– సంబరాజు లీల (లట్టుపల్లి)

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

ఓదార్పు పొందినట్లుగా కళ్లు తుడుచుకుంటూ, ‘‘ఆ బిడ్డ భూమి మీదికి రావటానికి ఇంకెన్ని నెలలు పడతాయి’’ అడిగింది కుంతల.

‘‘ఇంకా చాల సమయముంది. అప్పటివరకూ లాలిపాటలు నేర్చుకో కుంతలా! ఇప్పటికైనా సరే! ఆడపిల్లయినా కంటానంటే నీకూ మరోసారి ప్రయత్ని స్తాను. అప్పుడు నీ బిడ్డను నువ్వే మోసి కనొచ్చు. ఆలోచించుకో!’’ వివరించింది వరద.

ఈసారి దుష్యంత్‌ మాట్లాడాడు.

భార్య భుజం మీద చెయ్యి వేస్తూ ‘‘నాకు పిల్లలు లేరు అన్న బాధకన్నా, కుంతల మూగగా అనుభవించే దుఃఖం చూడలేకపోతున్నాను. ఈసారి అమ్మను ఒప్పించే బాధ్యత నాది. ఇక నుంచి ప్రసవమయ్యే వరకూ, కుంతలను మీకప్పచెబుతున్నాను’’ ధైర్యంగా చెప్పాడు.

‘‘హండ్రెడ్‌ పర్సెంట్‌!’’ నవ్వింది వరద.

‘‘ష్యూర్‌!’’ మాట ఇచ్చాడు. వెలిగే కళ్లతో భర్త వంక చూసి, సేదదీరుతున్నట్లుగా అతని భుజంపై వాల్చుకుంది తలను.

క్షణం తరువాత అతడు సమాధానంగా చేయందించగా లేచింది.

 * * * *

ఉష, అనిరుద్‌ డాక్టర్‌ వరద వద్దకొచ్చారు. తమ సరోగేట్‌ మదర్‌ ఎలా ఉందో తెలుసుకోవటానికి! వరద వారిని కూర్చోమంది.

 ‘‘అజ్ఞాతంలో ఉన్న, ఆ అదృశ్య మాతృమూర్తి ఎలా ఉంది డాక్టర్‌?’’ అడిగాడు అనిరుద్‌.

అతడి గొంతులో ఆమె పట్ల హేళన లేదు. కానీ, తాను పురుషుడినేనన్న గర్వం ధ్వనిస్తున్నది. అందుకెే ఆ పరామర్శలో ఆసక్తిలేదు. నిరాసక్తిగా ఉంది.

గాలి వాటుకు పుప్పొడి రేణువులు ఎగిరిపోయో, ఏ పక్షి కాళ్లనంటో, ఎవరి తోటలోని చెట్టుకో ఫలపుష్పాలందించి, వికసించినట్లుగా, తన బిందువు లన్నీ ఎక్కడికో వెళ్లి, ఎవరికో సంతానాన్నిస్తే, ఆ బిడ్డ మానసికంగా తనదవుతుందా? గుడ్డికన్నా మెల్ల మేలన్నట్లుగా, ఎవరినో దత్తత తీసుకునే బదులు, సరోగేట్‌ మదర్‌ ద్వారా సంతానాన్ని పొందటం మంచిదే!

వాడి రక్తంలో తన బీజకణాలున్నాయన్నదే ఇక్కడ తృప్తిపడే విషయం అనుకుంటాడు అనిరుద్‌.

‘‘ఆరోగ్యంగానే ఉంది. కదలికలు కూడా మొదల య్యాయి. నిన్న ఒక్కరోజు న్యూలీ బేబీ కదిలిందట. మానిటర్‌ చూస్తుంటే తెలుస్తోంది’’ చెప్పింది వరద.

‘‘ఎంతదృష్టం ఆవిడది’’ అంటూ తలెత్తింది ఉష. ఆ కళ్లు, ఏ సప్త సముద్రాల కావల నిలిచిన కల్పవృక్షాన్నో చూస్తున్నట్లు ఉన్నాయి. పెద్ద సరస్సులో కదిలేె నల్లకలువల్లాంటి కళ్లు నీళ్లతో నిండి ఉన్నాయి.

‘‘రిలాక్స్‌, బీ రిలాక్స్‌ ఉషా!’’ అంది ఓదార్పుగా డాక్టర్‌ వరద. అనిరుద్‌ ముఖంలో విసుగు, అసహనం తొంగి చూశాయి. ‘‘ఉషా! ఏం చెప్పాను? ఏడవొద్దు. మనలాంటి దంపతులు చాలామంది ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యే ఇది. నేను కాసేపు బయట రిలాక్సవుతాను. డాక్టర్‌, మీ చెక్‌, రిసిప్టు రిసెప్షన్‌లో కట్టేశాను’’ అంటు లక్ష రూపాయల చెక్‌ రిసిప్టు చూపించాడు.

వరద దాన్ని తీసుకుని సరోగేట్‌ మదర్‌ సంతకం చేసిన అగ్రిమెంట్‌ పేపర్లిచ్చింది. అనిరుద్‌ బైటకు వెళ్లగానే ఉష ఒక్కసారిగా లేచి కళ్లు తుడుచు కుంటూ ‘‘ఆవిడ ఎలా ఉందని నేను అడగను డాక్టర్‌! ఎలా ఉన్నా అమ్మగా నేనా అనుభూతుల్ని పొందలేను కదా?

‘‘అదే… నా గర్భంలోనే పెరిగితే, ఆ స్పర్శ సుఖం, ఈ తొమ్మిదినెల్లు భరించేదాన్ని. రోజుకోసారయినా నా చిట్టిపాపాయిని స్పర్శించి చూసుకునేదాన్ని.

‘‘ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చూస్తూ, తల్లి అంటే అలా ఉండాలి అనుకోవటం తప్పితే, చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్న కాలంలో, అప్పుడప్పుడె ల్యాప్‌ట్యాప్‌ల ఆవిర్భావకాలంలో ఆ నెట్‌లో చదివితే తెలిసినవే.

‘‘ఆ రేడియేషన్‌ వల్ల గర్భాలు నిలవటం లేదని, చాలమంది అమ్మాయిలకు అబార్షన్లు అవుతున్నా యని, చాలామంది దంపతులకు పిల్లలు కావటం లేదని ఆనాడే అనుకున్నాం.

‘‘అప్పుడైనా జాగ్రత్త తీసుకోలేదు, ముందు జాగ్రత్తకోసం. పోతే పోనీ… నా ఎంజాయ్‌మెంట్‌లో ఓ మందు బిళ్లమింగే పని తప్పుతుందని సంతో షించాను. గర్భపు గోడలు పట్టుకుని, అమ్మ పేగు అనుబంధంగా ఎదగాలనుకునేె పసిప్రాణిని, నిర్దాక్షిణ్యంగా తోసేశాను.

‘‘అప్పుడు తెలియలేదు. నేను ఆడదాన్నయినా అమ్మను కాలేనని, దానికింత వ్యధాభరిత జీవితాన్ని గడపాల్సి వస్తుందని…’’ సన్నగా ఏడ్చేసింది ఉష.

‘‘ఉషా! రిలాక్స్‌. నీవు ప్రతీసారీ ఇలా, నీ అస్తిత్వం కోల్పోయానని ఏడిస్తే నేనేమీ చేయలేను.పైగా ఈ ధోరణి అనిరుద్‌కు విసుగు పుట్టిస్తున్నది. ఆ విషయం స్పష్టంగా గమనించాను నేను.

‘‘నీవు అంగీకరిస్తే, అమ్మగా రిస్కు తీసుకుంటా నంటే, నీకు ఆర్థికంగా కూడా సమస్య లేదు కాబట్టి మరోసారి ప్రయత్నించి, నీ గర్భం ద్వారానే నీ బిడ్డ జన్మించేలా చేస్తాను.

‘‘ముందు నీ గర్భసంచిలోని టిష్యూలకేమయినా, ఇన్‌ఫెక్షనుందేమో టెస్టు చేసి, ట్రీట్‌మెంట్‌ ప్రారంభిస్తాను. సంతాన సాఫల్య కేంద్రం పెట్టినప్పటి నుంచి నేనింత రిస్కు ఎప్పుడూ తీసుకోలేదు.

‘‘నిజానికింత రిస్క్‌ నాకవసరంలేదు. నా సంపాదన నాకెలాగు వస్తుంది. కానీ, ఓ తల్లిగా నీ దుఃఖం చూశాక, నాకే ఆ రిస్క్‌ చేద్దాం అనిపించింది. అన్నీ సరిగ్గా ఉన్నవారికి ఫలితాల్ని అందించటం గొప్పకాదు. మీలాంటివారి మీద చేసే ప్రయోగాల వల్ల నా నైపుణ్యం బైటపడటమే కాదు, మీకు నిజమైన ఆనందాన్ని అందించడం నాకున్న శ్రద్ధ ఏపాటిదో కూడా బైటపడుతుంది.

‘‘నీవంగీకరించి రిసెప్షన్‌లో బిల్‌ చెల్లించి వస్తే, వచ్చే నెలనుంచే నీ కోసం ప్రయోగం ప్రారంభ మౌతుంది.’’ ధైర్యంగా చెప్పింది వరద.

‘‘నాకు నలభై నిండుతున్నాయి. అది… సాధ్యమా?’’ సంశయంగా ప్రశ్నించింది.

‘‘నీకా సందేహమక్కరలేదు. అయినా… సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. ప్రయత్నించటం మన పని. ఫలితమివ్వటం దేవుని దయ. అందుకే పని ప్రారంభించినపుడు ఫలితాలకెదురు చూడొద్దు. మా నానమ్మకు నలభై ఏడేండ్లప్పుడు,రుతుక్రమమే ఆగిపోయిందనుకున్నప్పుడు గర్భం నిలిచి, మా నాన్న పుట్టాడట. మా అమ్మ తండ్రి తాతయ్యకు, అరవై మూడేండ్ల వయసులో మా అమ్మ పుట్టిందట. చెప్పలేము’’ వివరించింది.

‘‘నేను అంగీకరిస్తున్నాను డాక్టర్‌! అనిరుద్‌ నొప్పించి, ఇప్పుడే బిల్‌ పే చేస్తాము. ప్రస్తుతం నేను, పీరియడ్స్‌ రెండో రోజులో ఉన్నాను. ఎప్పటి నుంచి ట్రీట్‌మెంట్‌కు రావాలి?’’ అడిగింది సంతోషంగా.

‘‘పీరియడ్‌ ప్రారంభమయిన పన్నెండో, పదమూడో రోజు రావాలి. దానికన్నా ముందు, ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్‌ లేకుండా యాంటి బయోటిక్స్‌ వాడాలి’’ అంటూ చకచకా మెడిసిన్స్‌ రాసిచ్చింది.

అనిరుద్‌ రాగానే ఉష అతనికి చెప్పి, ఫీజు కట్టేయమంది. అతడు రిసెప్షన్‌లో ఫీజు కట్టి వచ్చాడు.

‘‘నమస్తే డాక్టర్‌! వస్తాను’’ ఉష ఆశగా చేతులు జోడిరచింది. ఈసారి ఆమె వదనంలో నిర్వేదం లేదు. ఆశాభావముంది.

‘‘ఓకే, బై. గుడ్‌లక్‌’’ చెప్పింది వరద.

‘ఆశ మనిషిని ఎలా బ్రతికిస్తుందో, నిరాశ అలా ముందుకు వెళ్లకుండా చంపుతుంది’ అనుకుంది డాక్టర్‌ వరద.

 * * * *

కొడుకు వ్యాస్‌తో సత్యవతి విషయం చెప్పింది,

‘‘వ్యాస్‌! ఆ అమ్మాయి ఎవరికి సరోగేట్‌ తల్లిగా వెళ్తుందో తెలియదు. ఎన్నో వందల సంతాన సాఫల్యకేంద్రాలున్నాయి. ఎందులో ఏం జరుగు తుందో తెలియనంత గోప్యంగా ఉంచుతున్నారు.

‘‘ఒకవేళ… ఆ అమ్మాయి మన గాంధారి డొనేట్‌ చేసిన ఎగ్‌ను మోస్తున్నామ్మాయి అయితే, ఎంత బాగుండు’’ అంది కొడుకుతో.

‘‘అమ్మా! ఎంత ఆశ! ఆశ మంచిదేగాని, దురాశ మంచిది కాదు. ఒకవేళ, అది నిజమైనా అసలు విషయం మనకేమీ తెలవదు కదా? అమ్మాయి చాలా బాగుంది. చదువు అదీ నచ్చింది. నా కమిట్‌మెంట్స్‌ అన్నీ ఒప్పుకుందంటే, భార్యగా నాకు సహకరిస్తుందనే అనిపించింది’’ అన్నాడు.

‘‘నాకూ అలాగే అనిపించిందిరా. అందుకే లేని ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకోవాలన్నారు’’ చెప్పింది.

‘‘అంటే… అలాంటి అమ్మాయిల ‘లేమి’వల్లా, మనకు లొంగి పడుంటుందనా? ఒకవేళ, అలాంటి ఇంటి నుంచి వచ్చినా పెళ్లయి వచ్చాక అత్తగారింటి హోదా, అంతా ఆమెదే అవుతుంది కదా? పిచ్చమ్మా! ఆధునికత అంతా అలంకారాల్లో చూపించటం కాకుండా, ఆలోచించటంలో ఉండాలి. విజ్ఞానాన్ని చూసి ఆనందించి ఊరుకోకూడదూ. రెండు చేతులా ఒడిసి పట్టుకోవాలి.

‘‘చూశావామ్మా! నేనీ మధ్యకాలంలో, నా గురించి పది నిమిషాలు ఆలోచించలేదు. ఎప్పుడైతే, పెళ్లి ప్రపోజల్‌ వచ్చిందో, అప్పుడే నా వృత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ప్రవృత్తికి కోరికలు ఏర్పడుతున్నాయి. ఆ అమ్మాయిని తీసుకువెళ్లి ఏదవసరమున్నా కొనివ్వమ్మ!’’ చెప్పాడు.

‘‘బావగారు అప్పుడే కాబోయే భార్య గురించి ఆలోచనల్లో తేలిపోతున్నారు’’ అంటూ హాస్యమాడిరది గాంధారి.

గాంధారికెందుకో హాయిగా ఉంది.

ఒకవేళ కుటుంబంలోనివారు ఆశించినట్లుగా తను బిడ్డను కని ఉంటే, వ్యాస్‌తో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేదా? పుట్టిన బిడ్డను ఎప్పుడైనా తన వారసుడే అని అతననుకుంటే… అనిపించింది.

ఎందుకో… తను ఆ ఆలోచనకు అంగీకరించ కుండా మంచి పనే చేశాననిపించింది. జీవితంలో ఎప్పుడైనా, ఎప్పటికైనా, నైతిక జీవన విలువలు ఎంత ముఖ్యమో, ఆప్యాయతలు, అనుబంధాలు, వారసత్వాలు కూడా అంతే అవసరం.

కానీ… వాటికోసం కేవలం కోరికల కోసం, జీవన విలువల్ని పక్కన పెట్టకూడదనుకుంది. తనిప్పుడు ధైర్యంగా బాబునో, పాపనో చక్కగా ఎత్తుకుని ఒళ్లో వేసుకోగలదు’’ అనుకుంది.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE