ఇం‌గ్లండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నది. 14 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బ్రిటన్‌ ‌లేబర్‌ ‌పార్టీ జూలై 4న జరిగిన సాధారణ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఆ పార్టీ నాయకుడు కీర్‌ ‌స్టార్మర్‌ ‌నూతన ప్రధాని కాబోతున్నారు. జూలై 6న ఫలితాలు వెలువడినాయి. బ్రిటిష్‌ ‌పార్లమెంటులో దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్‌లో 650 స్థానాలు ఉండగా, అందులో లేబర్‌ ‌పార్టీ 411 స్థానాలలో విజయం సాధించింది. ఇది ఆ పార్టీ ఘన విజయమే. 2019 ఎన్నికలలో 209 స్థానాలకు లేబర్‌ ‌పార్టీ పరిమితమైంది. అంటే రెట్టింపు స్థానాలతో విజయం మూటగట్టుకుంది. 2019 ఎన్నికలలో 365 స్థానాలు సాధించిన కన్సర్వేటివ్‌ ‌పార్టీ ఈ సారి 121 స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పుడు బోరిస్‌ ‌జాన్సన్‌ ‌నాయకత్వంలో ఈ విజయం సాధ్యమైంది. లిబరల్‌ ‌డెమోక్రాట్స్ 72, ‌స్కాటిష్‌ ‌నేషనల్‌ ‌పార్టీ 9 సీట్లు గెలుచుకున్నాయి. రిఫార్మ్ ‌యూకే అనే పార్టీ ఐదు స్థానాలు గెలుచుకుంది. నిజానికి ఈ ఎన్నికలలో చిన్న చిన్న పార్టీలు తమ ఉనికిని బాగా చాటుకోగలిగాయి.
650 స్థానాలు కలిగిన ఇంగ్లండ్‌ ‌పార్లమెంట్‌ ‌దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్‌కు జూలై మొదటి వారంలో ఎన్నికలు జరిగాయి. జూలై 4న ఎన్నికలు నిర్వహించమని తాను ఇంగ్లండ్‌ ‌రాజుకు సిఫారసు చేశానని మే 22, 2024న రుషి శునాక్‌ ‌చెప్పగానే సొంత పార్టీ ఎంపీలే విస్తుపోయారట. అంత ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం అయి ఉండవచ్చు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని తాను విశ్వసించినందువల్లనే ఈ నిర్ణయానికి వచ్చానని ఆయన చెప్పారు. నిజానికి ఈ డిసెంబర్‌ ‌వరకు కన్సర్వేటివ్‌ ‌పార్టీ ప్రభుత్వానికి గడువు ఉంది. అయినా శునాక్‌ ‌ముందస్తు ఎన్నికలకు ప్రాధాన్యం ఇచ్చారు.
మొదటి నుంచి కన్సర్వేటివ్‌ ‌పార్టీ ఓడిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. సర్వేలన్నీ కూడా లేబర్‌ ‌పార్టీకే సానుకూల వాతావరణం ఉందని తేల్చి చెప్పాయి. ఫలితాలు అలాగే వచ్చాయి. దిగువ సభ ఎన్నికలు బలహీనపడిన, ఏకాభిప్రాయం లేని నాయకత్వంలోని కన్సర్వేటివ్‌ ‌పార్టీకీ, 14 తరువాత విజృంభిస్తున్న లేబర్‌ ‌పార్టీకీ నడుమ జరుగుతున్న ఎన్నికలని ఆ సర్వేలు ఆనాడే తేల్చేశాయి. ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య రక్షణ, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వలసలు, గృహవసతి, విద్యుత్‌ ‌వంటి అంశాలే ఈ ఎన్నికలలో కీలక ప్రచారాంశాలుగా ఉన్నాయి. కన్సర్వేటివ్‌ ‌పార్టీ తరఫున రుషి శునారఖ లేబర్‌ ‌పార్టీ సుంకం విధానం మీద ఎక్కువ విమర్శలు గుప్పించారు. లేబర్‌ ‌పార్టీ నాయకుడు స్టార్మర్‌ ‌మాత్రం ‘మార్పు’ అన్న అంశాన్నే ఎక్కువ ప్రచారం చేశారు. దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లే, ఆర్థికంగా బలోపేతం చేసే శ్రామికల శ్రేయస్సుకే తమ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఆయన చెప్పారు. నిజానికి నాలుగైదు సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇంగ్లండ్‌ను రక్షిస్తామని, ఆర్థిక స్థిరత్వం కల్పిస్తామని కూడా స్టార్మర్‌ ‌హామీ ఇచ్చారు. దేశ ప్రయోనాలకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. లిబరల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ నాయకుడు ఎడ్‌ ‌డేవి మాత్రం ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నా ఫలితాలు సాధించలేకపోయారు.
యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌నుంచి ఇంగ్లండ్‌ ‌వైదొలగడం (బ్రెగ్జిట్‌) అం‌శం దగ్గర కన్సర్వేటివ్‌ ‌పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోవడం మొదలుపెట్టింది. ఆ వివాదం మొదలైన తరువాత ప్రధాని పదవి చేపట్టిన వారంతా అపఖ్యాతితోనే పదవి నుంచి వైదొలిగారు. అయితే శునాక్‌ ఇం‌దులో కొంచెం మినహాయింపు గానే భావించవచ్చు. మిగిలిన వారికంటే ఆయన కొంచెం ఎక్కువ కాలమే పదవిని నిర్వహించగలిగారు. డేవిడ్‌ ‌కామెరూన్‌ ‌దగ్గర మొదలైన ప్రధానుల పదవీచ్యుతి వ్యవహారం థెరిసా మే, బోరిస్‌ ‌జాన్సన్‌, ‌లిజ్‌ ‌ట్రస్‌, ‌చివరకు శూనక్‌ ‌వరకు సాగింది. 2022లో శునాక్‌ ఆ ‌పదవిని స్వీకరించారు. 2024 ఎన్నికల ద్వారా ఆంగ్లేయులు కన్సర్వేటివ్‌ ‌పార్టీని నిరాకరించిన మాట వాస్తవం. ఇందులో కొంచెం బాధ కలిగించే విషయం, భారతీయ సంతతికి చెందిన రుషి శునాక్‌ ‌ప్రధానిగా కొనసాగే అవకాశం కోల్పోయారు. పాత సభలోని 300 మంది తిరిగి ఎన్నికయ్యారు. 335మంది తొలిసారి సభలో అడుగు పెడుతున్నారు. బ్రిటన్‌ ‌నుంచి అమెరికా స్వాతంత్య్ర తెచ్చుకున్న రోజునే ఈసారి పోలింగ్‌ ‌జరిగింది.
దాదాపు ఒకటిన్నర దశాబ్దం తరువాత లేబర్‌ ‌పార్టీ అధికారం చేపడుతున్నది. ఆ పార్టీ తరఫున అధికారం చేపట్టబోతున్న కొత్త ప్రధాని కీర్‌ ‌స్టార్మర్‌ ఎదుర్కొనవలసిన తొలి సవాలు ఏమిటి? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సంధిస్తున్నారు. తాము అధికారంలో ఉండగా భారత్‌తో బెడిసికొట్టిన సంబంధాలను పునరుద్ధరించుకోవడమేనన్నది ఆ ప్రశ్నకు ఇప్పుడు వినిపిస్తున్న సమాధానం. స్టార్మర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్‌ ‌పార్టీకశ్మీర్‌ అం‌శంలో గతంలో చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీకీ, భారత్‌కీ మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. గతంలో కశ్మీర్‌ ‌వివాదంపై ఆ పార్టీ అనుసరించిన విధానంతో, చేసిన ప్రకటనలతో తరచు భారత్‌ ఆ‌గ్రహానికి గురయ్యేది. నిజానికి లేబర్‌ ‌పార్టీయే కాదు, అక్కడ ఇంకొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా కశ్మీర్‌ అం‌శంలో భారత్‌కు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసేవి. కశ్మీర్‌ ‌లోయలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగి పోతోందని గగ్గోలు పెట్టేవి. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం మాత్రం కశ్మీర్‌ ‌వివాదం భారత్‌- ‌పాకిస్తాన్‌ల నడుమ ద్వైపాక్షిక సమస్యగా మాత్రమే భావించేది. కానీ ఈ అభిప్రాయంతో లేబర్‌ ‌పార్టీ విభేదించేది. 2019 సెప్టెంబర్‌లో లేబర్‌ ‌పార్టీ ప్రవేశపెట్టిన అత్యవసర తీర్మానం ఆ పార్టీ అన్ని హద్దులను అతిక్రమించే టట్టుగా ఉంటుంది. జెర్మి కొర్బన్‌ ‌నాయకత్వంలో ఆ సంవత్సరం పార్టీ ఆ తీర్మానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కశ్మీర్‌ ‌వివాదం పరిష్కారానికి ఒక అంతర్జాతీయ పరిశీలకుడిని అనుమతించాలి. అలాగే అక్కడి ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. ఇరు దేశాలు అణ్వస్త్రాలు కలిగి ఉన్నందున భారత్‌, ‌పాక్‌ ‌హైకమిషనర్లు ఇద్దరు సమావేశమై శాంతి స్థాపనకు కృషి చేయాలని కూడా కొర్బన్‌ ‌సూచించాడు. ఇలాంటి వాదన, సూచన కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని అప్పట్లో భారత్‌ ‌కొట్టి పారేసింది. కొర్బన్‌ ‌నాయకత్వంలో నడుస్తున్న లేబర్‌ ‌పార్టీకి విషయాలు ఏమాత్రం తెలియవని కూడా భారత్‌ ‌తీవ్ర స్థాయిలోనే తిప్పికొట్టింది. నిజానికి ఈ తీర్మానం పట్ల లేబర్‌ ‌పార్టీలోనే ఉన్న భారతీయ సంతతి ఎంపీలు కూడా సానుకూలంగా లేరు. అది భారత వ్యతిరేక వైఖరి అని వారికీ తెలుసు. ఈ ద్వైదీభావంలో వారు కొట్టుమిట్టాడారు. చాలా చిత్రంగా, కశ్మీర్‌ ‌మీద అతడు ప్రవేశపెట్టిన తీర్మానం కారణం కాకపోయినా, 2020లోనే కొర్బన్‌ను లేబర్‌ ‌పార్టీ బహిష్కరించింది. యూదు వ్యతిరేకత అంశం మీద వచ్చిన వివాదమే అందుకు కారణం. కొర్బన్‌ ‌స్థానాన్ని భర్తీ చేసిన వారే స్టార్మర్‌.
అయితే ఇప్పుడు లేబర్‌ ‌పార్టీ కశ్మీర్‌ ‌మీద తన వైఖరిని సడలించుకుంది. ఇందుకు కారణం, శరవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ఇంగ్లండ్‌కు సత్సంబంధాలు అత్యవసరమని లేబర్‌ ‌పార్టీ భావిస్తున్నది. అందుకే గతంలో తన పార్టీ చేసిన తప్పిదాలను సవరించే పనిని ఆయన ఆరంభించారు. నిజానికి ఈ ఎన్నికలలో లేబర్‌ ‌పార్టీ తన మేనిఫెస్టోలో సైతం భారత్‌తో సత్సంబంధాలు వాంఛనీయమన్న వైఖరినే ప్రకటించింది. అంతేకాదు, వాణిజ్య ఒప్పందాలు చేసుకోవలసిన అవసరమే కాకుండా, కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. తన ఎన్నికల ప్రచారంలో భారత సంతతికి చెందిన వారిని కలుసుకున్నప్పుడే స్టార్మర్‌ ‌మారిన పార్టీ వైఖరి గురించి స్పష్టం చేశారు. కశ్మీర్‌ ‌వివాదం భారత్‌ అం‌తర్గత సమస్య మాత్రమే నని, పాకిస్తాన్‌తో కలసి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగ పరిధిలోని ఏ అంశం మీదనైనా భారత పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. కశ్మీర్‌ ‌కూడా ద్వైపాక్షిక సమస్య కాబట్టి ఆ ఇరు దేశాల వారు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అని ఆయన భారత ‘లేబర్‌ ‌ఫ్రెండ్స్’‌తో పేర్కొన్నారు. నిజానికి స్టార్మర్‌ ‌ప్రచార సరళి పూర్తిగా భారత అనుకూల ధోరణిలోనే ఉంది. భారతీయుల మనసు గెలుచుకునే ప్రయత్నమే అందులో కనిపించింది. ఆయన హిందూఫోబియా (హిందువుల పట్ల వ్యతిరేకత)ను ఖండించారు. హిందువుల ప్రధాన పండుగలు దీపావళి, హోళీ వంటివి ఇక్కడా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
లేబర్‌ ‌పార్టీ ప్రకటించిన కొత్త విధానం ఆసియా ఖండంలోనే కొత్త శకానికి తెర తీస్తుంది. కశ్మీర్‌ ‌ద్వైపాక్షిక అంశం అన్న ప్రకటనతో పాకిస్తాన్‌కు పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టే. చాలా దేశాలు ఇప్పుడు కశ్మీర్‌ ‌వివాదం మీద భారత్‌కు అనుకూల వైఖరితోనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్‌కు బాధ కలిగించే అంశం సహజంగానే చైనాకూ బాధ కలిగించేది అవుతుంది. లేబర్‌ ‌పార్టీలో వచ్చిన మార్పు చైనాకు కూడా మింగుడు పడేది కాదు. అసలు దక్షిణ ఆసియా కల్లోలానికి కశ్మీర్‌ ‌వివాదం ఒక కారణం. ఆ వివాదం విషయంలో తన వైఖరినే మార్చుకున్నట్టు లేబర్‌ ‌పార్టీ ప్రకటిం చింది. కాబట్టి ఐక్య రాజ్య సమితిలో కూడా ఇందుకు సంబంధించి ప్రతిధ్వనులు వినిపిస్తాయి.
లేబర్‌ ‌పార్టీ ఒక దశాబ్దకాలంగా అధికారానికి దూరంగా ఉంది. ఇంతలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త వాస్తవాలు ప్రపంచ ప్రజా నీకాన్ని ఆలోచింప చేశాయి. ఆ క్రమంలోనే లేబర్‌ ‌పార్టీ తన విదేశాంగ విధానంలో కూడా మార్పులు తెచ్చుకుంటున్నది. దానికే పురోగమన వాస్తవికత అన్న పేరు. ప్రపంచ సమస్యలను పరిగణనలోనికి తీసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవడమే ఈ విధానం ధ్యేయం. ఇందులో వాతావరణ మార్పులు, అంతర్జా తీయ భద్రత అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. భారత్‌తో తమ వ్యూహాత్మక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో కూడా లేబర్‌ ‌పార్టీ మేనిఫెస్టో వెల్లడించింది. వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక పరిజ్ఞానంలో సహకారం, భద్రత, విద్య, పర్యావరణ అంశాలు ఉండబోతున్నాయి.
రుషి శునాక్‌ ఒక క్లిష్ట సమయంలో ఇంగ్లండ్‌ ‌ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన భారత్‌తో సత్సంబంధాలు నెరపడం సహజ విషయం. ఇంగ్లండ్‌ ‌పౌరుడే అయినా, శునాక్‌ ‌భారతీయ మూలాలను విస్మరించలేదు. సరికదా, హిందువుగా జీవించడానికీ, తాను హిందువుననీ సగర్వంగా ప్రకటించుకోవడానికీ కూడా ఆయన వెనుకాడలేదు. కొత్త సహస్రాబ్దిలో భారత్‌ ‌పట్ల వైఖరిని మార్చుకున్న దేశాలలో అమెరికాతో పాటు ఇంగ్లండ్‌ ‌కూడా ఉందనే అనుకోవాలి. ప్రధానంగా ఉగ్రవాదం మీద పోరులో మొదట అమెరికా, తరువాత ఇంగ్లండ్‌ ‌భారత్‌ అవసరాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించాయి. లేబర్‌ ‌పార్టీ ఇప్పుడు కశ్మీర్‌ ‌గురించి కొద్దిపాటి సంయమనంతో మాట్లాడుతున్నదంటే, 1947 నాటి విభజన విషాదం పట్ల కొత్త దృష్టిని ఏర్పరుచుకుని ఉండాలి. సెరిల్‌ ‌రాడ్‌క్లిఫ్‌ ‌చేత ఆదరాబాదరా చేయించిన దేశ విభజనవల్ల ఐదు లక్షలమంది ప్రాణాలు కోల్పో యారు. మరొక పదిలక్షల మంది నిరాశ్రయు లయ్యారు. ఆ గాయాలు భారత్‌ను ఇప్పటికీ పట్టి పీడిస్తున్నాయి. నిజానికి విభజన దుష్ఫలితమే కశ్మీర్‌ ‌సమస్య కూడా.

– జాగృతి డెస్క్


‌బ్రిటన్‌ ‌సభలో భారతీయులు

రద్దయిన ఇంగ్లండ్‌ ‌దిగువ సభలో భారతీయుల సంఖ్య 15. ఈ ఎన్నికలలో 107 మంది భారత సంతతికి చెందిన వారు బరిలో దిగారు. టోరీ లేదా కన్సర్వేటివ్‌ ‌పార్టీ నుంచి రుషి శునాక్‌ (‌రిచ్‌మండ్‌/‌నార్తాల్‌లెర్టన్‌), ‌ప్రీతి పటేల్‌ (ఎస్సెక్స్‌లోని విథామ్‌), ‌సూయెల్లా బ్రవెర్మెన్‌ (‌ఫారేహమ్‌/‌వాటర్‌లూవిల్‌), ‌డాక్టర్‌ ‌నీల్‌ ‌శాస్త్రి హర్సట్ (‌సోలిహల్‌ ‌వెస్ట్ /‌షిర్లే), డాక్టర్‌ ‌రేవా గుడి (ఫెల్తామ్‌/‌హెస్టన్‌), ‌నూపుర్‌ ‌మజుందార్‌ (‌లువిషామ్‌ ‌నార్త్), ఎరిక్‌ ‌సుకుమారన్‌ (‌సౌత్‌గేట్‌/ఉడ్‌‌గ్రీన్‌), ‌శివానీ రాజా (లీసెస్టర్‌ ఈస్ట్) ‌పోటీ చేశారు. లేబర్‌ ‌పార్టీ నుంచి ప్రీత్‌ ‌కౌర్‌ ‌గిల్‌ (‌బ్రిమ్మింగ్‌హ్యామ్‌ ఎడ్జ్‌బాస్టన్‌), ‌తన్మన్‌జిత్‌ ‌సింగ్‌ ‌దేశి (స్లౌ), లీసా నాండీ (వీగన్‌), ‌సీమా మల్హోత్రా (ఫాల్తెమ్‌ ‌హెస్టన్‌), ‌గురిందర్‌ ‌సింగ్‌ ‌జోసాన్‌ (‌స్మెత్విక్‌), ‌కనిష్కనారాయణ్‌ (‌వేల్‌ ఆఫ్‌ ‌గ్లామోర్గాన్‌), ‌సోనియా కుమార్‌ (‌డడ్లి) లతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా భారతీయులు బరిలో దిగారు. వీరిలో రుషి శునాక్‌, ‌శివానీ రాజా, కనిష్కనారాయణ్‌, ‌సుయెల్లా బ్రవెర్మెన్‌, ‌ప్రీత్‌కౌర్‌ ‌గిల్‌, ‌ప్రీతీ పటేల్‌, ‌గగన్‌ ‌మహేంద్ర, నవేందు మిశ్రా, లీసా నంది, తన్మన్‌జిత్‌ ‌సింగ్‌ ‌దేశీ గెలిచి సభలో అడుగు పెట్టబోతున్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE