జూలై 21 వ్యాసపూర్ణిమ

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

గురు ప్రసక్తి రాగానే వ్యాసుని స్మరణ చేయడం సహజం. ఆయన గురువులకు గురువు. వేదాలను విభజించాడు. అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రాలను రాశాడు. ‘పంచమ వేదమై పరగిన’ మహాభారతాన్ని నిర్మించి, దాని ద్వారా ‘గీతా’మృతాన్ని పంచాడు. అలా విశాల హిందూ ధార్మిక వట వృక్షాన్ని పెంచి పోషించిన పరమ గురువు. ఆయన పేరుతో వెలసిన గురుపూర్ణిమ మన దేశంలో అనాదిగా సాగుతూ వస్తున్న గురుశిష్యపరంపరను గుర్తుకు తెచ్చే రోజు.
వ్యాసభగవానుడు భారతీయ విజ్ఞానజ్యోతి. సమస్త విద్యా సాగరాన్ని అపోశన పట్టిన అగస్త్యుడు. జాతికంతటికి ఏకైక సాంస్కృతిక శక్తిని ప్రసాదించిన గురుదేవుడు. భారతజాతి ఉద్ధరణ కోసం, ధర్మ సమైక్యత కోసం అవతరించి శిష్యప్రశిష్యులతో ధర్మసంస్థాపన చేసిన చారిత్రక వ్యక్తిగా శంకర భగవత్పాదులు తదితరులు అభిప్రాయపడ్డారు.
సత్యవతి-పరాశరులు ప్రణయ ఫలం కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు). వేదాధ్యయనాన్ని తపస్సుగా భావించి వేదాలను విశ్లేషించి విభజించి వ్యాసుడయ్యాడు. తన కుమారులు శుకుడు, పైలుడు, వైశంపాయనుడితోనూ, నారదాది రుషులతోనూ తాను రాసిన భారతాన్ని ప్రచారం చేయించాడు. ప్రపంచానికి విష్ణువు కథలను తెలియచెప్పాలనే ఉద్దేశ్యంతో భాగతం రాశారు. సాక్షాత్తు శ్రీమహా విష్ణువే వేదవ్యాసుడై భాగవత రచనతో విష్ణుభక్తి ప్రబోధించాడని రుషులు, మునులు, జ్ఞానులు కీర్తించారు. ‘వదలక వేదవ్యాసులు నుడిగిన విదిత పావనము విష్ణుకథ’ అని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య శ్లాఘించారు. విద్యా వ్యాప్తి కోసం వ్యాసుడు సరస్వతీ మందిరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని బాసర (వ్యాసపురి)లోని సరస్వతీమాత ఆలయం ఆ మహనీయుని ప్రసాదమే.
గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని చూపే వ్యక్తి. వ్యక్తికి తొలిగురువులు తల్లిదండ్రులు. జన్మనిచ్చిన వారు తీర్చిదిద్దితే, జీవన• సూత్రాలను నేర్పేది గురువు. తరగతి గదుల్లో పాఠాలు బోధించేవారో, ఒక వ్యక్తి రూపాన్నో గురువుగా భావించడం సమంజసం. కానీ గురుత్వం అనేది వ్యక్తికి పరిమిత మైనది కాదు. గురుస్థానం ఒక సిద్ధాంతం.. ఒక మహాపురుషుడు.. ఒక ప్రవక్త… ఒక పవిత్ర గ్రంథం.., ఒక స్ఫూర్తికి చిహ్నం. అలా గురువు ఏ రూపం ద్వారానైనా మార్గదర్శనం చేయవచ్చు. వృద్ధ శిష్యులకు మౌన వ్యాఖ్యానంతో విద్యనేర్పిన దక్షిణామూర్తిగా, ఏకలవ్యునికి అన్నీ నేర్పిన ద్రోణుని మట్టి బొమ్మగా, శంకరుడికి ఎదురు పడిన చండాలుడిగా, అర్జునుడికి ‘గీత’ను బోధించిన శ్రీకృష్ణుడిగా… ఇలా ఏ రూపంలోనైన ప్రబోధం చేయవచ్చు.
గురుత్వమనేది మనం గుర్తించి స్ఫూర్తిని పొందే అంశం. అది ముఖ్యంగా శిష్య ప్రతిష్ఠ స్థానం. ఒక మాటలో… అది జీవన దిక్సూచి, జీవితాలకు మార్గదర్శి. ఏ రంగంలోని వ్యక్తికైనా సలహా ఇచ్చేవారు, దారి చూపేవారు అవసరమవుతారు. జనన మరణాల అరణ్యాల నుంచి సత్‌ ‌బోధనలతో సురక్షిత ప్రదేశానికి చేర్చేవారిని గురుతుల్యులుగానే పరిగణిస్తారు. జ్ఞానామృతభాండాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందించేదే గురుపరంపర. ఈ సంప్ర దాయం హిందూ ధర్మంలోని ద్వైత, అద్వైత, విశిష్టా ద్వైత సంప్రదాయాలలో, బౌద్ధ,జైన మతాల్లో కని పిస్తుంది. గురుపాదాలను ఆశ్రయించకపోతే నిష్ప్ర యోజన మంటారు అపర మహేశ్వరులు ఆదిశంకరా చార్యులు. ఆయన ‘ఉపదేశ సాహస్రి’లో గురువు విశిష్టతను వివరిస్తూ, ‘జ్ఞానసాగరంలో పయనించే శిష్యులకు గురువు నావ లాంటివాడు. శిష్యులకు శ్రుతులు, స్మృతులు నేర్పడమే కాదు.. నియమాలను పాటించడంలో నిష్ణాతులుగా తయారుచేయాలి. రాగద్వేషాలను అదుపు చేయగల ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచాలి. అరిషడ్వర్గాలకు దూరంగా వారిని సన్మార్గంలో నడిపించాలి. ఆదిగురువు బాధ్యత’ అని విశదీకరించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం, భగవంతుడి తరువాత ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులను, గురువును దైవాలుగా భావిస్తారు. గురువు మూలంగానే భగవంతుడిని దర్శించాను కనుక దైవం, గురువు ఏకకాలంలో ప్రత్యక్షమైతే గురువుకే ప్రథమ నమస్కారం చేస్తాను’ అన్నాడు కబీరు. ‘నాకు శరీరాన్ని ఇచ్చిన నా తండ్రికి నేను రుణపడి ఉన్నాను. అయితే సరియైన విధంగా జీవించే జ్ఞానాన్ని ప్రసాదించిన నా గురువుకు ఇంకా రుణపడి ఉన్నాను’ అని అలెగ్జాండర్‌ ‌తను గురువు అరిస్టాటిల్‌ ‌గురించి అన్నాడట.
గురువును సేవించి ధన్యులైన శిష్యులు వినయి శీలురై అపార జ్ఞానరాశిని పొందుతారు. తాను చెప్పింది చెప్పినట్లు ఆచరించి చూపే శిష్యుల పట్ల గురువులు ప్రసన్నులవుతారు. అవతార పురుషులు రామకృష్ణులు, వారి గురువులు వశిష్ఠ, విశ్వామిత్ర, సాందీపుడు అందుకు ప్రథమ ఉదాహరణలు. పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదుల వద్ద ఆది శంకరులు, యమునాచార్యుల వద్ద రామానుజులు, రామకృష్ణ పరమహంస వద్ద స్వామి వివేకానంద.. ఇలా ఎందరో గురుకృపతో ధన్యులయ్యారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE