వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
మణి వడ్లమాని
కొట్టిలేపినట్టయి, ఉలిక్కిపడి నిద్రలేచాడు రవిచంద్ర, ఎవరూలేరు, గోడ గడియారం ఆరుగంటలు కొట్టింది. ‘‘ఏమండీ! మనుష్యులు సూర్యభగవానుడి కన్నా ముందే నిద్రలేవాలండీ.’’
‘‘ఆహా! కోడి కన్నా ముందుగానే తీస్తున్నావుగా నువ్వు?’’
కాలేజీలో చదువుకొనేటప్పుడు చాలా ఆలస్యంగా లేవడం అలవాటు అతనికి. అక్కడికీ తల్లి అంటూ ఉండేది. ‘‘ఇప్పుడు నా మాట వినటం లేదు. అదే రేపు పెళ్లయ్యాక మీ ఆవిడ చెబితే ఉదయాన్నే లేచేస్తావు. ఇవన్నీ నా దగ్గరే’’ అనేది.
నిజానికి ఆవిడ, తన భవిష్యత్తుని ముందే చూసే సింది. అదేదో మాయ దర్పణంలో చూసినట్లుగా!
తెలతెలవారుతుండగా లేచి కాస్సేపు వాకిట్లో అలా పచార్లు చేసేసరికి ‘కాఫీ రెడీ’ అనే పద్మినితో కలిసి ఆ చల్లని వాతావరణంలో కాఫీ తాగుతుంటే’ ఎంత హాయిగా ఉండేదో !
మరి ఈ రామ్మూర్తి కూడా కాఫీజీవే. కాని అతను నిద్రలేచేది మటుకు ఏడింటికి. ఎన్నిసార్లో చెప్పి చూపాడు. ‘‘ఉహూ.. ఏమి లాభం లేకపోయింది.’’ చేసేది లేక పొద్దున్నే మొదట కాఫీ కలుపుకోవడం రవిచంద్ర అలవాటు చేసుకున్నాడు.
‘‘అప్పుడే ఏడున్నర అయింది. రెండోసారి కాఫీ తగలని నాలుక ఓ తెగ ఆరాటపడిపోతోంది.. అతను కలిపే మొదటి కాఫీకే దిక్కు లేదు. అవునూ? ఇవాళ రామ్మూర్తి కూడా లేచిన జాడ కన్పించదేం? రాత్రి ఒంట్లో బాగా లేదన్నాడు. టెంపరేచర్ కానీ రాలేదు కదా?’’ రవిచంద్ర మంచం మీది నుంచి ఒక్క ఉదుటున లేచి వంటగది వైపు పరుగెత్తాడు.
* * *
రామ్మూర్తి కూడా తనలాగే ఒంటరి. కాకపోతే తనకు డబ్బుంది. అతనికి లేదు. అతని వృత్తి వంటలు చేయటం. కానీ అందులోనూ అతను పెద్దగా రాణించలేదు. అతను వండిన పదార్థాలలో పాళ్లు సమంగా ఉండేవి కాదు. ఉప్పో, కారమో ఏదో తక్కువో, ఎక్కువో అయ్యేవి. అంచేత అతను పెద ్దపెద్ద వంటలు చేసే వారికి సహాయకుడిగా ఉండేవాడు. అతని కొడుకులు మాత్రం గజ వంటగాళ్లుగా పేరు పొందేరు. రామ్మూర్తి బిడ్డల ప్రతిభను చూసి సంతోషించాడు. వాళ్ల నీడనే ఉండాలని ఆశించాడు. కానీ వాళ్లు ఆయన్ని తమ జట్టులోకి తీసుకోలేదు.
అంతేకాదు. ఆయనకు పిడికెడు మెతుకులు పెట్టటం కూడా భారంగా భావించారు. బిడ్డలుండీ ఒంటరి వాడయ్యాడు.
కానీ తన విషయం అలా కాదు. నెత్తిన పెట్టుకొని పూజించే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఉండి కూడా తను ఒంటరితనాన్నే ఎన్నుకున్నాడు. ఎందుకంటే.. జీవన విధానాలు మారిపోయాయి. తల్లితండ్రులంటే ప్రేమ ఉంది, ఆ విషయంలో కొదవలేదు. కానీ ఏదో తెలియని సన్నని పొర అడ్డు నిలుస్తోంది.
ఆ విషయాన్నే పద్మిని, తను ఎన్నోసార్లు వాదోప వాదాలు చేసుకునే వాళ్లు. ‘‘ఏమండీ! మనం అలవాటుపడ్డ జీవన విధానానికి వాళ్ల దానికి ఎంత వ్యత్యాసం ఉందో చూచారా? కన్నబిడ్డల దగ్గర నాలుగు రోజులు ఉండేసరికి ఎవరో కొత్త వారింట్లో ఉన్న భావం కలిగింది నాకు. ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చేద్దామా! అనిపించింది. మీకెలా అనిపించిందో? అమెరికాలో కొడుకు ఇంటికి, కూతురు ఇంటికి వెళ్లి ఆరునెలలు ఉండి వచ్చాక అంది పద్మిని.
‘‘నాకూ అలాగే అనిపించింది పద్మిని, అయినా మన బిడ్డలకు మనం అంటే గౌరవం, ప్రేమ ఉన్నాయి. వాళ్లు మనకు లోటు చెయ్యలేదు. మర్యాదగా చూచారు. కూల్! పద్మినీ, వాళ్ల జీవితాలు వాళ్లవి. మనము ఇప్పుడు వాళ్లకి• అతిథులమే! ఆ విషయం ఎరుక ఉంచుకో’’ అని చెప్పాడు.
కానీ పద్మిని ఆ మనసు సమాధాన పరచుకోలేక పోయింది. ఫలితం ఒక పది రోజులు హాస్పిటల్‌లో ఉండవలసి ఉంచింది.
శంఖు చక్రాల మాదిరి ఇద్దరికీ కూడా బీపీ, షుగర్ వచ్చాయి. చాలామటుకు జాగ్రత్తగానే ఉండేవారు .
కాలం ఒక్క రీతిగా ఉండదు కదా ! ముందురోజు రాత్రి వరకు గడగడ మాట్లాడిన పద్మిని, నిద్దట్లోనే తుది శ్వాస విడిచింది.
పిల్లలు, మనవలు అందరూ వచ్చారు. ఆమెని పైలోకాలకి ఘనంగా పంపారు. అందరూ తిరుగు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. పిల్లలు తమ దగ్గరకు వచ్చేసి ఉండమన్నారు. వాళ్లందరికి ఒకటే సమాధానం ఇచ్చాడు రవి చంద్ర.
‘‘నిజమే ఒంటరి తనమే. ఒప్పుకుంటాను అయినా నాకు ఈ ఇల్లు అమ్మతో ఉండే అనుబంధాన్ని గుర్తు చేసి ఆనందాన్ని కలిగి స్తుంది. ఒంటరిగా ఉన్నాననే భావన రాదర్రా. ఒకవేళ అలాంటిది ఏదైనా అనిపిస్తే వెంటనే మీకు చెప్పేస్తాను’’ సరేనా? అని వాళ్ళను బుజ్జగించి పంపేసాడు.
* * *
మనశ్శాంతి కోసం శృంగేరియాత్రకి వెళ్లినప్పుడు రవిచంద్రకు తమతో పాటు వచ్చిన వంట చేసే బృందంలో రామ్మూర్తి కలిశాడు. అప్పటినుంచి అతనికి తోడయ్యాడు. యాత్ర పూర్తి చేసి తిరిగి వస్తున్నప్పుడు. ‘‘బాబుగారూ! మీరు ఏమీ అనుకోనంటే నాదో అభ్యర్థన. నేను అన్నీ ఉండీ దిక్కులేని వాడినయ్యాను. మీరు కూడా ఒంటరి వారయ్యారు. మీరు కనికరిస్తే మీకింత వండిపెట్టి నేనింత తిని మీ సేవ చేసుకొంటూ మీ నీడన పడి ఉంటాను. జీతభత్యాలు ఇంత ఇమ్మని నేనడగను. ఎందుకంటే సంపాదించి ఒకరికి పెట్టాలన్న తాపత్రయం నాకు లేదు. కాకపోతే చనిపోయాక ఉత్తర కర్మలకి, ఆ తర్వాత శ్రాద్ధం పెట్టడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి కదా? మీరు తృణమోపణమో ఇస్తే అందుకు పనికి వస్తుంది.’’
ఆ మాటలకి కరిగిపోయాడు రవిచంద్ర. పిల్లలతో ‘‘ఈ రామ్మూర్తి పాపం నా ఆశ్రయం కోరి వచ్చాడు. తన పరిస్థితిని నిస్సంకోచంగా అంగీక రించగల అమాయకుడు. అంచేత అతనికి ఆశ్రయం ఇస్తాను. అతను నాకు వంట వండి పెడ్తాడు. నా ఆలనా పాలనా చూసుకుంటాడు. నా గురించి విచారం పెట్టుకోకండి’’ అని చెప్పాడు..
నిజానికి రామ్మూర్తి వంట అతి భయంకరంగా ఉండేది. ‘‘మీరు అమ్మగారిని గురించే కలవరిస్తుం టారు. మేలుకొని ఉన్నప్పుడూ ఆమె ఊసే. ఆమె వంట చాల బాగా చేసేది అన్నారు కదా.. నేను కూడా ప్రయత్నిస్తాను’’ అని చెప్పేవాడు. అయితే అది అప్పటి వరకే. మళ్లీ మరునాడు, అదే వంట, చప్పగానో, కారంగానో ఉండేది.’’
ఇలా రామ్మూర్తి రవిచంద్ర మధ్య ఓ గమ్మత్త యిన సహచర్యం ఏర్పడింది. ఆత్మీయత పెరిగింది.
* * *
ఇలా ఎంతో దూరం పరుగులెత్తిన ఆలోచనలు వంట ఇంట్లోని దృశ్యం చూసాక బ్రేక్ వేసినట్లు ఆగిపోయాయి. ఎదురుగా పక్క మీద రామమూర్తి అచేతనంగా ఉన్నాడు.
‘‘రామ్మూర్తి! రామ్మూర్తి! ఏమయింది అడిగాడు. జవాబులేదు. అర్థమయింది. అయినప్పటికీ డాక్టర్‌ని పిలిచాడు. డాక్టర్ వచ్చి డిక్లేర్ చేసేసాడు, ‘‘హి ఇస్ నో మోర్’’ అని
దానితో రవిచంద్రకళ్లు జలపాతాలయ్యాయి! అయ్యో రామ్మూర్తి చనిపోయాడు
అతని ఉత్తరక్రియలు దగ్గరుండి జరిపించాడు.
ఆ రోజుతో ఆ బంధం తెగిపోయింది.. శ్రాద్ధం రోజు బీదలకు అన్నదానం చేశాడు. అందుకుగాను వంట చేయటానికి రామ్మూర్తి కొడుకుల్ని పిలిపిం చాడు. చాలా గొప్పగా అన్నదానం జరిగింది. వంట చాలా రుచిగా ఉంది.
ఎన్నో ఏళ్ల తరువాత ఆ రోజు మళ్లీ సుష్టుగా భోజనం చేశాడు రవిచంద్ర. డబ్బు కోసం వచ్చి చేతులు కట్టుకు నిలబడ్డారు రామ్మూర్తి కొడుకులు.
‘‘వంటచాలా బాగుంది. సుష్టుగా తిన్నాను. కానీ, రేపటికి నేను తిన్నది అరిగిపోతుంది. కానీ ఈ శ్రాద్ధ కర్మ ఎవరి కొరకైతే జరిగిందో ఆయన ఒక వంట వాడే. ఆ వంట మనిషి పేరేమిటో తెలుసా?’’
‘‘ఏమిటి?’’
‘‘రామ్మూర్తి! మీరు అన్నం పెట్టకుండా వెళ్లగొట్టిన మీ నాన్నగారు. ఆయనకు మీరు శ్రాద్ధకర్మలు చేసే అర్హత కోల్పోయారు. అందుకే వంటవాళ్లుగా పిలిపించాను.’’ అన్నాడు కటువుగా
‘‘క్షమించండి. బాబుగారూ!’’ వాళ్లిద్దరూ ఒకేసారి అన్నారు. ఏమయితేనేమి రామ్మూర్తి లేడు. ఆ మొహాలలో ఎక్కడా పశ్చాతాప పడుతున్నట్లే లేదు. అందుకే వాళ్లు వెళుతున్నామని చెప్పినా తలెత్తి చూడలేదు రవిచంద్ర.
ఇక్కడితో ఈ జీవన నాటకంలోని ఈ అంకం పూర్తయింది.
* * *
ఒక వారం రోజులలో మరో కొత్త అంకానికి తెరలేచింది.
పిల్లలకి ఫోన్ చేసి చెప్పాడు. తను అమెరికా వస్తానని. వాళ్లు సంతోషపడ్డారు. పదేళ్ల వీసా ఉండటం వల్ల టికెట్టు కొనుక్కుని వెళ్లడమే. ఆ మాటకి అన్నా చెల్లెలు ఇద్దరూ ఆనంద పడ్డారు.
* * *
‘‘నాన్నా… మీరు…’’ రవిచంద్రను చూచి కూతురు నవ్య ఎగిరి గంతేసి చెంగున వచ్చి కౌగ లించుకుంది.
‘‘నేనేనమ్మా! వచ్చేశాను. సమయం వచ్చినప్పుడు వస్తానని చెప్పాను గదా!’’
‘‘సమయానికి ఆయన ఊరు వెళ్లారు నాన్నా! ఎప్పుడూ ఆయన మిమ్మల్ని గురించే అనుకుం టుంటారు. ఉండండి. మీరొచ్చారని ఫోన్ చేసి వస్తాను.’’
అతని గురించి చెప్పేటప్పుడు కూతురు సంతోషాన్ని గుర్తించాడు.
‘‘పిల్లలేరమ్మా? స్కూలు నుంచి ఇంకా రాలేదా?
‘‘అయిదయిందిగా?’’
‘‘ఆఫ్టర్ స్కూల్ కేర్‌లో ఉన్నారు వెళ్లి తీసుకుని రావాలి’’ అంది.
‘‘అంటే నువ్వు కూడా ఉద్యోగంలో చేరావమ్మా?’’
‘‘అవును నాన్నా! వేన్నీళ్లకు చన్నీళ్లు వదులు కోవటం ఎందుకు? పైగా ఆయన ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు వెళ్లాక ఉండి చేసేదేముంది?
తనతో మాట్లాడుతూనే పనులు చేసుకోవటం గమనించాడు. అచ్చు పద్మిని, పోలికలే ఇంటి పనుల్లో తల్లి ట్రైనింగ్ బాగా ఇచ్చిందని ఆనంద పడ్డాడు.
రాత్రి డిన్నర్‌కి టేబుల్ మీద అన్ని పదార్ధాలు పెట్టి రవిచంద్రకు మటుకు మిల్లెట్స్ పెట్టింది.’’ అదేమిటమ్మా అది నాకు కూడా పెట్టు ఆ పథ్యాలు అవీ మీ అమ్మతోనే పోయాయి. ఇప్పుడు నేను అన్నీ తింటున్నాను. నాకిష్టమైనవి చేయించుకు తినటానికే నీదగ్గరి కొచ్చానసలు.
‘‘పథ్యాలు మానేశారా? అయితే. ఇవాళ్ల నుండి మళ్లీ మొదలెట్టండి. అందుకే మీవంట స్పెషల్‌గా చేశాను. తెలుసా?’’
ఒక్కో పదార్థాన్ని నోట్లో పెట్టుకొని రుచి చూచాడు. దేనిలోనూ కారం, ఉప్పూ, పులుపు లేదు.
రామ్మూర్తి వంట ఇంతకన్నా నయం.
రోజులు గడుస్తున్నాయి. పెద్ద వాడివి అనే పేరుతో పథ్యం భోజనం తింటున్నాడు. అది రవిచంద్రకు సహించటం లేదు.
‘‘నాన్నా! నీ భోజనం టేబుల్ మీద పెట్టాను. పేపర్లు, పుస్తకాలు ఉన్నాయి. టీ.వీ. మ్యూజిక్ సిస్టం ఉన్నాయి. హాయిగా రెస్ట్ తీసుకో. నేను పిల్లల్ని తీసుకొని అయిదింటికి వచ్చేస్తా?’’ అని వెళ్లి పోయేది
సాయంత్రం అయిదింటికి పిల్లలతో వచ్చీరాగానే వాళ్ల పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది. ఎనిమి దింటికి భోజనాలు. ఆ తరువాత ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయేవారు. ఆ యాంత్రిక జీవితం గురించి తెలిసే వచ్చాడు. మరి అనుకోవటం ఎందుకు? ఇక్కడకు వచ్చాక తను ఒంటరి వాడిని అన్న భావన ఎక్కువ అయిపోయింది. లేదు దీనికి ఏదో మార్గం ఆలోచించాలి అనుకున్నాడు.
మూడు నెలలు భారంగా గడిచాయి. భరించలేక పోయాడు. ‘‘అమ్మా! నేనింక వెళ్లి వస్తానమ్మా!’’
‘‘ఏంనాన్నా! నా మీద కోపం వచ్చిందా? ఇక్కడే ఉండి పోతావనుకొన్నానే!’’
‘‘ఇప్పుడు కాదమ్మా! మరోసారి వచ్చినప్పుడు. ఇప్పుడు అన్న దగ్గరకు వెళ్తాను అన్నాడు.
‘‘సరే నాన్నా!’’ అంటూ వీడ్కోలు పలికింది తండ్రికి.
* * *
‘‘నాన్నగారూ! రండి, రండి. నీతూ! నీతూ!’’ భార్యని పిలిచాడు, కొడుకు సమీర్ ‘‘నాన్నగారి గది రెడీగా ఉంది కదా’’
‘‘హా రెడీ’’, ‘‘రండి అంకుల్ మీ గది చూపిస్తాను’’ అని పైన మేడ మీద గదికి తీసుకుని వెళ్లింది.
ఏ.సీ. రూమ్ అటాచ్డ్ బాత్‌రూం. టీవీ, టెలిఫోన్, డబుల్ కాట్, మోడరన్ డ్రెస్సింగ్ టేబుల్… అన్ని టచ్ లేదా సెన్సొర్‌తో ఉండే స్విచ్చులు. ఇంటర్ కం ఫోన్. ఇంద్రభవనం లాంటి ఇల్లు మరి. ఆ మాత్రం సౌకర్యాలు ఉంటాయి అనుకున్నాడు.
‘‘మీకేం కావాలన్నా కాలింగ్ బెల్ నొక్కండి. ఇండియా నుంచి వచ్చి సావిత్రిగారు ఉన్నారు. ఆవిడ ఇక్కడ మనింట్లో మొత్తం డొమెస్టిక్ హెల్ప్ చేస్తారు. అతికష్టం మీద దొరికారు. మనకి ఆవిడ చాల వాల్యుబుల్. మీకు ఏదైనా నచ్చకపోతే నాకు చెప్పండి. ఆవిడకి డైరెక్ట్‌గా చెప్పకండి. బాగుండదు’’ అంది కోడలు నీతూ.
ఇంతలో బెల్ మోగింది. ‘లోపలికి రావచ్చా? అన్న సంకేతపు మోత అది. అది తెలిసిన వెంటనే లోపలికి రావచ్చు అని ఇంగ్లీష్‌లో చెప్పాడు. తలుపు తట్టి ‘‘మే.. ఐ కమిన్ సార్!’’ అడుగుతూనే లోపలి కొచ్చింది. పంజాబీ డ్రెస్ వేసుకున్న ఒకావిడ ‘‘మీరు సమీర్ ఫాదర్ కదా’’? అంది తెలుగులో
‘‘హమ్మయ్యా మీరు తెలుగు వాళ్లా’’ అన్న దానికి సమాధానంగా తలూపింది. నీతూ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఎక్కువ మాట్లాడకుండా ఉన్నాడు.
మధ్యాహ్నమవుతుండగా నీతూ ఫోన్ చేసింది. ‘‘హలో అంకుల్..! మీకింట్లో అంతా సౌకర్యంగా ఉంది కదా! మీరు ఎర్లీగా లంచ్ తీసుకుంటారు కదా! తీసుకోండి. డైనింగ్ రూమ్‌కి వెళతారా? రూంకి తెప్పించుకుంటారా? మీ ఇష్టం. నేను సాధ్యమయి నంత త్వరగా వస్తాను. బై…’’ అని పెట్టేసింది.
రవిచంద్రకి ఆకలితో కడుపు నకనకలాడు తోంది. డైనింగ్ రూమ్‌కి వెళ్లి సుష్టుగా తినాలను కున్నాడు. అక్కడ సావిత్రిని చూసి ఈమె వంట ఎలా ఉంటుందో అనుకున్నాడు.
‘‘వడ్డించాను. భోంచేయండి.’’ టేబుల్ మీద రకరకాల పదార్థాలు. అయితే ఒక్కటీ ఆయనకి తెలిసిన పదార్థం కాదు.
‘‘సావిత్రి గారూ ! ఏమిటండీ ఇవన్నీ.’’
‘‘రుచి చూడండి. మీకే తెలుస్తుంది.’’
‘‘ఊహూ ఏంతెలీలా. కానీ ఇవి నాకు సరిపోయేవి కాదు ఆ మిల్లెట్స్, పచ్చికూరలు తినలేనమ్మా, పెరుగు కాస్త వెయ్యండి.’’
ఇదే తంతు రోజూ. ముందే ఊహించుకున్నాడు, అమ్మాయి ఇంట్లో అబ్బాయింట్లో పెద్ద తేడా ఉండదు. అంతా ఒక ఫార్మేట్‌లో ఉంటుంది. వీక్ ఎండ్స్ వస్తే ఏదో ఒక పోగ్రాం. మొహమాటానికి రెండు, మూడుసార్లు వెళ్లాడు. ఆ తరువాత విసుగనిపించి ఇంట్లోనే ఉండిపోయాడు. నెమ్మదిగా సావిత్రితో పరిచయం పెరిగింది.
ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలు మాట్లాడు కునేవారు. ఆమెది కూడా ఇంచు మించు రామ్మూర్తి లాంటి కథే, ఆ కథలో పిల్లలయితే ఇక్కడ తమ్ముళ్లు, చెల్లెళ్లు కోసం జీవితాన్ని పణంగా పెట్టిన ఓ పెద్దక్క కథ, ఆ తరువాత షరామాములే !
* * *
అక్కడ అంతా కళ కళ లాడుతోంది. చక్కటి వంటలు ఘుమ ఘుమ లాడుతున్నాయి. అక్కడున్న పదిహేను మంది ‘‘రవి చంద్రకు జై, జై’’ అంటూ హర్షధ్వానాలు చేస్తున్నారు. ఈ హడావిడి అంతా ఏమిటంటే రవిచంద్ర తన ఇంటిని ఒక హోంగా మార్చేసి. తనలాంటి వాళ్లను ఒక పది మంది వరకు కలుపుకుని ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ… చక్కటి భోజన సదుపాయం, మంచి ఫలహారాలు, అలవాటయిన వంటలనే, అందరికీ ఆరోగ్యంతో పాటు రుచికరంగా ఉండే ఏర్పాటు చేసాడు.
అమెరికాలో కొడుకు ఇంట్లో ఉన్న సావిత్రికి వీసా టైం అయిపోయింది. ఇండియాకు వచ్చాక ఎలా బతకడం అనుకున్న తరుణంలో, రవిచంద్ర మాట మీద, ఈ సహచరులలో తను ఒకరిగా చేరి అందరికి రుచికరమైన వంట చేసి పెడుతోంది.
రేపటి గురించి దిగులు లేకుండా జీవనసంధ్యలో ఉన్న వాళ్లంతా ఒకరికొకరు తోడుగా మసులుకో సాగారు.