‘‘1999లో జరిగిన లాహోర్‌ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించింది.  అది మేం చేసిన పొరపాటు’’ అని మే 28, 2024న నవాజ్‌ షరీఫ్‌ ఈ ప్రకటన చేశారు. సరిగ్గా పాతికేళ్ల క్రితం మే 28, 1998న అటల్‌ బిహారీ వాజపేయి తాను సంతకాలు చేశామని, కాని పాకిస్తాన్‌ కార్గిల్‌లో దుస్సాహసమే చేసిందని షరీఫ్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ ఎన్‌ సమావేశంలోనే ప్రకటించారు. శరీరం గడ్డకట్టుకుపోయే వాతావరణంలో అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య దాదాపు 80 రోజులు జరిగిన పోరును ప్రపంచమంతా చూసింది. అంతకు ముందు భారత్‌తో పాకిస్తాన్‌ చేసిన మూడు యుద్ధాలలోనూ శృంగభంగమే మిగిలినా మళ్లీ కాలు దువ్వింది. మతోన్మాద సంస్థల విరగబాటు, మతపిచ్చితో రెచ్చిపోయే పాక్‌ సైన్యం ఇందుకు కారణం. భారత్‌ విజయం లాంఛనమే. శత్రువుపై సాధించిన ఆ విజయం ప్రతి భారతీయుని మదిలో విజయగర్వాన్ని, దేశభక్తిని నింపింది. సినీ నటులు, క్రికెట్‌ ఆటగాళ్లను ఆరాధించే యువతకు నిజమైన జవానులే అసలైన హీరోలు అని తెలిసొచ్చింది. భారత్‌కు శాంతి మంత్రమే కాదు, యుద్ధతంత్రం కూడా తెలుసునని వీరజవాన్లు, నాటి బీజేపీ ప్రభుత్వం చాటగలిగారు. ఆ విజయాన్ని ఏటా జులై 26న కార్గిల్‌ విజయ్‌ దివస్‌గా  జరుపుకుంటున్నాం.

భారత్‌ మీద వెయ్యేళ్ల జిహాద్‌ను ప్రకటించిన దేశం పాకిస్తాన్‌. అధ్యక్షులు, ప్రధానులు మహమ్మదలీ జిన్నా, లియాఖత్‌ అలీఖాన్‌, యాహ్యాఖాన్‌, జడ్‌ఏ భుట్టో, బెనజీర్‌ భుట్టో, ముషార్రఫ్‌, నవాజ్‌ షరీఫ్‌ ఎవరైనా భారత్‌ మీద కాలు దువ్వినవారే. భారత్‌తో 1947, 1965, 1971 యుద్ధాలలో చిత్తుగా ఓడినా బుద్ధి మారలేదు. 1999లో కార్గిల్‌ ఘర్షణకు సిద్ధపడి మరొకసారి కునారిల్లిపోయింది. మొదటి మూడు యుద్ధాల సమయంలో మీడియా విస్తృతి అంతగా లేదు. సమాచార సాంకేతిక విప్లవం వికసిస్తున్న రోజుల్లో జరిగిన 1999 కార్గిల్‌ యుద్ధం ప్రపంచాన్ని ఆకర్షించింది. సరిహద్దులను కాపాడేందుకు వీరజవానులు చేసిన త్యాగాలు చూసి భారతజాతి చలించిపోయింది.

కార్గిల్‌ యుద్ధం హఠాత్తుగా జరిగింది కాదు. దానికి ఎంతో పూర్వ చరిత్ర ఉంది. పూర్వం కార్గిల్‌ జమ్ముకశ్మీర్‌ సంస్థానంలోని గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ జిల్లాలో భాగం. విభిన్న భాషలు, మతాల ప్రజలు నివ సించేవారు. 1947లో కశ్మీర్‌ సంస్థానం భవిష్యత్తును తేల్చడంలో జాప్యం జరిగింది. అప్పుడే గిరిజన మూకల ముసుగులో పాక్‌ సైన్యం దురాక్రమణకు దిగింది. కశ్మీర్‌ పాలకుడు మహారాజా హరిసింగ్‌ వెంటనే భారత్‌లో విలీనం చేశారు. భారత సైన్యం పాక్‌ మూకలను తిప్పికొట్టింది. ఈ సందర్భంగా జరిగిన పరిణామాల్లో నియంత్రణ రేఖ బాల్టిస్తాన్‌ జిల్లా మీదుగా వెళ్లగా కార్గిల్‌ ప్రాంతం భారత దేశంలోని జమ్ముకశ్మీర్‌లో భాగమైంది. ఐదేళ్ల క్రితం ఏర్పడిన లద్దాక్‌ పరిధిలోకి వచ్చింది.

శ్రీనగర్‌ మంచుమయం. అక్కడ నుంచి 205 కి.మీ.ల దూరంలో ఉంది కార్గిల్‌. అక్కడ శీతా కాలంలో ఉష్ణోగ్రత మైనస్‌ 48 సెల్సియస్‌ డిగ్రీలు. శ్రీనగర్‌ -లెప్‌ాలను కలిపే జాతీయ రహదారి కార్గిల్‌ మీదుగా పోతుంది. వ్యూహాత్మంగా భారత్‌కు కీలకమైన ప్రాంతం.

కదనరంగంగా మారిన సియాచిన్‌

భారత్‌, పాకిస్తాన్‌ల సరిహద్దు వివాదానికి మూలం సియాచిన్‌ హిమానీ నదం. ఇది నివాస యోగ్యం కాదు. సియాచిన్‌ 1949 కరాచీ ఒప్పందం, 1972 సిమ్లా ఒప్పందంలో ఏ దేశానికి చెందుతుందో ప్రస్తావించనే లేదు. ఆరంభంలో దీన్ని ఇరు దేశాలు తటస్థ భూమిగా భావించాయి. అయితే కశ్మీర్‌పై పట్టు సాధించే క్రమంలో సియాచిన్‌ ప్రాధాన్యతను గుర్తించిన పాకిస్తాన్‌ దాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేపట్టింది. ఇందులో భాగంగా 1970,80లలో సియాచిన్‌ ప్రాంతంలోకి పర్వతారోహకులు ప్రవేశించేందుకు పాకిస్తాన్‌ అనుమతులు ఇచ్చింది. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్‌, పాకిస్తాన్‌లు చలికాలంలో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాయి. కానీ భారత సైన్యం లేని సమయంలో పాకిస్తాన్‌ ఈ ప్రాంతాలను ఆక్రమించు కోవడం ప్రారంభించింది. ఈ పన్నాగాలను గ్రహించిన భారత సైన్యం ఏప్రిల్‌ 13, 1984న ‘ఆపరేషన్‌ మేఫ్‌ుదూత్‌’ను చేపట్టింది. పాకిస్తాన్‌ కూడా తమ దళాలను మోహరించినా భారత్‌ తిప్పి కొట్టి సియాచిన్‌ను తమ అధీనంలోకి తీసుకుంది. దీనితో పాకిస్తాన్‌ సేనల అహం దెబ్బతింది. నాటి నుంచీ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ వచ్చింది పాకిస్తాన్‌.

భారత్‌- పాక్‌ అణుపరీక్షలు

1998లో నాటి భారత ప్రధాని వాజపేయి పోఖ్రాన్‌లో విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించారు. అమెరికా బెదిరింపులు, ఆంక్షలకు తలొగ్గకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆపరేషన్‌ ‘శక్తి’పేరుతో మే 11, 13 తేదీల్లో జరిపిన పరీక్షలివి. భారత క్షిపణి పితామహుడు అబ్దుల్‌కలాం కీలకపాత్ర పోషించారు. దీనితో అణు సామర్థ్యం కలిగిన ఆరవ దేశంగా భారత్‌ నిలిచింది. ఈ పరిణామంతో పాకిస్తాన్‌, చైనానుంచి అరువు తెచ్చుకొన్న పరి జ్ఞానంతో మే 28, 30 తేదీల్లో అణుపరీక్షలను నిర్వ హించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గించ డానికి ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని సూచించారు.

బస్సుయాత్ర-లాహోర్‌ ఒప్పందం

సరిహద్దు వివాదాలు ఉన్నా ఇరు దేశాల ప్రజల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉండాలని ప్రధాని వాజపేయి భావించారు. ఫలితమే న్యూ ఢల్లీి -లాహోర్‌ మధ్య బస్సు. ఆరంభంలో ఆయనే లాహోర్‌ను సందర్శించారు. అక్కడ ఫిబ్రవరి 21, 1999న వాజపేయి, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ఇద్దరు నేతలు లాహోర్‌ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం రెండు దేశాలు మధ్య శాంతి, స్థిరత్వం కోసం, కశ్మీర్‌ కేంద్రంగా ఉన్న అన్ని సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి. అణ్వాయుధాలను ప్రమాదవశాత్తు లేదా అనధికారి కంగా ఉపయోగించడాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి.

లాహోర్‌ ఒప్పందానికి తూట్లు

లాహోర్‌ చర్చల సమయంలోనే అది నచ్చని ఆ దేశ సైనిక ప్రధానాధికారి పర్వేజ్‌ ముషార్రఫ్‌ కుట్రకు తెర లేపారు. ‘గ్యాంగ్‌ ఆఫ్‌ ఫోర్‌’గా పిలిచే ముషార్రఫ్‌, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ అజీజ్‌ఖాన్‌, కోర్‌ కమాండర్‌ జనరల్‌ మెహమూద్‌, ఉత్తర ప్రాంత పదాతిదళ కమాండర్‌ జావెద్‌ హసన్‌ కలిసి వ్యూహం రచించారు. దీనికి ‘ఆపరేషన్‌ బ్ర’ అని రహస్య పేరు పెట్టారు. దీని లక్ష్యం కశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచిన్‌ నుండి వెనక్కి పంపడం, భారత్‌ని కశ్మీర్‌ సరిహద్దు పరిష్కారం పేరుతో ఇరుకున పెట్టడం. కశ్మీర్‌ సమస్య అంతర్జాతీయ వేదికల మీదకు చేరాలన్నది కూడా వారి ఉద్దేశం.

కొండలపై తిష్టేసిన శత్రువు

లద్దాక్‌లోని గార్కల్‌ గ్రామానికి చెందిన తాషీనామ్‌ గ్యాల్‌ అనే బౌద్ధ పశువుల కాపరికి చెందిన యాక్‌ (జడల బర్రె) తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ సరిహద్దులకు వెళ్లాడు. అంతకు ముందురోజు అంటే 1999 మే 3వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన 6 నార్తర్న్‌ లైట్‌ ఇన్ఫాంట్రీ సైనికులు దాదాపు 1700 మంది ముజాహిద్దీన్‌ల ముసుగులో సరిహద్దు దాటి 8 కిలోమీటర్ల లోనికి చొరబడ్డారు. పాక్‌ ఎస్‌ఎస్‌జి, సెవెన్‌ నార్త్‌ లైట్‌ ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, కశ్మీర్‌ ఉగ్రవాద మూకల చొరబాటుదారులు, అఫ్ఘాన్‌ కిరాయిమూకల సహాయంతో ఈ ఎత్తైన పోస్ట్‌లను ఆక్రమించు కున్నాయి. లెప్‌ాను శ్రీనగర్‌ నుంచి వేరుచేయడం ద్వారా వాస్తవాధీన రేఖ రూపురేఖలను మార్చాలన్నది వారి లక్ష్యం. సాధారణంగా సరిహద్దుల వెంట పాకిస్తాన్‌ తరచూ కాల్పులు జరుపుతూనే ఉంటుంది. దీటుగా భారత సైన్యం కూడా ఎదురు కాల్పుల ద్వారా సమాధానం ఇస్తుంది. ఈ కాల్పుల చాటునే చొరబాటుదార్లు పెద్ద సంఖ్యలో ప్రవేశించారు. పాక్‌ కాల్పుల్లో భారత గస్తీ దళానికి చెందిన ఓ జవాను మరణించాడు. తాషీనామ్‌ గ్యాల్‌ సరిహద్దుకు దూరం నుంచి బైనాక్యులర్‌ ద్వారా చూస్తే అనుమానిత వ్యక్తులు కనిపించారు. వారు తన యాక్‌ను చంపి తిన్నారని గ్రహించాడు. వెంటనే భారత గస్తీ దళాలకు సమాచారాన్ని అందించారు.

భారత సైన్యం మొదట సమస్య తీవ్రతను గ్రహించలేకపోయింది. మే 5వ తేదీన మన సైన్యం కెప్టెన్‌ సౌరబ్‌ కాలియా నాయకత్వంలో ఐదుగురు సైనికుల గస్తీ దళాన్ని ఆ ప్రాంతానికి పంచించింది. పాక్‌ సైన్యం వీరిని చంపేసింది. కానీ అది తీవ్రవాదుల పని అన్నట్లుగా పాకిస్తాన్‌ నమ్మించే ప్రయత్నం చేసింది.

అదే సమయంలో ముషార్రఫ్‌, అజీజ్‌లు కార్గిల్‌ ప్రాంతంలోని సైనికుల గురించి మాట్లాడుకున్న ఆడియో టేపులను భారత సైన్యం ఛేదించింది. ద్రాస్‌, కక్సార్‌, ముషో సెక్టార్లలో చొరబాట్లు జరిగాయని గ్రహించింది. ఈలోగా మే 9న పాకిస్తాన్‌ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్‌ ఆయుధాగారం ధ్వంసమైంది. పరిస్థితి తీవ్రత అర్థమైపోయింది. కార్గిల్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది పాకిస్తాన్‌ సైన్యమేనని స్పష్టమైంది.

నవాజ్‌కు వాజపేయి ఫోన్‌

పాకిస్తాన్‌ దురాక్రమణ వార్త తెలియగానే ప్రధాని వాజపేయి పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఫోన్‌ చేశారు. ‘మీరు నాతో చాలా దారుణంగా వ్యవహ రించారు. లాహోర్‌లో నన్ను హత్తుకుంటూనే, మీవాళ్లను కార్గిల్‌ ఆక్రమణ కోసం పంపిస్తున్నారు..’ అన్నారు. నవాజ్‌ షరీఫ్‌ తనకు ఆ విషయం తెలీదన్నారు. పర్వేజ్‌ ముషార్రఫ్‌తో మాట్లాడి మళ్లీ ఫోన్‌ చేస్తాను అన్నారు. అప్పుడు వాజపేయి, ‘నా పక్కనే ఓ పెద్దమనిషి ఉన్నారు, ఆయనతో మాట్లాడతారా?’ అన్నారు.

ఆ పెద్దమనిషి బాలీవుడ్‌ ప్రముఖుడు దిలీప్‌ కుమార్‌. ఫోన్లో దిలీప్‌ కుమార్‌ గొంతు వినగానే నవాజ్‌ హతాశయులయ్యారు. ‘షరీఫ్‌ సాబ్‌! మీరిలా చేస్తారని నేనసలు అనుకోలేదు. ఎందుకంటే మీరెప్పుడూ భారత్‌-పాకిస్తాన్‌ మధ్య శాంతి గురించే మాట్లాడేవారు. భారత్‌-పాక్‌ మధ్య ఎప్పుడు ఉద్రిక్తతలు తలెత్తినా ఇక్కడి ముస్లింలు అభద్రతా భావంలో పడతారు. వారికి ఇళ్లలోంచి బయటికి వెళ్లడం కూడా కష్టమైపోతుంది’’ అన్నారు దిలీప్‌ కుమార్‌ (పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్‌ మహమూద్‌ కసూరీ తన ఆత్మకథ ‘నైదర్‌ ఎ హాక్‌ నార్‌ ఎ డోవ్‌’లో ఈ కథనం రాశారు). వెంటనే ప్రధాని, రక్షణమంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌, భారత సైన్యాధ్యక్షుడు వేద్‌ప్రకాష్‌ మాలిక్‌ సమావేశమై సైన్యాన్ని సిద్ధం చేశారు.

ఆపరేషన్‌ విజయ్‌ ప్రారంభం

పాక్‌ ధోరణి 1999లో రెండు దేశాల మధ్య నాలుగవసారి యుద్దానికి దారితీసింది. పాకిస్తాన్‌ చొరబాట్లకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం ‘ఆపరేషన్‌ విజయ్‌’ మొదలు పెట్టింది. పెద్ద సంఖ్యల్లో సైనికుల్ని కార్గిల్‌కు తరలించింది. యుద్ధ క్షేత్రమంతా ఎత్తైన కొండలు. శత్రుమూకలను తిప్పి కొట్టడం తేలిక కాదు. పాకిస్తాన్‌ సైన్యం కార్గిల్‌ను అక్రమించడానికి వెనుక ఉన్న ధైర్యం ఎత్తైన కొండలే. దాదాపు 130 కిలో మీటర్ల పరిధిలో 16-18 వేల అడుగుల ఎత్తైన పర్వతాల మీద నుంచి జాతీయ రహదారి (ఎన్‌ హెచ్‌ 1డీ)పై రాకపోకలు, భారత సైన్యం కదలికలను తేలికగా గమనించవచ్చు. దీనికి తోడు గడ్డకట్టుకు పోయేంత చల్లటి ఉష్ణోగ్రతలు. గత యుద్ధాలలో ఓటముల కారణంగా భారత్‌తో ముఖాముఖి యుద్ధం చేయడం కష్టమని పాక్‌ గ్రహించింది. కొండలను ఎంచుకొని భారత్‌ సైన్యానికి ఎక్కవ నష్టం కలిగించాలనే వ్యూహం ఇందుకే.

కీలకమైన జాతీయ రహదారి-1డి పాక్‌ శతఘ్ని దాడికి గురయ్యే పరిధిలో ఉండటంతో సైన్యాన్ని, ఆయుధాలను తరలించడం, విమానాల ద్వారా సామాగ్రిని చేరవేయడం కూడా కష్టమైపోయింది. అందుకే జూన్‌ రెండో వారానికి గాని భారత్‌ యుద్ధభూమి మీద పట్టు సాధించలేకపోయంది. ఆ తర్వాత చొరబాటును నియంత్రించే స్థితికి వెళ్లింది. శత్రువుల దగ్గర ఆయుధాలు, గ్రనేడ్లు మాత్రమే కాక ఫిరంగులు, శతఘ్నులు, యుద్ధవిమానాలని కూల్చివేసే తుపాకులు ఉన్నాయి. మానవరహిత విమానాలు, అమెరికా సమకూర్చిన ఫైర్‌ ఫైండర్‌ రాడార్‌ల ద్వారా పాకిస్తాన్‌ పర్యవేక్షణ కొనసా గించింది. 8,000 మందు పాతరలు కనుగొన్నట్లు తర్వాత కాలంలో భారత్‌ ప్రకటించింది.

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌

మే 26న చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు మొదలయ్యాయి. ఇదే ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’. మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ల సహాయంతో వైమానికదళం శత్రుసైన్యంపై బాంబుల వర్షం కురిపించి కొన్ని స్థావరాలను నేలమట్టం చేసింది.ఈ పోరాటంలో భారత వైమానిక దళం ఒక మిగ్‌-27 స్ట్రైక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ని ఇంజిన్‌ విఫలం కావడంతో కోల్పోయింది. మరో మిగ్‌-21 ఫైటర్‌ ని పాక్‌ దళాలు కూల్చివేశాయి. మొదట్లో రెండిరటినీ తామే కూల్చినట్లు పాకిస్తాన్‌ చెప్పుకుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్డ్‌ పాక్‌ ఆఫీసరు సాంకేతిక సమస్యల వల్లే కూలిందని చెప్పాడు.

మే 27, 1999న ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ నచికేత నడుపుతున్న మిగ్‌-27లో ఇంజన్‌ లోపంతో బటాలిక్‌ సెక్టార్‌లో ఉండగా పారాచూట్‌ సాయంతో బయట పడ్డారు. పాక్‌ సైన్యం యుద్ధఖైదీగా పట్టుకుంది. నచికేత జాడ కనిపెట్టడానికి వెళ్లిన స్క్వాడ్రన్‌ లీడర్‌ అజయ్‌ అహూజా విమానాన్ని మిసైల్‌ సహాయంతో పాక్‌ దళాలు కూల్చేశాయి. విమానం కూలి పోవడానికి ముందే అజయ్‌ అహుజా క్షేమంగా బయట పడి పాక్‌ దళాలకు దొరకడంతో కాల్చి చంపారు. మే 28న ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్‌ కూల్చడంతో నలుగురు సిబ్బంది మరణించారు. జూన్‌ 1న పాకిస్తాన్‌ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు వేసింది.

టోలోలింగ్‌ స్వాధీనం

ద్రాస్‌ సెక్టార్‌లో ఎన్‌హెచ్‌ 1డీ చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీన పర్చుకోవడం మొదటి ప్రాధాన్యతగా భావించింది భారత సైన్యం. అందుకే ద్రాస్‌లో ఉన్న టైగర్‌ హిల్‌, టోలోలింగ్‌ పర్వతాల మీద గురిపెట్టారు. ఆ తర్వాతే సియాచిన్‌ వైపు ప్రవేశించే బటాలిక్‌-టుర్‌ టోక్‌ సబ్‌ సెక్టార్‌ మీద దాడి చేశారు. జూన్‌ 6 న భారత సైన్యం పెద్ద ఎత్తున దాడులు మొదలుపెట్టింది. జూన్‌ 9 బటాలిక్‌ సెక్టారులో రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి వశపరచుకుంది.

సముద్ర మట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్‌ పర్వత శిఖరాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం 110 డిగ్రీల చలిగాలుల మధ్య పోరాటం సాగించింది. కర్నల్‌ రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో సైన్యాన్ని అర్జున్‌, భీమ, అభిమన్యు అని మూడు భాగాలుగా చేసి త్రిముఖ వ్యూహం పన్ని జూన్‌ 14, 1999న టోలోలింగ్‌ను స్వాధీనం చేసుకొని జాతీయ జెండా ఎగురవేశారు.

మేజర్‌ వివేక్‌ గుప్తా, హైదరాబాద్‌కు చెందిన మేజర్‌ పద్మపాణి ఆచార్య శత్రుమూకలతో పోరాడి అమరులైౖంది ఇక్కడే. మరికొంత మంది సైనికులను కోల్పోవలసి వచ్చింది. కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లలో దాదాపు సగం మంది టోలోలింగ్‌ శిఖర కైవసం సందర్భంగా అమరులయ్యారంటే పోరాటం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. టోలోలింగ్‌ పర్వత శిఖరాన్ని భారత సైన్యం స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ యుద్ధంలోని కీలక విజయాన్ని నమోదు చేసింది. అయితే దీన్ని నిలుపు కోవడం మరింత కీలకంగా మారింది.

టైగర్‌ హిల్స్‌ పోరాటం

టోలోలింగ్‌ గెలుపుతో సైన్యం స్థైర్యం పెరగటమే కాదు ఇక్కడి నుంచి లద్దాక్‌ మార్గం జాతీయ రహదారి 1డిలో దాదాపు 20 కిలోమీటర్ల పరిధి వరకు భారత్‌ అధీనంలోకి వచ్చింది. ఎన్‌ హెచ్‌ 1డీ రహదారి పరిసర ప్రాంతాలలోని స్థావరాలను జూన్‌ మధ్య నాటికి భారత సైన్యం తిరిగి స్వాధీన పర్చుకుంది. ఆ తర్వాత శత్రువులను నియంత్రణ రేఖ అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టింది. యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగాయి. తర్వాత టైగర్‌ హిల్స్‌ మీద దృష్టి పెట్టింది. జూన్‌ 29న భారత సైన్యం టైగర్‌ హిల్‌ సమీపంలోని రెండు కీలక స్థావరాలను పాయింట్‌ 5060, పాయింట్‌ 5100 స్వాధీనపరచుకుంది. జూలై 2న మన సైన్యం యుద్ద క్షేత్రంలో త్రిముఖ దాడిని మొదలుపెట్టింది. జూలై 4న దాదాపు11 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్‌ హిల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. జూలై 5న భారత సైన్యం ద్రాస్‌ సెక్టార్‌ పై పూర్తి నియంత్రణ సాధించింది. జూలై 7న బటాలిక్‌ సెక్టారులోని జుబర్‌హైట్స్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.

బాత్రా టాప్‌.. యోధుని పేరు

సముద్రమట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాయింట్‌ 5140 ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి జరిగిన యుద్ధానికి లెఫ్టినెంట్‌ కర్నల్‌ యోగేష్‌ కుమార్‌ జోషి నాయకత్వం వహించారు. సైన్యాన్ని రెండు భాగాలుగా చేసి ఒక దానికి లెఫ్టినెంట్‌ సంజీవ్‌ సింగ్‌, మరొక దానికి లెఫ్టినెంట్‌ విక్రం బాత్ర నాయకత్వం వహించారు. ఇద్దరూ విజయం సాధించి పాయింట్‌ 5140ని స్వాధీన పరచుకున్నారు. విక్రం బత్రాకు కెప్టెన్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు.

ఆ తర్వాత జూలై 8న కెప్టెన్‌ విక్రం బత్రా, కెప్టెన్‌ అనుజ్‌ నయ్యర్‌ ఆధ్వర్యంలో సైన్యం పాయింట్‌ 4875 స్వాధీనానికై బయల్దేరింది. మూడు రోజుల భీకర యుద్ధం అనంతరం జూలై 11న ఆ ప్రాంతం మన వశమైంది. గాయపడిన భారత సైనికుడికి సహాయం చేస్తున్న సమయంలో కెప్టెన్‌ విక్రం బత్రాను పాకిస్తాన్‌ సైనికుడు వెనక నుంచి తుపాకీతో కాల్చడంతో ఆ యుద్ధవీరుడు నేలకొరిగాడు. పాయింట్‌ 4875 శిఖరానికి ‘బాత్రాటాప్‌’ అని పేరు పెట్టారు. జూలై 11 బటాలిక్‌లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీనపరచుకోవడంతో పాకిస్తాన్‌ వెనక్కి వెళ్లడం మొదలైంది.

వాజపేయి యుద్ధనీతి

పోరు తీవ్రంగా సాగుతున్న సమయంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అనిల్‌ యశ్వంత్‌ ప్రధాని వాజపేయికి ఫోన్‌ చేసి ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ విజయవంతంగా సాగుతోందని, ఎల్‌ఓసీని దాటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరాడు. కానీ వాజపేయి స్వీయ నియంత్రణ పాటిస్తూ ఎల్‌ఓసీని దాటవద్దని చెప్పారు. ఈ నిర్ణయం భారత దౌత్య విజయానికి కీలకమైనదిగా విశ్లేషకులు భావించారు. వాజపేయి యద్ధనీతిని ఆసియన్‌ దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలే కాకుండా అమెరికా, చైనా కూడా స్వాగతించాయి. అలా సరిహద్దు దాటితే యుద్ధ తీవ్రత పెరగడమే కాక, అంతర్జాతీయంగా అనేక ప్రశ్నలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. భారత్‌కు శాంతి మంత్రమే కాదు, యుద్దతంత్రం కూడా తెలుసు అని చాటి చెప్పారు వాజపేయి.

దిగొచ్చిన పాక్‌

జూన్‌ 15న అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ప్రధాని నవాజ్‌కి ఫోన్‌ చేసి కార్గిల్‌ నుండి వెనక్కి తప్పుకోమని స్పష్టం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు నత్తనడకన సాగాయి. నవాజ్‌ తీరుపై క్లింటన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత షరీఫ్‌ అభ్యర్థనపై క్లింటన్‌ కలిశారు. ‘బేషరతుగా సైనికులను ఉపసంహరించడం మీకు ఇష్టం లేకపోతే, ఇక్కడికి రాకండి, అని నేను మీకు ముందే చెప్పాను. మీరు అలా చేయకపోతే, ‘కార్గిల్‌ సంక్షోభానికి దోషి పాకిస్తానే’ అని చెప్పడానికి ముందే సిద్ధం చేసిన ప్రకటన నా దగ్గర సిద్ధంగా ఉంది’ అని షరీఫ్‌తో క్లింటన్‌ చెప్పేశారు. క్లింటన్‌తో మాట్లాడుతున్నప్పుడే, టీవీలో ‘టైగర్‌ హిల్‌పై భారత్‌ పట్టు’ అనే వార్త ఫ్లాష్‌ అయింది. సమావేశం బ్రేక్‌ సమయంలో ముషా ర్రఫ్‌కు ఫోన్‌ చేసిన నవాజ్‌ షరీఫ్‌ వార్త నిజమేనా అని అడిగారు. ముషార్రఫ్‌ ఖండిరచలేదు. క్లింటన్‌తో సమావేశం అయిన తర్వాత నవాజ్‌ షరీఫ్‌ బయటికి వస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఒత్తిడి కనిపించింది

ఒక దశలో పాకిస్తాన్‌ అణుదాడికి సిద్ధపడు తున్నట్లు వార్తలు వచ్చినా, పూర్తి స్థాయి పరిజ్ఞానం లేకపోవడంతో వెనక్కి తగ్గింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళ వ్యక్తం చేశాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ పై ఒత్తిడి పెరిగింది. ఆదేశానికి అత్యంత సన్నిహిత దేశమైన చైనా కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధ పడలేదు.ప్రపంచ దేశాల ముందు దోషిగా ఒంటరైపోయిన పాకిస్తాన్‌ కార్గిల్‌ నుంచి వెనక్కి తగ్గేందుకు నిర్ణయం తీసుకోక తప్పలేదు.

ఒకదశలో భారత నౌకాదళం ఆపరేషన్‌ తల్వార్‌ పేరుతో కరాచీ నౌకాశ్రయంతో పాటు ఇతర సముద్రమార్గాలను దిగ్బంధించడానికి సిద్ధమైంది. భారత నౌకాదళానికి చెందిన పశ్చిమ-తూర్పుదళాలు ఉత్తర అరేబియా సముద్రంలోకి చేరాయి. పూర్తి స్ధాయి యుద్ధం సంభవిస్తే పాక్‌ వద్ద కేవలం ఆరు రోజులకు సరిపడ ఇంధనమే ఉందని నవాజ్‌ షరీఫ్‌ చెప్పాడు.

జూలై 26 విజయ్‌ దివస్‌

జూలై 14న ఆపరేషన్‌ విజయ్‌ విజయవంత మైందని భారత ప్రధాని వాజపేయి ప్రకటించారు. దీంతో పాటు పాకిస్తాన్‌తో చర్చలకు భారత్‌ షరతులు విధించింది. జూలై 26న యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్‌ చొరబాటుదారులను పూర్తిగా వెళ్లగొట్టామని భారత సైన్యం ప్రకటించింది. దాదాపు రెండు నెలల 20 రోజుల తర్వాత పాక్‌ సైన్యం పూర్తిగా వెనక్కి తగ్గింది. దాదాపు 130 స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది.

ఈ విజయ సాధనలో 527మంది సైనికులు బలిదానం చేశారు. 1,363 మంది గాయపడ్డారు. సైన్యానికి అవసరమైన ఆయుధ, ఆహార సరఫరా అందించిన ‘టండా టైగర్‌’ దళంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు.

పాక్‌ సైనికులు దాదాపు 12 వందలకు పైగా మరణించి, అంతకు మూడిరత మంది గాయపడినా, ఈ లెక్కలు అధికారికంగా వెల్లడికాలేదు. మృతులు తమ సైనికులే కాదని బుకాయించింది పాకిస్తాన్‌. పట్టుబడ్డ 8 మంది సైనికులను ఆగస్ట్‌ 13, 1999న తిరిగి పాక్‌కు అప్పగించారు. సరిహద్దు దాటి భారత్‌లో ప్రవేశించి సైనిక స్థావరాలను ఆక్రమించి నందుకు పాకిస్తాన్‌ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. నాటి నుంచి యుద్ధం ముగిసిన జూలై 26వ తేదీని ‘ఆపరేషన్‌ విజయ్‌’ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. కార్గిల్‌ కదనంలో భారత సైనికులు చూపిన పరాక్రమం, ధైర్యసాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి పరాక్రమాన్ని చిత్రిస్తూ అనేక బాలీవుడ్‌ సినిమాలు వచ్చాయి. కార్గిల్‌ విజయం అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టను పెంచింది.

వ్యూహాత్మకంగా సాగిన పోరాటం

కార్గిల్‌ యుద్ధాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చు. మొదటి దశలో పాక్‌ దళాలు కార్గిల్‌ కొండ లను వ్యూహాత్మకంగా ఆక్రమించుకొని ఎన్‌ హెచ్‌ 1డీని తమ శతఘ్నుల పరిధిలోకి తెచ్చుకున్నాయి. రెండో దశలో భారత దళాలు చొరబాట్లను గుర్తించి సైన్యాన్ని సమాయత్తం చేసింది. మూడో దశలో పాక్‌ ఆక్రమించుకున్న భూభాగాలన్నింటినీ భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకుంది. భారత్‌ ఆపరేషన్‌ విజయ్‌ కోసం 20 వేల మంది సైన్యాన్ని వినియోగించింది.

కొండ ప్రాంతాల్లో తిష్టవేసిన శత్రువును తీవ్రంగా దెబ్బతీసేందుకు భారత సైన్యానికి బొఫోర్స్‌ శతఘ్నులు ఎంతో ఉపయోగపడ్డాయి. మిగిలిన ప్రాంతాలలో వీటిని మోహరించడానికి సరిపడ స్థలం లేక పోవడంతో ఫలితాలు రాలేదు.

కొండల్లో యుద్ధానికి ప్రత్యేక నైపుణ్యం, సంఖ్య బలం అవసరం. ఆయుధాలు, నిత్యావసర వస్తువులు చేరవేయడానికి, స్వాధీనం చేసుకున్నా పోస్ట్‌లను సురక్షితం చేసుకునేందుకు బలగాలు అవసరం. ఈ పనులన్నీ ఇంతకు ముందు ‘పయనీర్‌ కాయ్స్‌’ నిర్వహించేవారు. 1971 యుద్ధం తరువాత ఈ విభాగాన్ని రద్దుచేశారు. దీనితో 600మంది చొప్పున ఉండే ఆరు ‘పోర్టర్‌ కాయ్స్‌’ ఈ బాధ్యతలు నిర్వహించ వలసి వచ్చింది. కె.పి. సింగ్‌ అనే సామాజిక కార్యకర్త చొరవ తీసుకుని ఈ పనులు నిర్వహించడానికి ముందుకు వచ్చే స్వచ్ఛంద కార్యకర్తల పేర్లను నమోదు చేసుకున్నారు. అలా 3వేల మంది ముందుకు వచ్చారు. ఈ యువ బ్రిగేడ్‌కు ‘టండా టైగర్‌ ఫోర్స్‌’ అని పేరు పెట్టారు.

ఎందరో వీరు త్యాగఫలం

కార్గిల్‌లో ఎందరో వీర జవాన్లు అమరు లయ్యారు. పద్మపాణి ఆచార్య, మరియప్పన్‌ శరవణ్‌, రాజేష్‌ సింగ్‌ అధికారి, విక్రమ్‌ బాత్రా, బల్వాన్‌ సింగ్‌, యోగేంద్ర సింగ్‌ యాదవ్‌, వివేక్‌ గుప్తా, దిగేంద్ర కుమార్‌, సంజయ్‌ కుమార్‌, మనోజ్‌ కుమార్‌ పాండే, సౌరబ్‌ కాలియా, అంజూ అయ్యర్‌, విజయంత్‌ తపర్‌, హనీఫుద్దీన్‌, అజయ్‌ అహూజా, చునీలాల్‌, బసప్ప రవీంద్రనాథ్‌, నిర్మల్‌సింగ్‌.. ఇలా రాస్తూ పోతే స్థలంసరిపోదు. వీరంతా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు, మతాలు, కులాలకు చెందినవారు.

యోధులకు పురస్కారాలు

కార్గిల్‌ యోధులకు భారత ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేసింది. నాలుగు పరమ వీరచక్ర, 11 మహావీర చక్ర అవార్డులను ఇచ్చారు. వీరిలో కొందరికి మరణానంతరం ఇచ్చారు. పరమ వీరచక్ర అందుకున్నవారు.. గ్రెనేడియర్‌ యోగేంద్ర సింగ్‌ యాదవ్‌, లెఫ్టినెంట్‌ మనోజ్‌కుమార్‌ పాండే, కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా, రైఫిల్‌ మాన్‌ సంజయ్‌ కుమార్‌. మహా వీరచక్ర అందుకున్న వారు.. కెప్టెన్‌ అనుజ్‌ నయ్యర్‌, మేజర్‌ రాజేష్‌సింగ్‌ అధికారి, కెప్టెన్‌ గుర్జీందర్‌ సింగ్‌ సూరి, నాయక్‌ దిగేంద్ర కుమార్‌, లెఫ్టినెంట్‌ బల్వాన్‌ సింగ్‌, నాయక్‌ ఇమ్లియాకుమ్‌, కెప్టెన్‌ కీషింగ్‌ క్లిఫోర్డ్‌ నోంగ్రమ్‌, కెప్టెన్‌ నీకెజాకువో కెంగురుసే, మేజర్‌ పద్మపాణి ఆచార్య, మేజర్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌, మేజర్‌ వివేక్‌ గుప్తా.

పాకిస్తాన్‌ కుట్రకు సాక్ష్యాలు ఎన్నో..

కార్గిల్‌లో పాకిస్తాన్‌ చొరబాట్లపై భారత  మాజీ ప్రధాని వాజపేయి పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కి ఫోన్‌ చేస్తే, ఆ విషయమే తెలియదన్నాడు. ఆ తర్వాత చొరబాటుదార్లు తమ సైనికులు కాదని, జిహాదీలని బుకాయించాడు. అయితే జూన్‌ 5న భారత సైన్యం ముగ్గురు పాకిస్తాన్‌ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలతో పాకిస్తాన్‌ పాత్ర బయటపడిరది. ఆ తర్వాత భారత సైన్యం జూన్‌ 11న పాకిస్తాన్‌ సైనిక ప్రధానాధికారి పర్వేజ్‌ ముషార్రఫ్‌, ఛీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ అజీజ్‌ఖాన్‌తో జరిపిన ఫోన్‌ సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్‌ సైన్యం జోక్యాన్ని నిరూపించింది. భారత సైన్యాధిపతి వేద్‌ ప్రకాష్‌ మాలిక్‌ అంచనాల ప్రకారం భారత్‌ పై దాడికి పాకిస్తాన్‌ నాయకులు చాలా కాలం క్రితమే రంగం సిద్ధం చేసినా, యుద్ధ తీవ్రతకి భయపడి వెనక్కి తగ్గారు. పర్వేజ్‌ ముషార్రఫ్‌ పాక్‌ సైన్యాధిపతి అవ్వగానే మళ్లీ ఈ పథకానికి ప్రాణం పోశాడు. ఈ విషయాలేవీ తనకు తెలియవని, భారత ప్రధాని వాజపేయి చేసిన ఫోన్‌ ద్వారానే తెలిశాయని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చెబుతారు. కానీ లాహోర్‌ ఒప్పందానికి 15 రోజుల ముందే షరీఫ్‌కు తెలియ పరిచానని ముషార్రఫ్‌ ఒక సందర్భంలో చెప్పాడు. కార్గిల్‌లో పాక్‌ సైన్యం ఆక్రమించినది 130-200 కిమీ భూభాగమే అయినా, 1300 కిమీ మేరకు భారత్‌ భూభాగాన్ని ఆక్రమించినట్లు ముషార్రఫ్‌ గొప్పలు చెప్పుకున్నాడు. ఈ పరిణామాల అనంతరం పాక్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ పదవీచ్యు తుడయ్యాడు. ముషార్రఫ్‌ సైనిక నియంతగా, పాక్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ యుద్ధం అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ విశ్వసనీయతను దెబ్బతీసింది. పాకిస్తాన్‌ పై జరిగిన అన్ని యుద్దాల్లోనూ విజయం భారత్‌ సైనిక పాఠవం ప్రపంచానికి స్పష్టంగా తెలిసివచ్చింది.

సైనికపరంగా చూస్తే ‘ఆపరేషన్‌ విజయ్‌’ అన్నది రెండు, మూడు డివిజన్లు పాల్గొన్న చిన్న వ్యూహాత్మక యుద్ధమే. 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ యుద్ధాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే అప్పుడు కార్గిల్‌లో మనకు ఎదురైన పరిస్థితులే ఇప్పటికీ వాయువ్య ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఇవి దేశ భద్రతకు పెను సవాలుగా నిలిచాయి. పాక్‌ బుద్ధి నేటికీ మారలేదు. ఇదే కాదు, ఆధునిక ప్రపంచంలో ఇది కొన్ని ప్రత్యేకతలు కలిగిన యుద్ధం. అత్యంత ఎత్తయిన రవాణాకు క్లిష్టంగా ఉండే ప్రదేశంలో ఇటీవలి కాలంలో జరిగిన యుద్ధమిది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన రెండు దేశాల మధ్య సంప్రదాయ ఆయుధాలతో జరిగిన యుద్ధం కూడా ఇదే. అదే సమయంలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు యుద్ధానికి సిద్ధపడవన్న ప్రపంచ నమ్మకాన్ని కూడా కార్గిల్‌ పటాపంచలు చేసింది. భారత్‌`అమెరికా సంబంధాలు ఈ యుద్ధం తరువాత కొత్త మలుపు తిరిగాయి. రెండు దశాబ్దాల తరువాత భారత్‌కు అమెరికా అధ్యక్షుడు రావడానికి (క్లింటన్‌) కారణం కూడా ఇదే. ఇందులో పాకిస్తాన్‌దే తప్పు అనడానికి అమెరికా అధ్యక్షుడు వెనుకాడలేదు. భారత సైన్యం సామర్థ్యం ప్రపంచానికి తెలియడంతో పాటు, ఇరుగుపొరుగుకు ఒక హెచ్చరికను కూడా ఇచ్చిన ట్టయింది. మన సైన్యానికి తోడుగా వైమానిక దళం కూడా తనదైన పాత్రను నిర్వహించింది. పాకిస్తాన్‌ సైన్యం పూర్తి స్థాయిలో, దొంగపేర్లతో కాకుండా పాల్గొన్న యుద్ధం ఇది మాత్రమే. మీడియాలో విశేషమైన కథనాలు వచ్చాయి. కార్గిల్‌ అంటే అధీనరేఖ సమీపంలోని ప్రదేశం అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే దేశానికి బలమైన నాయకత్వం ఉండాలని ఇది తేల్చి చెప్పింది. వాజపేయి పాత్ర అదే నిరూపించింది.


కొదమ సింహంలా విరుచుకుపడ్డ పద్మపాణి

‘‘ప్రియమైన పప్పా! మీరు ప్రాణనష్టం గురించి బాధపడండి.. ఇది మా విధి నిర్వహణలో నియంత్రణ లేని అంశం. మేము ఉన్నత ఆశయం కోసం చనిపోతున్నాం. పోరాటం మాకు జీవితకాలపు గౌరవం. నేను ఏ విషయం గురించి ఆలోచించలేనని అమ్మతో చెప్పండి. భారతభూమికి సేవ చేయడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది! మీరు చారు (భార్య చారులత)కు మహాభారతం నుంచి రోజుకు ఒక కథ చెప్పండి. దీంతో మీ మనవడు లేదా మనవరాలు మంచి విలువలను అలవర్చు కుంటారు’’

 అమరుడు కావడానికి 10 రోజుల ముందు మేజర్‌ పద్మపాణి ఆచార్య తండ్రికి ఉత్తరం రాసిన ఉత్తరమిది. అందరినీ కంటతడి పెట్టించింది. మేజర్‌ పద్మపాణి ఆచార్య. వీరి నివాసం హైదరాబాద్‌ (నాగార్జునసాగర్‌ రోడ్డు)లోని హస్తినాపురం. పద్మపాణి జూన్‌ 21న తన 30వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు. అదే చివరి కాల్‌ అని వారికి తెలియదు. పద్మపాణి భార్య చారులత 6 నెలల గర్భిణి. ఏడురోజుల తర్వాత పద్మపాణి ఇక లేరనే వార్త ఆ కుటుంబానికి ఫోన్‌ ద్వారా అందింది.

పద్మపాణి జూన్‌ 21, 1969న జన్మించారు. 1993లో సైన్యంలో చేరారు. రాజ్‌పుతానా రైఫిల్స్‌ (2 రాజ్‌ రిఫ్‌)లో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తండ్రి జగన్నాథ్‌ ఆచార్య భారత వాయుసేనలో వింగ్‌ కమాండర్‌ గా సేవలు అందించి రిటైర్‌ అయ్యారు. పద్మపాణి సోదరుడు పద్మసంభవ్‌ కూడా సైన్యంలో పని చేస్తున్నారు.

కార్గిల్‌ యుద్ధంలో రాజ్‌పుతానా రైఫిల్స్‌కు ఆయన నేతృత్వం వహించారు. పద్మపాణి ఆచార్య టోలోలింగ్‌పై పాక్‌ సైనికుల బంకర్‌ వద్దకు చేరుకొని వారిపై గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో పద్మపాణి శరీరంలోకి చాలా తూటాలు దిగాయి. అయినా వెనుతిరగకుండా కొదమ సింహంలా శత్రువులపైకి దూకాడు. ఒక పూర్తి రాత్రంతా కొనసాగిన ఈ కాల్పుల్లో చివరకు రాజపుతాన రైఫిల్స్‌ టోలోలింగ్‌ పర్వతాన్ని అధీనంలోకి తెచ్చుకుంది. తీవ్రంగా గాయపడ్డ ఆచార్యను చికిత్స కోసం వెనక్కి తీసుకెళ్తామని రెజిమెంట్‌లోని సైనికులు కోరినప్పటికీ ఆయన దానిని తిరస్కరించారు. ఆ గాయాలతోనే యుద్ధాన్ని కొనసాగించారు. టోలోలింగ్‌ స్వాధీనమైంది. కానీ మేజర్‌ పద్మపాణి అమరుడయ్యారు. ఆరోజు జూన్‌ 28.

వార్త తెలియగానే హస్తినాపురి కాలనీలో ఉంటున్న ఈ వ్యాసకర్త వారి నివాసానికి వెళ్లి ఇంటర్వ్యూ చేశారు. ఆ కుటుంబంలో ఒక్కరు కూడా కంటతడి పెట్టలేదు. తండ్రి జగన్నాథ్‌ ఆచార్య, తల్లి విమలా ఆచార్య తమ కుమారుడి వీర మరణానికి గర్వపడుతున్నట్లు ప్రకటించారు.

‘ఒక తల్లిగా నేను కచ్చితంగా బాధపడ్డాను. వీరమాతగా కొడుకు గురించి గర్వపడుతున్నాను. నేను ఉండకపోవచ్చు. కానీ అతను అమరుడు. నా కొడుకు యుద్దానికి బయలుదేరినప్పుడు నేను ఏడవనని వాగ్దానం చేశాను’ అని విమలా ఆచార్య తెలిపారు. హైదరాబాద్‌లో ఆశేష జనవాహిని ఊరేగింపు మధ్య పద్మపాణి అంతిమయాత్ర సాగింది. భారత్‌ మాతాకీ జై, పద్మపాణి అమర్‌హై నినాదాలు, సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. హస్తినాపురం ప్రధాన వీధికి మేజర్‌ పద్మపాణి ఆచార్య మార్గ్‌ అనే పేరు పెట్టారు. రహదారిపై ఆయన విగ్రహం ఏర్పాటైంది.

– క్రాంతి : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE