వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– ఆర్‌.సి. కృష్ణస్వామిరాజు

ఆవుల కొట్టంలో అమ్మ పాలు పితుకుతోంది.

పచ్చి పాల వాసన తెరలుతెరలుగా వస్తోంది.

ఆవు పొదుగు నుంచి గిన్నెలోకి పడుతున్న పాలు ‘సుయ్‌ సుయ్‌’ అని పసిబిడ్డ కాలి గజ్జెల శబ్దం లాగా వినిపిస్తోంది.

కళ్లు మూసుకుని నార మంచం మీద కూర్చుని తన్మయత్వం చెందుతున్నాడు అనంత.

ఆస్ట్రేలియాలో వెటర్నరీ డాక్టర్‌ ఉద్యోగం. మూడు నెలల శెలవు దొరకడంతో ఊర్లోని అమ్మా నాన్నలతో కొన్నాళ్లు గడుపుదామని వచ్చాడు. శెలవు దొరకలేదని భార్యాబిడ్డలు అక్కడే ఉండిపోయారు.

పాలు పితుకుతూనే అమ్మ-

‘‘దేశంకాని దేశం పోయినావు అనంతా…

ఎద్దుల్లో ఎద్దువై, గొర్రెల్లో గొర్రెవై, ఆవుల్లో ఆవువై, మేకల్లో మేకవై… అందరిలోనూ కలిసిపో కొడుకా… ఎవ్వరితోనూ…కోరికోరి కొట్లాట తెచ్చుకోవద్దు. చేతనైతే చిటికెడంత సాయం చేయి…’’ అని అంటూ ఉంది.

కొట్టంలో ఉన్న దూడ తన మెడకు కట్టిన దారాన్ని తెంచుకోవాలని గింజుకుంటూ ఉంది. దాన్నే చూస్తున్నాడు అనంత.

 * * * * *

ఎవరో వచ్చిన అలికిడి అయితే వెనక్కి తిరిగి చూశాడు. ఊరి గుడి అభివృద్ధి కమిటీ సభ్యులు వచ్చి కూర్చున్నారు.

‘‘మామా! ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చినావు. మొన్న గాలివానకి ఊర్లో కృష్ణుడి గుడి గోడ కూలిపోయింది. అరవై వేలుదాకా ఖర్చు అవుతుంది. మీరు డబ్బులిస్తే కట్టాలని ఉన్నాం. గోడ మీద శిలాఫలకంలో మీ పేరు పెద్ద అక్షరాల్తో వేయిస్తాం’’ అని గట్టిగట్టిగా చెప్పారు.

అవుననలేదు, కాదనలేదు. మౌనంగా ఉండి పోయాడు అనంత.

ఎంతసేపటికీ సమాధానం రాకపోయేసరికి వారు చిన్నగా అక్కడి నుంచి కదిలారు.

 పోతూపోతూ ‘‘అన్నా… ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు. మనం ఈయన గారి గురించి గొప్పగా చెప్పుకుంటాము కానీ….ఈ అనంత మన ఊరికి ఇప్పటి దాకా ఏం మేలు చేసినాడు?’’ అంటూ వారు అనడం అనంతకు వినిపించింది.

ఆవు నడుము మీది పుండును కాకి పొడుస్తోంది. దాన్నే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు అనంత.

 * * * * *

ఆవు కొమ్ముల మధ్యన సూరీడు పుడుతున్నాడు. ఇంటి ముందర తిరుగులాడుతున్న పెంపుడు కోళ్లకు బియ్యపు గింజలు వేస్తూ ఉన్నాడు అనంత.

‘‘ఐలురాజు చూడి ఆవుకు దూడ పుట్టిందిరోయ్‌. అయితే ఉలుకూపలుకూ లేకుండా ఉందిరోయ్‌’’ చెబుతూ వెళ్లినాడు ఊరి తలారి.

వీధి మొదట్లో ఉంటుంది ఐలురాజు ఇల్లు.

క్షణం ఉండలేక పోయినాడు అనంత.

మొండి గోడల మధ్య… పేడ దిబ్బపక్కన,

అప్పుడే నేల మీద పడిన దూడ గాలి సరిగా పీల్చుకోలేక కష్టపడటం చూశాడు.

గడ్డి మీద కూర్చున్నాడు. దూడని తన బిడ్డ మాదిరి లాక్కొని రొమ్ముపై భాగాన్ని బలంగా ఒత్తినాడు. అది కదలలేదు, మెదలలేదు.

దూడ స్పృహలో ఉన్నట్లుగా అనిపించలేదు. లేచి నిలబడ్డాడు. దాని వెనుక కాళ్లు పట్టుకుని ఎత్తి దూడను తలకిందులుగా వంచి ఒకటికి రెండు సార్లు… పైకీ, కిందికీ ఊపినాడు. అది చిన్నగా గాలి పీల్చుకోవడం కనిపించింది. ‘హమ్మయ్య’ అనుకున్నాడు.

నీళ్ల తొట్టెకాడికి పోయి చేతులు కడుక్కుని తల పైకెత్తాడు.

ఊర్లోని అమ్మలక్కలందరూ అనంత చుట్టూ చేరి ఉన్నారు. సినిమా యాక్టర్‌ని చూసినట్లు చూస్తున్నారు. ‘ఫారిన్‌ పోయినోళ్లు కూడా పశువులని తాకుతారా?’ అన్నట్లుగా చూశారు.

అనంత నవ్వుతూ ‘‘ఆస్ట్రేలియాలో కూడా పశువులకు నాలుగు కాళ్లే ఉంటాయి. అక్కడైనా ఇక్కడైనా వెటర్నరీ డాక్టర్‌ చేసేది ఇలాంటి వైద్యమే. ఏదో ప్రపంచ ఎనిమిదో వింత మాదిరి చూస్తా ఉండారే… పొండి పొండి’’ అన్నాడు.

ఐలురాజు నవ్వుతూ దగ్గరికి వచ్చి ‘‘అనంతన్నా… మజ్జిగ తాగి పొండి!’’ అంటూ మజ్జిగ తెచ్చి ఇచ్చినాడు.

తృప్తిగా తాగి ఊర్లోకి నడిచాడు అనంత.

అప్పుడే కృష్ణుడి గుడికాడ పాల వ్యాను వచ్చి ఆగింది. గబగబా ఆడవాళ్లు వచ్చి వ్యాను దగ్గర నిలుచున్నారు. ఇండ్లల్లో పితికిన తమ పశువుల పాలను చెంబుల్లో పోసుకుని తెచ్చి ఉన్నారు.

పాలవ్యాన్‌ వాళ్లు వరుసగా ఒక్కొక్కరి పాల స్వచ్ఛతను లాక్టో మీటర్‌తో కొలిచి పెద్ద క్యాన్‌ లలో పోస్తున్నారు.

అక్కడ…

పాలు పోస్తున్న యువతిని చూశాడు అనంత.

తలలో ముద్దబంతి పువ్వు. పొడుగాటి జడ. అర్థమయ్యింది. అది ఆమే…

అణువణువూ పులకరించింది.

ఏదో..పని ఉన్నవాడిలా… వేప చెట్టుకిందికి వెళ్లి నిలబడ్డాడు.

ఖాళీ గిన్నె తీసుకుని వస్తోంది ఆ తేనెరంగు ముద్దులగుమ్మ.

ఆమె కూడా అనంతను చూసింది. ఒక్క క్షణం నిలబడిరది. తెలియని మనిషిని చూసినట్లు తల వంచుకుని నడవడం ప్రారంభించింది.

ఆమె నడుస్తున్నంత సేపూ కన్నార్పకుండా చూశాడు.

దగ్గరికి వచ్చాక ‘‘బాగున్నావా హరిణీ’’ అని అడిగాడు.

కనబడని కత్తి కోత చూపు చూస్తూ…

‘‘ఫర్లేదు… మేమింకా గుర్తున్నాము’’ నిష్టూరంగా అంది.

కోర్టు బోనులో ముద్దాయిలా నిలబడ్డాడు.

ఇంతలో ఆరేళ్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

‘‘అమ్మా… నాన్న ఆవుల్ని గుట్ట మీదికి తోలుకుని పోవాలంట. గబగబా రా అమ్మా’’ అంటూ హరిణినిని సరసరా తీసుకుని వెళ్లాడు.

కొద్దిసేపు గమ్మున అక్కడే మట్టి దిబ్బలాగా నిలబడ్డాడు అనంత.

తను మాత్రమే అక్కడ ఉన్నాడు. అతడి మనసు హరిణి వెనుకే వెళ్లింది.

‘ఒకటి నుంచి ఇంటర్‌ దాకా కలిసి చదువు కున్నాము. నేనేమో వెటర్నరీ కోర్సు చదవడానికి తిరుపతికి వెళ్లి పోయాను. హరిణికేమో వాళ్ల ఇంటివాళ్లు ఇంటర్‌ అయ్యిందే పెళ్లి చేసేశారు. ఎవరిని తప్పు పట్టగలం?… ఒకరంటే ఒకరికి ఇష్టమే… కానీ జీవితంలో ఏం జరగాలో అదే జరుగు తుంది కదా…’ అనుకుంటూ అడుగులు ముందుకేశాడు.

 * * * * *

ఊరికి పడమర, బోడి గుట్ట మిలమిలా మెరుస్తూ కనిపించింది.

‘అప్పుడెప్పుడో తిరుమల కొండ గుండులాగా బోడిగా ఉండేదని… బోడిగుట్ట అని పేరు వచ్చింది దానికి. ఇప్పుడేమో పచ్చటి చెట్లతో నిగనిగలాడుతూ ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలందరం కలిసి ఆడుతూ పాడుతూ గుట్ట ఎక్కేవాళ్లం. అప్పటికీ ఇప్పటికీ గుట్టలో ఏమాత్రం మార్పు లేదు…’ అనుకున్నాడు.

ఊరి నుంచి ఆవుల మందలు, పరుగులు తీస్తూ బయలుదేరినాయి. ఎర్రెర్ర దారి దుమ్ము ఎగిరెగిరి పడుతోంది. రైతులు మంచి మేత కోసం, ఆవుల్ని కయ్యిలమ్మిటా, కాల్వలమ్మిటా తోలుకెళ్లి ఎర్ర చెరువు మీదుగా బోడి గుట్టకు తీసుకెళ్తారు.

‘మనం కూడా గుట్ట మీదకు వెళ్దాము… ఎలా ఉందో చూద్దాం’ అని చిన్నగా బయలుదేరాడు.

దారి పొడుగునా చింత చెట్లు పలకరించాయి. అందిన చిగురు కోసుకుని తింటూ నడిచాడు.

అలవాటైన జీవాలు కాబట్టి ఆవులు సర్రుసర్రున గుట్టని ఎక్కేస్తున్నాయి.

అలవాటు తప్పిన ప్రాణం… అనంతది. కాలు జారి పడబోయాడు. రాళ్ల సందుల్లో నుంచి పుట్టు కొచ్చిన చిన్న వేప కొమ్మను పట్టుకుని నిలబడ్డాడు.

గుట్టపైన ఉండే పెద్ద కొలను గుర్తుకు వచ్చింది.

‘దాని నిండా తామర పూలే. సావాసగాళ్లతో పాటు కొలనులో ఎగిరెగిరి దూకే వాళ్లం. ఆడామగా తేడా లేదు. ఊర్లో పిల్లలంతా గుట్టమీదకి వచ్చి ఆకలి అయ్యేంతవరకు ఈతకొట్టి డబ్బాల్లో తెచ్చుకున్న మురుకులు, జేబుల్లో వేసుకొచ్చిన సెనిక్కాయలు తినేవాళ్లం. హరిణి మంచి ఈతగత్తె. నాకు ఇష్టమని తెల్ల తామర పువ్వు కోసుకొచ్చి ఇచ్చేది…’ తలుచుకుంటూ చిన్నగా గుట్ట మీదకి చేరినాడు.

ఎవరో ఆత్మీయులు పెనవేసుకున్నట్లు గాలి చుట్టేసింది. ఒళ్లు పులకరించింది.

అక్కడే ఒక పెద్ద బండ రాయి మీద కూర్చున్నాడు.

మిట్ట మధ్యాహ్నం అయ్యింది.

ఆవులు వచ్చి చెట్ల కిందకి చేరాయి. వాటి వెనుకే మేపే వాళ్లూ వచ్చారు.

ఎప్పుడూ నిండు నీళ్లతో కళకళలాడే కొలను ఎండిపోయి ఉంది. రాళ్లు, రప్పలు, చెత్త, చెదారం నిండి ఉంది.

బాధగా కొలను వైపు చూశాడు. ‘ఏడవటం ప్రారంభిస్తే… కొలను నిండి పోతుందేమో’ అన్నట్లుగా ఉంది. గుట్టమీదికి అప్పుడే వచ్చిన ఐలురాజును అడిగాడు ‘‘పశువులకు నీళ్లు కావాలంటే ఏమి చేస్తారు?’’అని.

‘‘మన ఊరు పక్కన ఆవులకు మంచి మేత దొరకడం లేదు. ఈ గుట్ట మీదనే వాటికి కొద్దోగోప్పో దొరుకుతోంది. అందుకని ఇంత దూరం తోలుకొస్తున్నాము.

ఎండాకాలం, వానాకాలం అని లేదు. కరువు కాలంలో కూడా ఈ కొలను ఎండిరది చూడలేదు. ఎప్పుడూ ఈ కొలను నీళ్లతో కళకళలాడేది.

అయితే నాలుగైదు ఏళ్లుగా ఈ కొలనులో నీళ్లు ఉండటం లేదు. బాగా వానలు కురిస్తే, కొంచెం నీళ్లు నిలుస్తాయి. ఎండ వస్తే మామూలే’’ అని బదులిచ్చాడు ఐలురాజు.

‘‘అయినా ఏటి పక్కన ఉండే మన ఊర్లో నీళ్లకి కరువు లేదు కదా. అందరి బావుల్లోనూ నీళ్లు ఉంటున్నాయి కదా….’’ అంటూ ఆవులవైపు చూశాడు అనంత.

ఒక ఆవుకి బాగా దాహమేసింది. దిక్కుతోచక అది ‘అంబా’ అని అరుస్తూ గుట్టంతా పరుగులు తీసింది. దాని బాధ చూడలేక తను తెచ్చుకున్న సొరకాయ బుర్రలోని నీళ్లు దాని నాలుక మీద పోశాడు ఐలు రాజు. అది చూసి మరికొన్ని ఆవులు పరుగెత్తతా వచ్చాయి.

‘మాకే లేదు నాకుడు బెల్లం… మీకెక్కడ తెచ్చేది గోకుడు బెల్లం’ అని కట్టె తీసుకుని వాటిని తరిమినాడు ఐలురాజు. రాయి విసిరితే పిట్టలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయినట్లు అవి చెల్లాచెదరు అయిపోయాయి.

కానీ వాటి చూపులన్నీ సొరకాయ బుర్ర పైనే ఉన్నాయి. మరికొన్ని ఆవులు చొంగ కారుస్తూ, గెస పోసుకుంటున్నాయి. వాటి ఒంట్లో నీళ్లు లేక, కళ్లు లోపలికి ఈడ్చుకు పోయి ఉన్నాయి.

‘మనం ఏమీ చేయలేమా…’ అని ఆలోచనల్లో పడినాడు అనంత.

ఇంతలో ఐలురాజు కూతురు నెత్తిమీద బిందె పెట్టుకుని వచ్చింది. ఆవుల్ని తోలుకొచ్చిన వాళ్లు అన్నం తిన్నాక, చేతులు కడుక్కోవటానికి, తాగటానికని.

చిన్న దొన ఒకటి ఉంటే దానిలో సగం బిందె నీళ్లు పోసింది. ఆవులు పరిగెతు ్తకుంటూ వచ్చి నాలికల్ని తడి చేసుకుంటున్నాయి.

అప్పుడు వచ్చింది అనంతకి మెరుపులాంటి ఆలోచన.

‘మన ఊరి పశువులకి మంచి మేత దొరికేది ఈ బోడి గుట్టమీదే. మేత అయితే దొరుకుతోంది కానీ… దప్పికకు అల్లాడి పోతున్నాయి. కింది నుంచి నీళ్లు… పైకి తెప్పిస్తే…’

చిన్నగా లేచాడు.

గుట్టమీదినుంచి కిందికి చూశాడు. ఊరి చుట్టూ పెద్దపెద్ద బావులు. నిండు కుండల్లా పుష్కలంగా ఉన్నాయి. ఊరి ముందరి ఏటిలో కూడా నీళ్లు కావలసినన్ని ఉన్నాయి.

వెంటనే తన మిత్రుడైన సివిల్‌ ఇంజినీర్‌కి ఫోన్‌ చేశాడు. తన ఆలోచన చెప్పాడు. అతడి సహాయంతో పని ప్రారంభించాడు.

మొత్తం గుట్ట రెండువందల అడుగులపైనే ఉంది. ప్రతి డెబ్భై అడుగులకీ ఒక నీటి తొట్టె ఏర్పాటు చేయించాడు. మొత్తం మూడు తొట్టెలు, వాటికి మోటార్లు ఏర్పాటు పెట్టించాడు. పైపుల ద్వారా నీరు కొలనుకు చేరుతుంది.

గుట్ట కింద ఉండే తమ అనంతరాజు బావికి మోటార్‌ పంపు బిగించాడు. అక్కడి నుంచి నీళ్లు మొదటి తొట్టెలోకి చేరుతాయి. అక్కడినుంచి వరుసగా ప్రతి తొట్టెలోకీ వెళ్లి చివరిగా గుట్టమీది కొలనులోకి చేరుతాయి.

 * * * * *

కొలనులో నీళ్లు నింపే రోజు రానే వచ్చింది.

ఊరు ఊరంతా గుట్ట మీదికి చేరింది.

చిన్న బండ మీద నిలబడ్డాడు అనంత.

‘‘మన ఊరి గుడి గోడ కట్టించమని అడిగారు మన ఊరి వాళ్లు. నాకెందుకో… మన ఊరికి మరింత ఉపయోగపడేది చేయాలనిపించింది. గుడి గోడ నేను కాకపోతే మరొకరు కట్టిస్తారు.

బోడి గుట్టకు నేను వెళ్లినప్పుడు పశువులు నీళ్లకు తల్లడిల్లడం చూశాను. వాటి బాధను చూసిన నాకు ‘అయ్యో!’ అనిపించింది. ‘మేత కోసం గుట్ట ఎక్కే ఆవులకి నీళ్లు దొరక్కపోతే ఎలా…?’ అనే ఆలోచనలో నుంచి పుట్టింది ఈ తాగునీటి పైపుల కార్యక్రమం. అందుకే నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఈ ఏర్పాటు చేశాను.

పాడి మన ఊరి ప్రాణం. మన ఊరి రైతు లందరూ పశువులపైనే ఆధారపడి ఉన్నారు. పాడిని కాపాడుకుంటే పది రూపాయలు సంపాదించుకుంటారు. నోట్లోకి నాలుగేళ్లూ పోతాయి.

మేపిన దాన్నిబట్టి పశువులు పాలు ఇస్తాయని మనకందరికీ తెలుసు. కాబట్టి మనం వాటి ఆలనాపాలనా చూసుకోవాలి’’ అన్నాడు.

పలకలు మోగాయి. టపాకాయలు పేలాయి. రంగులు చల్లినారు. ఈలలు వేసినారు. అనంతపై పూల వర్షం కురిపించారు.

‘మెట్లు లేని మిద్దె మీదికి ఏనుగును ఎక్కించినంత పని చేసినావని’ పొగిడినారు. కుండల్లో తెచ్చిన జున్ను అందరికీ పంచినారు.

ఊరి పెద్దలు మోటార్‌ స్విచ్‌లు నొక్కారు.

నీళ్లు జోరుజోరుగా కొలనులోకి చేరుతున్నాయి.

పిల్లలు నీళ్లల్లో నిలబడి కేరింతలు కొడుతున్నారు.

ఆవులు పక్కగా నిలబడి నీళ్లు తాగుతూ ఉన్నాయి.

మెరుపు ముఖంతో నిలబడి ఉన్నాడు అనంత. ఊర్లో వాళ్లు ముద్దబంతుల మాల తెచ్చి అనంత మెడలో వేశారు.

‘‘ఆలోచన, డబ్బు నాది కావచ్చు. కానీ బాధ్యతగా పని పూర్తి చేసిన సివిల్‌ ఇంజినీర్‌ సహాయం మరువలేనిది’’ అంటూ తన మెడలోని పూలమాల తీసి ఇంజినీర్‌కి వేశాడు.

ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఇంజినీర్‌ ‘‘ఇంతమంచి ఊరికి నాకూ ఏదో చేయాలనిపిస్తోంది. మీరు అవకాశమిస్తే… నా స్వంత డబ్బుతో గుడి గోడ నేను కట్టిస్తాను’’ అని చెప్పడంతో ఊరివాళ్లు చప్పట్లు కొట్టినారు.

ఇంతలో ఓ తేనెరంగు ముఖం పిల్లవాడు ఊరి చెరువులోని తెల్ల తామర పూలు తెచ్చి అనంత చేతికిచ్చాడు.

దూరంగా హరిణి నవ్వుతూ నిలబడి ఉంది.

వచ్చేవారం కథ..

సమానో మంతః – అవని సంబరాజు

About Author

By editor

Twitter
YOUTUBE