సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి ఆషాడ శుద్ధ నవమి – 15 జూలై 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


రాజ్యాంగ ప్రతి చేతబూని రాహుల్‌గాంధీ దేశమంతా ప్రచారం పేరుతో ఊరేగుతున్నప్పుడు అది పిచ్చివాడి చేతిలో రాయిని మరిపించిందే తప్ప, ఒక మహత్తర గ్రంథమని ఎవరూ భావించలేకపోయారు. ప్రతిపక్ష నేత హోదా దక్కిన తరువాత ఆయన వైఖరి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టే ఉంది. కాంగ్రెస్‌, ఈ శతాధిక వర్షాల పార్టీకి కొన్ని స్థానాలు బిచ్చం వేస్తున్న డీఎంకే, అయోధ్యలో కరసేవకులను ఊచకోత కోసిన ఎస్‌పీ, ముఖ్యమంత్రి పదవికోసం తండ్రి హిందుత్వ బాటను నిస్సిగ్గుగా అరేబియాలో కలిపేసిన ఉద్దవ్‌ వంటి వారందరి ఏకైక కోరిక`బీజేపీని దించడం. కమలం పార్టీ ప్రజాదరణ కోల్పోతే ఆ పని చేయడానికి ఆ పార్టీలకు హక్కు ఉంది. కానీ భారతీయ జనతా పార్టీని గద్దెదించడం పేరుతో, నరేంద్ర మోదీని సాగనంపాలన్న సాకుతో ఈ దగాకోరుల ముఠా భారతదేశాన్నీ, భారతీయతనీ, మరీ ముఖ్యంగా హిందూత్వాన్ని దూషించే దుశ్చర్యకు పాల్పడుతున్నది. 18వ లోక్‌సభ తొలి సమావేశాలలో రాహుల్‌ ఊకదంపుడులో గుప్పుమన్నది ఆ దుర్గంధమే. తరువాత మోదీ సొంత రాష్ట్రానికి వెళ్లి బీజేపీని ఇక్కడా ఓడిస్తాం అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు రాహుల్‌. అంతకు ముందు ఎక్కడ ఓడిరచాడట? అయోధ్యలోనట.

ఎన్ని అబద్ధాలు! అగ్నివీర్‌ పథకం మీద అబద్ధం. అయోధ్యలో బీజేపీ ఓడిరదంటూ మరొక పెద్ద అబద్ధం. అసలు మోదీకి మెజారిటీ లేదన్నది ఇంకా నికృష్టమైన అబద్ధం. అంతకు ముందు రఫెల్‌ ఒప్పందం మీద అబద్ధాలు. జీవిత బీమా సంస్థ గురించి అబద్ధం. ఇక ఈవీఎంల మీద అబద్ధాల వెల్లువ. ఎన్నికల ఫలితాలు వెల్లడికావడానికి కొన్ని గంటల ముందు షేర్ల మతలబంటూ మరొక తలా తోకా లేని అబద్దం. ఇండీ ఓ దుష్ట గ్రహ కూటమి అనుకుంటే, రాహుల్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతను అప్పగించడం ఆధునిక రాజకీయాలలో ఆ కూటమి చేసిన అతి పెద్ద తప్పిదం. ఇవాళ కాకుంటే రేపైనా భాగస్వాములు ఇది గ్రహించక తప్పదు.

ప్రతిపక్ష నేతగా రాహుల్‌ ఇచ్చిన తొలి ఉపన్యాసం నిండా ఉన్నది హిందూ ద్వేషమే. ఆ తరువాత గుజరాత్‌ వెళ్లిన రాహుల్‌ తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని కలగలిపి ఆ రాష్ట్ర ప్రజల మీద వెదజల్లే ప్రయత్నం చేశారు. ఎన్నికలలో అయోధ్యలో బీజేపీని ఓడిరచి,  లాల్‌ కృష్ణ అడ్వాణి ప్రారంభించిన అయోధ్య ఉద్యమాన్ని అక్కడే భగ్నం చేశామనీ, ఇక నరేంద్ర మోదీని గుజరాత్‌లో మట్టి కరిపిస్తామనీ భీషణ ప్రతిజ్ఞ చేశారు. హిందువులుగా చెప్పుకునే వారంతా హింసా ప్రవృత్తితో, అసహనంతో ఊగిపోతుంటారని పార్లమెంటులో చెప్పిన మాటలకు కొనసాగింపే గుజరాత్‌ ప్రేలాపన. అయోధ్య ఉద్యమం అడ్వాణితో ఆరంభమైందని చెప్పడమే రాహుల్‌ అజ్ఞానానికి పరాకాష్ట. అది ఐదు వందల ఏళ్ల  మహోద్యమం.  అది నాగరికత పట్ల వచ్చిన స్పృహతో సాగిన పునరుజ్జీవనోద్యమం. రాహుల్‌ అనే రాజకీయ అజ్ఞానికి తెలియని వాస్తవం అయోధ్య వరకు బీజేపీ ఓడిపోలేదు. శాసనసభ ఎన్నికలలో గాని, ఫైజాబాద్‌ లోక్‌సభ పరిధిలోని భాగంగా గాని అయోధ్య ప్రజలు బీజేపీకే ఓటేశారు. పార్లమెంటులో హిందువులను అవమానించిన రాహుల్‌, అయోధ్య ఉద్యమం నాలుగు దశబ్దాల పోరాటం మాత్రమేనని జాతిని నమ్మించడానికి ప్రయత్నించి అంతకంటే పెద్ద ద్రోహానికే పాల్పడ్డారు. అయోధ్య ఉద్యమానికి, ఎన్నికల రాజకీయాలకు ఏనాడూ సంబంధం లేదు. ఇవి ఆయా ఎన్నికల ఫలితాలే వెల్లడిస్తున్నాయి.

రాహుల్‌ దివాంధుడు. రెండు మూడు నాలుకలు ఉన్నవాడు. మణిపూర్‌ గొడవల గురించి పదే పదే ఊదరగొట్టే ఈ నాయకుడు పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసాకాండ గురించి మాట్లాడలేదు. అక్కడి హింసా రాజకీయాల గురించి సొంత పార్టీ వారే ఘోష పెడుతున్నా రాహుల్‌కు వినపడలేదు. తమిళనాడులో కల్తీ సారా కాటుకు నిన్న మొన్న 65 మంది చనిపోయిన వార్త  ఆయన దాకా రాలేదు. హథ్రాస్‌లో ఓ దొంగబాబా వికృతచేష్టలకు 125 చనిపోతే అక్కడికి హుటాహుటిన వెళ్లారు. తమిళనాడులో కంటే ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ దుర్ఘటన మృతులు ఎక్కువ కదా అని రాహుల్‌ అభిమానులు ప్రశ్నించవచ్చు.  కారణం అదికాదు. కల్తీ సారా కరాళ నృత్యం చేసినది  నాలుగు సీట్లు బిచ్చంవేసే పార్టీ ఏలుతున్న తమిళనాడులో. 125 మంది చనిపోయినది బీజేపీ పాలిత రాష్ట్రంలో.

కేవలం బెయిల్‌ మీద స్వేచ్ఛా ప్రపంచంలో సంచరిస్తున్న రాహుల్‌కి ఇంతింత మాటలు అవసరమా? ఇంత చెలరేగిపోవాలా? 400కు పైగా లోక్‌సభ స్థానాలలో పోటీచేసి 99 స్థానాలకు పరిమితమైన అంగుష్టమాత్రుడికి ఈ నేల విడిచిన సాము వాంఛనీయమా? నేషనల్‌ హెరాల్డ్‌ కేసు  మొత్తం గాంధీ`నెహ్రూ కుటుంబం నెత్తి మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు వేసిన పరువునష్టం కేసులు ఈ రాజకీయ అజ్ఞానిని, అబద్ధాల పుట్టని ఏ క్షణంలో అయినా కటకటాల వెనక్కి గెంటవచ్చునన్నది సత్యమే. వీటి భయంతోనే రాహుల్‌ ఇంతగా చెలరేగి మాట్లాడుతున్నారన్న మాట కూడా కొట్టివేయలేనిదే. ఆధునిక రాజకీయ రంగంలో రాహుల్‌ ఏ మాత్రం నైతిక విలువలు లేని వ్యక్తి. ఆయన  ఎన్నికల ముందు ‘జన్యుధారి హిందువు’. భారత్‌ను ఆగర్భశత్రువుగా చూసే చైనాతో రహస్య సంబంధాలు నెరిపే ఈ వ్యక్తిని ఏ పేరుతో పిలవాలి? మోదీకి నమస్కరించినప్పుడు వంగిన మీరు, నా ముందు ఎందుకు వంగలేదని లోక్‌సభ స్పీకర్‌ను ఉద్దేశించి సభలో పేలిన ఈ వ్యక్తి అహంకారాన్ని ఎవరు అంచనా వేయగలరు? అయినా రాహుల్‌లో హఠాత్తుగా పెల్లుబుకిన ఈ ‘పరిణతి’ని దర్శించి పొంగిపోతున్న మేధావులు కోకొల్లలు. ముమ్మాటికీ రాహుల్‌ స్థానం పార్లమెంటు కాదు. చట్టం నిర్దేశించిన చోటకే. తనకోసం మొత్తం అన్ని వ్యవస్థలను భష్ట్రు పట్టించడానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తిని సభ్య ప్రపంచం భరించడం అవసరమా?

About Author

By editor

Twitter
YOUTUBE