యువత సమాజం పట్ల, రాజకీయంగానూ ఎంత చైతన్యంతో ఉందనే విషయానికి విద్యార్ధి ఉద్యమాలు ప్రతీకగా ఉంటుంటాయి. ఈ ఉద్యమాలను ఏ దేశామూ తప్పించుకోలేదు. నిన్న కాక మొన్న అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలన్నింటిలో పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన ఉద్యమాలను ఇంకా మరువక ముందే మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో ఒకటి ప్రారంభమైంది. నిజానికి, పలు సందర్భాల్లో మార్పునకు పునాదిగా ఉండేది ఈ ఉద్యమాలే. 2018లో షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పోరాడిన యోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉధృతంగా ప్రారంభమైన విద్యార్ధి ఉద్యమం హింసాత్మకంగా మారడంతో సుప్రీం కోర్టు కలుగచేసుకొని వాటిని ఐదుశాతానికి తగ్గించడంతో అక్కడ కొంత శాంతి ఏర్పడేందుకు అవకాశం లభించినట్లైంది.
బంగ్లాదేశ్‌లో విద్యార్ధి ఉద్యమాలు కొత్తకాదు. నిజానికి ఆ దేశం ఏర్పడిరది ఢాకా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభమైన ఉద్యమం కారణంగానే. నాటి పాకిస్తాన్ ప్రభుత్వం తమకు అందవలసిన అధికా రాన్ని అందనివ్వడం లేదన్న కారణంగా ప్రారంభమైన ఆ ఉద్యమం, యుద్ధంగా మారి తదనంతరం బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పడిరది. నిజానికి 1971 బంగ్లా స్వాతంత్య్ర యుద్ధంలో వారు చేసిన త్యాగాలు తక్కువేమీ కాదు. ఇందులో దాదాపు 30 లక్షల మంది బెంగాలీలు మరణించగా, 40 లక్షల మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 1971 విముక్తి యుద్ధం చేస్తున్న వారిపైకి పాకిస్తానీ సైన్యం రజాకార్లను ఉసిగొల్పింది. వీరంతా కూడా పాకిస్తానీ అనుకూల బెంగాలీలు, ఉర్దూ మాట్లాడే బీహారీలు. ఈ రజాకార్లు తెలంగాణలో లాగే ఆ సమయంలో అత్యంత క్రూరమైన హత్యలకు, అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడ్డారు. అందుకే, బంగ్లాలో దానిని ఒక ప్రతికూల మాటగా పరిగణిస్తారు. చర్చలకు రాకుండా ఉద్యమిస్తున్న విద్యార్ధులను రజాకార్లతో ప్రధాని షేక్ హసీనా పోల్చడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుని ఉద్యమం తీవ్రం, హింసాత్మక మైంది. ఈ నిరసనలలో వందమందికి పైగా విద్యార్ధులు మరణించినట్టు వార్తలు చెబుతున్నాయి.
1971 నాటి స్వాతంత్య్ర యుద్ధంలో పోరాడిన వారి కుటుంబాలకి బంగ్లా ప్రభుత్వం ప్రభుత్వో ద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. నిజానికి 2018 వరకు బంగ్లాదేశ్‌లో 56శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. ఇందులో వికలాంగు లకు ఒక శాతం, ఆదివాసులకు 5 శాతం, మహిళ లకు 10 శాతం, వెనుకబడిన జిల్లాలకు చెందిన వారికి 10 శాతం, బంగ్లా విముక్తి యుద్ధంలో పోరాడిన వారి కుటుంబాలకు 30 శాతంగా ఉండేవి. దీనితో నిజమైన ప్రతిభ కలిగిన వారికి 44శాతం స్థానాలు మాత్రమే మిగిలేవి. ఇందుకు వ్యతిరేకంగా 2018లో విద్యార్ధి సంఘాలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో నాటి షేక్ హసీనా ప్రభుత్వం మొత్తం కోటాలనే రద్దు చేసింది. కానీ కోర్టులు తిరిగి వాటిని పునరుద్ధరించడంతో సమస్య ప్రారంభమైంది.
కాగా, ఈ నిరసనల నేపథ్యంలో అనేక యూని వర్సిటీలు మూతపడగా, ఇంటర్నెట్‌ను నిలిపివేసి, అందరినీ ఇంట్లోనే ఉండమంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మీడియా కూడా సరైన సమాచారాన్ని తెలుసుకోలేకపోతోంది. అయితే, ఉన్నత న్యాయస్థానం రిజర్వేషన్ కోటాను తగ్గించడాన్ని మంచి నిర్ణయంగా బంగ్లా న్యాయశాఖ మంత్రి అనిసుల్ అల్‌హక్ కొనియాడారు. రాజ్యాంగ వ్యతిరేకంగా హింస, తీవ్రవాదం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని అజెండా కలిగినవారు ఈ విద్యార్ధి ఉద్యమాన్ని సాకుగా తీసుకునే అవకాశ ముందని, ఈ ఉద్దేశాన్ని 2013 నుంచి ఆ రాజకీయ ముఠా దీనిని ప్రదర్శిస్తూనే ఉందంటూ ఆయన విమర్శించారు.
హింసతో, రాజకీయాలతో సంబంధంలేని కోటా వ్యతిరేక ఉద్యమకారులను అడ్డుగా పెట్టుకొని గత కొద్ది రోజులలో వారు ప్రేరేపించిన హింసతో ఈ అనుమానం నిజమేనని తేలిందని బంగ్లా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. నిరసనకారులు తమ 8 డిమాండ్‌లను ప్రభుత్వానికి లిఖితరూపంలో అందించారని, ప్రభుత్వం దానికి పరిష్కారం కనుగొనడం అసాధ్యం కాదని భావించిందని కూడా ఆ ప్రకటన పేర్కొనడం గమనార్హం. దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో విద్యార్ధి సంఘాలకు ఎటువంటి సంబంధం లేదని వారి కోఆర్డినేటర్లు స్పష్టంగా చెప్పారని, ఇతర పార్టీల విధ్వంసకర చర్యలకు, తమ శాంతియుత ఉద్యమానికి మధ్య తేడా ఉందని కూడా వారు స్పష్టం చేశారని కూడా ప్రభుత్వం వెల్లడిరచడం ద్వారా ప్రతిపక్షాలకు, ఇస్లామిక్ గ్రూపులకు తమకు విషయం తెలిసిందనే సందేశాన్ని పంపింది.
ఈ నిరసనల నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. బంగ్లాదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తగలబెట్టడం, జాతీయ టెలివిజన్ కేంద్ర కార్యాలయాల లూటీ, అగ్నికి ఆహుతి చేయడం, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రా లను, పోస్టు ఆఫీసులను, పాస్‌పోర్టు ఆఫీసులను అల్లరిమూకలు ధ్వంసం చేశాయి.
ఆర్ధిక సంక్షోభంలో దేశం
ప్రస్తుతం బంగ్లాదేశ్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని మగ్గుతోంది. ద్రవ్యోల్బణం పదికి పైనే ఉండగా, వృద్ధి మందగించి, చైనాకు కట్టవలసిన అప్పులపై వడ్డీలు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చైనా అప్పుల ఉచ్చులో చిక్కుకుని శ్రీలంక సహా పలు దేశాలు ఎలా విలవిలలాడాయో మనం చూశాం. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆ మార్గాన్నే ఎక్కుతున్నట్టు కనిపిస్తోంది.
ఇటీవలే ప్రధాని హసీనా ఈ సమస్యలను కొంతైనా పరిష్కరించుకునేందుకు చైనా పర్యటనకు వెళ్లడం, అర్థంతరంగా తిరిగి రావడం మనకు తెలిసిందే. ఆమె చైనా నుంచి 5 బిలియన్ డాలర్ల రుణాన్ని, అప్పులపై వడ్డీల చెల్లింపులో కాస్త సరళీకరణలను ఆశిస్తూ వెళ్లారు. మూడు రోజుల చర్చల అనంతరం, చైనా కేవలం 137 మిలియన్లను మాత్రమే అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించింది. చైనా పీనాసితనం, మరోవైపు దేశంలో పెరుగుతున్న అశాంతి కారణంగా ఆమె తన పర్యటనను రద్దు చేసుకొని బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. ఇటువంటి ఆర్ధిక పరిస్థితుల మధ్య ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ డిమాండ్ పెరిగింది. ఇంతటి సంక్షుభిత పరిస్థితుల్లో అంతో ఇంతో స్థిరత్వానికి హామీ ఇచ్చేవి ఇవేనని అక్కడి యువత భావన. ఇదే సమయంలో ఈ కోటా వ్యవహారం తెరపైకి రావడంతో అక్కడి విద్యార్థులలో అసంతృప్తి తీవ్రమై వీధులు పట్టారు.
భారత్ పట్ల వ్యతిరేకత
ఒకవైపు పాలక అవామీ లీగ్ ప్రభుత్వం భారత్‌కు అనుకూలంగా ఉండగా, ప్రతిపక్షాలు భారత్ పట్ల వ్యతిరేకతను పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కొందరు బంగ్లాదేశీ ఇన్ఫ్లూయెన్సర్లు, రాజకీయ నాయకులు మాల్దీవుల తరహాలో ‘ఇండియా ఔట్’ ప్రచారాన్ని ప్రారంభించాయి. తమ దేశంలో ప్రజాస్వామ్య స్థితి దిగజారిపోతున్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోకపోగా, షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు తోడ్పడు తున్నారంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఐఎస్‌ఐ అనుకూల బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బిఎన్‌పి) నాయకురాలు ఖలీదా జియా గెలవవలసిన ఎన్నికలను భారతీయ ‘రా’ తోడ్పాటుతోనే హసీనా ఈసారి గెలిచిందని అనేకమంది బంగ్లాదేశీయులు భావిస్తున్నారు.
బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో ముఖ్యమైంది, విస్మరించలేనిది. పైకి సాధారణంగా కనిపించే గ్రూపులు అంతర్గతంగా తీవ్రమైన ఇస్లామిక్ భావనలు కలిగి ఉండటం అన్నది మన దేశానికి భద్రతాపరమైన ముప్పుగా పరిణమించే అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పటికే, భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న దాదాపు రెండు కోట్లమంది బంగ్లాదేశీయులు చాలు ఇక్కడ అల్లర్లు ప్రారంభించి, పరిస్థితులను సంక్షుభితం చేయడానికి. నిజానికి భారత్, చైనాలు రెండూ నిశ్శబ్దంగా అంగీకరించే అరుదైన విదేశాంగ విధానం షేక్ హసీనాను అధికారంలో కొనసాగనివ్వడమని కొందరి విశ్లేషకులు భావిస్తుంటారు. ఈ ప్రాంతంలో స్థిరత్వానికి కీలకంగానూ, తీవ్రవాద వ్యతిరేకతకు పెట్టని కోటగానూ ఆమె ఉంటుందని వారు విశ్వసిస్తారు.
అల్లర్ల వెనుక అమెరికా హస్తం?
అయితే, యుఎస్, ఇతర పాశ్చాత్య దేశాలు పరిస్థితిని ఆ రకంగా చూడటం లేదు. తమ కన్నా భారత్, చైనాలతో హసీనా ఎక్కువ సన్నిహితంగా ఉండటాన్ని వారు భరించలేకపోతున్నారు. ఎలా అయినా హసీనాను అధికారానికి దూరం చేయాలని ప్రయత్నించిన అమెరికా, పాశ్చాత్య దేశాలు గత రెండు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్షాలను, అక్కడి మతోన్మాదులను రెచ్చగొడు తున్నాయనే విశ్లేకుల మాటల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే, బంగ్లాదేశ్, మయన్మార్, భారత్‌లోని మణిపూర్‌ను కలుపుకుని ఒక క్రైస్తవ దేశాన్ని సృష్టించేందుకు పాశ్చాత్య దేశాలు కుట్ర చేస్తున్నాయని సాక్షాత్తు షేక్ హసీనాయే ఆరోపించారు. అంతేనా, ఇటీవలే డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగి నప్పుడు అటువంటి భద్రతా వైఫల్యాన్ని అనుమతిం చిన యుఎస్‌ను ఎత్తిపొడుస్తూ హసీనా, విదేశాంగ మంత్రి ప్రకటనలు జారీ చేశారు. అవామీ లీగ్‌లో పలువురు నాయకులు, కార్యకర్తలూ కూడా ప్రస్తుతం హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేపట్టిన అల్లర్ల వెనుక సిఐఎ హస్తం ఉందని భావిస్తున్నారు.
భారత్ తన పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. రాజధాని ఢాకా వీధులు రక్తరంజితం అవుతు న్నాయి. ఇందుకు అక్కడ చక్కర్లు కొడుతున్న వదంతులే కారణం అన్నది నిర్వివాదం. దేశం మండి పోతుంటే హసీనా స్పెయిన్ పర్యటనకు వెళ్లిందని ఆగ్రహించిన అల్లరి మూకలు ఆమె ఇంటిపై దాడి చేసే యత్నం చేశాయి.
భారతీయ విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి
ఇదిలా ఉండగా అక్కడ పలు యూనివర్సిటీలలో చదువుతున్న భారతీయ విద్యార్ధులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో దాదాపు వెయ్యిమందికి పైగా విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. కాగా, దాదాపు 405 మంది విద్యార్ధులను జులై 19న సురక్షితంగా డాకీ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు ద్వారా వెనక్కి తెచ్చినట్టు మేఘాలయ ముఖ్యమంత్రి కోన్‌రాడ్ సంగ్మా వెల్లడిర చారు. అదే రోజున భారత ప్రభుత్వం ఢాకాలోని భారత హైకమిషన్ కార్యాలయం ఇచ్చే సూచనలు అనుసరించవలసిందిగా అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్ధులకు సందేశమిచ్చింది. బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయం సాయంతో విద్యార్ధులను పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు మార్గాల ద్వారా వెనక్కి తెస్తున్నారు.
మమత రాజకీయం
ఇదిలా ఉండగా, సిఎఎను (పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేకిస్తూనే, ఓట్ల కోసం రాష్ట్రాన్ని అక్రమ వలసదారులతో, ఇస్లామిస్టులతో నింపుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనలను ఆసరాగా చేసుకుని రాజకీయ పేలాలు వేయించుకునే యత్నం చేస్తున్నది. బంగ్లాదేశ్‌లో పరిస్థితి మానవీయ సంక్షోభంగా పరిణమించే అవకాశముందని, తమ రాష్ట్రం ఎప్పుడూ నిస్సహాయు లకు ద్వారాలు తెరిచే ఉంచి, ఆశ్రయమిస్తుందంటూ తన ఉద్దేశ్యాన్ని ప్రకటించింది. ఒకపక్క సిఎఎను వ్యతిరేకిస్తూనే, మరోవైపు సంక్షుభిత దేశం నుంచి పొరుగుదేశానికి వచ్చిన శరణార్ధులకు తోడ్పాటు, ఆశ్రయమివ్వాలనే ఐరాస తీర్మానాన్ని ఆమె ఉదహరించడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
దీనితో తక్షణం అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, ఇటువంటి వ్యవహారాలు రాష్ట్ర పరిధిలో ఉండవని, కేంద్ర పరిధిలో ఉంటాయనే విషయాన్ని ఆమెకు గుర్తు చేసింది. పొరుగుదేశంలో హింసకు గురవుతున్న ఏ హిందూ, సిక్కు, పార్సీ లేదా క్రిస్టియన్ శరణార్ధిని తాము తమ రాష్ట్రంలోకి అనుమతించమంటూ సిఎఎను ఆమె వ్యతిరేకించిన విషయాన్ని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద గుర్తు చేశారు. శరణార్ధులను అనుమతించే విషయంలో రాజ్యాంగం రాష్ట్రాలకు హక్కులు ఇవ్వలేదని, కేవలం భారత ప్రభుత్వానికే ఆ హక్కు ఉంటుందనే విష యాన్ని ఆమెకు జ్ఞాపకం చేయవలసి వచ్చింది.
– డి. అరుణ