ముస్లిం మహిళల భద్రతకు, గౌరవానికి తోడ్పాటునిచ్చే విధంగా ప్రభుత్వం, సుప్రీం కోర్టు తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న తీర్పులను అభినందించి తీరవలసిందే. గత పదేళ్ల కాలంలో త్రిపుల్ తలాక్ నుంచి విముక్తి లభించేలా ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు, ముస్లిం పురుషుడు విడాకులు ఇస్తే సీఆర్‌పీసీ సెక్షన్ 125లోని మత తటస్త ప్రొవిజన్ కింద భరణం ఇచ్చి తీరాల్సిందేనంటూ జస్టిస్ నాగరత్న, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునివ్వడంతో ముస్లిం సమాజంలో గగ్గోలు ప్రారంభమైంది. భరణం అనేది దాతృత్వానికి సంబంధించిన అంశం కాదని, మతాలకు అతీతంగా వివాహిత మహిళల ప్రాథమిక హక్కు అని కూడా కోర్టు స్పష్టం చేస్తూ ఈ అంశాన్ని ఒక సెక్యులర్ చట్టం కిందకు తీసుకురావడంతో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) గగ్గోలు ప్రారంభించింది. ముస్లిం మహిళలకు భరణం అన్నది ఇస్లామిక్ చట్టాలకు (షరియా) వ్యతిరేకమని, ఈ తీర్పును ఉపసంహరింప చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని బోర్డు ప్రకటించేసింది. దీనితో పాటుగా, ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తున్న ఉమ్మడి యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)కి వ్యతిరేకంగా కూడా తాము కోర్టుకు వెడతామని ప్రకటించింది. చిత్రమైన విషయమేమిటంటే, హిందూ మతం మహిళలను అణచివేస్తుందంటూ రంకెలు వేసే వామపక్షవాదులు కానీ, ఉదారవాదులు కానీ ఈ విషయంపై నోరెత్తకపోవడం.
దేశంలో ఉన్నవి చాలనట్టుగా ఇది ఒక తాజా అంశంగా మరింది. అసలు ఈ కేసు ఎక్కడ షురూ అయిందో తెలుసుకోవలసిన బాధ్యత కూడా మనపైన ఉంది. ఇట్లాంటి నమూనా కేసులన్నీ కూడా మన ఓల్డ్‌సిటీలోని అబ్దుల్లాలే చేస్తారు. ఎమ్.ఐ.ఎమ్. వంటి రాజకీయ పార్టీల మద్దతు ఉందన్న ధీమాతో తమ భార్యలను పశువులకన్నా హీనంగా చూడటం ప్రారంభిస్తారు. కాగా, ఈ ఘటనలో హింసను తట్టుకోలేక అబ్దుల్ భార్య సాహసం చేసి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి విడాకులకు దాఖలు చేసి భరణం కోరింది. ఫ్యామిలీ కోర్టు 20 వేలు భరణం ఇవ్వాలని అబ్దుల్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వెనుక ఉన్న దన్ను కారణంగా, ‘అచ్చా 20వేలు ఇవ్వాలా’ అని భావించి హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు కూడా ఫ్యామిలీ కోర్టును సమర్ధించింది కానీ భరణాన్ని 10వేలకు తగ్గించి, అంతా అన్నా ఇవ్వమని చెప్పింది. అబ్దుల్‌కు 10వేలు నచ్చలేదు, 20వేలు నచ్చలేదు. అందుకని సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అక్కడ తాను భరణమే ఇవ్వను అని వాదించాడు. అక్కడ ఈ మహిళ తరుఫున అగర్వాల్ అనే న్యాయవాది వాదించాడు. వాదోపవాదాల అనంతరం, నువ్వు ఆమెకిచ్చే భరణమేదైతే ఉందో, అది బిక్షం అనకు, అది ఇమె హక్కు, ఆమెకు నువ్వు ఇవ్వాలి అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ఇస్లాం ప్రకారం పెళ్లి అనేది ఒక కాంట్రాక్ట్. ఒక ఒప్పందం మాత్రమే. మనలాగా జన్మజన్మల బంధం కాదు. నువ్వు వదిలేసినపుడు ఆమెకు భరణం ఇవ్వాలి అని కోర్టులు చెప్తే, తమకేం సంబంధం లేదనే నైతికత లేని ఒక సిద్ధాంతాన్ని అనుసరించే వారు దానికి తల ఒగ్గరు. ఒక ఒప్పందం ప్రకారం పెళ్లయిన తరువాత ప్రతీ భర్త కూడా భార్యలకు మెహర్ ఇవ్వాలి. అంటే కానుక అన్న మాట. అయితే ఈ కానుకను తక్షణమే ఇవ్వరు. చాలాసార్లు విడాకులు అయినపుడు చూద్దాంలే అని, అప్పటిదాకా ఇవ్వరు. పెళ్ళయిన తరువాత తమ మతం చెప్పిన కానుకే ఇవ్వరు. వారి మతం ప్రకారం, కట్నం ఉల్టా ఇవ్వాలన్న మాట. మనం కట్నం అనుకుంటాం కానీ, అది కట్నం కాదు అది ఒక కాంట్రాక్ట్. మెహర్ అంటారు. ఇంకా దానికి చెడ్డ పదం ఉంది. ‘మేవా కోరి ఖర్చా’ అంటారు. ఇవన్నీ ఏమిటంటే తలాక్ తరువాత అల్‌బత్తా పేరుతో భరణం కింద ఇవ్వా లంటే 90 రోజులకు మాత్రమే ఇస్తారు. ఆ 90 రోజులకు ఎందుకు అంటే 90 రోజులలో ఒకవేళ ఆ మహిళ గర్భవతి అయితే దానికోసం, అది పరిశీలనా సమయం అన్నమాట.
ఇంత అసహ్యమైన ఈ లాజిక్‌ను తెచ్చింది, ఈ సెక్షన్‌ను తెచ్చింది ఎవరు అంటే మన కాంగ్రెస్, ముస్లిం మైనారిటీ బుజ్జగింపు కింద. 1985లో షాబానో భరణం కోసం సుప్రీంకోర్టుకు వెళితే, అపుడు కూడా కోర్టు మతంతో సంబంధం లేకుండా, ప్రతి భారతీయ మహిళకు భర్త భరణం ఇవ్వాలి అని తేల్చింది. అయితే హిందువులకు ఆ చట్టం ఉంది. హిందూ భర్త బాధ్యతయుతంగా విడాకు లయిన తరువాత భరణం ఇస్తాడు. కానీ, వీళ్ల విషయంలో 1986 ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 90 రోజులు ఇద్దత్ కాలాన్ని పెట్టి, ఆ ఇద్దత్ కాలంలో ఆమెకు గర్భం రాకున్నా, వచ్చినా ఆ కాలవ్యవధిలో మాత్రమే నెల నెల భరణం ఇచ్చి ఆ తరువాత చేతులు దులుపుకోవడమనేది వీళ్ల దుర్మార్గానికి పరాకాష్ట.
అయితే వీళ్ల దుర్మార్గత్వానికి, చేస్తున్నదానికి సపోర్టు చేసింది ‘ఖాన్’గ్రెస్. ఓటు బ్యాంకు కోసం. వీళ్లు ఇపుడు ఏం మాట్లాడతారు, రైట్ టు రిలీజియన్ అంటే మా మతాన్ని అనుసరించే హక్కు మాకు ఉంది అని అన్నపుడు మరి ఆ మహిళలకు కూడా, ఒక భారతీయ మహిళగా హక్కుంటుంది. ఆమె ఓటేస్తుంది, పిల్లల్ని కంటుంది. ఆమె పిల్లలకు ఈ దేశ పౌరులుగా అధికారం వచ్చినపుడు ఆమెకు ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా. ఆ హక్కుల కింద భరణం ఇవ్వాలి కదా. ఒకవేళ పెళ్లి చేసుకోలేదు. వీడు చేసిన హింస భరించలేక విడాకులు ఇచ్చి జీవితాంతం పెళ్లిచేసుకోనని నిర్ణయించినపుడు ఆమె భరణం ఏంటన్నట్లు. ఎవరు చూసుకోవాలి, కుటుంబం వారు చూసు కోవాలట లేదా వక్ఫ్‌బోర్టు చూసుకుంటుందట లేదా ముస్లిం సమాజం చూసుకుంటుందట. అంతేగానీ, భారత దేశం చూసుకోవద్దు, భారతదేశం చట్టాలు కూడా చూసుకోవద్దు. ఇది వీళ్ల లాజిక్. ఈ లాజిక్‌కు ‘ఖాన్’గ్రెస్ ప్రభుత్వం మద్దతు ఉంటుంది.
జెండర్ న్యాయాన్ని అణగదొక్కడం
విడాకులు పొందిన ముస్లిం మహిళలు నిరాశ్రయులు, అనాథలు కాకుండా ఉండాలనే ఉద్దేశ్యమే సుప్రీం కోర్టు తీర్పులో కనిపిస్తుంది. జెండర్ సమానతకు సంబంధించిన విస్తృత రాజ్యాంగ నిబంధనతో అనుగుణంగా ఉండే లక్ష్యంతో ఈ తీర్పును ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ తీర్పును ఎఐఎంపిఎల్‌బి వ్యతిరేకత అన్నది విడాకులు పొందిన ముస్లిం మహిళల దుస్థితిని పట్టించుకోవడాన్నే ఎత్తి చూపు తుంది. చారిత్రికంగా ముస్లిం మహిళలు చెప్పుకోదగిన ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేయడం ద్వారా ముస్లిం లా బోర్డు న్యాయవాదులు జెండర్ అసమానతను, మహిళల ప్రాథమిక హక్కులకన్నా మతపర మైన వ్యాఖ్యానాలకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టు కనిపిస్తోంది.
రాజ్యాంగం కన్నా షరియా గొప్పదా?
ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు రాజ్యాంగం కన్నా షరియాకే ప్రాధాన్యతను ఇస్తోందంటే, అది విస్తృతమైన జాతీయ ప్రయోజనాల కన్నా మతానికే ప్రాముఖ్యతను ఇస్తోందన్న మాట. ఇటువంటి వైఖరి దేశం ఎప్పటికీ, సమ్మిళితం కాకుండా చూడడమే కాకుండా విభజిస్తుంది. సమ్మిళిత సమాజంలో ప్రతి వ్యక్తి హక్కులకు గౌరవమే కాదు, భద్రత కూడా ఉంటుంది. కానీ, ఈ విషయాన్ని అంగీకరించేందుకు ముస్లిం లా బోర్డు సిద్ధంగా లేకపోవడం కన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదు. సమాజంలోని ప్రతి వర్గానికీ ప్రత్యేక చట్టాలు చేయాలని పట్టుబట్టడమనేది, ఇప్పటికే సమాజంలో ఉన్న విభజనలను మరింత లోతు చేయడమే కాదు, ఒక ఉమ్మడి, సమాన న్యాయవ్యవస్థ దిశగా పురోగమనాన్ని అడ్డుకోవ డమే.
యుసిసికి వ్యతిరేకం
వివిధ వ్యక్తిగత చట్టాలు కొనసాగించే అన్యాయాలను, అసమానతలను నిర్మూలించి పౌరులందరికీ ఒక సామాన్య న్యాయచట్రాన్ని అందించాలన్నది ఉమ్మడి సివిల్ కోడ్ లక్ష్యం. అది జాతీయ ఐక్యతను ప్రోత్సహించి, చట్టం అందరు పౌరులనూ సమానంగా చూడాలన్న అంశం కేంద్రంగా రూపుదిద్దుకుంది. యుసిసిని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతిఘటించడం అన్నది, అది ఒక సమ్మిళిత జాతీయ గుర్తింపు అన్న భావనను స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడాన్ని సూచిస్తోంది. ఇందుకు బదులుగా అది సమానత, న్యాయం పట్ల దేశ సామూహిక నిబద్ధత కన్నా కొన్ని మత చట్టాలకు ప్రత్యేక హక్కులను కల్పించే న్యాయ వ్యవస్థను ముస్లిం లాబోర్డు ప్రోత్సహిస్తోంది.
సంస్కరణలకు ఆటంకంగా నిలవడమే ధ్యేయమా?
ఈ చట్టపరమైన సంస్కరణలను ఎంఐ ఎంపిఎల్‌బి వ్యతిరేకిస్తోందంటే, అది మారేందుకు సిద్ధంగా లేకపోవడమే కాదు, సమాజంలో పెరుగు తున్న అవసరాల పట్ల అలక్ష్యాన్ని ప్రదర్శించడమే. చట్టాలు, సామాజిక నిబంధనలు స్థిరమైనవి, చలనరహితమైనవి కావు. అవి క్రియాశీలమైనవి. కాలాన్ని బట్టి సమాజం అందులో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కాలం చెల్లిపోయిన చట్టాల వ్యాఖ్యానాలను పట్టుకొని ఎఐఎంపిఎల్‌బి వేళ్లాడడం అన్నది వారి సమాజానికే కాదు, మొత్తం సమాజపు పురోగతికే ఆటంకం.
సుప్రీం కోర్టు తీర్పు, ఉత్తరాఖండ్‌లో యుసిసి చట్టానికి వ్యతిరేకంగా ఎఐఎంపిఎల్‌బి తీసుకున్న వైఖరి జాతీయ సంఫీుభావ సూత్రాలనే సవాలు చేస్తోంది. రాజ్యాంగ శాసనాలకన్నా మతపరమైన చట్టాలకు ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా ముస్లిం బోర్డు ఒక సందేశాన్ని పంపిందనే భావించాలి. జాతి ప్రయోజనాలకన్నా , పౌరులందరికీ సమానత్వం, న్యాయాన్ని అమలు చేయాలన్న దేశ నిబద్ధత కన్నా తమ ప్రాధాన్యతలే అధికమనే అభిప్రాయాన్ని బోర్డు వ్యక్తం చేయడం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.
మైనారిటీ బుజ్జగింపుతో ఇపుడు 99 సీట్లు తెచ్చుకొని రాహుల్‌గాంధీ ఎక్కడా ఆగట్లేదు. అట్లాంటి రాహుల్‌గాంధీ ఇపుడు భారతీయ జనతాపార్టీ ముస్లిం మహిళలకు సమాన హక్కు ఇవ్వడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తా అంటే తేనిస్తాడా? అసలు కామన్ డెవలప్‌మెంట్ స్కీమ్ తప్ప ఇట్లా నైతికతకు సంబంధించినవి, సంస్కృతి, సంప్రదాయ లకు సంబంధించినవి లేదా ఈ దేశ ఆత్మకు సంబంధించినవి. అవి ఇండియన్ క్రిమినల్ కోడ్, ఇండియన్ ప్రోసీజర్ కోడ్‌లో లేనివి. అందుకే తాజాగా, ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరికా సురక్షా సంహిత జీవం పోసింది. చట్టమనే రాజ్యాంగ పుస్తకంలో జీవచ్ఛవంగా ఉన్న న్యాయంలో ఆత్మను ప్రవేశపెట్టడంవల్ల ఆ పేర్లతోనే కొత్తదనం వచ్చింది.
సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా పౌరులందరికీ సమాన హక్కులు, భద్రతను ఇవ్వాలనే ప్రయత్నిం చింది. ఈ ప్రయత్నం కొత్తగా జరిగింది కాదు. 1980వ దశకంలో షాబానో కేసులో కూడా సుప్రీం కోర్టు ముస్లిం మహిళలకు న్యాయం చేసే యత్నం చేసింది. అప్పుడు కూడా మతంతో సంబంధం లేకుండా న్యాయం జరగాలనే కోర్టు చెప్పింది. వాస్తవానికి న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా పర్సనల్ లా పేరుతో లింగ అసమానత, మహిళలకు అన్యాయం చేయడం వంటి సమస్యలను పరిష్కరించా లనే యత్నం చేస్తున్నాయి. కానీ, ముస్లిం లా బోర్డు ఇటువంటి చొరవలను వ్యతిరేకిస్తోంది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కన్నా మత పిడివాదానికే ఈ శతాబ్దంలోనే ప్రాధాన్య తను ఇవ్వడాన్ని మించిన విషాదం మరొకటి ఉండదు.
మరి అట్లాంటి కొత్తదనాన్ని తీసుకొచ్చిన భారతీయ జనతాపార్టీ ఇపుడు రాహుల్‌గాంధీ చేసే ఈ చిచోర వేషాలన్నీ ప్రక్కనపెట్టి ఇట్లాంటి యూని ఫామ్ సివిల్‌కోడ్, ఎన్‌ఆర్‌సి లాంటివి తేగలరా? తేలేరా అనేది మనం వేచి చూడాలి. భారతీయ జనతాపార్టీ అయినా, మనమైనా ఏమి ఆలోచించా లంటే వీళ్లకు మనం అన్యాయం చేస్తే అబ్దుల్ కలాం లాంటివారు కాకుండా వాళ్లు అజ్మల్ కసాబ్‌లుగా తయారుకావచ్చు. అలా కాకూడదంటే, అంటే మహిళలకు సమాన హక్కులు ఇవ్వాల్సిందే. అభివృద్ధి పథకాలు అందేలా చూసుకోవల్సిందే. మెళ్లో పడ్డ పాము కరవక మానదు అన్నట్లుగా కలిసి నడవడం, కలుపుకొని నడవటం చేయక తప్పదు భారతీ యులకుగానీ, రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి గానీ.
– మౌనిక సుంకర, హైకోర్టు న్యాయవాది, తెలంగాణ