ప్రధానంగా కేసీఆర్‌ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నిపుణుల ఆవేదనలు తెరపైకి వచ్చాయి. నిర్ణయాల వెనుక ఏం జరిగింది? ఎన్ని నిధులు దారి మళ్లాయి? అన్న చర్చ ప్రజల్లో మొద లయ్యింది. విచారణ కమిషన్లు ఏం తేలుస్తాయి? అనే ఉత్సుకత కూడా సర్వత్రా నెలకొంది. ఇవే అంశాలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని నడిపించిన బీఆర్‌ఎస్‌ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించింది. పలు ఆధారాలు కూడా బయటపెట్టింది. సంబంధిత అధికారులు, విచారణాధికారులకు ఫిర్యాదులు కూడా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆధారాలున్న అంశాలపై ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అధిక వ్యయంతో పాటు..కరెంటు కొనుగోళ్లపై తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. రెండు అంశాలపైనా నియమించిన న్యాయ విచారణ కమిషన్లు దాదాపు రెండు నెలల నుంచి విచారణ సాగిస్తున్నాయి. తమకు అప్పగించిన అంశాలపై పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో అప్పటి నిర్ణయాధికారాల్లో భాగమైన కొందరు అధికారులతో పాటు… బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల కూసాలు కదిలిపో తున్నాయి. ఈ విచారణల తర్వాత ఏం జరుగు తుందో అన్న భయం అందరినీ వెంటాడుతోంది.

ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అనవసర పనులను తేల్చేందుకు నియమించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇప్పటికే పలుమార్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు.. దానికి అనుసంధానమై ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వంటి బ్యారేజీలను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించింది. అధికారులతోనూ పలుమార్లు భేటీ అయి చర్చలు సాగించింది. అవసరమైన వివరాలు సేకరించారు. మరోవైపు.. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించిన అంశాలపై జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ న్యాయ విచారణ సాగిస్తోంది. అయితే, ఈ రెండు కమిషన్ల విచారణతో కేసీఆర్‌ బెంబేలెత్తి పోతున్నారు. అప్పటినుంచీ బయటకు రావడం లేదు. రాజకీయ సభల్లో మాట్లాడటం లేదు. పార్టీ పరిస్థితిని విశ్లేషించడం లేదు. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకోవడం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇప్పటికే పలువురిని విచారించి, అనేక కోణాల్లో వివరాలు సేకరించింది. అయితే వాటన్నింటినీ మౌఖికంగా కాకుండా అఫిడవిట్‌ రూపంలో తీసుకుంటోంది. పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు, రిటైర్డ్‌ ఐఏఎస్‌లను కూడా వరుసగా ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగానే కీలక అధికారులను కూడా రప్పిస్తోంది. ఇప్పటి వరకు నిర్మాణ, సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించిన కమిషన్‌.. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే అనుమతుల జారీ, అంచనా వ్యయాల పెంపు, నిధుల విడుదలలో పాత్ర ఉన్న ఐఏఎస్‌లను విచారించనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పలువురు ఐఏఎస్‌ల నుంచి కమిషన్‌ వివరణ కోరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు పంపుహౌసులపై విచారణ నిర్వహిస్తున్న కమిషన్‌ తాజాగా 10 మందికి నోటీసులు పంపింది. వీరిలో రిటైర్డ్‌ ఐఏఎస్‌లూ ఉన్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల, ఆర్థిక శాఖలలో కీలక విధులు నిర్వహించిన వారు కూడా హాజరు కావాలని కమిషన్‌ సమాచారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పదవీ విరమణ చేసిన సోమేశ్‌కుమార్‌, ఎస్‌కే జోషీ, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, మాజీ సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన స్మిత సభర్వాల్‌లకు సమన్లు జారీ చేసింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక సుదీర్ఘకాలం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్‌కే జోషి పనిచేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనా నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో.. కమిషన్‌ ఆయనను విచారణకు పిలిచింది. జోషి పదవీవిరమణ తర్వాత నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొన్ని నెలల పాటు ఇన్‌చార్జిగా వ్యవహరించిన సోమేశ్‌కుమార్‌ కూడా విచారణకు రావాలని ఆదేశాలు వెళ్లాయి. ఇక ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్న స్మిత సభర్వాల్‌ దాదాపు తొమ్మిదిన్నరేళ్లపాటు చంద్రశేఖరరావు కార్యదర్శి పనిచేస్తూ, ఆ హోదాలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణ, బడ్జెట్‌ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులో పాత్ర నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన వి.నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కమిషన్‌ విచారణకు రమ్మని తాఖీదులు ఇచ్చింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు సహకరిస్తామని ఐఏఎస్‌లు చెబుతున్నారు. కాగా, వారు చెప్పిన వివరాలను అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని పీసీ ఘోష్‌ కమిషన్‌ కోరుతోంది. ఇప్పటిదాకా విచారణకు హాజరైన వాళ్ల నుంచి కూడా కమిషన్‌ అఫిడవిట్‌ రూపంలోనే సమాధానాలు సేకరించింది. ఇప్పటికే ఐఏఎస్‌ వికాస్‌ రాజ్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ రజత్‌ కుమార్‌లు కమిషన్‌ ఎదుట హాజరయ్యారు.

ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచిన విధానం? ఎన్ని టెండర్లు వచ్చాయి? ఎన్ని కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి? ఏ ప్రాతి పదికన టెండర్లు ఇచ్చారు? కాంట్రాక్ట్‌లు ఇచ్చాక మళ్లీ సబ్‌ కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరమేంటి? తదితర అంశా లను ఈ ఉన్నతాధికారుల నుంచి రాబట్టాలని కమిషన్‌ భావిస్తోంది. ఇక ఆర్థిక శాఖ అధికారుల నుంచి ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత అంచనావ్యయాలు ఎంతమేర పెరిగాయి, ఎందుకు పెంచాల్సి వచ్చింది, కాంట్రాక్ట్‌ సంస్థ లకు ఎంత చెల్లించారు? సబ్‌ కాంట్రాక్ట్‌ సంస్థ లకు చెల్లింపులు తదితర వివరాలను రాబట్ట నుంది.

మరోవంక, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి జరిగిన విద్యుత్‌ కొనుగొలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ వ్యవహారంపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ ఇప్పటికే ఈ అంశంతో ముడిపడి ఉన్న, సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు జారీచేసి, విచారించింది. అధికారులు, ఉద్యోగసంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులనూ పిలిపించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేయగా, ఆయప కేసీఆర్‌ ససేమిరా అన్నారు. తానేంటి? విచారణకు హాజరు కావడమేంటి? అన్న రీతిలో స్పందించారు. కమిషన్‌ ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత ఓ సుదీర్ఘ లేఖ రాస్తూ, విద్యుత్‌ కొనుగోళ్లపై వివరణ ఇస్తూనే, కమిషన్‌ ఉనికినే ప్రశ్నించారు. అసలు ఆ కమిషనే అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తన సూచన మేరకు కమిషన్‌ విచారణ నుంచి తప్పుకోవాలని కూడా ఉచిత సలహా ఇచ్చారు. జస్టిస్‌ నర్సింహారెడ్డి కమి షన్‌ను రద్దుచేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు కేసీఆర్‌ వాదనను తోసిపుచ్చింది.కమిషన్‌ను రద్దుకు ఆదేశాలు ఇవ్వబోమని కరాఖండిగా తేల్చి చెప్పింది. నిజనిర్ధారణకోసం విచారణ సాగిస్తున్న కమిషన్‌ ముందు హాజరైతే తప్పేంటని ప్రశ్నించింది. కానీ, కేసీఆర్‌ మాత్రం అంతటితో ఊరుకునేది లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి (పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి) ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈ అంశంపై తాను జూన్‌ 24న దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన అత్యున్నత న్యాయ స్థాన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తోంది.

 ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ విద్యుత్‌ సంస్థలు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోళ్ల, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపించి, ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పాటుచేసింది. ఈ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ 1952 విద్యుత్‌ చట్టం 2003కి విరుద్ధమని దాన్ని రద్దుచేయాలని కేసీఆర్‌ ఈ పిటిషన్‌ దాఖలుచేశారు. విద్యుత్‌ కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్‌కు లేదని కేసీఆర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము ఏ తప్పు చేయలేదని చెబుతూ.. జస్టిస్‌ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరుతూ 12 పేజీల లేఖ రాశారు కేసీఆర్‌. అయితే కేసీఆర్‌ తీరుపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంది. అక్రమాలు భయటపడతాయన్న భయంతోనే కేసీఆర్‌ ఇలా చేస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొవాలని సవాల్‌ విసిరారు. కానీ కేసీఆర్‌ ఎలాంటి పరిస్థితుల్లో కమిషన్‌ ముందుకు వెళ్లకూడదన్న పట్టుదలతో ఉన్నారు. విచారణకు హాజరై వివరణ ఇస్తే తన ప్రాభవం తగ్గిపోతుందన్న ఆలోచనలో ఉన్నారు.

– సుజాత గోపగోని

About Author

By editor

Twitter
YOUTUBE