‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

గీరాకు ఎనిమిదో నెల వచ్చింది.

కడుపులో పిల్లల కదలికలు ఎక్కువయ్యాయి. పడుకున్నా, కూర్చున్నా అవి ఎక్కువగా తెలిసి పోతున్నాయి. అందరన్నట్లుగా, ముగ్గురు పిల్లలతో కూడిన బరువైన పొట్ట వల్ల శ్రమ, ఆయాసం వస్తాయా అనుకుంది. కానీ అదేమి లేదు.

శరీరంలో ఒక భాగం, అతి సహజంగా పెరిగినట్లుగా అనిపిస్తున్నదంతే! కాకుంటే, కూర్చున్న ప్పుడు నిలబడినప్పుడు ఆ పసివాళ్లకే ఏవైనా బాధ కలుగుతుందేమోనని జాగ్రత్తగా లేవటం కూర్చోవటం చేస్తున్నది.

తనిప్పుడు ఏకకాలంలో ముగ్గురు బిడ్డలకు తల్లి కాబోతున్నదని అనుకుంటే, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతున్నది. తెలియని గర్వంతో మనసు ఉప్పొంగిపోతున్నది. గుర్తుకొచ్చినప్పుడల్లా చెయ్యి పొట్ట మీద వేసుకుని వాళ్లెక్కడ ఉన్నారోనన్నట్లుగా వెతుక్కునేది.

అది తెలిసేది కాదు. పొట్టంతా నిండుగా ఉంది. ఉదరోన్నతాలు పెరిగి జీవన లయను నియంత్రిస్తు న్నట్లుగా ఉంది. తల్లి స్పర్శ చేతికి తగలగానే తెలిసినపోయినట్లు, పొట్టలో కదిలేవారు, అమ్మతో అనుబంధాన్ని పెంచుకుంటున్నట్లుగా.

అద్దంలో చూసుకుంటే తన విగ్రహమే తనకు నిండుగా, ముగ్ధమోహనంగా, ఆశ్చర్యం కలిగించేంత అందంగా ఉంది.

‘‘ప్చ్‌… ఇలా సీమంతం జరిపించుకుంటే… ఎంత బాగుంటుంది! ఆ జ్ఞాపకాలు తనను జీవితాంతం వెన్నంటి ఉంటాయిగా అనుకుంది.

ఆ విషయమే, డాక్టర్‌ వరదతో అనేసింది.

‘‘ఊహు! గీరా! నీవిప్పుడు తల్లిగా జీవించటం లేదు. ఓ ఉద్యోగిలా మాతృదానం చేస్తున్నావు. దాన్నలాగే కొనసాగనివ్వు. ఇంకా ముందుకు వెళ్తే, కంటికి కనిపించని మమతల పొరలు, అనుబంధాల అనుభూతులు బంధాల దారలై నిన్ను కట్టివేస్తాయి.

ఆ పిల్లల్ని పెంచాలని కూడ అనిపిస్తుంది. అప్పుడు నీ అగ్రిమెంట్‌ నీకు అడ్డుపెడుతుంది. దాన్ని పట్టుకుని నీవు కోర్టుకు వెళ్లినా చెల్లదు. నీవు తల్లిగా అనుభూతుల్ని మాత్రం పంచుకుంటానన్నావు. గర్భిణిగా వాటిని భరిస్తున్నావంతే!’’ కచ్చితంగా చెప్పేసింది వరద.

గీరా మాట్లాడలేదు. ‘‘అది నిజమే! తనది అగ్రిమెంట్‌ మాత్రమే. గుడ్లను పొదిగే వరకే ఈ ఉదరమనే గూటి ఆధారం. పక్షులు రెక్కలొచ్చాక ఎగిరిపోతే, వీళ్లు పుట్టగానేె కదిలిపోతారు’’ అనుకుంది.

డాక్టర్‌ వరద ఆప్యాయంగా గీరా తల మీద చెయ్యివేస్తూ, ‘‘అమ్మ కావాలని అంత ఆశగా ఉంటే, పెళ్లి చేసుకుని స్థిరపడతానంటున్నావుగా. అప్పుడు నిజమైన అమ్మలా, గర్భవతిగా సీమంతం చేసుకుని నన్ను పిలువు, వస్తాను’’ చెప్పింది నవ్వుతూ.

నిజంగా గీరా అంటే డాక్టర్‌ వరదకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ‘ఎంతగా కష్టపడి, రిస్కు తీసుకుంటుందీ పిల్లా, రుచులు కోరెే నాలుకను నియంత్రిస్తూ తిన్న దాన్ని ఇముడ్చుకోలేక, ఒక తల్లి గర్భవతిగా పడే కష్టాలన్నీ పడుతున్నది’ అనుకుంటుంది.

‘‘నాకు, సహజమైన ప్రసవం కావటానికి వీలుందా? సిజెరియనా?’’ అడిగింది. ‘‘వీలయినంత వరకు నార్మల్‌ చూద్దాం. సాధారణంగా ‘సీ సెక్షన్‌కు నేను వెళ్లను. నీకేది ఇష్టం?’ ఎదురు ప్రశ్నించింది.

‘‘నార్మల్‌ డెలివరి పురిటి నొప్పులెలా ఉంటాయో చూడాలనుంది’’ చెప్పింది.

‘‘ఓకే. అన్నీ అనుకూలంగా ఉంటే నార్మల్‌ డెలివరి సాధ్యమే’’ అంటూ అన్నీ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయింది వరద.

ఎదలు ఎత్తు పెరిగాయి. పొట్టతో పాటు ఉదరోన్నతాలు పెరిగి, వాటి నుంచి అడపాదడపా క్షీరధారలు కనిపిస్తున్నాయి. జాకెట్లన్నీ బిగువయి పోయాయి. అదే డాక్టర్‌ వరదతో చెప్పింది.

‘‘పిల్లల పోషణ కోసం తల్లి లోపల ఈ జీవ రసాయనాలన్నీ చైతన్యవంత మవుతాయి. నిజమైన అమ్మకా ఎదరోన్నతాలు పెరగటం సహజం. నీకలా అనిపించటం సహజమైన మార్పు’’ చెప్పింది.

మనసులో మాత్రం, నీవు మాతృదానం చేసెే సరోగేట్‌ అమ్మవి. నీకే మార్పులన్నీ అనవసరం. నీవా పిల్లల్ని పెంచవు కాబట్టి, నీకవన్ని బాధనే మిగులు స్తాయి. కానీ గీరా! యు ఆర్‌ లక్కీ. నీవు పెళ్లి చేసుకోబోయె వ్యాస్‌ కూతుర్ని, అదనంగా మోస్తున్నావు. గాంధారికి సరోగెట్‌గా మారిన అండం, సెల్ప్‌ డివిజన్‌తో మార్పులేర్పడి, ఐడెంటికల్‌ ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నావు.

గాంధారికి ఒకరినిచ్చినా, ప్రకృతి నీ కోసం మరొకర్ని దాచింది. అది నీకు, పెళ్లయ్యాక పెళ్లి కానుకగా ఇచ్చి, సర్‌ప్రైజ్‌ చేస్తాను అనుకుంది డాక్టర్‌ వరద.

*  *  *

గీరాకు తొమ్మిది నెలలు నిండాయి.

చివరి చెకప్‌ చేస్తున్నది డాక్టర్‌ వరద. ఆమెకే ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా ఒకే గర్భం అయితే ఇంత మందుంటే చోటు సరిపోక ఒకరికొకరు ఒత్తుకుపోయినట్లుంటారు.

ఒక్కోసారి వాళ్ల ఎదుగుదలకు సరయిన పోషణ లభించక బలహీనంగా, లేదా వేరే కారణాలతో నీరసంగా ఉంటారు. ఒక్కోసారి అలాంటి సందర్భాల్లో ఒకరో, ఇద్దరో చనిపోవటం కద్దు. కానీ గీరా పొట్టలోని ఈ నలుగురు, ఎంతో చైతన్యవంతంగా, ఆరోగ్యంగా, ముఖ్యంగా అందరికి ఒకేలాంటి ఎదుగుదల ఉంది.

ఏ ఏ తల్లులకెలాంటి వాళ్లు కావాలో, అలాంటి వారి కోరిక తీర్చాలన్నట్లుగా, ఆరోగ్యంగా ఎదుగుతున్నారు.

‘ఇదంతా గీరా విల్‌పవర్‌. ఆమె మానసిక స్థయిర్యమే పిల్లల్ని అలా పెంచగలుగుతున్నది. ఆహార నియమాల్ని, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తుంది గీరా’ అనుకుంది వరద.

అందులో ఇద్దరికి తలలు కూడా కిందికి వచ్చాయి. ఇద్దరికి రాలేదు. ఇలాంటి సందర్భాల్లో పురిటినొప్పులు ముందే వస్తాయి.

ఇలాగే లేబర్‌పెయిన్స్‌ ప్రారంభమయితే, ఇద్దరికి కాన్పు అవుతుంది. ఇద్దరికి కాదు, ఆ ఇద్దరి కోసమయినా సి సెక్షన్‌ చెయ్యాలి. డాక్టర్‌ అజాగ్రత్తగా ఉంటే, పిల్లల ప్రాణాలకే ముప్పొస్తుంది. ఒకే బిడ్డయితే, నొప్పులు రాగానే ఉమ్మనీటితో పాటు, ఆ బిడ్డ బైటపడుతుంది. నొప్పులాగిపోతాయి. అంతటితో ఆ తల్లికి విశ్రాంతి దొరుకుతుంది.

కానీ గీరా! ఇంతమందిని కనాలి. ఒక్కొక్కరికి నాల్గు నిమిషాల వ్యవధి ఉన్నా, పదహారు నిమిషాలు పడుతుంది. పదహారు నిమిషాల ప్రసవవేదనంటే, ఎంత కష్టమో తన దగ్గరికొచ్చే స్త్రీలలో నిరంతరం చూస్తూనే ఉంటుంది. అందుకే గీరాకు సి సెక్షన్‌కు తేది నిర్ణయించి, ‘‘గీరా! ఇక రెండు రోజుల్లో, నీ భారం దిగిపోతుంది. ఫ్రీబర్డ్‌లా, మరో పదిహేను రోజులు, అజ్ఞాతంలో నా దగ్గరే ఉంటావు. ఆ పైన, నీ జీవితం నీదిరా! వెళ్లిపోతావు’’ చెప్పింది.

గీరా సన్నగా నవ్వుతూ ఈ చిన్నారులు నా పొట్టలో ఇంక రెండేరోజులు ఉండేది. ఈ అమ్మతో అనుబంధం పంచుకునేది నలభై ఎనిమిది గంటలేనా?’’ ఆప్యాయంగా పొట్టమీద చెయ్యివేసి చూసుకుంది.

‘‘చాలు, వాళ్లకు అది నరకమే. భగవంతుడు వారికెలాంటి ఆపదలూ రానీకుండా, మాతృగర్భాన్ని సృష్టించాడేెగాని, ఆ పిల్లలకది తొమ్మిది నెలలే సరిపోతుంది.

‘‘అందుకే ఒక్కొక్కటిగా తల్లి నుంచి వేరు పడుతూ, స్వతంత్రంగా జీవించటానికి సిద్ధపడుతూ దారి చేసుకుంటారు. కదలికలు తగ్గిపోతాయి. ఉమ్మనీరు తగ్గి, క్రమంగా ఆక్సీజన్‌ పీల్చుకోవటం కష్టమౌతుంది.

‘‘తల్లి కడుపులో నుంచి వచ్చేసి, ఒంటరిగా బతకటానికి పోరు ప్రారంభమయితే, అందులో భాగంగానే బిడ్డ బయట పడటానికి పురిటి నొప్పు లొస్తాయి. అందుకు తల్లి దేహమే సహకరిస్తూ అనుగుణంగా మారుతుంది.

‘‘ఇదంతా సృష్టి రహస్యమే!

‘‘గీరా! నీవు ఓ ప్రయోగానికి ఒప్పుకున్నావు. అంతకష్టం పడలేవు. అందుకే సిజేరియన్‌కు ఏర్పాటు చేశాను’’ చెప్పింది డాక్టర్‌ వరద.

‘‘ఒద్దు డాక్టర్‌! ఎంత కష్టమైనాకాని, మళ్లీ నా జీవితంలో అమ్మనౌతానో లేదో… సహజ ప్రసవానికే అవకాశం ఇవ్వండి. ఎంత కష్టమైనా సరే! ఆ నొప్పుల్ని, పిల్లల్ని కనటంలోని బాధను మనసారా అనుభవిస్తాను’’ అంది గీరా.

‘‘నీకింత ఓపిక ఉంటే నీ ఇష్టం. ఆ ఇద్దరు పిల్లలు కూడా కిందివైపుకు తిరిగారా, నీ కోరిక సులభమౌ తుంది. మళ్లీ రేపు స్కానింగ్‌ ఉంటుంది. కొందరిలో గర్భాశయం క్రింది గోడలు పలచగా ఉంటే జననాంగాల వద్ద సృష్టి కేంద్రం తెరుచుకుని కానుపు సులభమౌతుంది.

‘‘నీకైతే, అన్ని సహజ లక్షణాలేె కనిపిస్తున్నాయి.

‘‘నీలాంటి సరోగేట్స్‌కు మాతృ అనుభూతులు, అనుభవాలకు వారి దేహం తగినట్లుగా ఉండదు. నీ అదృష్టం. నీ గర్భాశయం కూడా సహజ ప్రసవానికి అనుకూలంగా ఉంది. మేబీ, రేపు కానుపు నొప్పులు రావచ్చు.

‘‘అయినా ఇప్పుడు తల్లికి ఎక్కువ బాధలు తెలియకుండా, అనేక రకాల మందులొచ్చాయి’’ చెప్పింది డాక్టర్‌ వరద.

‘‘మీరేమయినా చెయ్యండి. అది మీ ఇష్టం!’’ చెప్పింది గీరా.

‘‘ప్రసవమంటే స్త్రీకి మరో జన్మంటారు. ఒక్కోసారి తల్లి ప్రాణాలకే ముప్పు ఏర్పడి ప్రాణాలు పోవచ్చు’’ హెచ్చరించింది.

‘‘అలాంటి సమయమే వస్తే, డాక్టర్‌ వరద, వరదాయినిగా నా ప్రక్కనే ఉంటుంది, ఆదుకుని వైద్య సహాయం అందించటానికి, మీరుంటారు. నాకా ధైర్యం చాలు’’ చెప్పింది.

ఈ రోజుల్లో తల్లులకు లేని ధైర్యం, గీరాకున్నందుకు అభినందించకుండా ఉండలేక పోయింది వరద.

*  *  *

‘రేపు, మీ సరోగేట్‌ మదర్‌కు ప్రసవం జరగొచ్చు. వచ్చి రిమైనింగ్‌ అమౌంటిచ్చి, బేబిని పిడియాట్రిషియన్‌ చూసి, ఆమోదించగానే తీసుకుపోవచ్చు’ అంటూ మెయిల్‌ పెట్టింది వేరు వేరుగా, గాంధారి, ఉషా, కుంతల దంపతులకు.

అది చూడటానికి ఒకే మెయిల్‌. కాని, అందులో ఆరుగురు అపరిచిత వ్యక్తులకు సమాచార మందుతుంది. ఒక్కొక్క దంపతులకు లభించేది, అద్దె అమ్మ నుంచి ఒకే బిడ్డ. కానీ ఆ పసిప్రాణం ఎక్కడ ఉద్భవించిందో, సమాచారం ఎవరికీ తెలియదు.

ఆ ముగ్గురు దంపతులకు బిడ్డలనిచ్చేది ఒకే తల్లి. కానీ ఆ తల్లి వారికి తెలియదు. ఆ దంపతులకు ఆ తల్లి తెలియదు. ఆ వ్యక్తులు కూడా ఒకరికొకరు తెలియరు. అంత గొప్పగా, గోప్యంగా ఉంటుందీ సమాచారం.

పురిటిబిడ్డ కేరుమంటే పదిమందికి తెలిసే సృష్టి జీవనం అంత గోప్యంగా జరిగే ఆధునిక కాలం ఇది. పేగు తెంచుకుని, భూమ్మీద పడ్డ మరుక్షణం, ఆ బిడ్డ తల్లి నుంచి వేరయిపోతుంది. కనీసం కంటితో కూడా చూడరు.

ఎక్కడికి వెళ్లింది? ఎవరి చేతుల్లో పెరుగుతుంది? ఆడ, మగా? లాంటి విషయాలు కూడా ఆ తల్లికి చేరవు. ఊరుతున్న తల్లిపాలను మందులతో తగ్గించుకునే తల్లులతో చేస్తున్న వ్యాపారమది.

ఆధునిక యుగంలో అంతు తెలియని రహస్యమిది.

గాంధారి ఆ మెయిల్‌ను అత్తగారికి చూపించింది. ‘‘ఓహో! నా మనవరాలు, శుక్రవారపు మహాలక్ష్మిలా నా ఇంటికొస్తుంది’’ అంది సంతోషంగా.

నిజంగానే ఆవిడకు సంతోషంగా ఉంది.

సృష్టి మొదలయింది. తన పెద్ద కొడుకు వారసత్వంతో, పెరిగేది, పెంచేది చిన్న కొడుకు సంతానంగా. ఆవిడకు తేడా ఏమి కనిపించలేదు. అందుకే మనస్ఫూర్తిగా ఆ పసిబిడ్డను ఆహ్వానించటానికి పూనుకుంది.

రాష్ట్రాయ్‌ కూడ, సంతోషాన్నేె వ్యక్తపరిచాడు.

ఆవిడ అప్పటికప్పుడు డ్రయివర్‌ను తీసుకునివెళ్లి, పలచని కాటన్‌ జుబ్బాలు, డైపర్లు కొంది. గాంధారి మాత్రం ‘‘రేపటి నుంచి నేను రిజిష్టర్డు తల్లి నౌతాను’’ అంది. ఆమె గురించి ఎవరూ పట్టించుకోలేదు.

ఉష మాత్రం ‘‘ఆ పాప నా ఇంటికి రాగానే, నేను నిజమైన తల్లినౌతాను, మరో తొమ్మిది నెలల్లో, నా కడుపులోంచేె ఓ బిడ్డ, ఈ పాపకు తమ్ముడుగానో, చెల్లెలుగానో బైటకొస్తుంది’’ అంది ఆనందంగా.

ఆ రోజంతా ఉత్సాహంగా ఉంది. ‘‘పాప పుట్టిన పదోరోజు నుంచి, తన ట్రీట్‌మెంట్‌ ప్రారంభమవు తుంది’’ అనుకుంది.

కుంతల కూడ, మెయిల్‌ చూసుకుని, ‘‘నా జీవితం ఓ గాడిన పడుతుంది. ఈ పసిబిడ్డవల్ల లభించబోయే, ఆ అదృష్టాన్ని, ఈ బాబుకెే అంటగడతారు. వాడీ ఇంటి యువరాజు’’ అంటూ ఆనందపడిరది. దుష్యంత్‌ కూడా, సంతోషాన్ని వ్యక్తపరిచాడు. దుష్యంత్‌ తల్లి ఛాయాదేవి ‘‘ఇన్నాళ్లకు నా కోరిక తీరి, ఓ మగబిడ్డ ఇంట్లో కొస్తున్నాడు, చెట్టు ఏదైతేనెం, ఆ తోటలో నాటిన విత్తనం నా ఇంటిదే!’’ అనుకుంటూ ఆనందించింది.

– సంబరాజు లీల (లట్టుపల్లి)

(వచ్చేవారం ముగింపు)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE