ఇంట పోయ్యిలో పిల్లి లేవకపోయినా, పక్కింట్లో మంట పెట్టాలన్న పాకిస్తాన్‌ దుర్బుద్ధి మరొక్కసారి బయటపడిరది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను రద్దు చేసి, ఆ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి, ప్రజల జీవితాలను మెరుగుపరుస్తూ వారిని ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న భారత ప్రభుత్వ యత్నాలకు గండి కొట్టేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. తీవ్రవాద కార్యకలాపాలు తగ్గి జీవితాలు స్థిరపడుతూ ‘నయా కశ్మీర్‌’లో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న తరుణంలో జమ్ములో ప్రారంభమైన తీవ్రవాద దాడులు ఉధ్రుతం కావడంతో మళ్లీ అందరి దృష్టీ అటువైపు తిరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే రైసీ ప్రాంతంలో హిందూ యాత్రికులను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకుని, భారత్‌ను రెచ్చగొట్టే యత్నం చేసిన విషయం తెలిసిందే. అప్పటి  నుంచీ తీవ్రవాద దాడులు తరచుగా సాగతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఒకవైపు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో, సింధు, బెలూచిస్తాన్‌, ఖైబర్‌ ఫక్తూంఖ్వాలలో అశాంతిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ తన దేశంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు జమ్ములో ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. మింగ మెతుకులేదు మీసాలకు సంపంగె నూనె అన్న చందంగా వారు మళ్లీ ఉగ్రవాద సంస్థలను క్రియా శీలకం చేస్తున్నారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్‌ గ్లాసెస్‌ వంటి పరికరాలతో జమ్ము ప్రాంతంలోని అరణ్యాలలో మాటు వేసిన తీవ్రవాదులు మన సైనికులను చాలా తేలికగా బలి తీసుకుంటున్నారు. వీరికి ఇంత అత్యాధునిక ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది.

ఎవరీ కశ్మీర్‌ టైగర్స్‌?

కొద్ది ఏళ్ల కిందటివరకూ లోయను కేంద్రంగా చేసుకొని తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించిన పాక్‌ ఇప్పుడు జమ్మును లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జెయిష్‌`ఎ` మహమ్మద్‌ (జెఇఎం), లష్కర్‌`ఎ`తయిబా (ఎల్‌ఇటి) వంటి సంస్థలు ఇప్పుడు ‘కశ్మీర్‌ టైగర్స్‌’ (జెఇఎం) వంటి ముసుగు సంస్థల పేర్లతో తన కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఇటీవల దోడా, కథువాలలో 10 మంది భద్రతా సిబ్బంది మరణానికి తామే కారణమంటూ కశ్మీర్‌ టైగర్స్‌ సంస్థ ప్రకటించి, తన ఉనికిని చాటుకుంది. ఇటీవలే జమ్ములోని దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక కెప్టెన్‌ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించడం, సైన్యానికి వ్యతిరేకంగా ఇటువంటి దాడులు మరిన్ని సాగుతా యంటూ కశ్మీర్‌ టైగర్లు హెచ్చరించడం జమ్మూకు ఏమవుతోందన్న ఆందోళనను పెంచుతోంది. కాగా, తీవ్రవాదులు ఇటువంటి ముసుగు/ మారు పేర్లను ఉపయోగించడం కొత్త కాదని జమ్ముకశ్మీర్‌ పోలీసు అధికారులు అంటున్నారు. వాస్తవానికి ఇది సర్వ విదితమే. గతంలోనూ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌, కశ్మీర్‌ ఫ్రీడం ఫైటర్స్‌ అండ్‌ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ పేర్లతో జైష్‌ ఏ మహ్మద్‌ వంటి తీవ్రవాద సంస్థలు కార్య కలాపాలు నడిపిన విషయం అందరికీ తెలిసిందేనని, ముఖ్యంగా సైన్యానికి వారి ఆటలు బాగా తెలుసని వారు చెప్తున్నారు.

2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన వెంటనే కశ్మీర్‌ టైగర్లు ప్రత్యక్షమయ్యారు. రెండేళ్ల తర్వాత, అంటే 2021 డిసెంబర్‌లో శ్రీనగర్‌ శివార్లలో పోలీసులపై జరిపిన దాడులకు బాధ్యత తమదే నంటూ ప్రకటించారు. ఈ దాడిలో ముగ్గురు అధికారులు మరణించారు. జమ్ముకశ్మీర్‌ పోలీసు సాయుధ దళ విభాగపు 9వ బెటాలియన్‌ పోలీసు బస్సులో వెడుతుండగా వారిపై తీవ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ముగ్గురి మృతికి, పలువురు గాయపడటానికి కారణమైన విషయం ఇంకా ఎవరూ మరువలేదు. అప్పటి నుంచీ అక్కడ చోటు చేసుకున్న ప్రతి తీవ్రవాద ఘటనకూ తామే బాధ్యులమంటూ ప్రకటించడం ప్రారంభించారు.

గత నెలలో దోడాలో టెంపరరీ ఆపరేటింగ్‌ బేస్‌ను వారు లక్ష్యంగా చేసుకోవడంతో ఐదుగురు సైనికులు, ఒక ప్రత్యేక అధికారి గాయపడ్డారు. ఈ ఘటన కథువా జిల్లాలోని సర్తాల్‌ ప్రాంతం సమీపంలో పోలీసుల, రాష్ట్రీయ రైఫిల్స్‌ ఉమ్మడి చెక్‌పాయింట్‌పై జరిగింది. గత వారంలో కథువా జిల్లాలోని మారు మూల మాచేదీ ప్రాంతంలో కశ్మీర్‌ టైగర్లు దాడి చేశారు. వారు ఒక సైనిక ట్రక్కును లక్ష్యంగా చేసుకో వడంతో ఒక జేసీఓ సహా పలువురు సైనికులు మరణించారు.

మౌలిక సదుపాయాల లేమే ఈ స్థితికి కారణమా?

కశ్మీర్‌ ప్రాంతంలో ఇటీవలే అభివృద్ధి కనిపిస్తున్న ప్పటికీ, జమ్ము పరిస్థితి, ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో దయనీయంగా ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. రెండేళ్ల కిందట సాక్షాత్తు రక్షణమంత్రే  గరిష్ట సంఖ్యలో దేశ సరిహద్దు ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు కేంద్రం ప్రణాళికలను రూపొందిస్తోందంటూ ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం జమ్ముకశ్మీర్‌ను అభివృద్ధి చేయకుండా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం చేయడమే తీవ్రవాదం వెనుక ఉన్న కారణాలలో ఒకటని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వంతెనలు, రహ దారులు, హెలిపాడ్లు సహా 75 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను 2022లో రక్షమంత్రి జాతికి అంకితం చేశారు. లద్దాక్‌, జమ్ముకశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం సహా పలు వ్యూహాత్మకమైన కీలక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. ఇందులో 20 ప్రాజెక్టులు జమ్ముకశ్మీర్‌లో నాడే ప్రారంభించారు. సైనిక దళాల సాహసానికి మౌలిక సదుపాయాలు కలిస్తే శత్రుమూకలను దూరంగా ఉంచవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన నాడు వ్యక్తం చేశారు. కానీ, అవన్నీ నీటి మూటలైనట్టు కనిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ రహదారుల లేమి

 జమ్ము ప్రాంతంలో ప్రత్యామ్నాయం రహదారులు లేకపోవడంతో పోలీసులు కానీ సైనికులు కానీ సరిహద్దులను, నియంత్రణ రేఖలో గల తమ స్థావరాలను చేరుకోవడానికి ఒకే మార్గంలో ప్రయాణించవలసి వస్తోంది. వారు తమ స్థావరాలకు, ఆహారాన్ని, ఆయుధాలను, సిబ్బందినీ కూడా ఒకే మార్గంలో తీసుకు వెళ్లవలసి వస్తోంది. వారి రాకపోకలపై కన్నువేసిన తీవ్రవాదులు తమకు చిత్తం వచ్చినప్పుడు వారిపై దాడులు చేస్తున్నారు. వీటికి అదనంగా జమ్ము ప్రాంతంలోని అటవీప్రాంతం తీవ్రవాదులకు స్వర్గంలా ఉంది. పర్వతాల మధ్య దట్టమైన అడవుల్లో ఆశ్రయం పొందుతున్న తీవ్రవాదులు తేలికగా ఈ దాడులకు పాల్పడగలుగు తున్నారు. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ఈ అడవులలోకి చొరబడడం కూడా పాకిస్తానీ తీవ్రవాదు లకు తేలిక అవుతోంది. ఇటీవలి సంవత్సరాలలో తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిన దక్షిణ కశ్మీర్‌ జిల్లాల వరకూ తీవ్రవాదులు దాగిన ఈ అడవులు విస్తరించడం ఆందోళన కలిగించే విషయం. ఇటీవలి కాలంలో సుందరమైన కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో దాదాపు ఆరురోజుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. సైనికాధికారులు, పోలీసు అధికారి సహా ఐదుగురు ఇందులో మరణించారు.  డ్రోన్లు కూడా వీరినీ, వీరి స్థావరాలను గుర్తించలేకపోతున్నాయి. గాజా తరహాలో తీవ్రవాదులు సొరంగమార్గాలను తవ్వుకొని వస్తున్నారనే అనుమానం రావడంతో ఈ అటవీ ప్రాంతంలో సైన్యం వాటిని గుర్తించి, మూసివేసేందుకు చర్యలు ప్రారంభించింది.

విదేశీ తీవ్రవాదులా?

జమ్ము డివిజన్‌లోని రజౌరీ, పూంఛ్‌ ప్రాంతంలో దేశీయ తీవ్రవాదులను అణచివేయడంతో విదేశీ తీవ్రవాదుల ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఒక దశాబ్దం కిందట ఈ ప్రాంతాన్ని తీవ్రవాద విముక్త ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. కాగా, 2021 నుంచి తీవ్రవాద దాడులు తిరిగి ప్రారంభమ య్యాయి. మళ్లీ ఒక ఏడాది విరామానంతరం తిరిగి ఇక్కడ తీవ్రవాద కార్యకలాపాలు పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కశ్మీర్‌ లోయలో అనుసరిం చిన తీవ్రవాద వ్యతిరేక వ్యూహాన్నే జమ్ములో హింసను అరికట్టేందుకు రూపొందిస్తున్నామంటూ జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ లెఫ్టనెంట్‌ జనరల్‌ మనోజ్‌ సిన్హా ప్రకటించినప్పటికీ, గత ఏడాది కూడా ఇదే హామీని ఆయన ఇచ్చి ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలలో అంత ఉత్సాహం రాలేదు. ఎందుకంటే, ఈ ఏడాది ప్రారంభం అయినప్పటి నుంచీ శాంతి యుతంగా ఉంటుందని భావించే జమ్ము ప్రాంతం లోని ఆరు జిల్లాలవ్యాప్తంగా 14 తీవ్రాదదాడులు చోటు చేసుకోగా 11మంది భద్రతాసిబ్బంది, ఒక గ్రామ భద్రతాధికారి, ఐదుగురు తీవ్రవాదులు మరణించారు.

ఈ ప్రణాళిక ప్రకారం తీవ్రవాదులకు మద్దతు నిచ్చే ఓవర్‌గ్రౌండ్‌ సానుభూతి పరులను గుర్తించి అరెస్టు చేయడం, సానుకూల రీతిలో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, పోలీసు, సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు ఫోర్సు మోహరింపు, రాత్రి గస్తీ, ప్రాంతంపై ఆధిపత్యాన్ని సాధించడం ప్రధాన మైనవి. కశ్మీర్‌ ప్రాంతంలో చొరబాట్లను నియంత్రిం చేందుకు ఈ చర్యలే తోడ్పడ్డాయిట!

 తీవ్రవాద వ్యతిరేక వ్యూహాలు ఎలా ఉండాలి?

జాతీయస్థాయిలో తీవ్రవాదదాడులకు మన పరిమితిని స్పష్టంగా నిర్వచించుకోవాలి. తీవ్రవాదాన్ని సహించమని ప్రకటిస్తే సరిపోదు. తీవ్రవాదానికి అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన  నిర్వచనం ఐక్యరాజ్య సమితి స్థాయిలో ఆమోదితమైనా, తన జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్‌ తీవ్రవాదాన్ని స్పష్టంగా నిర్వచించి, ప్రజా డొమైన్‌లో ఉంచాలి. ఇటీవలే ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహిత 2023ను ఎటువంటి తీవ్రవాద చర్యకైనా లేదా తీవ్రవాదానికి ఏ రూపంలో మద్దతు ఇచ్చినట్టు తేలిన వారిపైన అయినా నిర్దయగా వర్తింపచేయాలి. క్రియాశీలమైన తీవ్రవాద వ్యతిరేక వ్యూహ చట్రాన్ని రూపొందించాలి. మనకు తీవ్రవాద వ్యతిరేక వ్యూహం ఉన్నప్పటికీ, స్థానికంగా వచ్చిన మార్పుల క్రమంలో దానిని కొంచెం సవరించుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నక్సల్‌ వ్యతిరేక వ్యూహం మంచి ఫలితాలను ఇస్తున్నది కనుక ఈ ప్రాంతంలో కూడా ఉత్తేజితమైన మార్గాన్ని అనుసరించడం తప్పనిసరి. దీనితో పాటుగా ప్రత్యేక వాహనాల ఆవశ్యకతను గుర్తించి, వాటిని అందు బాటులోకి తేవడం అవసరం.

అత్యాధునిక ఆయుధాలు, పరికరాలు

దీనితో పాటుగా, భద్రతాదళాలకు, ముఖ్యంగా తీవ్రవాదంపై పోరు చేసే సైన్యానికి అవసరమైన ఆయుధాలు, పరికరాల తయారీలో భారీ పెట్టుబడులు పెట్టాలి. జమ్ము ప్రాంతంలో ఉన్న సైనిక యూనిట్లు శాంతియుత ప్రాంతంలో ఉన్నట్టు వారి ప్రొఫైల్‌ చూపుతోంది. ఎత్తైన పర్వతాలు, అడవులలో కఠినమైన మూడేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్న తర్వాత, మారుమూల సరిహద్దులలో పని చేసిన తర్వాత వారు ఇక్కడకు చేరుకుంటారు. వారికి అవసరమైన విశ్రాంతికి బదులుగా వారికి సంప్ర దాయ యుద్ధంలో శిక్షణ ఇవ్వడంతో వారు తీవ్రవాద వ్యతిరేక గ్రిడ్‌లోకి ఇమిడిపోతుంటారు. సైనిక యూనిట్లు సంప్రదాయ యుద్ధాలలో ఉపయోగించ వలసిన ఆయుధాలను, పరికరాలనే తీవ్రవాద కార్యకలాపాల్లో ఉపయోగిస్తోంది. దీనితో పాటుగా, గట్టి మందపాటి ఉపరితలం కలిగిన వాహనాలనే గస్తీలకు వాడాలి. కానీ అలా జరుగడం లేదు. ఇప్పుడు మనకు అటువంటి వాహనాలు దేశీయంగా తయారు చేయగల సామర్ధ్యం ఉంది. జబల్‌పూర్‌లోని ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ వెహికిల్‌ ఫ్యాక్టరీ, ప్రైవేటు పరిశ్రమలకు ఈ సామర్ధ్యం ఇప్పుడు ఉంది. మనం ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించగల, సాంకేతికంగా ప్రావీణ్యం కలిగిన తీవ్రవాదులతో పోరాడుతున్నాం కనుక, అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించగల భద్రతా దళాలు కూడా అవసరం.

ఏజెన్సీల మధ్య సమన్వయం అవసరం

వీటన్నింటినీ మించి, పరిస్థితిని నిర్వహిం చడంలో స్థూలస్థాయిలో లోటుపాట్లు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. వివిధ ఏజెన్సీలకు చెందిన సిబ్బంది వివిధ పనుల్లో నిమగ్నం కావడం, సమన్వ యంతో పని చేయకపోవడంతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కనుక, రాష్ట్ర స్థాయిలో తక్షణమే ఒక సమర్ధమైన, సమన్వయ యంత్రాంగం అవసరం. దీనితో అదనంగా, ఈ ప్రాంతంలో రొహింగ్యాల ఉనికి సహా జనాభాలో వస్తున్న మార్పులను ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుండాలి. సరైన సమయానికి ఇంటెలిజెన్స్‌ సమాచారం అందకపోవడం పెద్ద వైఫల్యం. కనుక భద్రతా దళాలు ఎప్పటికప్పుడు తమ తమ గూఢచారులను సరిహద్దు గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకూ రూపొందించుకుంటే అనేక దాడులను నిలపడంలో విజయవంతం అవుతారు. ఏమైనప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గి ఉండవచ్చేమో కానీ పూర్తిగా సమిసిపోలేదు. తాజాగా జరుగుతున్న రిక్రూట్‌మెంట్లు, చొరబాట్లు నిర్వీర్యమైన తీవ్రవాదుల స్థానాలను కొత్తవారితో నింపుతున్నాయి. ఇక్కడ తీవ్రవాదాన్ని నిలిపివేసేం దుకు ప్రభుత్వం భద్రతా విధానంతో పాటుగా రాజకీయంగా వారిని చేరుకునే విధానాన్ని రూపొం దించుకోవాలి. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్న ఆ రాష్ట్రంలో రాజకీయ చొరవ సమయా నికి సామాన్యులను చేరుకోకపోతే, ఆర్టికల్‌ 370 ఎత్తివేసిన ఫలితం దక్కేలా కనిపించడం లేదు.

– నీల

About Author

By editor

Twitter
YOUTUBE