‘గురువు’ అంటే అంధకారంలోంచి వెలుగులోకి నడిపించేవాడన్నది హిందువులలోని సాధారణ అవగాహన. అందుకే, భగవంతుడికి కోపం వచ్చినా పర్లేదు కానీ, గురువుకు వస్తే కష్టమని హిందువులు విశ్వసిస్తారు. గురు ఆశీర్వచనం ఉంటే, తిరుగుండదని కూడా నమ్మకం. ఇటువంటి నమ్మకాలే అమాయక ప్రజలు బాబాల చుట్టూ తిరిగేలా చేస్తుంటాయి. హథ్రాస్‌లో జరిగింది కూడా అదే. తమను ఉద్ధరిస్తాడని భావించి, తమ గురువు సత్సంగానికి పోటెత్తిన భక్తులలో 121మంది కైలాసానికి చేరుకున్నారు. ‘భోలే బాబా’ అనే గురువు పాద ధూళి కోసం మహిళలు పోటీపడి తోసుకోవడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, కొంచెం లోతుగా తొంగి చూస్తే ఈ ఘటనలో పలు కోణాలు కనిపిస్తాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో జులై 2న జరిగిన ఒక పూజా కార్యక్రమానికి భక్తులు హాజరైన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివపూజ కోసం ఈ కార్యక్రమాన్ని రతిభన్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. సత్సంగం, పూజ పూర్తి అయిన వెంటనే బాబా బయలుదేరి వెళ్లడంతో ఆయన పాదధూళి కోసం భక్తులు విరగబడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అలా బయలుదేరి వెళ్లిన బాబా జాడలు నాలుగురోజులు తెలియలేదు. జాటవ సమాజ దళితులలో అత్యంత ప్రాచుర్యం పొందిన గురువుగా భోలే బాబా పేరు సంపాదించుకున్నారు. ఆయన సత్సంగమంటే భక్తులు పోటెత్తుతారు. ఆ రోజు కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన బాబా సంస్థవారు ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి తీసుకునే సందర్భంలో 80వేల మంది వస్తారని అందుకు తగిన అనుమతి తీసుకున్నారు. కాగా, సమయానికి రెండు లక్షలకు పైగా ప్రజలు అక్కడకు చేరుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే సిట్ దర్యాప్తుకు ఆదేశించి, 24 గంటలలోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్లమెంటులో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ కూడా తన ప్రసంగాన్ని నిలిపివేసి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియచేసి, అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో బాబా పేరు లేకపోవడాన్ని పలువురు ఎత్తి చూపుతున్నారు. అఖిలేష్ యాదవ్ వంటి రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వల్లనే వారు ఇలా తప్పించుకుంటున్నారనే విమర్శలూ వస్తున్నాయి.
కార్యక్రమానికి అనుకున్న సంఖ్యకు మించి జనాలను అనుమతించడమే ఈ పరిస్థితికి దారితీసిందని ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్ బృందం స్పష్టం చేసింది. కేవలం 80వేల మంది కోసం అనుమతి తీసుకున్న బాబా యంత్రాంగం దాదాపు రెండు లక్షల మందిని అనుమతించిందని కూడా నివేదిక పేర్కొంది. విడిగా, అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి బ్రిజేష్‌కుమార్ శ్రీవాస్తవ, రిటైర్డు ఐపీఎస్ అధికారి హేమంత రావు అధ్యక్షతన న్యాయకమిషన్ దర్యాప్తు చేసింది. గత ఆదివారం, వారు స్థానికులను, ప్రజలను, అధికారు లను, ఈ దుర్ఘటనకు సంబంధించిన సాక్షులను కలుసుకొని సమాచారం సేకరించారు.
ప్రతి ఏడాదీ దేశంలో పలు ఉత్సవాలు జరుగుతుంటాయి. కానీ ప్రతిసారీ ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవు. అందుకు కారణం ప్రభుత్వ జిల్లా యంత్రాంగం రానున్న జనాభాను అంచనా వేసుకొని, ఆ మేరకు ఏర్పాట్లకు అనుమతి ఇస్తారు. ఇక్కడ అంచనా తప్పు కావడం, అనూహ్యంగా వచ్చిన వచ్చిన జనాన్ని నియంత్రిం చేందుకు బాబా మనుషుల శక్తి చాలకపోవడం, వారి అలసత్వమే ఈ ఘటనకు కారణమయ్యాయి.
బాబాపై ఆరోపణలు
నారాయణ సాకార్ హరి ఉరుఫ్ సూరజ్ పాల్ ఉరుఫ్ భోలేబాబా సరిగ్గా ఇరవై నాలుగేళ్లకిందట మరణించిన ఒక 15 ఏళ్ల యువతిని తిరిగి బతికిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదును అనుసరించి నాటి ఆగ్రా పోలీసులు అతడిని అరెస్టు చేశారట. ఈ విషయాలు నాటి రిటైర్డ్ డిఎస్పీ తేజ్‌వీర్ సింగ్ వార్తా పత్రికలకు వెల్లడించ డంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అలాగే, భోలేబాబా పోలీసు విభాగంలోనే పని చేశాడని, తర్వాత సస్పెండ్ అయ్యాడనే వార్తలూ వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ, అనంతరకాలంలో ‘భోలేబాబా’ పేరుతో ఉత్తరప్రదేశ్‌లో ప్రాచుర్యం పొంది, పెద్ద ఆశ్రమాన్ని నెలకొల్పాడు.
విషం చల్లారు, బాబా న్యాయవాది ఆరోపణ
ఈ దుర్ఘటన వెనకాల కుట్ర ఉందని భోలేబాబా న్యాయవాది ఏపీ సింగ్ ఆరోపిస్తున్నాడు. తాము సత్సంగానికి అనుమతి తీసుకున్నామని, అనుమతి పత్రంలో మ్యాప్‌ను కూడా జోడించారని ఆయన అంటున్నాడు. బాబాకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, విషాన్ని ఆ సమయంలో ఎవరో స్ప్రే చేయడం వల్లనే మహిళలు పడిపోయి, మరణించారని ఆయన ఆరోపించాడు. సుమారు 15-16మంది వ్యక్తులు ఈ కుట్రలో జోక్యాన్ని కలిగి ఉన్నారని, అందులో 10-12మంది విషాన్ని స్ప్రే చేశారని ఆయన ఆరోపించాడు. చాలామంది సాక్షులు మహిళలు పడిపోవడాన్ని చూశామని, అనేకమంది ఊపిరందక మరణించారని చెప్తున్నారని ఆయన అన్నాడు. తొక్కిసలాట జరుగుతున్న సమయంలో కొన్ని, గుర్తు తెలియని వాహనాలు అక్కడ ఉన్నాయని, తర్వాత మాయమయ్యాయని కూడా ఆరోపించాడు. ఈ ప్రాంగణంలోని సిసిటివి ఫుటేజ్‌ను తక్షణమే స్వాధీనం చేసుకుంటే, వాహనాలను గుర్తించవచ్చని ఆయన పేర్కొన్నాడు.
ప్రధాన నిందితుడి అరెస్టు
కాగా, కీలక నిందితుడైన దేవప్రకాష్ మధుకర్ సహా ఇద్దరు వ్యక్తులను ఈ ఘటనకు సంబంధించి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. పోలీసుల సమాచారం ప్రకారం మధుకర్ బాబా కార్యక్రమాలకు నిధులను సేకరిస్తుండేవాడు.
మౌనం వీడిన భోలేబాబా
దుర్ఘటన జరిగిన నాలుగురోజుల తర్వాత భోలేబాబా తన మౌనాన్ని వీడారు. ఆ భగవంతుడి పైన, జిల్లా యంత్రాంగంపైనా నమ్మకం ఉంచమని ఆయన తన సందేశమిచ్చాడు. ఈ బాధను భరిం చేందుకు మనకు ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని, ప్రభుత్వం, అధికారు లపై నమ్మకముంచమనీ ఓదార్చాడు. ఈ గందర గోళాన్ని సృష్టించినవారెవరినీ విడిచిపెట్టరనే నమ్మకం తనకుందంటూ బాబా విశ్వాసం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవ వలసిందిగా తాను కమిటీ సభ్యులను కోరానని కూడా వెల్లడిం చాడు.
రాజకీయ నాయకుల హడావిడి
భోలేబాబా భక్తులలో ప్రధానంగా జాటవ సమాజానికి చెందినవారు ఎక్కువ. వారు ఉత్తర ప్రదేశ్‌లో ప్రధానమైన ఓటు బ్యాంకు. మొన్నమొన్నటి వరకూ బీఎస్పీకి ప్రధాన ఓటుబ్యాంకుగా ఉన్నవారు హఠాత్తుగా భోలేబాబా సత్సంగానికి వెళ్లి ఆయనకు సన్నిహితుడనన్నట్టు వ్యవహరించిన అఖిలేష్ పార్టీకి ఓట్లు వేసి, యుపిలో గెలిపించారు. ఇప్పుడు ఈ విషాదంలో కూడా ఓట్లు ఏరుకునేందుకు రాహుల్ గాంధీ బయలుదేరి వెళ్లాడు. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా అది అతడి బాధ్యత కూడా. ఈ విషయాన్ని రాజకీయం చేయనని చెప్తూనే, వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, ఆ నిరుపేద కుటుంబాలకు మరింత నష్టపరిహారాన్ని, త్వరితగతిన ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఆధునిక బాబాల విషయంలో రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉంటారు. శంకరాచార్యుల వంటి ప్రాచీన మఠాలకు చెందిన ఆచార్యులకు కాకుండా ఇటువంటి గురువులకు అండదండలుగా ఉంటూ క్విడ్ ప్రో కో అన్నట్టుగా ఓట్లను, నోట్లను లేదా రక్షణను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ప్రతి ఆధునిక గురువు మోసగాడు అని గట్టిగా చెప్పలేం కానీ, వెలుగులోకి వచ్చే అనేకానేక ఘటనలు దానినే సూచిస్తుంటాయి. ఏమైనప్పటికీ, హిందూ ధర్మంలో గురువులకు ఉన్న ప్రాముఖ్యత కారణంగానే గురువునని చెప్పుకున్న ప్రతివారికీ గౌరవం దక్కుతోంది.
భారతదేశంలో అత్యంత ఘోరమైనదానిగా ప్రస్తుత ఘటనను మనం భావిస్తున్నప్పటికీ, ఆధునిక చరిత్ర ఇటువంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. అవేమిటో చూద్దాం –
దక్షిణ కొరియా, సియోల్ 2022
ఆ ఏడాది వచ్చిన హాలోవీన్ పండుగనాటి రాత్రి దాదాపు లక్షమంది ప్రజ లు సియోల్ నగరంలోని ఇటవాన్ ప్రాంతంలోని ఇరుకు సందుల్లో గుమిగూడారు. ఆ ఇరుకు ప్రదేశంలోకి జనాలు ప్రవాహంలా చొచ్చుకువస్తుం డడంతో తొక్కిసలాట జరిగి, 158మంది మరణించగా, 500మంది గాయ పడ్డారు.
వైష్ణోదేవి ఆలయం-2022
2022 నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మాతా వైష్ణోదేవి ఆలయానికి ఆశీర్వచనంకోసం రావడంతో తొక్కిసలాట జరిగింది. అధికారిక నివేదికల ప్రకారం, పెద్ద సంఖ్యలో భక్తులు రావడం మొదలయ్యేసరికి ఈ ఘటన చోటు చేసు కుంది. దాదాపు 12మంది ఈ ఘటనలో మర ణించగా, 14మంది గాయపడ్డారు.
మక్కాలోని హజ్‌లో ఘటన -2015
సెప్టెంబర్ 2015లో మక్కాలో దాదాపు పది నిమిషాలపాటు సాగిన తొక్కిసలాటలో దాదాపు 2,411 యాత్రికులు మరణించినట్టు వార్తలు వచ్చారు. ఈ లెక్కలు సౌదీ అరేబియా విడుదల చేసిన గణాంకాలకన్నా మూడు రెట్లు ఎక్కువ. ఈ తొక్కిసలాట తర్వాత వందలాదిమంది యాత్రికులు కనిపించకుండాపోయారు. అధికారిక నివేదిక ప్రకారం, రెండు వైపుల నుంచి వస్తున్న భక్తులు ఒక సన్నటి రోడ్డు వద్ద కలవడంతో మొదలైంది. తాము జనాన్ని నియంత్రించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, బిలియన్లు దానికోసం ఖర్చు పెట్టినా అంత పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రిం చడం అధికారులకు కష్టమైంది. మరణించినవారిలో 120మంది భారత్‌కు చెందినవారు.
ఆంధప్రదేశ్‌లో గోదావరి పుష్కరాలు-2015
గోదావరి నది ఒడ్డున జరిగిన మహాపుష్కరాల సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 29మంది ప్రాణాలు కోల్పోగా, 60మంది గాయపడ్డారు. రాజమండ్రిలో ఉదయం 8 గంటలకు రాష్ట్రముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు గోదావరిలో పుణ్యస్నానమాచరించిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. తమ చెప్పులను వెతుక్కుంటున్న భక్తులపై జనం వచ్చి పడడంతో తొక్కిసలాట జరిగిందని వార్తలు చెప్తున్నాయి. వేలమంది ప్రజలు నదిలో స్నానం చేసుకునేందుకు ముందుకు తోసుకువెళ్లారు.
రతన్‌గఢ్ ఆలయం, మధ్యప్రదేశ్ -2013
నవరాత్రి పండుగ సందర్భంగా ఎంపీలోని దతియా జిల్లాలోని రతన్‌గఢ్ ఆలయంలో దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు తోసుకోవడంతో ఏర్పడిన తొక్కిసలాటలో 111మంది ప్రాణాలు కోల్పోగా, 100మంది గాయపడ్డారు. భక్తులు నడుస్తున్న బ్రిడ్జి కూలిపోబోతోందంటూ వదంతులు రావడంతో భక్తులు తోసుకున్నారు.
తొక్కిసలాటలు ఎందుకు జరుగుతాయి?
చిన్న స్థలంలో లెక్కకు మించిన ప్రజలు ఉన్నప్పుడు ప్రధానంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రాంగణాన్ని మించి జనం వచ్చి నప్పుడు అది ప్రమాదకర పరిస్థితులకు దారి తీయవచ్చు. అదనంగా సరైన ప్రణాళిక లేకపోవడం, జనాన్ని నియంత్రించలేకపోవడం సమస్యను రెట్టింపు చేస్తాయి. అలాగే, పెద్ద శబ్దం, అనూహ్యమైన ఘటన, వదంతులు ప్రజలు హఠాత్తుగా కదిలేందుకు కారణమై తొక్కిసలాటకు దారి తీస్తాయి. హథ్రాస్‌లో జరిగిన ఘటనలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆయన పాదధూళి సేకరించేందుకు చొచ్చుకురావడంవల్ల జరిగిందనేది అర్థమవుతోంది. భద్రతా సిబ్బంది వారు బాబా దగ్గరకు వెళ్ళకుండా అడ్డుకోవడంతో జనం ఒకరిపై ఒకరు పడిపోవడం, జనాలు ఆ ఉన్మాదంలో వారిపై నుంచే వెళ్లడంవంటి కారణాల వల్ల ఈ ఘటన జరిగింది. కాగా, పాలనా యంత్రాంగం, పోలీసుల నుంచి తక్షణ స్పందన లేకపోవడంవల్ల కూడా ఇటువంటివి పెద్దవి అవుతాయి.
– జాగృతి డెస్క్