జూలై 7న జగన్నాథ రథయాత్ర
పురుషోత్తమ పురాధీశుడు జగన్నాథస్వామికి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు నిర్వహించే రథయాత్ర విశ్వవేడుక. వేటగాడి బాణప్రయోగంతో శ్రీకృష్ణ భగవానుడు అవతారసమాప్తి చేశాక, ఆయన ఆత్మస్వరూపమైన బ్రహ్మ పదార్ధాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు దారువిగ్రహంలో నిక్షిప్తం చేసి ప్రతిష్ఠించాడని, అలా జగన్నాథుడిని ‘దారుబ్రహ్మ’ అంటారని పురాణ కథనం. మోక్షదాయక క్షేత్రాలలో ఒకటిగా చెప్పే పూరి ప్రస్తావన విష్ణు, మత్స్య, వామన, స్కంద పురాణాలలో కనిపిస్తుంది. శ్రీక్షేత్రం, శంఖు, నీలాద్రి క్షేత్రాలు, పురుషోత్తమపురం, జగన్నాథపురం పేర్లతో ప్రసిద్ధమైన ఈ పుణ్యస్థలి బ్రిటిష్ పాలకుల హయాంలో ‘పూరి’గా ప్రచారంలోకి వచ్చింది.
శతాబ్దాల క్రితం సముద్రంలో కొట్టుకు వచ్చిన దారువులతో ఇంద్రద్యుమ్న మహారాజు, బలభద్ర, సుభద్ర జగన్నాథ విగ్రహాలను తయారు చేయించారు. దేవశిల్పి విశ్వకర్మ మా(నవ)రు రూపంలో వచ్చి వాటిని రూపొందించి బ్రహ్మ పదార్థాన్ని నిక్షిప్తం చేశాడు. శ్రీకృష్ణుడి దివ్యదేహం దహనమప్పుడు అగ్ని సంస్కారం కాని నాభిని సముద్ర జలాల్లో వేయగా, అది నీలపు రాయిగా మారిందని, దానిని బ్రహ్మ పదార్థం అంటారని పురాణ కథనం.
జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా రాతి సింహాలు ఉంటాయి. అక్కడి మూడు మండపాలను భోగ, నాట్య, జగన్మోహన మండ పాలుగా వ్యవహరిస్తారు. గర్భాలయాన్ని జగ్ మోహన్ అంటారు. జగన్నాథుడు అన్నాచెల్లెళ్లతో విప్పారిన కళ్లతో దర్శనమిస్తాడు. బలభద్రుడి విగ్రహం అయిదడుగుల అయిదంగుళాల ఎత్తుతో శ్వేత వర్ణంలో, సుభద్ర విగ్రహం అయిదడుగుల ఎత్తుతో పసుపురంగులో, జగన్నాథుని విగ్రహం అయి దడుగుల ఏడంగుళాల ఎత్తుతో నలుపురంగులో ప్రకాశిస్తుంటాయి. జగన్నాథుడు చక్రాల వంటి కళ్లతో కరుణను కురిపిస్తూ, ఆదరంతో అక్కున చేర్చుకునేలా చాచిన రెండు చేతులతో భరోసా ఇచ్చే భంగిమలో దర్శనమిస్తాడు. రథయాత్రకు రెండు రోజుల ముందు ఇచ్చే దర్శనాన్ని ‘నవయవ్వన వేష’ అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు రథంపై కొలువైన జగన్నాథ త్రయాన్ని విశేష నగలతో అలంకరించడాన్ని ‘సునావేష’ అంటారు. ఏ ఇతర క్షేత్రంలోనైనా స్వామివారి ఊరేగింపునకు శాశ్వత ప్రాతిపదికపై రథాలు వినియోగిస్తే పూరీలో అందుకు భిన్నంగా ఏటా కొత్తవి తయారవుతాయి.
బలభద్ర,సుభద్ర, జగన్నాథుల కోసం వరుసగా, ఎరుపుపై నీలం రంగు, ఎరుపుపై నలుపు రంగు, ఎరుపుపై పసుపు రంగుతో భాసిల్లేలా రథాలు సిద్ధం చేస్తారు. బలభద్రుని రథం (తాళధ్వజ) 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలు, సుభద్రాదేవి రథం (పద్మధ్వజ) 43 అడుగుల ఎత్తులో 12 చక్రాలు, జగన్నాథుడి రథం (నందిఘోష్) 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలు గలిగి ఉంటాయి.
ఏటా జరిగే డోలయాత్ర,ఝాలన్ యాత్ర, దమనక ఉత్సవం, పవిత్రోత్సవం తదితర 13 ఉత్సవాలలో ఆషాఢ (శుద్ధ విదియ) మాసంలో నిర్వహించే రథోత్సవం అత్యంత విశిష్టం, ప్రపంచం లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఆరోజు ఆ మూర్తిత్రయానికి ప్రత్యేకంగా ప్రభాత పూజలు నిర్వహించి, రథంపై చేరుస్తారు. ఈ పక్రియను ‘పహాండీ’ అంటారు. సవరతెగ రాజు విశ్వావసు వారసులు మాత్రమే ఈ విగ్రహాలను రథాలపైకి చేరుస్తారు. ఇంద్య్రుమ్న మహారాజుకు ముందే విశ్వావసు రాజు జగన్నాథుడిని నీలమాధవస్వామి రూపంలో అర్చించాడని ఐతిహ్యం. పూరి మహారాజు తలపై కిరీటాన్ని తీసి నేలపై ఉంచి బంగారు చీపురుతో రథాలను శుభ్రపరచి మంచిగంధం నీటితో కడిగి, పూజాదికాలు నిర్వహించి, రథం తాడు (శంఖచూడనాథుడు) లాగడం ద్వారా యాత్రను ప్రారంభిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తజన సందోహం పోటీ పడుతుంది. రథాన్ని లాగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రథం తాడును స్పర్శించినా, పాపాలు హరించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని వారి విశ్వాసం. ఈ మూడు రథాలు సాయంత్రానికి గుడించా మందిరానికి చేరతాయి. ‘యాత్ర’లో బలభద్రుని రథం ముందు భాగంలో, దాని వెంట సోదరి సుభద్ర రథం వెళుతుంటే జగన్నాథుడి తేరు వాటిని అనుసరిస్తుంది. ఇది. చెల్లెలిని సు‘భద్రం’గా చూసుకోవాలన్న తత్త్వాన్ని బోధిస్తున్నట్లుంటుంది. గుడించా మందిరంలో పంచమినాడు జరిపే ‘హోరా’ (పంచమి) వేడుక చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. తొమ్మిది రోజుల తరువాత తిరుగు ప్రయాణం (బహుదాయాత్ర) ఘనంగా ఉంటుంది. జగన్నాత రథయాత్ర విశ్వవ్యాప్తమైంది. తొలిసారిగా 1967లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జగన్నాథ రథయాత్ర జరిగింది. వందకు పైగా ప్రపంచ సుప్రసిద్ధ నగరాలలో ఏటా రథయాత్రలు కొనగసాగు తున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పూరీ క్షేత్ర నమూనాలో జగన్నాథ ఆలయం కొలువుదీరింది.
విశిష్ట ప్రసాదం
పురుషోత్తమ క్షేత్రంలో ప్రసాదం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆధ్వర్యంలో తయారవుతుందని విశ్వాసం. జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. నిత్యం 64 రకాల పిండివంటలను కట్టెలపొయ్యిల మీద మట్టి కుండలలోనే తయారు చేస్తారు. ఒకసారి వాడిని పాత్రను మరోసారి ఉపయోగించరు. కుండమీద కుండపెట్టి అన్నం వండడం, అన్ని పాత్రలలోని పదార్థం ఒకేలా ఉడకడం విశేషమే. అన్న పసాదాన్ని ‘ఒబడా’ అంటారు. దీనితో పాటు‘శుష్క’ ప్రసాదాన్ని చేస్తారు. దైవదర్శనానికి వచ్చే వారు అక్కడ స్వీకరించేది ‘అన్న ప్రసాదం’కాగా, ఇళ్లకు తీసుకు వెళ్లేది శుష్క ప్రసాదం. దీనిని వితరణ చేసే ప్రదేశాన్ని ‘ఆనంద్ బజార్’అంటారు. మహా ప్రసాద స్వీకరణలో అంటూ సొంటూ, ‘ఎంగిలి’ ప్రసక్తే ఉండదు. ‘సర్వం జగన్నాథం’ మాట అలానే పుట్టిందంటారు.
‘జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే’
-డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్