రాష్ట్రం విడిపోయి సరిగ్గా పదేళ్లు పూర్తయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారం కోసం జులై 6న భేటీ అయ్యారు. తమ అధికార మార్బలంతో హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ ప్రజా భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రి వర్గ సహచరులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ఆస్తులు, అప్పులపై చర్చించారు.
విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై చర్చిస్తూ.. హైదరాబాద్‌లో కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని చంద్రబాబునాయుడు కోరగా, హైదరాబాద్ లోని స్థిరాస్తులు మొత్తం తెలంగాణకే చెందుతాయని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. కావాలంటే ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో భవనం కట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తామని తెలంగాణ సర్కార్ చెప్పిందంటున్నారు. ఇక.. భద్రాచలంలో నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఇదే విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోసారి రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. విభజన సమస్యలపై మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయను న్నారు. షెడ్యూల్ 9,10లోని ఆస్తుల పంపకం, ఏపీకి రావాల్సిన రూ. 7,200 కోట్ల విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థలపై షీలా బిడే కమిషన్ సిఫార్సుల అమలు, ఫైనాన్స్ కార్పొరేషన్, ఉద్యోగుల విభజన అంశాలు, లేబర్ సెస్ పంపకాలపై చర్చ జరిగింది.
తెలంగాణలో అంశాలు చూస్తే… రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలన్న అంశంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల మేర విస్తారమైన తీరప్రాంతం ఉందని, అందులో తెలంగాణకు భాగం కావాలని, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా భాగం కావాలని, తమకు ఓడరేవులు లేనందున, విభజనలో భాగంగా ఏపీలోని కృష్ణపట్నం, మచిలీ పట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలని తెలంగాణ బృందం ప్రతిపాదించింది. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల నీటి లభ్యతలో అంతర్జా తీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్‌మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని కోరింది. ఈ లెక్కన తెలంగాణకు 558 టీఎంసీలను కేటాయించాలనే అంశం చర్చకు వచ్చింది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ. 24 వేల కోట్ల బకాయిలను సత్వరమే చెల్లించాలని కోరింది. ఏపీకి ఏమైనా రావలసి ఉంటే చెల్లిస్తామని అధికారులు ప్రస్తావించారు.
అయితే,ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ బృందం ఉలిక్కిపడిరది. ఇప్పటివరకు ఊహించని కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వాలని కొర్రీ పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ మహానగరం లాంటి నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేనందున, ఇప్పటికీ రాజధాని లేనందున దాని ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ బృందం ప్రతిపాదనను సమావేశం ముందుంచినట్లు సమాచారం. విభజన చట్టం ప్రకారం పాలనా పరమైన సౌకర్యాల కోసం హైదరాబాద్‌లో ఏపీకి మూడు భవనాలను కేటాయించారు. ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోవడంతో వాటిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలను కుంటున్నది. అయితే వీటిపై ఏపీ పెట్టిన ప్రతిపాదనలు పీటముడులుగా మారాయి.
రెండు అత్యున్నత కమిటీలు
మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి రెండు వైపుల నుంచి అత్యున్నత స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయాలని, మంత్రుల స్థాయిలో మరో కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాల ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయానికి వచ్చారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన వేయనున్న కమిటీలు రెండు వారాల్లోగా మనుగడలోకి రానున్నాయి. మరో ముగ్గురు చొప్పున అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆ తర్వాత మంత్రుల స్థాయి కమిటీలో ఆ అంశాలపై చర్చిస్తారు. చివరగా ముఖ్యమంత్రుల నేతృత్వంలో తుది నిర్ణయం తీసుకొని కేంద్ర హోంశాఖకు ప్రతిపాదిస్తారు.
ఫలితమివ్వని సమావేశాలు
విభజన అంశాలపై చర్చకు ఇద్దరు సీఎంలు భేటీ కావడం ఇదే మొదటిసారి. అంతకు ముందు గడచిన పదేళ్లలో కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పలుమార్లు సమావేశాలు జరిగినా, చాలా అంశాలు పెండిరగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు 30సార్లు భేటీ అయినా, ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రజా ప్రతి నిధుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. అనేక అంశాల్లో విభజన చట్టానికి విరుద్ధంగా ఇరుపక్షాలు వాదించడం వల్లే సమస్య జటిలమైందన్న వాదన లున్నాయి. నాటి రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంప కానికి సంబంధించి నాటి గవర్నర్ నరసింహన్ నేతృత్వంలో రాజ్ భవన్ వేదికగా కొన్ని సమావేశాలు జరిగాయి. అయితే.. నరసింహన్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ సర్కార్ అప్పుడు పక్కకు తొలగింది. అనంతరం పలు కీలక పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తమ పాలనను హుటాహుటిన అమరావతికి మార్చు కోవడంతో సచివాలయ విభజన అంశం తెగని సమస్యగానే మారిపోయింది.
ఒకే సమస్య పరిష్కారం
ఢిల్లీ లోని ఏపీ భవన్ సమస్య ఒక్కటే పరిష్కారం కావడం గమనార్హం. ఇందులో భాగంగా, ఈ ఏడాది మార్చిలో రెండు రాష్ట్రాలకు కేంద్రం భూకేటా యింపులు జరిపింది. విభజన చట్టం ఆధారంగా 58ః42 నిష్పత్తి ప్రకారం ఏపీ భవన్ ఆస్తులు పంచు కున్నాయి.
9వ షెడ్యూల్ కొర్రీలు
9వ షెడ్యూల్‌లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా బిడే కమిటీ కొన్ని సిఫార్సు చేసింది. ఈ షెడ్యుల్‌లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 89 కార్పొరేషన్లను విభజించాలని కమిటీ చేసినా, ఏపీ అంగీకారం తెలిపింది. కానీ 68 కార్పొరేషన్లను మాత్రమే విభజిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ, ఎఫ్‌ఎస్‌సీ వంటి 23 కార్పొరేషన్లలోని ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై భిన్నవాదనలు ఉన్నాయి. విభజన చట్టంలో నిధులు, ఉద్యోగులను పంచుకోవాలని ఆస్తులను ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయని పేర్కొంది. విభజన చట్టంలోనని హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి ఏపీ మొదటినుంచీ పేచీ పెడుతోంది. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్నే హెడ్‌క్వార్టర్స్‌గా పరిగణించాలని తెలంగాణ వాదిస్తోంది. దీనికి భిన్నంగా హైదరాబాద్‌లోని కార్యాలయాలను, భవనాలను హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని ఏపీ వాదిస్తోంది. వీటిలో ఏపీకి వాటా కావాలన్నది ఏపీ ఉద్దేశం. ఈ వివాదానికి ముగింపు పలకడానికి కేంద్రం హెడ్‌క్వార్టర్స్ అనే పదానికి స్పష్టత ఇచ్చింది. తెలంగాణ వాదనను సమర్థించింది. దీన్ని అంగీకరించలేదు. దీన్నిబట్టి 9 షెడ్యూల్‌లో సంస్థల విభజన ఎందుకు పూర్తి కాలేదు అర్థమౌతోంది.
10వ షెడ్యూల్ పీటముళ్లు
మరోవైపు.. విభజన చట్టంలోని 10 వ షెడ్యూల్ చూస్తే అందులో 142 సంస్థలు ఉన్నాయి. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ వంటి 30 సంస్థలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య భిన్నవాదనలు ఉన్నాయి. తెలుగు అకాడమీ సహా భవనాలు, ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదర లేదు. అలాగే, ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్, ఏపీ ఫారెస్ట్ అకాడమి, సెంటర్ ఫర్ ఫుడ్ గవర్నెన్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఏపీ పోలీస్ అకాడమీ వంటి శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి. రాజ్‌భవన్, లోకాయుక్త, హైకోర్టు రాజ్యాంగ బద్ధ సంస్థల నిర్వహణపై ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటున్నది. కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నుల బకాయిలపై వివాదాలున్నాయి. హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సీఐడీ కార్యాలయం, మినిస్టర్స్ క్వార్టర్స్ , ఐఏఎస్ క్వార్టర్స్ లను ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సీఐడీ కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ తమకు కావాలని ఏపీ కోరుతోంది. స్థానికత, ఆప్షనల్స్ ఆధారంగా ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండిరగ్‌లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1800 మందికి పైగా విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు వంటి అంశాలూ పీటముడిగా మారాయి. విద్యుత్ బకాయిల అంశం కూడా సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉంది. సుమారు రూ. 24 వేల కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ వాదిస్తోంది. అయితే, తమకే 7 వేల కోట్ల రూపాయలు రావాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది.
జల వివాదాలు ఇవీ…
ఇక, నీటిపారుదలకు సంబంధించి పరిశీలిస్తే… కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున అంతర్జాతీయ నీటి పంపిణీ నిబంధనల ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్ఫత్తిలో నీటి పంపిణీ చేయాలని, తెలంగాణ వాదిస్తోంది. దీని మేరకు 558 టీఎంసీలు తమ రాష్ట్రానికి కేటాయించాలని వాదిస్తోంది. కృష్ణా జలాల పంపిణీపై వేసిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పు త్వరలో వెలువడనుంది. ఆ ట్రైబ్యునల్ కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాలకు పంచింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిరది కాబట్టి ఆ జలాలను నాలుగు రాష్ట్రాలకు పంచాలని తెలంగాణ అధికారులు వాదిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేసు నడుస్తోంది. కేసు విత్ డ్రా చేసుకుంటే సమస్యను పరిష్కరిస్తామని కేంద్రం చెప్పినా ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.
పట్టించుకోని కేసీఆర్-జగన్
ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో చంద్రశేఖర రావు హయాంలో గవర్నర్ సమక్షంలో జరిగిన చర్చలూ విఫలం కాగా, అనంతరం ఏపీలో సీఎంగా వచ్చిన జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోలేదు. ఆయనతో రెండవసారి సీఎం అయిన కేసీఆర్‌కు రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. వీరిద్దరూ ఒకటి రెండు సార్లు సమావేశమైనా.. అవి రాజకీయ కోణంలోనే జరిగాయి.
సొంత ఎజెండా ఉందా?
చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి మధ్య సఖ్యత, సాన్నిహిత్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో రేవంత్‌రెడ్డి ఓ వెలుగు వెలిగారు. టీడీపీ నాయకుడి గానే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనివార్యంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని చెబుతారు. అంతేకాదు.. అసలు కాంగ్రెస్‌పార్టీలో రేవంత్‌రెడ్డి చేరడానికి కారణం చంద్రబాబే అని, ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా నియామకం వెనుకా చంద్రబాబే చక్రం తిప్పారని ఇప్పటికీ చెప్పుకుంటారు. మరి.. ఈ నేపథ్యంలో ఇరువురు నాయకులు తమ సొంత ఎజెండా కోసమే భేటీ అయ్యారా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇద్దరూ ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్నారు. వాళ్లేం చేసినా బహిరంగమే. ఎవరిని కలిసినా వార్తే. అయితే, ఏ ఎజెండా లేకుండా, ఏ ప్రతిపాదనలూ లేకుండా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే రాజకీయ వర్గాల్లోకి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. పైగా ఉప్పూ నిప్పులా ఉండే విభిన్న పార్టీలకూ ఇద్దరు నేతలు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు రేవంత్‌రెడ్డిని కలిస్తే.. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి చెందిన బీజేపీతో విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. అదే.. రేవంత్‌రెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసినా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇద్దరి భేటీకి విభజన సమస్యల ఎజెండా కలిసి వచ్చిందని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి.
పవన్ కల్యాణ్ గైర్హాజర్‌కు కారణం?
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతస్థాయి సమావేశం అది. పదేళ్లుగా ఎడతెగని సమస్యల పరిష్కారమే ఎజెండాగా సాగిన అత్యంత ముఖ్యమైన భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు మంత్రులు హాజరైనప్పటికీ కీలక హోదాలో ఉన్న ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు హాజరు కాలేదన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కీలకంగా నిలుస్తోంది. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన మిత్రుడు పవన్ కళ్యాణ్ అని ఆయనే స్వయంగా చెప్పారు. అందుచేత బీజేపీ కలసి నడుస్తున్నందున.. కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రుల స్థాయి భేటీకి ఆయన దూరంగా నిలిచారని చెబుతున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నా ఏపీలో అదే హోదా గల పవన్ కళ్యాణ్ పాల్గొనక పోవడం గమనార్హం. సమావేశానికి ముందు విడుదల చేసిన రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొనబోయే మంత్రులు, అధికారుల పేర్ల జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది. అయినా ఆయన పాల్గొనక పోవడం గమనార్హం. కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకోవడం పట్ల విముఖతతోనే హాజరు కాలేదని తెలుస్తున్నది. అయితే ఈ అంశంపై జనసేన వర్గాల నుంచి మరో విధమైన సమాధానం వస్తోంది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధిస్తే అమ్మవారి వారాహి దీక్ష చేపడతానని మొక్కుకున్నారట. అందులో భాగంగా జూన్ 25న 11 రోజుల అమ్మవారి వారాహి దీక్ష చేపట్టారు. దీక్ష సమయంలో ద్రవ ఆహారమైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకున్నారు. అందుకే ముఖ్యమంత్రుల భేటీకి ఆయన హాజరుకాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కారణమేదైనా ఈ పరిణా మంతో ఢిల్లీస్థాయిలో బిజెపి పెద్దల దగ్గర పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరుగుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్