నార్త్‌`సౌత్‌ కారిడార్‌ (ఐఎన్‌ఎస్‌టీసీ) లతో పాటు ఉత్తర సముద్రమార్గంలో ఇరుదేశాల మధ్య నౌకా రవాణాను అభివృద్ధి చేయాలని మోదీ`పుతిన్‌లు కృత నిశ్చయంతో ఉన్నారు. ఉత్తర సముద్ర మార్గంలో రవాణా అవకాశాలపై ఉమ్మడిగా ఇంటర్‌ గవర్నమెంట్‌ వర్కింగ్‌ బాడీ ఏర్పాటుకు ఇరుదేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇది వాస్తవరూపం దాలిస్తే రెండుదేశాల మధ్య హైడ్రోకార్బన్‌ల పరంగా సంబంధాలు మరింత విస్తృతమవుతాయి. జూన్‌ ఆఖరి వారంలో రష్యా నుంచి మొట్టమొదటిసారి రెండు రైళ్లలో బొగ్గును ఐఎన్‌ఎస్‌టీసీ మార్గం ద్వారా ఇరాన్‌కు చేర్చారు. అక్కడి నుంచి నౌకా మార్గం ద్వారా భారత్‌కు చేరుకుంటుంది. దీనివల్ల ఖర్చు, సమయం ఎంతగానో కలిసొస్తాయి. దుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఇంధనరంగంలో చమురు, బొగ్గు రష్యా నుంచి పెద్ద మొత్తంలో మన దేశానికి దిగుమతులు కొనసాగుతున్నాయి. రష్యా బొగ్గు ఎగుమతులను మరింత పెంచేందుకు.. ముఖ్యంగా అంథ్రసైట్‌ కోల్‌ను మన దేశానికి సరఫరా చేసే విషయంలో అవకాశాలను కూడా పరిశీలించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. రష్యాకు చెందిన సూదూర తూర్పు ప్రాంతం, అర్కిటిక్‌ ప్రాంతాల్లో పెట్టుబడుల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని కూడా నిర్ణయించాయి. ముఖ్యంగా వ్యవసాయం, ఇంధనం, మైనింగ్‌, శ్రామికశక్తి, వజ్రాలు, ఔషధాలు, సముద్ర రవాణా రంగాల్లో ఈ సహకారం కొనసాగుతుంది.

దౌత్యవేదికలపై సహకారం

ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్‌, జి-20, తూర్పు ఆసియా సదస్సు, షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ వంటి వేదికలపై వాతావరణ మార్పులు, సైబర్‌ సెక్యూరిటీ, మత్తుమందుల రవాణా, వేర్పాటువాదం, ఉగ్రవాదానికి వ్యతిరేక చర్యలు, వ్యవస్థీ కృత సీమాంతర నేరాలు వంటి అంశాలపై పరస్పరం కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించాయి. ఆసియన్‌ రీజియన్‌ ఫోరమ్‌ ఆన్‌ సెక్యూరిటీ (ఎఆర్‌ఎఫ్‌), ఆసియన్‌ డిఫెన్స్‌ మినిస్టర్స్‌ మీటింగ్‌ ప్లస్‌ (ఎడిఎంఎం ప్లస్‌) వంటి ప్రాంతీయ సంస్థల్లో కూడా పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. భారత్‌కు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి రష్యా మరోసారి పూర్తి మద్దతు తెలిపింది. శాస్త్ర`సాంకేతిక రంగాలు, అంత రిక్షం, పౌర అణు సహకారం, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వ యిజర్స్‌ స్థాయిలో భద్రతకు సంబం ధించిన చర్చలు కొనసాగించాలని కూడా నిర్ణయించాయి.

చైనాకు ఝలక్‌

చైనాతో ‘పరిమితిలేని మైత్రి’ కొనసాగు తున్నప్పటికీ, మోదీని హత్తు కోవడం, రష్యాకు చెందిన అత్యున్నత పౌరపురస్కారాన్ని ఇవ్వడం ద్వారా జిన్‌పింగ్‌కు తాను పూర్తి సన్నిహితం కానన్న సత్యాన్ని పుతిన్‌ చెప్పకనే చెప్పారు. రష్యా విశ్లేషకుల ప్రకారం, పుతిన్‌ ఉత్తరకొరియా పర్యటనను చైనా పెద్దగా పట్టించు కోలేదు. కానీ ఇండియాతో తన సాన్నిహిత్యాన్ని ప్రదర్శించడం ద్వారా రష్యా పూర్తిగా చైనాకు అణకువగా ఉండబోదన్నది స్పష్టమైంది. దీనికి తోడు ఆర్కిటిక్‌, మధ్య ఆసియా, ఈశాన్య ఆసియా ప్రాంతాల్లో రష్యా, చైనాలకు ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. ఇక భారత్‌ విషయానికి వస్తే, రష్యా అధికంగా చైనాపై ఆధార పడకుండా ఉండే రీతిలో సన్నిహత సంబంధా లను కొనసాగించాలి.

తూర్పు`పశ్చిమ దేశాల మధ్య సమతుల్యత సాధనలో భారత విదేశాంగ విధానం రష్యాకు ప్రాధాన్యతనిస్తోంది. అంతేకాదు రష్యాతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో, భారత్‌ ఇటు పశ్చిమ దేశాలు`రష్యాల మధ్య సంధానకర్తగా వ్యవహించ గలుగుతుంది. యురేసియా, ఇండో`పసిఫిక్‌ ప్రాంతంలో రష్యాకు, యు.ఎస్‌, జపాన్‌లతో ఉన్న సమస్యల పరిష్కారానికి భారత్‌ ఉపయోగపడగలదు. ఇది రష్యాకు తెలియనిది కాదు. చైనాతో సాన్నిహిత్యం పశ్చిమ దేశాలతో దౌత్యపరమైన పరిష్కారాలకు పనికిరాదు. ఇరుదేశాలది కేవలం సైనికపరమైన సంబంధానికే పరిమితం. దౌత్యపరంగా, సమస్యలకు విస్తృత పరిష్కార సాధనలో భారత్‌ మాత్రమే రష్యాకు ఉపయో.గపడగలదు. ఇదే సమయంలో పశ్చిమ దేశాల గ్రూపులో చేరడం ద్వారా రష్యాను ఒంటరిగా వదిలేయడానికి భారత్‌ ఎంత మాత్రం సంసిద్ధంగా లేదు.

ప్రధాని పర్యటన విశేషాలు

ప్రధాని నరేంద్రమోదీ మాస్కో ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో చాలా గంటలపాటు గడిపారు. పుతిన్‌ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఆ మరునాడు, రెండో ప్రపంచ యుద్ధం అమరవీరుల స్మృతి కేంద్రం వద్ద అజ్ఞాత సైనికుడి సమాధి నివాళులు అర్పించారు. అనంతరం భారత సంతతి సమావేశంలో పాల్గొంటూ, రష్యా తమకు అన్ని కాలాల మిత్రుడని ప్రశంసించడమే కాకుండా, కాజన్‌, ఎకాటెరిన్‌బర్గ్‌ల్లో రెండు భారత కాన్సులేట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

మోదీ, పుతిన్‌లు మాస్కోలోని ఆల్‌ రష్యన్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వీడీఎన్‌కెను సందర్శించిన అనంతరం, అక్కడి రోస్తమ్‌ పెవిలియన్‌కు వెళ్లి భారత్‌`రష్యాల మధ్య పౌర అణుసహకారానికి సంబంధించిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కుడంకుళంలోని వీవీఈర్‌`1000 అణు విద్యుత్‌ కేంద్రం నమూనాను ఇక్కడ ఆయన వీక్షించారు. అనంతరం ఇరువురు నేతల మధ్య క్రెమ్లిన్‌లో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ సంక్షోభానికి శాంతి యుత పరిష్కారంకోసం ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషికి పుతిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దృఢతరం చేసేందుకు కృషి చేసినందుకు గుర్తుగా క్రెమ్లిన్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మోదీకి ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెంట్‌ ఆండ్రూస్‌ అపోస్టెల్‌’ అవార్డును పుతిన్‌ ప్రదానం చేశారు.

ఈ అవార్డును 2019లోనే ప్రకటించినప్పటికీ, ప్రధానికి ఇప్పుడు అందజేశారు. 1698లో టెస్సార్‌ పీటర్‌ ది గ్రేట్‌ ఈ అవార్డును సెయింట్‌ ఆండ్రూ గౌరవార్థం ప్రవేశపెట్టారు. జులై 8వ తేదీ ఉదయం ఉక్రెయిన్‌కు చెందిన కీవ్‌ నగరంలోని చిన్నపిల్లల ఆసుపత్రిపై జరిపిన క్షిపణి దాడిలో 37మంది పిల్లలు చనిపోవడంపై మోదీ సందిస్తూ ‘‘ఈవిధంగా చిన్నపిల్లల హత్య జరిగిన సంఘటన హృదయంలో కలిగించిన బాధ భరించలేనిది’’ అంటూ పుతిన్‌తో అన్నారు. ఇదే సమయంలో ఇటీవల డాగెస్తాన్‌లో జరిగిన ఉగ్రదాడిని కూడా ప్రధాని ఖండిరచారు. మొత్తంమీద చెప్పాలంటే మాస్కోలో జరిగిన 22వ భారత్‌-రష్యా వార్షిక సదస్సులో కుదిరిన రక్షణ ఒప్పందాలు, మనదేశ భద్రతకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

About Author

By editor

Twitter
YOUTUBE