జాతీయవాదానికీ, ఉదారవాదానికీ జరిగిన పోటీ ఫలితమే

జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

ఒలింపిక్స్‌ క్రీడోత్సవాలు మొదలు కావడానికి మరొక మూడు వారాలు మాత్రమే సమయం ఉండగా, ఆ విశ్వ క్రీడోత్సవాలకు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్‌లో అసాధారణ రాజకీయ క్రీడకు తెర లేచింది. ప్రపంచంలో జాతీయవాద పోకడలు బలపడడం, వాటిని అడ్డుకోవడానికి వామపక్షాలు, ఉదారవాదులు యథాశక్తిని విన్యాసాలు చేయడం నేటి వాస్తవిక రాజకీయ చిత్రం. ఫ్రాన్స్‌లోను ఇదే ప్రతిబింబించింది. అతివాదం, మితవాదం, మధ్యేవాదం మధ్య ఫ్రాన్స్‌ ఓటర్లు సందిగ్ధంలో ఉండిపోయారు. ఫలితమే హంగ్‌ పార్లమెంట్‌. అయితే ఏదో విధంగా అధికారంలోకి వచ్చి తిష్ట వేయాలని చూస్తే వామపక్షం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తమకే ఇవ్వాలని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మీద అప్పుడే ఒత్తిడి తేవడం ఆరంభించాయి. జూలై 8వ తేదీన వెలువడిన ఎన్నికల అంతిమ ఫలితాలను బట్టి 577 స్థానాలకు గాను ఏ కూటమి మేజిక్‌ నంబర్‌కు దగ్గరగా రాలేకపోయాయి. ప్రధాని గాబ్రియెల్‌ అట్టల్‌ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఒలింపిక్స్‌ క్రీడోత్సవాల దృష్ట్యా పదవిలో కొనసాగాలని అధ్యక్షుడు మెక్రాన్‌ ప్రస్తుతం ఆ రాజీనామాను ఆమోదించలేదు. ఏ విధంగా చూసినా ఇది జాతీయవాదానికీ, వామపక్ష`ఉదారవాద రాజకీయాలకీ నడుమ పోరాటమే. ఇదే పోరాటం ఫ్రాన్స్‌ ఇరుగుపొరుగు దేశాలలో జరుగుతోంది. అక్కడ జాతీయవాదమే ముందంజలో ఉంది. కాబట్టి ఐరోపాను కూడా ఫ్రాన్స్‌ హంగ్‌ ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

ప్రధాని గాబ్రియెల్ అట్టల్

ప్రభుత్వ ఏర్పాటుకు 289 స్థానాలు అవసరం. అయితే వామపక్ష కూటమి 180 స్థానాలలో, మెక్రాన్‌ కూటమి 160 చోట్ల, అతి మితవాద కూటమి 140 స్థానాలు సాధించాయి. మెక్రాన్‌ ఇంతవరకు తెచ్చిన అన్ని సంస్కరణలు తీసుకువస్తామని చెబుతున్న వామపక్ష కూటమి ప్రభుత్వ ఏర్పాటు తమకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరడం పెద్ద మలుపు. ఇజ్రాయెల్‌ పట్ల ఇంతకాలం ఫ్రాన్స్‌ అనుసరిస్తున్న సానుకూల వైఖరికి తాము వ్యతిరేకమని వామపక్షం చెబుతున్న నేపథ్యంలో ప్రపంచంతో ఫ్రాన్స్‌ సంబంధాలు కూడా కొత్త దారిలోకి మళ్లే ప్రయత్నం చేస్తాయి. మరొక మూడేళ్లు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్న మెక్రాన్‌ ఈ రాజకీయ సంక్షోభం నుంచి ఎలా బయటపడతారన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

ఐరోపా సమాఖ్య దేశాల పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యువల్‌ మెక్రాన్‌ దేశంలో ఆకస్మిక ఎన్నికలు జరపడానికి తీసుకున్న నిర్ణయం ఆయన నేతృత్వంలోని సెంటర్‌ రైట్‌ సంకీర్ణ కూటమికి అశనిపాతంగా మారడమే కాదు, దేశాన్ని అనిశ్చితి రాజకీయాల్లోకి నెట్టేసింది. రెండు దశలుగా జరిగిన ఈ ఎన్నికల్లో తొలిరౌండ్‌లో 76 స్థానాలకు, రెండోదశలో 501 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. జూన్‌ 30న జరిగిన తొలి రౌండ్‌లో 67శాతం పోలింగ్‌ జరిగింది. జూలై 7న జరిగిన రెండో విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 59.7శాతం పోలింగ్‌ నమోదైంది.1981 తర్వాత ఇంతటి స్థాయిలో పోలింగ్‌ నమోదవడం ఇదే ప్రథమం. తొలిదశలో వెనుకబడినప్పటికీ రెండో దశ ఎన్నికల్లో పుంజుకొని 182 స్థానాలు గెలుచుకొని న్యూపాపులర్‌ ఫ్రంట్‌ పెద్ద పార్టీగా అవతరించింది. పార్లమెంట్‌లోని మొత్తం 577 స్థానాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. తుది ఫలితాల తర్వాత పార్లమెంట్‌లో న్యూపాపులర్‌ ఫ్రంట్‌ 182 స్థానాలు, ఎన్సెంబుల్‌ అలయన్స్‌ 168, రిపబ్లికన్స్‌Gరైట్‌ గ్రూపు 60, నేషనల్‌ ర్యాలీ కూటమి 143, ఇతరులు 11, అదర్‌ లెఫ్ట్‌ గ్రూపు 13 సీట్లు సాధించాయి. గత జూన్‌ 30వ తేదీన జరిగిన తొలిరౌండ్‌ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ నేతృత్వంలోని జాతీయవాద కూటమి ఏకంగా 30% ఓట్లు నమోదు చేయడం లెఫ్ట్‌వింగ్‌ పార్టీలను కోలుకోలేని నైరాశ్యంలోకి నెట్టేసింది. న్యూపాపులర్‌ ఫ్రంట్‌ లెఫ్ట్‌వింగ్‌ (ఎన్‌ఎఫ్‌పి) 28% ఓట్లు సాధించగా, మెక్రాన్‌ నేతృత్వంలోని సెంటర్‌ రైట్‌ సంకీర్ణ పార్టీలు కేవలం 20% సీట్లు మాత్రమే సాధించడంతో దేశం మరోసారి అనిశ్చితి రాజకీయా లకు తెరలేచే పరిస్థితి నెలకొంది. ప్రజలు ధ్రువాత్మకతకే మద్దతిస్తున్నారన్న సత్యాన్ని తొలి రౌండ్‌ ఎన్నికలు స్పష్టం చేసిన నేపథ్యంలో మధ్యేవాద, వామపక్ష పార్టీలు కలిసిపోయి ‘రిపబ్లికన్‌ ఫ్రంట్‌’గా ఏర్పడ్డాయి. ఎట్లాగైనా జాతీయవాద పార్టీ ఎన్‌.ఆర్‌.ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ‘రిపబ్లికన్‌ ఫ్రంట్‌’గా ఏర్పడిన ఈ పార్టీలన్నీ శపథం పూనాయనే చెప్పాలి. రెండో రౌండ్‌ ఎన్నికల్లో పోటీల్లో ఉన్న ఈ ఫ్రంట్‌ అభ్యర్థుల్లో విజయావకాశాలున్నవారిని రంగంలో ఉంచి, మిగిలిన వారిని పోటీ నుంచి తప్పించే వ్యూహాన్ని అనుసరించడం ద్వారా జాతీయ వాద ఎన్‌.ఆర్‌.పార్టీని నిరోధించగలిగినప్పటికీ, పూర్తి మెజారిటీ సాధించలేకపోవడం గమనార్హం.

హింసకు రాడికల్‌ లెఫ్ట్‌ పార్టీలే కారణం

రెండో రౌండ్‌లో ఎన్‌.ఆర్‌. పార్టీ అధికశాతం ఓట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి వస్తే దేశంలో అంతర్గత యుద్ధం తప్పదని లెఫ్ట్‌ వింగ్‌ సమర్థకులు రెండో రౌండ్‌ ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనలు జాతీయవాదాన్ని హింసతోనే ఎదుర్కొంటా మని వారు చెప్పకనే చెప్పినట్లయింది. తొలిరౌండ్‌లో జాతీయవాద పార్టీ ఎన్‌.ఆర్‌.కు ఎక్కువ శాతం ఓట్లు రావడంతో తట్టుకోలేక విధ్వంసానికి పాల్పడిరది రాడికల్‌ లెఫ్ట్‌ గ్రూపులు మాత్రమే. ప్రజలు తమకు అనుకూలంగా ఓట్లువేస్తేనే ప్రజాస్వామ్యమని, ఇతరులకు వేస్తే అప్రజాస్వామ్యమనే రీతిలో వాదించడం ఈ పార్టీలకే చెల్లింది. అంతేకాదు ఒకవేళ ఎన్‌.ఆర్‌. పార్టీకి అధికసీట్లు వచ్చినట్లయితే ఫ్రాన్స్‌ను ఈ రాడికల్‌ లెఫ్ట్‌ గ్రూపులు అల్లకల్లోలం చేసి ఉండేవనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. జాతీయవాద పార్టీల విజయాన్ని, లెఫ్ట్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీల మద్దతుదార్లు దేశంలో విధ్వంసానికి పాల్పడటం వారిలోని అసహనానికి నిదర్శనం తప్ప సమాజంలో పెరుగుతున్న అభద్రతా భావాన్ని అవి గుర్తించడం లేదు. ముఖ్యంగా అక్రమంగా వలసలు వచ్చిన ముస్లింల వల్ల కలుగుతున్న సామాజిక ఆశాంతి అన్ని యూరప్‌ దేశాల సమాజాల్లో సాంస్కృతిక, అస్తిత్వానికి సంబంధించిన అభద్రతా భావానికి కారణమవు తోంది. దీన్ని అతివాద వామపక్షాలు లేదా సెంటర్‌ రైట్‌ పార్టీలు గుర్తించడంలేదు. అదీకాకుండా వలస దార్లపై ఓట్లకోసం నెరపే బుజ్జగింపు రాజకీయాలు కూడా ప్రజల్లో ఏవగింపునకు దారితీసినట్టు ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయ సామాజిక, సాంస్కృతిక పరిరక్షణ కోసం వలసలను వ్యతిరేకిస్తున్న జాతీయవాద నేషనల్‌ ర్యాలీ (ఎన్‌.ఆర్‌.) పార్టీ గణనీయంగా సీట్లు పెంచుకోవడానికి ఇదే కారణం. ఈ మూల కారణాన్ని గుర్తించకుండా లెఫ్ట్‌ పార్టీలు వ్యవహరించడమే ఇక్కడ ప్రధాన లోపం. ప్రస్తుతం ఫ్రాన్స్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఎన్‌.ఆర్‌. పార్టీకి ఓటువేయడం పరిష్కారం కాదనేది రాడికల్‌ లెఫ్ట్‌ పార్టీల వాదన. ఇందుకోసం రెండో రౌండ్‌ ఎన్నికల్లో తమకు అనుకూల పార్టీల ఓట్లు చీలకుండా ఎక్కడి కక్కడ అభ్యర్థులను ఉపసంహరించుకొని ఎన్‌.ఆర్‌. పార్టీకి వ్యతిరేకంగా కేవలం ఒకే అభ్యర్థి రంగంలో ఉండేలా జాగ్రత్తపడిన రాజకీయమే పాపులర్‌ ఫ్రంట్‌ అధిక స్థానాలు గెలవడానికి ప్రధాన కారణం. ప్రజల్లో జాతీయవాదానికి వ్యతిరేకంగా చైతన్యం కలిగించామని పైకి ఎంతగా చెప్పుకున్నా ప్రజల్లో తమ భద్రతపై భయాందోళనలు వ్యక్తమవు తున్నాయన్న సత్యం ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ‘‘తాము ఫ్రాన్స్‌ సాంస్కృతిక, సామాజిక విలువలకు ప్రాధాన్యం ఇస్తామని, 2017నుంచి అధికారంలో వున్న ఇమాన్యువల్‌ మెక్రాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఇప్పుడు ఓట్ల రూపంలో బయటపడిరది’’ అని జాతీయవాద ఎన్‌.ఆర్‌.పార్టీ పేర్కొనడమే కాదు తమపై ‘తీవ్రవాద’ ముద్ర వేయడం ఎంతమాత్రం సబబు కాదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా ఒక నిర్ణయానికి వచ్చిన ఫ్రెంచ్‌ ఓటర్లను మభ్యపెట్టడం లేదా వారి అభిప్రాయంలో మార్పులు తేవడానికి యత్నించడం సాధ్యం కాదన్న నిపుణుల అంచనాలు నిజమయ్యా యనే చెప్పాలి. ఎందుకంటే గత పార్లమెంట్‌లో కేవలం 83 స్థానాలు కలిగిన ఎన్‌.ఆర్‌. ఈసారి సొంతంగా 125 స్థానాల్లో గెలుపొందగా, దీని కూటమి 143 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఫ్రాన్స్‌ పార్లమెంట్‌లో సింగిల్‌ పార్టీల పరంగా చూస్తే ఎన్‌.ఆర్‌. రెండోస్థానంలో ఉంది. ప్రజల్లో వచ్చిన మార్పునకు ఎన్‌.ఆర్‌. సాధించిన ఈ సీట్లే నిదర్శనం.

వామపక్ష కూటమి సృష్టికర్త జిన్ ల్యూక్ మెలిన్

నిజానికి 2027వరకు దేశ అధ్యక్షుడిగా మెక్రాన్‌ పదవిలో కొనసాగుతారు. ఇటీవలి కాలంలో యూరప్‌లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ‘ఎల్లో వెస్ట్‌’ ఉద్యమాలు ఫ్రాన్స్‌కు కొత్తేం కాదు. జూన్‌ 30న జరిగిన తొలిరౌండ్‌ ఎన్నికల తర్వాత ఏకంగా లెఫ్ట్‌వింగ్‌ అనుయాయులు వీధి పోరాటాలకే దిగారు.

రెండో రౌండ్‌ ఎన్నికల తర్వాత దేశంలో ఫార్‌ రైట్‌, ఫార్‌ లెఫ్ట్‌ పార్టీల అనుయాయుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు చోటుచేసుకుంటే పరిస్థితేంటని ఒక దశలో ప్రభుత్వం భయపడిరది. అయితే ఈ ఎన్నికల్లో జాతీయవాద పార్టీల కూటమి సాధించిన సీట్లను పరిశీలిస్తే దేశంలోని అన్ని స్థాయుల రాజకీయాలపై దీని ప్రభావం తప్పక పడి తీరుతుంది.ముఖ్యంగా సంస్థాగత, పార్టీ రాజ కీయాలు, జాతీయ అసెంబ్లీల్లో మాత్రమే కాకుండా సమాజంలో ఈ ‘ధ్రువాత్మకత’ ప్రభావం తీవ్రంగా ఉండి తీరు తుంది. మైనారిటీలు, యువత, ఫెమినిస్టుల్లో ఈ పరిణామం ఆందోళ కలిగించడంలో ఆశ్చర్యంలేదు.

అభద్రత, అక్రమవలసలే ప్రధానాంశాలు

జాతీయవాద ఎన్‌.ఆర్‌. పార్టీ ముఖ్యంగా సమాజంలో పెరుగుతున్న నేరాలతో కలుగుతున్న అభద్రత, ఆక్రమ వలసలు, జాతీయ గుర్తింపు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. ఎన్‌.ఆర్‌.కు చెందిన 28 ఏళ్ల జోర్డాన్‌ బార్డెల్లా శాంతి భద్రతలను పునరుద్ధరిస్తామని, వలసలను నిరోధిస్తామని, సమాజంలో పెరుగుతున్న నేరప్రవృత్తిని అణచి వేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే పార్టీ మరోనాయకుడు మారిన్‌ పెన్‌తో పాటు బార్డెల్లా నాటోనుంచి ఫ్రాన్స్‌ బయటకు రావాలన్న తమ వాదనను పక్కనపెట్టడం, పార్టీ అనుసరించే సంప్రదాయిక రష్యా అనుకూల విధానాన్ని కొంత సరళతరం చేయడం గమనార్హం. బార్డెల్లా ఉక్రెయిన్‌కు ఆయు ధాల సరఫరాను సమర్థిస్తున్నప్పటికీ, ఫ్రాన్స్‌ దళాలను మద్దతుగా పంపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 577 స్థానాల్లో మెజారిటీ మార్క్‌ 289కు చేరువ కావడం ఎన్‌.ఆర్‌. పార్టీకి కష్టసాధ్యమని వేసిన రాజకీయ పండితుల అంచనా నిజమైంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హంగ్‌ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో దేశ రాజకీయాల్లో ఇప్పటివరకు అనుసరిస్తూ వస్తున్న పాత పద్ధతులు పనిచేయకపోవచ్చు. ప్రస్తుతం ఫ్రాన్స్‌, ‘సంప్రదాయాలు’, ‘అలవాటు పడిన రాజకీయాలకు’ దూరంగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో మారుతున్న ప్రస్తుత పరిస్థితులను ఫ్రాన్స్‌ సమాజం ఏవిధంగా సర్దుబాటు చేసుకోగలదనేది పెద్ద ప్రశ్న!

వామపక్షాల ఆగ్రహం

ఇటీవల జరిగిన యూరోపియన్‌ పార్టమెంట్‌ ఎన్నికల్లో జాతీయవాద పార్టీ ఎన్‌.ఆర్‌. విజయం నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా జూన్‌ 9న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ‘జాతీయవాద వ్యతిరేక ఆందోళనలు’ దేశవ్యాప్తంగా జరిగాయి. వామ పక్షాలకు చెందిన అనేక యూనియన్లు, సంస్థలు, మానవహక్కుల సంఘాలు, విద్యార్థిసంఘాలు ఫ్రాన్స్‌లోని వివిధ నగరాల్లో ఈ ర్యాలీలు, నిరసనలు జరిపాయి. వీరు ఎన్‌.ఆర్‌.పార్టీ నాయకుడు జోర్డాన్‌ బార్డెల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఆ తర్వాత కూడా జూన్‌ నెల వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. జూన్‌ 15న దేశ వ్యాప్తంగా 350,000 నుంచి 640,000 వరకు ఆందోళన కారులు ఎన్‌.ఆర్‌. పార్టీకి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారు. చాలావరకు ఇవి శాంతియుతంగానే జరిగాయని చెప్పాలి. ముఖ్యంగా జాత్యహంకారానికి వ్యతిరేకంగా, పాలస్తీనా అనుకూల నినాదాలు చేయడం గమనార్హం. యూరోపియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో జోర్డాన్‌ బార్డెల్లా నేతృత్వంలోని ఎన్‌.ఆర్‌. పార్టీ ఏకంగా 31.34% ఓట్లు సాధించడం వాపపక్షాలకు ఎంతమాత్రం మింగుడు పడకపోవడమే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. జాతీయవాద పార్టీలు బలపడకూడదన్న ఉద్దేశంతో ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఏకంగా జాతీయ అసెంబ్లీని రద్దుచేసి కొత్తగా ఎన్నికలకు పిలుపు నిచ్చారు.

ఎన్‌.ఆర్‌. పార్టీ ప్రతిస్పందన

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించా లని ఎన్‌.ఆర్‌. పార్టీ నా యకుడు జోర్డాన్‌ బోర్డెల్లా కోరారు. నిరసనల సందర్భంగా తిరుగుబాటు, విప్లవం వంటి పదజాలం ఉపయోగించడం చాలా ప్రమాదకరమని, వాక్‌స్వాతంత్య్రాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. నిరసనలు శాంతియుతంగా ఉండాలే తప్ప విధ్వంసకాండ, హింసాకాండ ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఎన్నికల ఫలితాలను ప్రశ్నిస్తున్న వామపక్షాలను ఆపార్టీ నాయకుడు ఇల్లీ`ఎట్‌` విలాయినీ మాట్లాడుతూ 40% ఉద్యోగులు జోర్డాన్‌ బోర్డెల్లాకు అనుకూలంగా ఓటువేసిన సంగతిని గుర్తుచేశారు. రాడికల్‌ లెఫ్ట్‌ నిరసనల్లో ఫ్రాన్స్‌ పతాకాలు లేకపోవడం, యూదులకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని ఎన్‌.ఆర్‌.పార్టీ తప్పు పట్టింది. తొలి రౌండ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన జర్నలిస్ట్‌ విన్సెంట్‌ ట్రిమోలెట్‌ డి విల్లర్స్‌, ‘తీవ్రవాద వామ పక్షాలనుంచి వ్యక్తమవుతున్న విధ్వంసాత్మక ప్రతిస్పందన’గా వర్ణించాడు. తొలిరౌండ్‌ ఎన్నికల తర్వాత, వివిధ మెట్రోపాలిటన్‌ నగరాల్లో అన్నిరకాల వాణిజ్య సంస్థలు, షాపులు, స్టోర్స్‌లు, ఇతర కార్యాలయాలు ఆందోళనకారుల భయంతో రక్షణగా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నాయంటే రాడికల్‌ వామపక్ష భావజాలికుల విధ్వంసకాండ పట్ల వారు ఎంతగా భయపడుతున్నదీ తెలియజేస్తుంది.

మొదటి రౌండ్‌ ఎన్నికల్లో ఏకంగా మూడో స్థానంలో ఉన్న మెక్రాన్‌ పార్టీకి రెండో రౌండ్‌ ఫలి తాలు ఊపిరి పోశాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని గేబ్రియల్‌ అట్టల్‌ను తాత్కాలికంగా పదవిలో కొనసాగామని మెక్రాన్‌ కోరారు. అతిపెద్ద గ్రూపుగా ఎన్నికైన పాపులర్‌ఫ్రంట్‌ ఇప్పుడు తమ ప్రధాని అభ్యర్థిని త్వరలో నిర్ణయించాలి. కానీ వాటికి పార్ల మెంట్‌లో పూర్తి మెజారిటీ లేనందువల్ల అసలు సమస్య ముందుంది. ప్రస్తుతానికి జాతీయవాద పార్టీ వెనకడుగు వేసినప్పటికీ, ఫ్రాన్స్‌ అనిశ్చితి రాజకీయ దశలోకి ప్రవేశించిందనేది మాత్రం నిష్టుర సత్యం!

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE