జూన్‌ 25, 2024 సాయంత్రం ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌గారితో కూర్చున్నాను. కొత్త లోక్‌సభ కొలువు తీరడం, మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఆ ముందురోజు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిని గురించి ప్రస్తావించడం ఇవన్నీ చర్చకు వచ్చాయి. జూన్‌ 25, 1975 నాటి అత్యవసర విధింపు ఉదంతాన్ని భారతీయులు ఏటా స్మరించుకోవడం అవసరమేనని డాక్టర్‌ శివప్రసాద్‌ వెంటనే అన్నారు. ఎందుకంటే 1977 తరువాతి భారత రాజకీయాల మీద ఆ ఉదంతం ప్రభావం విశేషంగా ఉంది. అవీ ఇవీ చెబుతూనే ఆయన నాటి జ్ఞాపకాలలోకి తీసుకువెళ్లారు. ఈ ముఖాముఖీ వనరు అదే.

చరిత్రలో జూన్‌ 25వ తేదీకి ప్రాధాన్యం ఉందంటారు. ఏమిటది?

సరిగ్గా యాభై సంవత్సరాల నాటి కథ. జూన్‌ 25, 1975న నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించింది. ఆ మరుక్షణం భారత రాజ్యాంగం పక్కకి పోయింది.

ఎందుకు అలా చేసింది ఇందిర?

రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు తీర్పు నిచ్చింది. రాజీనామా చేయవలసిందిగా ప్రతిపక్ష నాయకులు కోరారు. ఐతే ఆమె మొరార్జీ దేశాయ్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌, ఎ.బి. వాజపేయి, ఎల్‌కే అడ్వాణి, జార్జి ఫెర్నాండెజ్‌ వంటి ప్రముఖ నాయకులందరినీ జైల్లో పెట్టింది. ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, ఆనందమార్గ్‌ వంటి పాతిక సంస్థలను నిషేధించింది. ప్రాథమిక హక్కులకు పాతరేసింది. రాజ్యాంగంలో నూతన అధికరణలు ప్రవేశపెట్టింది. నవంబరు 14, 1975న నేను హైదరాబాదులో సెక్రటేరియట్‌కు నడిచి వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేశారు. ‘ఇతడు భారతమాతాకీ జై అన్నాడు. దేశభక్తుడు’ అని నా మీద కేసు. ముషీరాబాదు సెంట్రల్‌జైలులో పడేశారు. ‘నేను దేశభక్తుడినేమిటి? సావర్కర్‌ లాంటి మహాపురుషులనే అలా అంటారు’ అని చెప్పినా కోర్టు పట్టించుకోలేదు. కేసు రెండేండ్లు నడిచింది. హైదరాబాదులోనే నల్లకుంట ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవాణ్ణి. ఒక టెర్రరిస్టును పట్టుకోవడానికి వచ్చినట్లు పోలీసులు ఆ ఇంటి మీద దాడి చేశారు. దానితో ఇంటి ఓనర్‌ మా సామాన్లు బయట పడేశాడు. అప్పుడు నా కుటుంబం గతి ఏమిటి? ఇలాగే ఇంకొన్ని కుటుంబాలు. వారు ఇంట్లో ఫర్నీచర్‌, ఒంటి మీది బంగారం, మంగళసూత్రాలు అమ్ముకొని భోజన సామాగ్రిని కొనుక్కున్నారు. కొందరి పిల్లలు దొంగతనాలు చేసి బ్రతికారు. ఇవన్నీ కఠోర సత్యాలు. ఇప్పుడు చెప్పండి! ఈ నెహ్రూ కుటుంబాన్ని గౌరవించాలా? ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ అని చెప్పే నెహ్రూ కుమార్తె చేసినదే ఇదంతా. ఆమె పదవిని కాపాడుకునేందుకే.

అప్పుడు మీకు మద్దతుగా ఎవరు నిలిచారు?

ఒక్కరు కూడా అయ్యో పాపం అనలేదు. అంతటా భయమే. సరికదా సాటి కవులు సినారె, జె. బాపురెడ్డి, బోయి భీమన్న, శేషేంద్ర, శ్రీశ్రీ వంటివారు ఇందిరాగాంధీని ప్రశంసిస్తూ కవి సమ్మేళనాలు నిర్వహించారు. ది హిందూ, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వంటి ఆంగ్ల పత్రికలు ఇందిరనే బలపరిచాయి. ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, స్టేట్స్‌మన్‌, సెమినార్‌, మెయిన్‌స్ట్రీమ్‌ వంటి పత్రికలు ప్రతిఘటిం చాయి. జాగృతి వంటి పత్రికలు సెన్సార్‌షిప్‌తో మూతపడ్డాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు నోరు మూసుకున్నారు. ఒక్క పెజావర్‌ స్వామి బహిరం గంగా ఇందిరమ్మను ఎదిరించాడు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలన్నీ 26.6.1975 నుంచి రెండురోజులు సంపాదకీయం ప్రచురించే స్థలాలను ఖాళీగా విడిచిపెట్టి నిరసన ప్రకటించాయి. పదవిని కాపాడుకునేందుకు ఇందిర దేశాన్ని జైలుగా మార్చింది. అది స్వతంత్ర భారత చరిత్రలోనే చీకటిరోజు. అందుకే 26.6.2024 నాడు లోకసభకు రెండోసారి స్పీకర్‌ ఓం బిర్లాగారు ఈ అంశం ప్రస్తావించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అది సముచితం.

ఎమర్జెన్సీలో నిర్బంధం ఎలా ఉండేది?

చిన్న చిన్న సంఘటనలు కూడా గుర్తున్నాయి. ముళ్లపూడి సూర్యనారాయణమూర్తి గారింట్లో 25.6.1975 రాత్రే పెళ్లి. ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు వచ్చారు. మెరుపు లేని ఉరుములా ఎమర్జెన్సీ విధింపు వార్త అందింది. వారంతా అక్షింతలు వేయకుండా, భోజనాలు చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవలసి వచ్చింది. ఒకసారి ప్రాంత ప్రచారక్‌ సోంపల్లి సోమయ్య గారు మా ఇంటికి భోజనానికి వచ్చారు. ఇంతలోనే మా కాలనీలోనే ఉండే సత్యం అనే సీఐడీ గుమ్మం దగ్గరకొచ్చి నిలబడ్డాడు. అంతే, సోమయ్య గారు విస్తరి ముందు నుంచి లేచి వెనుక ద్వారం నుండి పారిపోవలసి వచ్చింది. ఇవి చాలా చిన్నవి. అప్పుడు జరిగిన అత్యాచారాలకి అంతేలేదు. సీపీఐతో కలసి ఇందిర మొత్తం జాతిని హింసించింది. అత్యవసర పరిస్థితిని సీపీఐ ఘనంగా సమర్థించింది.

ఇంత జరుగుతున్నా ప్రజలు నోరు మూసుకొని ఊరుకున్నారా?

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు, దరిమిలా సుప్రీంకోర్టు షరతులతో కూడిన స్టే ఇవ్వడానికి ముందే దేశంలో ఆమె అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ఆరంభమైంది. అదే సంపూర్ణ విప్లవం. అత్యవసర పరిస్థితి విధింపు తరువాత జనసంఘర్షణ సమితి పేరుతో ఆ ఉద్యమం కొనసాగింది. ప్రముఖ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకి జరిగిన ఉద్యమం చరిత్ర ప్రసిద్ధమైనదే. అందుకు రహస్య కరపత్రాలు బాగా ఉపకరించాయి.

ఈ చీకటిరోజులపై ఏమైనా గ్రంథాలు వచ్చాయా? అత్యవసర పరిస్థితి తరువాతి కాలంలో దాని ప్రభావం ఏమిటి? ఎంత?

తెలుగులో తక్కువే. కానీ ఆంగ్లంలో వందలలో ఉన్నాయి. ‘ఎండ్‌ ఆఫ్‌ యాన్‌ ఈరా’, ‘ఏ సాగా ఆఫ్‌ స్ట్రగుల్‌’, ‘ది జడ్జ్‌మెంట్‌’ వంటివి ఎన్నో వచ్చాయి. తెలుగులో భండారు సదాశివరావు రాసిన ‘జనవిజయం’ ఈ అంశాన్నే అక్షరబద్ధం చేసింది. నేను ‘అత్యాచారపర్వం’ అనే గ్రంథం రాశాను. 1977 ఎన్నికలలో ఇందిర ఓడిపోయింది. మొరార్జీ నాయకత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడిరది. చౌదరి చరణ్‌సింగ్‌ మద్దతుతో ఆ ప్రభుత్వాన్ని ఇందిరే కూల్చివేసింది. కానీ అత్యవసర పరిస్థితి ప్రభావం ఇప్పటికీ రాజకీయాలను శాసిస్తూనే ఉంది.

నేటి జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు చూస్తే ఒక ప్రశ్న అనివార్యంగా వేసుకోవాలనే అనిపిస్తుంది. అదే భారత్‌ భవితవ్యం ఏమిటి? అలాగే మోదీ కాంగ్రెస్‌ ముక్త భారత్‌ పిలుపు సాధ్యమేనా?

చైనా, పాకిస్తాన్‌లు ఇండియాను ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి. అందుకు కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు మద్దత్తునిస్తున్నాయి. నేతాజీ, తిలక్‌, ప్రకాశం, మహాత్మా గాంధీ యుగం ముగిసి పోయింది. ఉత్తర దక్షిణ భారతాలను వేరు చేయాలనే డీకే సురేశ్‌ వంటి వేర్పాటువాదులు, అసలు ఈ దేశాన్ని ముక్కలు చేయాలన్న కన్హయ్య కుమార్‌ వంటి అర్బన్‌ నక్సలైట్లు ఉన్నారు దాంట్లో. అందుకే మోదీ ఇచ్చిన పిలుపు వాస్తవరూపం దాలిస్తేనే మేలని నా నిశ్చితాభిప్రాయం. అత్యవసర విధింపు వంటి చర్యలకు పాల్పడిన పార్టీ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంకా మనుగడ సాగించడమే ఈ దేశంలో వింత. నా దృష్టిలో వేర్పాటువాదాన్ని ప్రబోధించే ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిష్టుల కన్నా నాడు ఇందిర కాళ్లు కడిగిన, నేడు సోనియా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటున్న హిందువులే ఎక్కువ ద్రోహులు.

  • జొన్నాభట్ల నరసింహప్రసాద్‌,  కథారచయిత, 25-6-2024

‘మేమూ అరెస్టయ్యాం.. బాధలు పడ్డాం!’

అత్యవసర పరిస్థితి (1975) సమయంలో తాము కూడా బాధలు పడ్డామని ఎట్టకేలకు ఆర్‌జేడీ నాయకుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అంగీకరించారు. జూన్‌ 29వ తేదీన ఆయన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు రాసిన వ్యాసంలో కొన్ని విషయాలు బయటపెట్టారు. తమను ఇందిరాగాంధీ నిర్బంధించినప్పటికి వ్యక్తిగత దూషణలకు దిగలేదని లాలూ ఒక మెలిక పెట్టారు. ఎంతయినా ఇంకా కాంగ్రెస్‌తో పని ఉంది కదా!  కాంగ్రెస్‌తో ఎంత సాన్నిహిత్యం ఉన్నా, కొన్ని వాస్తవాలను దాచిపెట్టడం సాధ్యం కాదు. అందుకే అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యం మీద మచ్చేనని ఆ వ్యాసంలో లాలూ ప్రసాద్‌ అంగీకరించక తప్పలేదు. జర్నలిస్ట్‌ నళిన్‌ వర్మతో కలసి ఆయన ఆ వ్యాసం రాశారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో జరిగిన అత్యాచారాలపై జయప్రకాశ్‌ నారాయణ్‌ నియమించిన సంఘానికి తాను కన్వీనర్‌నని, తాను కూడా మెయింటినెన్స్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద అరెస్టయి, 15 మాసాలు జైలులో ఉన్నానని  ఆయన గుర్తు చేసుకున్నారు. ఇవాళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న నరేంద్రమోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు నడ్డా, ఇతర నాయకుల పేర్లు ఏవీ ఆనాడు తాము వినలేదని కూడా ఆయన అన్నారు. ఇందిర తమను మీసా కింద జైలులో పడేసినా ఏనాడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఆయన వెల్లడిరచారు. నిజానికి అప్పటికి లాలూ కూడా పేరున్న నాయకుడేమీ కాదు. బిహార్‌ ముఖ్యమంత్రి కావడం, అడ్వాణి రథయాత్రను బిహార్‌లో నిరోధించడం ఆయనకు ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఇటీవల నరేంద్ర మోదీ అత్యవసర పరిస్థితిని గుర్తు చేస్తూ ప్రసంగించిన నేపథ్యంలో లాలూ ఈ వివరాలు వెల్లడిరచారు.

అత్యవసర పరిస్థితి విధిస్తున్న సంగతి నాటి హోంమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి కూడా తెలియదు. పత్రికల మీద సెన్సార్‌షిప్‌ విధించారు. 20 అంశాల ఆర్థిక కార్యక్రమం పేరుతో ఆదరాబాదరా కొన్ని సంస్కరణలు చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. జేపీ, మొరార్జీ, వాజపేయి, అడ్వాణి, విజయరాజే సింధియా, ములాయం, జేబీ కృపలానీ, చరణ్‌సింగ్‌, రాజ్‌నారాయణ్‌, అరుణ్‌ జైట్లీ వంటి వారంతా అరెస్టయ్యారు. వీఎస్‌ అచ్యుతానందన్‌, జ్యోతిర్మయి బసు (సీపీఎం) అరెస్టయ్యారు. బలవంతపు కుటుంబ నియంత్రణ అత్యవసర పరిస్థితిలో ఎక్కువ క్రూరమైనదిగా పేర్గాంచింది. ఎమర్జెన్సీ బాధలతోనే బెంగళూరులో కన్ను మూసిన నటి స్నేహలతా రెడ్డి వంటి ఉదంతం ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. కేరళలో రాజన్‌ కేసు కూడా అలాంటిదే. ఎంతమందిని అక్రమంగా నిర్బంధించారో లెక్కలేదు.

About Author

By editor

Twitter
YOUTUBE