తమ మత విశ్వాసాలను భక్తిశ్రద్ధలతో పాటించడం సంగతి అటుంచి, ఆ విశ్వాసాల పేరుతో, వాటిని అడ్డం పెట్టుకుని మెజారిటీ ప్రజల మనోభావాలతో ఆటలాడడానికే మైనారిటీలు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నట్టు భావించవలసిన పరిస్థితి దేశంలో ప్రబలింది. మైనారిటీలు తమ పండుగలను సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవడం కంటే, వాటి ద్వారా ఇతర మతాల వారితో కయ్యానికి కాలుదువ్వడానికి చూస్తున్న వాస్తవం, అందుకు రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి కూడా వెనుకాడరన్న నిజం నానాటికీ బయటపడుతున్నది. తెలంగాణలోని మెదక్ పట్టణంలో జూన్ 15న, అంటే బక్రీద్ పండుగకు రెండు రోజుల ముందు జరిగిన దుర్ఘటన, ఫలితంగా తరువాత రెండురోజులు కొనసాగిన ఉద్రిక్త వాతావరణం ఇందుకు రుజువుగా కనిపిస్తాయి. చిరకాలంగా బీఆర్‌ఎస్ ఆధిపత్యంలో ఉన్న మెదక్ లోక్‌సభ నియోజకవర్గం మొన్నటి ఎన్నికలలో బీజేపీ పరమైన తరువాతి పరిణామమిది. అందుకే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ పరిణామాలతో మెదక్ పట్టణంలో 144 సెక్షన్ విధించవలసి వచ్చింది. హింసాత్మక ఘటనలు జరిగి 21 మందిని అరెస్టు చేయవలసి వచ్చింది. ఘటన జరగకుండా నిరోధించడంలో ఘోరంగా విఫలమైన స్థానిక పోలీసు యంత్రాంగం అరెస్టుల దగ్గర కూడా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయినా వీటి గురించి మీడియా వాస్తవాలు చెప్పకుండా ప్రజలను భ్రమలలో ఉంచుతున్నది.
మెదక్‌లో తలెత్తిన ఉద్రిక్తతలకు రెండు ఘటనలు కారణంగా కనిపిస్తున్నాయి. అవి- ఆ పట్టణంలోనే ఇంద్రపురి మిన్హాజ్ ఉల్ ఉలుమ్ మదర్సా దగ్గర జరిగిన ఘర్షణ, ఈ పట్టణ శివారు నర్సిఖేడ్‌లో అక్రమంగా తరలిస్తున్న గోవులను కసాయిల నుంచి రక్షించాలన్న ప్రయత్నంలో తలెత్తిన వివాదం. బక్రీద్ లేదా ఈద్ ఉల్ అధా కోసం గోసంతతిని బలి (ఖుర్బానీ) ఇచ్చేందుకు మైనారిటీలు, గోవును మాతగా పూజించే హిందువులు వాటిని విముక్తం చేయడానికి జరిపిన ప్రయత్నమే మెదక్ ఘర్షణకు మూలం. బక్రీద్‌కు ముందు రెండు రోజులు, తరువాత రెండు రోజులు మెదక్ పట్టణంలో జరిగిన పరిణామాలు ఆందోళన కలిగించేవే. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం ఉన్నదని పోలీసులు, ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ మైనారిటీ వర్గీయులు తమదైన వైఖరితో అశాంతికి బీజం వేసి పెట్టారనే చెప్పాలి. మెదక్ జిల్లా బీజీపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్ లను పోలీసులు అరెస్టు చేయడం జనంలో ఆగ్రహా వేశాలు వ్యక్తమయినాయి. ఎనిమిది మంది ముస్లిం లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గడచిన రెండు దశాబ్దాలుగా మత ఘర్షణల జోలికి పోని మెదక్ ఇప్పుడు ఉద్రిక్త వాతావరణానికి గురైందని జిల్లా స్థాయి పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అయితే ఇందుకు మూలం ఏమిటన్నదే అసలు ప్రశ్న. ఇన్ని అరెస్టులు, 144 సెక్షన్ విధింపు సమాచారం ఎందుకు బయటకు రావడం లేదన్నదీ ప్రశ్నే. పోలీసుల నిర్లక్ష్యం, ఘర్షణ రేగిన తరువాత బుజ్జగింపు పార్టీలు ముస్లింల కొమ్ముకాయడం వంటి కారణాలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బక్రీద్ సందర్భంగా గోసంతతిని బలి చేయకుండా చూడాలని సాక్షాత్తు న్యాయస్థానాలు తాజాగా ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు, ముస్లింలు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గాలికి వదిలేశాయి. పోలీసులు సకాలంలో కలగచేసుకుని ఉంటే ఓ హిందూ యువకుడికి కత్తిపోట్లు తప్పేవి. ఇంత జరిగినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీని గురించి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు.
మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి అంజద్ ఉల్లాఖాన్ చేసిన ట్వీట్ మేరకు ఈ గొడవ ‘బలి ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో తెచ్చిన ఎద్దులను ఒక మదర్సాలో ఉంచగా, మధ్యాహ్నం (15వ తేదీ) మూడు గంటలకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు ఉద్రిక్త వాతావరణం సృష్టించా’రు. ఈ దాడికి అనుమతించిన పోలీసు యంత్రాంగం ఈ ఘర్షణకు బాధ్యత వహించాలని ఖాన్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మైనారిటీల మీద దాడులు చేయడానికి కొందరికి స్వేచ్ఛను కల్పించారని కూడా ఆరోపించారు. ఎడ్లను దాచిపెట్టారన్న ఆరోపణతో మదర్సా మీద దాడి చేసినప్పుడు, లేదా తరువాత ధర్ణా చేసినప్పుడైనా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మీద ఎందుకు చర్య తీసుకోలేదని ఖాన్ విమర్శించారు. ఆ సంస్థల కార్యకర్తలు ముస్లిం ఆస్తులను ధ్వంసం చేసి, ఏడుగురు ముస్లింలను గాయపరిచారని కూడా ఖాన్ చెబుతున్నారు. బక్రీద్ సందర్భంగా బలి ఇచ్చేందుకే మదర్సా యాజమాన్యం ఎద్దులను కొని తెచ్చిందని ఇండియా టుడే కూడా పేర్కొన్నది. ఈ వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం బక్రీద్ సందర్భంగా చంపడానికి తెచ్చిన ఎద్దులను మదర్సాలో ఉంచడమే ఘర్షణకు దారి తీసిందని జిల్లా పోలీస్ సూపరింటెం డెంట్ బాలాస్వామి కూడా వెల్లడించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఈ అంశాన్ని మరింత స్పష్టంగానే వెల్లడించారు కూడా. ఇంద్రపురిలోని మిన్హాజ్ ఉల్ ఉలుమ్ మదర్సా ఖుర్జానీ ఏర్పాటు చేసిందని దీనిని ఆర్‌ఎస్‌ఎస్/హిందూ వాహిని ప్రతిఘటించిందనే అన్నారు. మరి గోవులను, గోసంతతిని చంపడం చట్ట విరుద్ధం అన్న అంశం గురించి, దానిని ఉల్లంఘించి మదర్సాలో గోసంతతిని దాచి ఉంచడం గురించి మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి ఖాన్ ఎందుకు మాట్లాడరు? దాదాపు నలభయ్ ఎద్దులను మదర్సాలో ఉంచారని కొందరు చెబుతున్నారు. అన్ని ఒకేసారి అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయని అంటే, మేత కోసమని యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదమే. పైగా పచ్చి అబద్ధమని కూడా వెల్లడయింది. మెదక్ పట్టణ పోలీసు శాఖకు చెందిన ఒక ఉద్యోగి వివరణ ఇక్కడ గమనార్హం. ఆ వివరణ ప్రకారం: లోపల ఉన్న ఎద్దుల విడుదలకు మదర్సా ముందు మధ్యాహ్నం నిరసన మొదలయింది. నిరసనకారులు ప్రభుత్వ పశువైద్యుడిని తీసుకువచ్చి ఆయన ద్వారానే అక్కడ ఉన్నవన్నీ ఎద్దులని నిర్ధారణ చేయించు కున్నారు. అందులో ఎక్కువ ఎడ్ల వయసు రెండేళ్ల లోపు. అంటే చంపడానికి చట్టం అనుమతించని వయసులో ఉన్నాయి. వాటిని నిరసనకారులు తరలించారు. ఆ సాయంత్రమే మెదక్‌లోనే మరొకచోట ఇదే అంశం మీద ఘర్షణ జరిగింది. ఆ సమయంలో మధ్యాహ్నం మదర్సా వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన నిర్వాహకులు, ఇతర ముస్లింలు కొందరు చికిత్స కోసం చేరిన ఆసుపత్రి మీద రాళ్ల దాడి చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. వీటన్నిటితో మరునాడు ఆదివారం బీజేపీ, ఇతర హిందూ సంస్థలు మెదక్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇది విజయవంత మైంది.
కోడెలను గాని, దూడలను, గోవులను కాని చంపడం తెలంగాణలో 1977 నాటి చట్టం ప్రకారం నిషిద్ధం. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవలసిందిగా జూన్, 2023 లోనే రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. కానీ కొందరు ఆరోపిస్తున్నట్టు తాము గోవులను చంపలేదని స్థానిక ముస్లింలు ఇప్పుడు వాదించారు.
మదర్సా ఘటన తరువాత మెదక్ శివారు నర్సిఖేడ్‌లో కూడా ఆవులను తరలిస్తున్నారన్న సమాచారంతో భారతీయ జనతా యువ మోర్చా అటు వెళ్లింది. గోవులను తరలించుకుపోతున్న వాహనాన్ని సభ్యులు నిలువరించడంతో గొడవ పెద్దదయింది. మొదట బాధ్యతా రహితంగా మాట్టాడినప్పటికీ తరువాత పరిస్థితి వేడెక్కడంతో పోలీసులు ఆవులను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ దశలోనే యువమోర్చా సభ్యుడి మీద దాడి జరిగింది. దాడి చేసిన వారిపై చర్య చేయాలని కోరుతూ యువమోర్చా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్ణా చేసింది. దీనితో పట్టణంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి వ్యాపార సంస్థలన్నీ మూసివేశారు. రామదాస్ చౌరాస్తాలో 144వ సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జి చేయవలసి వచ్చింది.
కాగా, ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు యువకులను గోషామహల్ బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్ పరామర్శించారు. సంగతి తెలిసి ముంబై నుంచి మెదక్ వస్తున్న రాజాసింగ్‌ను మొదట పోలీసులు అడ్డుకుని విమానాశ్రయం వద్దనే అరెస్టు చేయడం విశేషం. గోరక్షకుల మీద కొందరు మతోన్మాదులు కత్తులతో దాడి చేశారని ఆయన ఆరోపించారు.
హిందూ సంస్థలకు చెందిన స్థానికులు ఇచ్చిన వివరాలు కూడా పరిశీలించవలసి ఉంటుంది. చట్టాలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన వారే నిర్లక్ష్యం వహించిన ఫలితంగానే మెదక్‌లో ఘర్షణ వాతా వరణం నెలకొన్నదని వారి ఆరోపణ. మదర్సా ఘటన తరువాత జరిగిన పరిణామాలు ఇంకాస్త తీవ్రమైనవే అనుకోవాలి.
చట్టం ప్రకారం గోమాతలను వధించకూడదు, వాటిని కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా ‘మాకు ఇంకో పనేమీ లేదా’ అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడమే విచారకరం. ఈ సమాధానంతో గోరక్షకులు విస్తుపోయారు. ఇక చేసేదేమీ లేక గోరక్షకులే ప్రాణాలకు తెగించి కసాయిలు తరలిస్తున్న వాహనాల వద్దకు వెళ్లి నిబంధనల ప్రకారం వెళ్తున్నాయా లేదా అని నిలదీశారు. వెటర్నరీ డాక్టర్ ఇవ్వాల్సిన సర్టిఫికెట్ చూపమంటే, సరైన సమాధానం చెప్పకపోగా భౌతికదాడికి దిగింది కసాయి ముఠా. గోరక్షకులు ఆత్మరక్షణ చేసుకుంటూనే మళ్లీ పోలీసులకు విషయం అందించారు. తీరిగ్గా వచ్చిన పోలీసులు అప్పుడైనా చేసిందేమిటి? గోవులను కాపాడిన కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడం. లాఠీఛార్జి చెయ్యడం. కసాయి మూకలకే వత్తాసు పలకడం ఇంకా విచిత్రం. అటు పోలీసుల నుంచి ఇటు కసాయి మూకల నుంచి వచ్చిన ఎదురుదాడిని తట్టుకోవాల్సి వచ్చింది. కసాయీలను సమర్ధించి నందుకు పోలీసులకు దక్కిన గౌరవం గురించి చెప్పుకోవాలి. అప్పటికే పట్టణంలో ఉన్న మరింతమంది కసాయిలను పోగు చేసి గోరక్షకుల మీద దాడి చెయ్యడమే కాకుండా పోలీసులనే దుర్భాషలాడారు. ఇదంతా వీడియోల సాక్షిగా ప్రపంచం చూసింది. అల్లరిమూక చేతిలో గాయపడ్డ గోరక్షక కార్యకర్తలను తోటి కార్యకర్తలే ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వార్త సోషల్ మీడియాలో రావడంతో మెదక్ పట్టణంలోని గోమాత ప్రేమికులు పెద్ద ఎత్తున రావడంతో కసాయి మూక వెనుకడుగు వేసింది.
చట్ట ప్రకారం గోవులను, ఎద్దులను, దూడలను వధించకూడదని స్పష్టంగా ఉన్నా కూడా, దీనిపై ఫిర్యాదు చేసినా గోవులను పట్టపగలు విచ్చలవిడిగా తరలిస్తున్నా ఆపవల్సిన బాధ్యత కలిగిన పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా మెదక్ ప్రశాంతత కోల్పోయింది. కసాయి మూకలకు కొన్ని రాజకీయ పార్టీల అందదండలు వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు తెరవెనుక మద్దతుగా నిలపడ్డారు.
గాయపడ్డ కార్యకర్త అరుణ్‌ను మియాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి చేర్చారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రాజసింగ్ ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. అక్రమంగా అరెస్టయిన గోరక్షకులను జైలులో కలిసి సంఘీభావం ప్రకటించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్వాకం
కాంగ్రెస్ పార్టీలో ఉంటే, ఆ పార్టీ తరఫున శాసనసభ్యునిగా ఎన్నికైతే ఆ విషయాన్ని వెల్లడించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయా? ఆ పద్ధతులు హిందూ వ్యతిరేకమైనవే అయి ఉండాలా? తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన నిర్వాకం ఇలాంటి ప్రశ్నలకు తావిస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంబం అనిల్‌కుమార్ రెడ్డి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియచేయడానికి వినూత్నమైన విధ్వంసకర పద్ధతిని అవలంబించారు. తరువాత ఆయన ఇందుకు క్షమాపణ చెప్పి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ నైజం హిందూ వ్యతిరేకత అన్నది మాత్రం ఇది తిరుగు లేకుండా రుజువు చేసింది. ఒక ఇస్లామిక్ కట్టడం నేపథ్యంగా ఉన్న బొమ్మలో ఆవును చిత్రించారు. నిజానికి అక్కడ గొర్రె ఉండాలి. కానీ ఆవును చిత్రించారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది. దీనితో ఎమ్మెల్యే వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి దానిని తొలగించి, బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఈ శుభాభినందనల పత్రం మీద కాంగ్రెస్ పెద్దల ఫొటోలు కూడా ఉన్నాయి. అయినా ఇంతవరకు దీని మీద స్పందన లేదు. ఖండన కూడా లేదు. ఈ గ్రీటింగ్ మీద రాజాసింగ్ తదితరులు మండిపడ్డారు.
-జాగృతి డెస్క్