సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి ఆషాడ బహుళ నవమి
29 జూలై 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
పెను తుపానులో, ఎదురుగాలిలో ఓడ నడిపే సరంగుకే అస్తిత్వ పోరాటం, దానిని నిలుపుకునే సామర్థ్యం జాజ్జ్వల్యమానంగా ఉంటాయి. వచ్చే సంవత్సరమే నూరో ఏటి మైలురాయి దగ్గరకు చేరుకునే మహోన్నత చారిత్రక సందర్భాన్ని దర్శించబోతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్ర ఇందుకు నిదర్శనం. బ్రిటిష్ ప్రభుత్వం నిఘా మధ్య, ఆపై స్వతంత్ర భారతదేశం లోను కార్యకలాపాలు సాగించింది సంఘం. నేటికీ అప్రతిహతంగా సాగిస్తున్నది. రేపూ సాగుతాయి. కానీ శ్వేతప్రభుత్వం కంటే, నల్లదొరల కాంగ్రెస్ ప్రభుత్వమే సంఘం దారిని కంటకప్రాయం చేసింది. గాంధీజీ హత్య నెపంతో, అత్యవసర పరిస్థితి కాలంలో, అయోధ్యలో కట్టడం కూలినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారు. మొదటి రెండు నిషేధాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ను కూకటివేళ్లతో పెళ్లగించే ఉద్దేశం కనిపిస్తుంది. స్వతంత్ర భారతంలో ఎక్కువ కాలం పరోక్ష నిర్బంధంలోనే ఆర్‌ఎస్‌ఎస్ మనుగడ సాగించింది. అందులో భాగమే ప్రభుత్వోద్యోగులు సంఘంలో చేరడం మీద ఉన్న నిషేధం. 1966లో ఇందిరాగాంధీ తెచ్చిన ఈ నిషేధాన్ని జూలై 9, 2024న కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తొలగించింది. ఇది చరిత్రాత్మక నిర్ణయం.
ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యులు కారాదంటూ ‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1964’ కింద మొదట 1966లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం తెచ్చింది. ఇందిర ఎంతో అసబద్ధంగా, క్రూరంగానే వ్యవహరించారు. ఒక దేశభక్త సంస్థను, ఏదో ఒక సందర్భంలో ఆమె తండ్రి నెహ్రూ, ఆ నెహ్రూకు మార్గదర్శకుడు గాంధీజీ మంచిమాటలు చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారామె. పైగా జమాత్ ఎ ఇస్లామ్‌ను, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒకే గాట కట్టారు. ‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1964’లో 1నుంచి 5 వరకు ఉన్న ఉప నిబంధనల ప్రకారం, ఎన్నికలలో భాగస్వాములైన రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉండే ఏ సంస్థలోను ఉద్యోగులు సభ్యులుగా ఉండరాదు. వాటి కార్యకలాపాలలో పాల్గొనకూడదు. మొదట లేకున్నా 1969లో ఆనంద్‌మార్గ్‌ను కూడా ఇందులో చేర్చారు. అత్యవసర పరిస్థితి కాలంలో ఈ నిబంధననే ఇంకాస్త కఠినం చేశారు. జూలై 3,4, 1975 ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్, జమాత్ ఎ ఇస్లాం, ఆనందమార్గ్, సీపీఐ (ఎంఎల్)లలో ప్రభుత్వోద్యో గులు సభ్యులు కారాదు. ఇది 1971 నాటి డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ మేరకు అమలులోకి తెచ్చారు. సంబంధం ఉన్నట్టు రుజువైతే ఏడేళ్లు జైలు, జరిమానా కూడా అనుభవించవలసి ఉంటుంది. కానీ జనతా ప్రభుత్వం హయాంలో ఈ నిషేధం ఎత్తివేసినా, ఇందిర తిరిగి అధికారంలోకి వచ్చాక మళ్లీ అక్టోబర్ 28, 1980న ప్రవేశపెట్టారు.
దేశంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు సీపీఐ, సీపీఐ (ఎం) అనుబంధ కార్మిక సంఘాల అదుపాజ్ఞలలో ఉండేవి. ఇప్పటికీ కొన్ని వాటి చెప్పుచేతులలోనే నడుస్తున్నాయి. బ్యాంకులు, తపాలా, కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమలు అన్నింటిలోను చిరకాలం ఆ సంఘాలే గుత్తాధిపత్యం సాగించాయి. వామపక్షాలు నామమాత్రంగా మిగిలినా నాటి కార్మిక సంఘాల క్రీనీడలు ఇప్పటికీ ప్రభుత్వాలను వేధిస్తున్నాయి. వాటి మీద లేని నిషేధం ఆర్‌ఎస్‌ఎస్ అభిమానుల మీద విధించాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు.
ప్రథమ ప్రధాని నెహ్రూ మొదలు ఇవాళ్టి రాహుల్ గాంధీ వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ను ద్వేషించేవారే. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందించి పబ్బం గడుపుకోవడం గాంధీ`నెహ్రూ వంశీకుల తొలి అర్హత. దేశం మీద ప్రేమ, ఇక్కడి జీవన విధానం పట్ల గౌరవం, సంస్కృతి ఎడల గాఢ అనుబంధం కలిగి ఉన్న ఏకైక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్. భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుడు తమ సోదరుడేనని భావించడమే స్వయం సేవకుల తొలిపాఠం. ఆర్‌ఎస్‌ఎస్ మత సంస్థ కాదని 1949లోనే భోగరాజు పట్టాభిసీతారామయ్య స్పష్టంగా చెప్పారు. గాంధీజీ హత్యానంతరం కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలతోనే, రాజ్యాంగబద్ధంగానే సంస్థ నడుస్తుందని నాడు పెద్దలు హామీ ఇచ్చి, అదే విధంగా నడిచారు. ఈ సందర్భంగా మైసూరు హైకోర్టు 1966లో ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యత్వం న్యాయాధికారి ఉద్యోగానికి అనర్హత కాజాలదని ఆ కోర్టు చెప్పింది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం సెక్యులరిజానికి వ్యతిరేకం కాదనీ, అహింసాయుత పంథాలోనే ఆ సంస్థ పనిచేస్తున్నదనీ అదే కోర్టు విస్పష్టంగా చెప్పింది. భారతదేశం సంఘాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకుంటున్న కాలమిది. మారనిదల్లా కాంగ్రెస్ ఆలోచనా ధోరణే. దేశ విద్రోహక చింతనలతో, అవినీతితో, విభజన రాజకీయాలతో, మాఫీయాల ప్రభావంతో సర్వ భ్రష్టమైన కాంగ్రెస్, సర్వోత్కృష్ణ సంస్థగా ప్రపంచం ముందు నిలిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించడమే ఈ శతాబ్దపు వికృతి. జాతీయతకు వ్యతిరేకంగా నిర్మాణమవుతున్న వాతావరణాన్ని స్వాగతించడానికి కాంగ్రెస్ కూటములు కడుతున్నది. నాలుగు స్థానాలకోసం, పది ఓట్లకోసం వందేమాతరం అనడానికి అంగీకరించనివారితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నది.
ఈ నేపథ్యంతో చూస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయం జాతి శ్రేయస్సును కోరేదే. స్వయంసేవకులు ఏ రంగంలో ఉన్నా దాని అస్తిత్వాన్ని రక్షించేవారే తప్ప, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంస్థల మాదిరిగా విధ్వంసానికి ఒడిగట్టే వారే కాదు. అయినా ఈ నిషేధం తొలగింపు లాంఛనమే. దేశం పట్ల కనీస జవాబుదారీతనం ఉన్న ఎవరైనా వారి మనసులో సంఘం ఉంటుంది. చేతలలో సంఘ కార్యం ఉంటుంది. అర్బన్ నక్సల్స్‌తో, దేశం పట్ల పౌరుడికో బాధ్యత ఉంటుందన్న స్పృహ కాస్తయినా లేని వారితో, లంచగొండులతో ప్రభుత్వ రంగాలు నిండిపోకుండా ఇది కాపాడుతుంది కూడా. సంఘ్ నిర్మాణం, ప్రయాణం, సిద్ధాంతం ఎప్పటికీ మార్గదర్శకమే. మౌన విప్లవానికి కేంద్ర బిందువు సంఘం.