ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర నూతన శాసనసభ జూలై 21న కొలువుదీరింది. సమావేశాల తొలిరోజు జూన్‌ 22‌న ప్రొటెం స్పీకర్‌ ‌గోరంట్ల బుచ్చయ్యచౌదరి  సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలిరోజు 172 మంది, మరునాడు ముగ్గురు   సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ కోలాహలం నెలకొంది.  శాసనసభ్యుల అనుచరులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. మీడియా గ్యాలరీతో సహా ఇతర గ్యాలరీలూ కిక్కిరిసిపోయాయి. ముఖ్యమంత్రి, శాసనసభా పక్షనేత చంద్రబాబునాయుడు తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ  తరువాత ఉప  ముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌, ఆ ‌తరువాత రాష్ట్ర మంత్రులు ప్రమాణం చేశారు. ఇంగ్లీషు అక్షర క్రమంలో మంత్రులు ఒకరి తరువాత మరొకరు ప్రమాణం చేశారు. ఆ తరువాత వైసీపీ  అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అంతకుముందు చంద్రబాబునాయుడు, పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రెండున్నరేళ్ల తరువాత సభలోకి అడుగుపెడుతున్న చంద్రబాబు తొలుత అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లారు. అనంతరం తన కార్యాలయానికి వెళ్లి అక్కడ వేదపండితుల ఆశీర్వచనం తీసుకొని శాసనసభలోకి ప్రవేశించారు. ఆయన హాల్లోకి రాగానే సభ్యులు ‘నిజం గెలిచింది- ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆయనకు స్వాగతం చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు కొంత ఉద్విగంగా కనిపించారు. నేరుగా పవన్‌ ‌కల్యాణ్‌ ‌సీటు వద్దకు వెళ్లి ఆయనను అలింగనం చేసుకున్నారు. ‘నారా చంద్రబాబు నాయుడు అను నేను’ అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా, సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ప్రమాణ స్వీకారానికి పవన్‌ ‌కల్యాణ్‌  ‌లేవగానే  టీడీపీ•, జనసేన, బిజెపి సభ్యులందరూ తమ సీట్ల వద్ద లేచి హర్షధ్వానాలు చేశారు. ‘కొణిదెల పవన్‌ ‌కల్యాణ్‌’ అం‌టూ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డిని మందడంలో రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో సీడ్‌ ‌యాక్సెస్‌రోడ్డు నుండి వెలగపూడి మీదుగా అసెంబ్లీ వెనుక రోడ్డు నుండి తీసుకొచ్చారు. పోలీసు అధికారుల సూచన, పార్టీ నాయకుల కోరిక మేరకు ఆయన్ను అటువైపుగా వచ్చేందుకు అనుమతించామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ‌లాబీలో తెలిపారు. తొలిరోజు కావడంతో జగన్‌ ‌వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించారు.

ఎవరెవరు ఎలా

ప్రమాణం చేసిన వారిలో వరుస క్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత మూడో వ్యక్తిగా ఉన్నారు. సభ్యుల్లో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, ‌మంత్రి కందుల దుర్గేష్‌, ‌లోకేష్‌ ‌ప్రమాణం చేశారు. క్యాబినెట్‌ ‌మంత్రి బీజేపీ ఎమ్మెల్యే వై,సత్యకుమార్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఎమ్మెల్యేల వరుసలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈశ్వరరావు (ఎచ్చెర్ల), విష్ణుకుమారరాజు (విశాఖ) నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (అనపర్తి) కామినేని శ్రీనివాస రావు (కైకలూరు), వైఎస్‌ ‌చౌదరి (విజయవాడ పశ్చిమ), పార్థసారథి(ఆదోని) ఆదినారాయణరెడ్డి (జమ్మల మడుగు) ప్రమాణస్వీకారం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ‌సభలోకి వచ్చే సమయంలోనూ, వెళ్లే సమయంలోనూ ఎమ్మెల్యేలు, వారితో వచ్చిన అనుచరులు ఫోటోల కోసం ఎగబ డ్డారు. వారిని మార్షల్స్ ‌కూడా నివారించలేక పోయారు. చివర్లోనూ పవన్‌ అసెంబ్లీ నుండి బయటకు వచ్చే సమయంలో చీఫ్‌ ‌మార్షల్‌ ‌గణేష్‌ అక్కడకు వచ్చి సర్దాల్సి వచ్చింది. ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ ‌బయటకు వెళ్లే సమయంలో ఎక్కువమంది సభ్యులు ఆయనను కలిసేందుకు ఎగబడ్డారు. లాబీలో అందరికీ సర్దిచెప్పుకుంటూ ఆయన ముందుకు వెళ్లాల్సి వచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలు వారి వినతులనూ లోకేష్‌కు అందించారు. అసెంబ్లీలో పార్టీలకు తాత్కాలికంగా కార్యాలయాలు కేటాయిం చారు. గతంలో టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయా నికి ఎదురుగా డిప్యూటీ స్పీకర్‌ ‌కోలగట్ల వీరభద్ర స్వామికి కేటాయించిన ఛాంబర్‌ను ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి, టీడీపీ కార్యాలయాన్ని జనసేనకు కేటాయించారు. అన్ని పార్టీలకూ త్వరలె కార్యాలయాలు కేటాయించనున్నారు.

సీ•ఎంగానే అసెంబ్లీకి వస్తానని గట్టిగా చెప్పా : చంద్రబాబు

ముఖ్యమంత్రిగానే శాసనసభకు వస్తానని చేసిన శపథాన్ని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. నవంబర్‌ 24, 2021‌న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కీలకమైన అంశాలపై చర్చ జరిగే సందర్భంలో నాటి అధికార వైసీపీ సభ్యులు ప్రతి పక్షనేత నారా చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో టీడీపీకి సంఖ్యాపరంగా ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ చంద్రబాబు అధికార పక్షంపై తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. వైసీపీ సభ్యులంతా ఆ సమయంలో చంద్రబాబుపై మరిన్ని విమర్శలు చేశారు. కొందరు మంత్రులైతే ఏకంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో సభలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. సభలో ఉన్న చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారపార్టీ సభ్యులపై నిప్పులు చెరగుతూ, ‘గౌరవంలేని కౌరవసభలో నేనుండలేను.. తిరిగి ముఖ్యమంత్రి గా సభలో అడుగుపెడతా..’ అంటూ శపథం చేసి భావోద్వేగంతో అ వెళ్లిపోయారు. 2019లో ఓటమి పాలైన టీడీపీని 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. అందుకు కూటమి ఏర్పడటం ఒక కారణమైతే చంద్రబాబునాయుడు కృషి, పట్టుదల, వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడలు, యువనేత నారా లోకేష్‌, ‌చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిల పోరాటాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వివిధ కేసుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్‌చేసి 53 రోజులు జైలుకు పంపింది. ఆ సమయంలో కూడా భువనేశ్వరి ఒంటరి పోరాటం సాగించారు. చంద్రబాబు కూడా విస్తృతంగా, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో పాటు ప్రజలకు స్పష్టంగా వివరించారు. ఆయన పట్టుదలే తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలోనే తిరిగి సభలో అడుగుపెడతానని చేసిన శపథాన్ని గుర్తు చేసుకుంటూ స••మారు 30 నెలల తర్వాత సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా పచ్చదనంతో నిండిపోయిన అసెంబ్లీలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెడుతుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు మర్యాద పూర్వకంగా లేచి నిలబడటంతో పాటు ఆయనకు చప్పట్లతో స్వాగతం పలికారు. ఆ సన్నివేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా  తిలకించిన ప్రజలు సైతం ‘దటీజ్‌ ‌చంద్రబాబు నాయుడు’ అంటూ గత సన్నివేశాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.

జగన్‌ ‌భావోద్వేగం

శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరైన వైసీపీ అధినేత జగన్‌ ‌నిరాశ, నిస్పృహతో కనిపిం చారు. ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన తడబడ్డారు. ఒకప్పుడు రాజులా శాసించిన ఈ అసెంబ్లీ భవనంలో ఇప్పుడు అధికారం కోల్పోయి కేవలం ఒక ఎమ్మెల్యేగా మిగలడం, తను నీచంగా చూసిన, హేళన చేసిన చంద్రబాబునాయుడు, పవన్‌ ‌కల్యాణ్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానాల్లో ఉండటంతో ఆయన సిగ్గు, అవమానంతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. ముఖంలో ఒత్తిడి, ఆందోళన కనిపించాయి. గతంలో ఆయన శాసనసభ ప్రధాన ద్వారం నుంచి ముఖ్యమంత్రి ఛాంబరుకు చేరుకునే వారు. 21 వ తేదీన జరిగిన సమావేశాల సందర్భంగా ఆయనను సాధారణ ఎమ్మెల్యేల తరహాలోనే సభలోకి పంపుతారని భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శాసనసభ వ్యవహారాలు, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, ‌నిబంధనలను సడలించి జగన్‌ ‌వాహనాన్ని మొదటి గేటు నుంచే అనుమతించాలని అధికారులకు సూచించడంతో పాటు వరుస క్రమంలో కాకుండా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్‌కు అవకాశమిచ్చారు. శాసనసభలో వైఎస్సార్‌ ‌సీఎల్పీ కార్యాలయాన్ని కూడా మార్పు చేశారు. గతంలో టీడీపీకి కేటాయించిన గదినే వైసీపీకి కేటాయించ టంతో సభా ప్రాంగణంలో రివర్స్ ‌సీన్‌ ‌సాక్షాత్క రించింది.

అటు వారిటు… ఇటు వారటు

 శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల కుర్చీలు తారుమారయ్యాయి. అటు వారు ఇటు.. ఇటు వారికి అటు సీట్లు కేటాయించారు. ఎన్నికల ముందు ఇదే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఓటాన్‌ అకౌంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల్లో భాగంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ‌ప్రసంగించారు. మరుసటి రోజున గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం.. ఓటాన్‌ అకౌంట్‌ ‌బడ్జెట్‌పై చర్చ అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్‌ ‌జగన్మోహన రెడ్డి ప్రసంగంతో సమావేశాలు ముగిసాయి. ఆ రోజుకు సభలో వైసీపీ పూర్తి స్థాయి మెజారిటీ 151 మంది సభ్యులతో బడ్జెట్‌ను ఆమోదించింది. ఏప్రిల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ ‌విడుదల కావటం మే 13న పోలింగ్‌ అనంతరం జూన్‌ 4‌వ తేదీన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి తిరుగులేని మెజారిటీతో 164 మందితో అధికార పగ్గాలు చేపట్టింది.. అప్పటి వరకు అధికారపక్షంగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావడమే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా సాధించలేదు. దీంతో గతంలో టీడీపీ నుంచి వైసీపీకి మద్దతిచ్చిన వారికి కేటాయించిన సీట్లనే ప్రస్తుతం వైసీపీకి కేటాయించారు. అప్పట్లో టీడీపీకి 23, జనసేన ఒక స్థానం గెలుచుకోగా టీడీపీ నుంచి ఇరువురు, జనసేన తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీకి మద్దతు పలికారు. అయితే టీడీపీకి 21 మంది సభ్యులు ఉండటంతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. ప్రస్తుత సభలో వైసీపీకి మాట్లాడే అవకాశం కూడా తక్కువే. ప్రధాన ప్రతిపక్షంగా 21 సీట్లతో జనసేన ముందుంటే తరువాత వైసీపీ, ఆపై 8 సీట్లతో బీజేపీ వరుస స్థానాల్లో ఉన్నాయి.

స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం

అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌, ‌మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ ‌యాదవ్‌ ‌స్పీకర్‌ ‌స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడుకి సభ్యులంతా అభినందనలు తెలిపారు. సభ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సభాపతిని గౌరవ సూచకంగా ఆయన స్థానం వరకు తీసుకు వెళ్లాలి. కానీ, వైసీపీ నాయకులు ఒక్కరు కూడా సభకు హాజరుకాలేదు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్యే జగన్‌ ‌సైతం ఈ సంప్రదాయాన్ని విస్మరించారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పిలుపుతో 25 ఏళ్ల వయసుల్లో రాజకీయాల్లోకి వచ్చి, 1983లో నర్సీపట్నం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలు పొందారు. మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. 16 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పదేళ్లపాటు సేవలందించారు.

సంప్రదాయాలకు పెద్దపీట : స్పీకర్‌

‌సభలో సంప్రదాయాలకు పెద్దపీట వేద్దామని సభ గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచుదామని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన కూటమి పార్టీల నేతలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ దఫా కొత్తగా 88 మంది సభ్యులు సభలో అడుగుపెట్టారని, మొద• సారి గెలిచిన వారికి సభలో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.

-టిఎన్‌. ‌భూషణ్‌

‌వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE