పేరుప్రతిష్టల కోసమో, సాహిత్యరంగంలో తనదైన స్థానం కోసమో పాకులాడకుండా, ప్రకృతి ఎంత సహజంగా, నిశ్శబ్దంగా తన పని తాను చేసుకు వెళుతుందో బంకించంద్రుడు కూడా తన పని మీద మమకారంతో అలాగే చేశారు. ఆయన తన కోసమంటూ ఏ లక్ష్యమూ పెట్టుకోకుండా, తాను ఎంత మంచి సాహిత్యం ఇవ్వగలరో అంత మంచి సాహిత్య సృష్టికి శ్రమించారు. ఆయన తనదైన భాషను, సాహిత్యాన్ని సృష్టించారు. అలాగే ఒక దేశాన్ని కూడా నిర్మించారు’ అన్నారు అరవింద్‌ ‌ఘోష్‌. ‌నిజమే, బంకించంద్ర చటర్జీ అద్భుత గేయం ‘వందేమాతరం’ భారత స్వరాజ్య సమరాన్ని విజయపథంలో నడిపి స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించింది. ఆ విధంగా అరవిందులు బంకించంద్రుని కేవలం సాహిత్య నిర్మాతగానే కాదు, ఒక దేశ లేదా స్వతంత్ర జాతి నిర్మాతగా కూడా చరిత్ర పుటలలో నిలిపే మహోన్నత ప్రయత్నం చేశారు. ఆధునిక భారతీయ సాహిత్య స్రష్టలలో, పునరుజ్జీవనోద్యమంలో బంకించంద్ర (1838-1894) అగ్రగణ్యులు. పందొమ్మిదో శతాబ్ది పూర్వార్థంలో బెంగాలీ సాహిత్యాన్నే కాక, భారతీయ భాషా సాహిత్యాలన్నింటినీ గొప్పగా ప్రభావితం చేశారు.

బంకించంద్ర బెంగాల్‌లో సంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. తండ్రి యాదవచంద్ర ఛటోపాధ్యాయ బ్రిటిష్‌ ‌ప్రభుత్వంలో ‘మిడ్నపూర్‌’‌లో డిప్యూటీ కలెక్టర్‌. ‌తల్లి దుర్గాదేవి, సనాతన సదాచార గృహిణి. బంకింబాబు ముగ్గురన్నదమ్ముల్లో చివరివాడు. విద్యాభ్యాసం హుగ్లీ జిల్లా మిషన్‌ ‌కళాశాలలో, కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో సాగింది. 1857 తరువాత ఆంగ్లేయులు కలకత్తాలో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన తొలి పట్టభద్రుడు బంకించంద్ర. తర్వాత న్యాయశాస్త్ర పట్టభద్రుడయ్యాడు. ఆయన తండ్రిలాగా ‘కెస్యూర్‌’‌లో డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ నిర్వహణలో బ్రిటీషువారికి పరమ విధేయుడనిపించుకోకుండా, తన స్వతంత్రతకు భంగం కలుగకుండా, అవసరమైన చోట్ల వారిని ఎదిరించి ఉద్యోగ విధులు నిర్వర్తించాడు. అయినా ఆయన మరణించేముందు భారతదేశంలో అత్యున్నతమైన సి.ఐ.ఇ బిరుదుతో ఇంగ్లీషు ప్రభుత్వం ఆయనను సత్కరించింది.

రచనా వ్యాసంగం – రచనలు

ఆయన సాహిత్యకృషి కవితా రచనతో ప్రారంభమైంది. ‘ఈశ్వరచంద్ర గుప్తా’ స్ఫూర్తితో రచనలు చేశాడు. ఆధునిక విద్యావంతులను ఆకర్షించేందుకు కవిత్వం కంటే నవలా పక్రియ ఉత్తమమని భావించారు. ఆయన ఊహ నిజమైంది. ఆయన బెంగాలీ భాషలో 14 నవలలు, ఇంగ్లీషులో ఒక నవల రాశాడు. 1865లో ఆయన రాసిన ‘దుర్గేశ నందిని’ ప్రణయ శృంగారాత్మక నవల. దీన్ని తొలి బెంగాలీ నవలగా విమర్శకులు నిర్ధారించారు. ఆయన నవలల్లో ‘కపాలకుండలి’, ‘మృణాళిని’, విషవృక్షం, ‘కృష్ణకాంతుడి వీలునామా’, ‘చంద్రశేఖర్‌’, ‘‌రాజసింహ’ వంటివి ప్రసిద్ధాలు. ఆయన ‘ఆనంద మఠం’ భారతీయ సాహిత్యంలో సంచలనాత్మక నవలగా ప్రసిద్ధి పొందింది. భారతీయ భాషలన్నింటిలో అది అనువదించబడింది.

ఆనందమఠం నవల-రచనా నేపథ్యం

భారతీయ పురాణాలు, ఆర్షధర్మం స్త్రీను దేవతగా ఆరాధిస్తాయి. తల్లిగా, సోదరిగా ఆమెను ప్రతి కుటుంబం ఎంతో గౌరవిస్తుంది. కానీ బంకించంద్ర దేశాన్ని మాతృమూర్తిగా భారతీయుల హృదయాల మీద చిత్రించారు. వందేమాతర గేయం సారాంశం, తాత్త్వికత, భావం ఇదే. మాతృభూమి అంటే ఆరాధ్యదేవతగా ఆవిష్కరించారాయన. బంకించంద్ర తన సృజనాత్మక రచనలకు ప్రాచుర్యం కల్పించుకొనే వేదికగా ‘వంగదర్శన్‌’ అనే పత్రికను 1872 ఏప్రిల్‌ ‌నెలలో ప్రారంభించాడు. ప్రారంభ సంచిక పూర్తిగా ఆయన రచనలకే పరిమితమైంది. అందులో ధారావాహిక నవలలు, కథలూ, వ్యాసాలూ, కవితా ఖండికలూ, సాహిత్య విమర్శ, పుస్తక సమీక్షలకు ప్రాధాన్యం ఉండేది. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చిన నవల ‘ఆనందమఠం’ 1882లో వంగదర్శన్‌ ‌పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. ఈ నవలా రచనకు ప్రేరణ కలిగించిన ‘వందేమాతరం’ గీతం ప్రస్తావన నవల్లో అనేకసార్లు వస్తుంది. ఈ గీతాన్ని ‘వంగదర్శన్‌’ ‌పత్రికలో ఖాళీ పేజీని పూరించేందుకు యాదృచ్ఛికంగా రాశాడు. ఆ గీతాన్ని రవీంద్రనాథ్‌ ‌గొప్పగా స్వరపరచాడు. ఆ గీతం స్వాతంత్య్ర సమర శంఖా నినాదమై బ్రిటీషువారి గుండెలవిసేలా ప్రతిధ్వనించింది. కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి ప్రదీప్తగీతంగా మార్మ్రోగింది.

ఈ నవలా రచనకు మూలం భారతదేశంలో జరిగిన సన్యాసుల తిరుగుబాటు. దీనితో పాటు 1770 నాటి ఘోరమైన బెంగాల్‌ ‌కరవును ఈ నవలకు నేపథ్యంగా ఉంటుంది. ఉత్తర భారత దేశంలో 1773లో కొందరు సన్యాసులు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వాన్ని కులద్రోయడానికి పూనుకున్న సంఘటన, అలాగే స్వాతంత్య్ర సమర చరిత్రలో ప్రథమ స్వాతంత్య్ర సమరంగా నిలిచిన 1857 నాటి సిపాయీ కలహం ప్రేరణ కలిగించాయి. ఈ ప్రేరణల ప్రభావాలతో అప్పటి బ్రిటీషు అధికారుల పన్నుల పీడింపు, కరువు కాటకాల్లో ప్రజలు ఆక్రందనలతో చలించి ఈ నవలా రచనకు పూనుకున్నాడు బంకించంద్ర.

భారత స్వాతంత్య్రోద్యమ సమయంలో ఈ నవల భారతీయుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని పొందింది. భారతీయ భాషలన్నింటితోపాటు, తెలుగులో కూడా అనూదితమైంది. తెలుగుభాషలో మొట్టమొదటి సారిగా జి.వి.యస్‌. ‌దొరస్వామయ్య అనువాదం (1907) చేశాడు. తర్వాత వేంకటపార్వతీశ్వరకవులు, తల్లాప్రగడ సూర్యనారాయణ, చాగంటి శేషయ్య వంటి ప్రముఖులు అనువదించారు. రమేష్‌ 1950 ‌ప్రాంతాల్లో బెంగాలీ, హిందీప్రతుల ఆధారంగా చేసిన అనువాదం మూలానికి దగ్గరగా ఉందన్న ప్రసిద్ధి పొందింది. ప్రముఖ కథా, నవలా రచయిత, పరిశోధకుడు డా।। అక్కిరాజు రమాపతి రావు ఆకర్షణీయమైన శైలిలో అనువదించి ఆరునెలల పాటు ఆంధప్రభ దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించి పాఠకుల ప్రశంసలందుకున్నారు.

పాత్రచిత్రణ

 నవలకు పాత్ర చిత్రణ ప్రధానం. బంకించంద్ర పాత్ర చిత్రణ విషయంలో ఉదాత్త శిఖరాలను అధిరోహించాడనటంలో అతిశయోక్తి లేదు. ఉదాత్తాశయాలు, ఉజ్జ్వల భావాలు, ధీరోదాత్త సాహసం, మానవాతీతమైన మహోన్నత త్యాగం ఆనందమఠం నవల్లో ఆయన చిత్రించిన పాత్రల్లో సాక్షాత్కరిస్తుంది. ఆయన స్త్రీ పాత్రలు కూడా ధీరలు, త్యాగధనులు, దేశభక్తి పరాయణులు. సన్యాసులకూ, సంక్షుభిత సమాజానికీ ఉన్న బంధం ఏమిటో ఈ నవలలో ఆవిష్కరించారు రచయిత. సమాజం తనదైన లక్షణాలను, నాగరికతను, ధర్మాన్ని కోల్పో తున్నప్పుడు ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడం సన్యాసులు చేయవలసినది కాదని ఈ నవలలో చెప్పారని అనిపిస్తుంది. సంతానుల ఉద్యమదీక్ష నాయకుడు సత్యానంద తపస్సంపన్నుడు. ఆయనలో సంయమనం, పరమత సహనం ప్రశంసనీయాలు. మాతృదేశ పరిరక్షణాచిత్తులై ఉద్యమంలో జీవనానంద, భవానంద, ధీరానందులు సర్వసంగ పరిత్యాగులై ఆయనకు బాసటగా నిలిచారు. విజయ కారకులయ్యారు. పదచిహ్నలో సంపన్న కుటుంబీకుడైన మహేంద్రసింగ్‌ ‌దీక్షా నియమబద్ధుడై విజయా నంతరం స్వామి మెప్పు పొందాడు. రచయిత, భవానందుడి పాత్రలో పరిణామాన్ని గొప్పగా చిత్రీకరించాడు. అతడు దీక్షా నియమ విరుద్ధంగా ప్రవర్తించి ప్రాయచిత్తంగా ప్రాణత్యాగం చేసుకున్నాడు.

స్త్రీ పాత్రల్లో ‘శాంతిని’ ధీరగా, బహుభాషా ప్రావీణ్యంగా, సాహసోపేతగా, త్యాగధనిగా తీర్చిదిద్దాడు. కల్యాణిని ఉదాత్త త్యాగ తత్పరగా, పతిభక్తి పరాయణగా, భర్త ఆశయ సిద్ధికి అసువులు బాసేందుకు సిద్ధమైన త్యాగమూర్తిగా చిత్రించాడు.

బంకించంద్ర ఆనందమఠం నవలను ఉత్తమ పురుష, ప్రథమ పురుష కథనాలతో, నాటకీయ సంవిధానంతో ఆకర్షణీయమైన శైలిలో రాశాడు.

తెలుగు నవలా సాహిత్యంపై ‘ఆనందమఠం’ ప్రభావం

బంకించంద్ర ఛటర్జీ ప్రభావం 20వ శతాబ్ది మొదటి దశాబ్దిలో తెలుగు రచయితలపై ప్రగాఢంగా ఉంది. విజ్ఞాన చంద్రికామండలి 1901లో చారిత్రక నవలలు పోటీ నిర్వహించింది. ఆ సందర్భంగా వచ్చిన వేంకట పార్వతీశ్వర కవుల ‘మాతృ మందిరం’పై ఆనందమఠం ప్రభావం ఉంది. భోగరాజు నారాయణమూర్తి రాసిన ‘విమలాదేవి’, ‘అంగరాజ్యం’ నవలలపై గాఢంగా ఉంది. విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ నవలలో బంకిచంద్‌ ‌స్ఫూర్తితో పరభాష, పరప్రభుత్వ, పర సంస్కృతుల మోజు ఏ విధంగా సంప్రదాయ విచ్ఛిన్నతకు దారి తీస్తుందో వివరించి, వాటిని నిరసించాడు. ఉన్నవ వారి మాలపల్లిలో (1922) బంకించంద్రుని అనుస రించిన సంఘటనలున్నాయి.

ఆనందమఠంలోని ‘వందేమాతరం’ గీత ప్రభావం జాతీయోద్యమ గీతాలపై గొప్పగా ఉంది. రాయప్రోలు వారి ‘‘నమస్తే మంగళమహి శ్రీ మహా మాతృభూమే’’ ఆంధ్ర భారతి (1910), కృష్ణశాస్త్రిగారి ‘జయ జయ ప్రియభారత జనయిత్రీ (1930) వంటి గీతాలు ‘వందేమాతరం’ స్ఫూర్తితో వచ్చాయి.

‘వందేమాతరం’ గీతంతో ప్రభావితుడు కాని తెలుగు రచయిత లేడంటే అతిశయోక్తి కాదు. బంకించంద్రుని ఆనందమఠం ప్రతి ఒక్కరూ విధిగా చదవదగిన గొప్ప నవల.

-డా।।పి.వి.సుబ్బారావు

విశ్రాంత అధ్యాపకుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE