‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

పెద్ద భవనం, చుట్టూ తోట, పలచని లాన్‌. ఆ ‌గార్డెన్‌ ‌నిండా రంగురంగుల గులాబీలు, చేమంతులు విరగబూసి, తలలూపుతూ లోపలికి అనుమతినిస్తున్నాయి. అంచులకు వేసిన కొబ్బరి, అశోక, మామిడి వృక్షాలు సైనికుల్లా ఆ ఇంటిని పహరా కాస్తున్నాయి.

గూర్ఖా గేట్‌ ‌తీయగానే, కారు నెమ్మదిగా లోపలికొచ్చింది.

గీరా దిగగానే పనమ్మాయి వచ్చి లోపలికి తీసుకువెళ్లింది. పెద్ద హాల్‌. అం‌దమైన ఫర్నిచర్‌తో ఐశ్వర్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ రాజభవనాన్ని తలపింపజేస్తుంది.

గీరా కూర్చోగానే సత్యవతి వచ్చి పలకరించింది.

హుందాగా, ఇస్త్రీ చీరలో డాక్టర్‌ ‌వ్యాస్‌ ‌పోలికలతో ఉన్న ఆమెను చూడగానే•, ఆవిడే సత్యవతి. వ్యాస్‌ ‌తల్లి అని ఊహించగలిగింది గీరా. కొద్దిపాటి నగలతో, వయసు నలభై సంవత్సరాలు దాటినట్లున్నా ఆమెను చూస్తే, ఆమెకంత వయసున్న కొడుకున్నాడంటే, నమ్మలేనట్లుంది. ఆవిడే తనను తాను పరిచయం చేసుకుంటూ, ‘‘నా పేరు సత్యవతి. వ్యాస్‌ ‌మా పెద్దబ్బాయి’’ చెప్పింది. గీరా కూడా మర్యాదగా నమస్కారం చేసింది. పనమ్మాయి కాఫీ•, ఫలహారం తెచ్చింది. సత్యవతి తనొకటి తీసుకుని, గీరాకొకటిచ్చింది. తరువాత యాపిల్‌ ‌జ్యూస్‌, ‌మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది ఆ అమ్మాయి.

ఆ మర్యాద, పద్ధతి, ఆ ఇంటి హోదా స్వర్గంలా అనిపించాయి గీరాకు. ఆవిడ డైరక్టుగా విషయానికొస్తూ ‘‘గీరా! పేపర్‌ ‌స్టేట్‌మెంట్‌, ‌టీవీ స్క్రోలింగ్‌ ‌చూశావుగా? అన్ని రకాల సదుపాయాలు, కుటుంబంలోని కోడలిగా ఉంటాయి.

‘‘అయితే, భర్తగా వ్యాస్‌  ‌నీకు తక్కువగా అందుబాటులో ఉంటాడు. దానికి నీవంగీకరించాలి. నీ విషయాలన్నీ వ్యాస్‌కు మెయిల్‌ ‌చేశాను. వాడికి నచ్చాయి. మా కుటుంబంలో అందరూ అంగీకరించారు. నీకూ అంగీకారమైతే ఒక్కసారి మీవాళ్ల విషయం కూడా చెప్పు. వాళ్ల గురించీ తెలుసుకుంటాం!’’ చెప్పింది సత్యవతి.

గీరాకు ఒక్క క్షణం మౌనంగా ఉండిపోక తప్పింది కాదు.

తను డాక్టర్‌ ‌వరదతో కమిటయిన విషయం చెప్పాలి. అప్పుడే తను ఈ కొత్త అంకానికి అంగీకారం చెప్పాలి. కానీ అందం, ఆరోగ్యం, హోదా, చదువు గౌరవనీయమైన పదవిలో ఉన్న యువకుడు తనను వరించి వస్తానంటే ఆమోదించకపోవటం మూర్ఖత్వమే అవుతుంది.

ఆనందమో, ఉద్వేగమోగానీ గీరా మనసు మాటలు మర్చిపోయింది. నిజానికి ఈ ఇంటి గౌరవంతో పోల్చి చూస్తే, వారికి తను కనుచూపు మేరలో కూడ నిలబడలేదు.

మరి… అలాంటి అవకాశం తనను అందుకోవటానికి వస్తుంటే ఏం చేస్తుంది!

 వెంటనే గీరా తల ఊపి వారి వివరాలు ఇచ్చింది.

 తరువాత మెల్లని స్వరంతో ‘‘మీకు నా విషయాలు కొన్ని చెప్పాలి. ప్రభుత్వ సహాయం వల్ల చదువుకున్న నేను, డబ్బు కోసం కొన్ని పనులు ఎంచుకున్నాను. అవి పూర్తయ్యాకే నా వివాహం. నిజానికి మీ హోదాకు, మా కుటుంబానికి చాలా అంతరముంది.

‘‘మేమున్న పరిస్థితుల్లో మీతో సరితూగటమటుంచి, కనీసం కంటితో కూడా చూడలేము. కానీ మీ ప్రకటనకు ముందే నేనొక పని గురించి కమిటయ్యాను. నాకు మీరు కొంత సమయమివ్వాల్సి వస్తుంది. దానికి నేను మాట ఇచ్చి, ఒప్పందం కుదుర్చుకున్నాను కాబట్టి, తప్పదు.

‘‘మీరు నన్ను కోడలిగా ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషం. అయినా నేను మీకు ఆంక్షలు పెట్టటం తప్పే, కానీ తప్పదు. ఈ లోపల నేను మావాళ్లందర్ని ఒప్పించగలను. లేకున్నా, నేను మేజర్ని. నా పెళ్లి, నా ఇష్టానికే జరుగుతుంది’’ చెప్పింది గీరా.

‘‘ఒప్పుకుంటాము గీరా! ఇన్ని రోజులు ఆగిన మేము, కొద్దికాలం ఆగలేమని కాదు. మేమూ కొన్ని ఆంక్షలు, ఒప్పందాలతోనేగా నీకు కోడలి హోదా ఇవ్వాలనుకున్నది. నీ పనుల కోసం నీకెంత సమయం కావాలి?’’ ప్రశ్నించింది సత్యవతి.

‘‘సుమారుగా పది, పదకొండు నెలలు’’ చెప్పింది.

‘‘సమయం ఎక్కువే! ఆ పనులేమిటో చెబితే  సమయాన్ని కుదించుకోవచ్చేమో ఆలోచించవచ్చు. ఐ మీన్‌, ‌మా కుటుంబంలోకి రాబోయే కోడలు చేసే పనుల గురించి మాకు తెలియాలిగా!’’ శాంతంగా చెప్పింది సత్యవతి.

ఒక్క క్షణం గీరా ఆలోచించింది.

అసలు విషయం చెప్పాలా, వద్దా అనుకుంది మొదట. చెప్పాల్సిందే! ఇదేమి చిన్న విషయం కాదు. మాతృత్వం స్త్రీ జీవితంలోనే కాదు, మనశ్శరీరాల మీదా ఎన్నో మార్పులు సూచిస్తుంది.

ముఖ్యంగా ఇప్పుడింత సుకుమారంగా ఉన్న రూపలావణ్యంలో, అనూహ్యంగా, పొట్ట మీద చారలు, పసివాడి పోషణ కోసం, ప్రకృతి సృష్టించే• క్షీర• సముద్రాలయిన ఎద లోతులు! ఆ తరువాత తెలిసినా, లేదా తెలవకపోయినా, వాళ్లు గుర్తిస్తే జీవితం మీదే చెప్పుకోలేని ముద్ర పడుతుంది. వాళ్లు నన్ను అంగీకరించనీ, లేకపోనీ! ముందే చెబితే, నా మనస్సాక్షి నాకు తోడుగా ఉంటుంది అనుకుంది.

‘‘నేను, సరోగేట్‌ ‌మదర్‌గా ఒప్పుకున్నాను. అందుకోసం మాట ఇచ్చాను. ఇందులో మీ కుటుంబానికి కలిగే పరువు నష్టమేమి ఉండదు. నన్ను మీ కోడలిగా అంగీకరిస్తే అందుకు కూడా మీ అనుమతి అవసరమౌతుంది.’’

‘‘అంగీకరించామని ముందే చెప్పాము. మామూలుగా అయితే ఎలా ఆలోచించేవాళ్లమోగానీ, ప్రస్తుతం మేము అలాంటి తల్లి మీదనే ఆధారపడి మా వంశాకురాన్ని తెచ్చుకుంటున్నాము.

‘‘అలాంటి తల్లులే లేకుంటే, మా కుటుంబానికెంత అసంతృప్తిగా ఉండేది! మా•కే కాదు, ఎంతమంది దంపతుల అసంతృప్తిని పోగొడుతుందో ఈ పద్ధతి.

‘‘ఇన్ని సంవత్సరాలు ఆగాము. ఇక, కొద్దినెలలాగలేమా? నీవు చేస్తున్నది గొప్ప త్యాగమే గీరా! మాతృత్వమనేది స్త్రీకి గొప్పవరం. అది రాకపోవటం, ఆ స్త్రీకి శాపమే సుమా! దాన్ని నీవందిస్తావంటే ఆ తల్లి చేసుకున్న పూజాఫలమది. అందుకు ఒప్పుకుంటాం, అంతదాకా ఆగుతాం కూడా. నేను వ్యాసుకీ విషయం తెలియజేస్తాను. నీవొక•సారి ఫేస్‌బుక్‌ ఓపెన్‌ ‌చేసి, వ్యాస్‌తో కూడా మాట్లాడు. ఒకవేళ వాడికి సమయం లేకుంటే మెయిల్‌ ‌మాత్రమిస్తాడు. దానికి బాధపడకేం!

‘‘ఈ విషయంలో నా కొడుకులకు ముఖ్యంగా వ్యాసుకు అభ్యంతరం ఉండకపోవచ్చు. వాడికి తెలియజేసి నీకు మెయిల్‌ ‌చేస్తారు. ఈనాటి నుండే, నీవు మా కోడలిగా ఇకముందు తీసుకునే నిర్ణయాల్ని తెలియపర్చాల్సి ఉంటుంది.

‘‘అయితే ఇది ఆంక్ష కాదు, అభ్యర్థన మాత్రమే!

‘‘కుటుంబంలో ఎలాంటి దాపరికాలు లేకపోవటం, ఆ కుటుంబంలోని స్థిరత్వానికి, ప్రశాంతతకు చిహ్నం’’ చెప్పింది సత్యవతి.

‘‘తప్పకుండా! మీరింత సహృదయంతో ఒప్పుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అన్ని నిర్ణయాలు మీకు తెలియపరచటం నా బాధ్యత అనే అనుకుంటాను’’ సంతోషంగా చెప్పింది గీరా.

‘‘గీరా! నీవు ఎవరి బిడ్డను మోస్తున్నావో, ఏ తల్లి స్థానంలో నిలిచి, సరో•గేట్‌ ‌తల్లిగా మాతృదానం చేస్తున్నావో నీ•కేమయినా తెలుసా?’’ కుతూహలంగా ప్రశ్నించింది సత్యవతి.

‘‘లేదు! అంత రహస్యంగాను బిడ్డను గర్భంలో వేసుకుని, అంతకన్నా గోప్యంగా కని, ఆ శిశువును కంటితో కూడా చూడకుండా వెనక్కి తిరిగి వచ్చేయటమే! పోయేటప్పుడు కడుపులో బిడ్డతో, తిరిగి వచ్చేప్పుడు ఒడిలో డబ్బుకట్టలు’’ నవ్వింది గీరా.

‘‘గీరా! ముందుముందయినా నీ వివాహ జీవితం ఇలాగే భర్త చెంత ఉన్నా, అతన్ని చేరటానికి సమయం తీసుకునేంత దూరంలో ఉంటావు’’ హెచ్చరించింది సత్యవతి.

‘‘ఆ విషయం, ముందే తెలియజేసారుగా! ఒక రకంగా ఇది కాంట్రాక్టు వివాహం. అయితే, ఒక్క విషయం! మీ అబ్బాయికింత హఠాత్తుగా పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఎందుకు కలిగిందో…? తెలుసుకోవచ్చా?’’ ప్రశ్నించింది గీరా.

‘‘ఇది, నా కొడుకు కోరిక కాదు. నా కోరిక. నా కుటుంబ వారసత్వానికి ఉత్తరాధికారిగా ఈ ఆస్తి, అంతస్తులకు కాపాడే వారసుడు కావాలని కోరాను. దీనిని నా కోరిగా తీసుకుని ఈ అమ్మ కోసం, అమలు పరుస్తున్నాడు’’ చెప్పింది సత్యవతి.

ఆమెలో సన్నని విచారవీచిక క్షణం కనిపించి మాయమయింది. అది గీరా దృష్టిని దాటిపోలేదు.

‘‘మీకిద్దరు అబ్బాయిలు కదా…’’ ఆగిపోయింది గీరా.

ఆవిడ నిట్టూర్చింది. గీరా అంతరంగం అర్ధమయినట్టు విషయం వివరించింది. ‘‘వ్యాస్‌ ‌పెద్దవాడు. శాస్త్రవేత్త. వాడి విషయం నీకు తెలుసు. రాష్ట్రాయ్‌ ‌రెండోవాడు. వాడికి పసి వయసులోనే తీవ్రస్థాయిలో మశూచి వచ్చింది. బ్రతకడనే అన్నారు. కేవలం ఆయుష్షుండి బ్రతికాడంతే•!

‘‘ఆ కారణంగా వాడికి పిల్లలు కలగరని ముందే చెప్పారు. ఆ విషయం తెలిసే నా కోడలు గాంధారి ఒప్పుకుంది. అందుకే ప్రస్తుతం అద్దె అమ్మ ద్వారానే వారసుడిని పొందబోతున్నాం. పోనీలే. ఒకేసారి కొత్తకోడలు, నా వారసులు ఇంటికొస్తారు’’ నవ్వింది సత్యవతి.

గీరా వెళ్తానంటే, పట్టుచీర, పూలు, గాజులు ఇచ్చి కుంకుమ దిద్దింది. గీరా లేస్తుంటే హుందాగా, లాల్చిపైజామల్లో, చేతికర్రతో అరవై, అరవైఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి ఈవినింగ్‌ ‌వాక్‌ ‌కోసం కాబోలు క్రిందికి వచ్చాడు.

అతన్ని పరిచయం చేస్తూ ‘‘గీరా! మీ మామగారు శంతన్‌ ఐ.ఏ.ఎస్‌. ‌విశ్రాంత ఉద్యోగి. మన వ్యాసుకు అగ్రిమెంట్‌ ఇచ్చిన అమ్మాయి గీరా! ఇక నుంచి మన కోడలు’’ పరిచయం చేసింది.

గీరా మనసు మరోసారి ఎగిరిపడింది. మంచి చదువు, సంస్కారం, ఐశ్వర్యం, అందం, సహృదయత  కలిగిన కుటుంబంలోకి, ఒక లోతైన మహా సముద్రంలోకి, ఓ చిన్న నీటి బిందువులా చేరబోతున్నది.

గీరా లేచి వినయంగా నమస్కారం చేసింది.

ఆ తరువాత డ్రైవర్‌ను ఇచ్చి గీరాను హాస్టల్‌కు పంపింది సత్యవతి.

– సంబరాజు లీల (లట్టుపల్లి)

About Author

By editor

Twitter
YOUTUBE