సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి జ్యేష్ఠ బహుళ తదియ -24 జూన్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


మా కుటుంబీకులు అధికారంలో ఉండి ఉంటే అయోధ్య కట్టడం కూలేదే కాదు..అన్నారు మకుటం లేని కాంగ్రెస్‌ మహారాజు రాహుల్‌ గాంధీ. మన్‌మోహన్‌ సింగ్‌ మంత్రిమండలి నిర్ణయానికి సంబంధించిన ఆదేశాన్ని విలేకరుల సమావేశంలోనే పరపరా చింపి అవతల పారేసినది కూడా ఆయనే. అసలు అధికారంలో కాంగ్రెస్‌ పార్టీ ఉంటే చాలదు. గాంధీ`నెహ్రూ కుటుంబమే ప్రధాని పదవిలో ఉండాలి. ప్రధాని పదవిలో ఆ కుటుంబానికి చెందనివారు కూర్చోవడమే ఆయన మహాపరాధంగా భావిస్తారు. పేరుకి ప్రజాస్వామ్యం. కానీ ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రధానులు. ఇప్పుడు ఒకరు రాజ్యసభలో, ఒకరు లోక్‌సభలో. మరొకరు వాయినాడ్‌ బరిలో. అయినా ఇదంతా నికార్సయిన ప్రజాస్వామ్యమేనని ఈ దేశ ప్రజలు చచ్చినట్టు నమ్మాలి. ముక్తకంఠంతో పలకాలి.

మోదీ 3.0.ను ప్రజలు ఎన్నుకున్నారన్నది తిరుగులేని వాస్తవం. ఆ స్పృహ పూర్తిగా చచ్చిన కాంగ్రెస్‌ అనే శతాధిక వర్షాల పార్టీ 18వ లోక్‌సభకు ఎన్నికలు ప్రకటించిన మరుక్షణం నుంచే అబద్ధాలను వెల్లువెత్తించింది ` రాజ్యాంగం మార్చేస్తారనీ, బీజేపీ కోరినట్టు 400 స్థానాలతో అధికారం ఇస్తే రిజర్వేషన్లు ఉండవు అనీ. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో ఫలితాలు తారుమారైపోతాయని మరొక దారుణమైన దుష్ప్రచారం. సుప్రీం కోర్టు నోటి నిండా గడ్డి పెట్టినా ఆగని ప్రచారాలలో ఇదొకటి. ఎన్నికలలో మతం ఆధారంగా నేరుగా ఆరోపణలు చేస్తే లేనిపోని రగడ కాబట్టి, ఎన్నికలకు ముందు నుంచి ఈ దేశంలో మైనారిటీలకు రక్షణే లేదంటూ ప్రచారం. విదేశాలలో కూడా అవే కూతలు. ఎన్నికల ఫలితాలు వస్తున్న తరుణంలో కూడా రాహుల్‌ అనే ఏ బాధ్యతాలేని, ఏ నిబంధనా వర్తించని, ఏ చట్టమూ పట్టని, దేశ సార్వభౌమత్వం పట్ల ఏ మర్యాదా పాటించని భారత రాజకీయవేత్త షేర్లలో ఘోర అవినీతి జరిగిందంటూ గంభీరంగా ముఖం పెట్టి వాపోయారు. కానీ స్పందన మాత్రం లేదు.

మోదీ 3.0. ప్రభుత్వాన్ని తాము ఎంత నీతిమాలిన కుట్రలతో నిరోధించాలని అనుకున్నారో ఈ షేర్ల వ్యవహారంతోనే తేలింది. తరువాత ఎలాన్‌ మస్క్‌ అనేవాడు  ఈవీఎంలని హ్యాక్‌ చేయవచ్చునంటూ ఏదో పేలితే దానిని పట్టుకుని రాహుల్‌, మిగిలిన ఆమాంబాపతు పార్టీలు రాగం అందుకున్నాయి. ఈ వాచాలత నిండా చాలా విషయం ఉందంటూ ప్రచారం చేయడానికి ఒక వర్గం మీడియా సదా సిద్ధంగానే ఉంటుంది. రాహుల్‌, మిగిలిన రాజకీయ తైనాతీలు చేసే ఆరోపణలు ప్రజాస్వామ్యబద్ధంగా చేసినట్టే ఉంటాయి. రాజ్యాంగబద్ధమైన వాక్‌ స్వాతంత్య్రానికి లోబడి ఉన్నట్టే కనిపిస్తాయి కూడా. రాజ్యాంగం అంటూ చేతిలో ఒక పుస్తకం పట్టుకుని చెప్పినంత మాత్రాన ప్రతి మాటా చట్టబద్ధం కాదు. ప్రతి పదం నీతిమంతం కాదు.  ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించినది అసలే కాదు. అవన్నీ హక్కుల మాటున హక్కుల పవిత్రను ధ్వంసం చేసే కుట్రలే. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అది ఇచ్చిన స్వేచ్ఛను భంగపరిచే దారుణ విధ్వంసం కూడా. అంతా ప్రత్యర్థి పార్టీని అవమానాల పాల్జేయడానికే. అధికారం నుంచి పెందరాళే దించేయడానికే. ఇందుకు సాయపడే చాలా సిద్ధాంతాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ అనుసరిస్తున్నది అలాంటి ఓ కుట్రే.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పట్టుకు వేలాడుతున్న విన్యాసాన్ని క్లొవార్డ్‌`పివెన్‌ వ్యూహం అంటారట. దీనికి వ్యూహం అని ఓ పెద్ద పేరు పెట్టడం కంటే కుట్ర అనడమే న్యాయం. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుతోనే ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడానికి ఉపకరించే కుట్ర. దీనికి 1966లో రిచర్డ్‌ క్లొవార్డ్‌, ఫ్రాన్సిస్‌ ఫాక్స్‌ పివెన్‌ అనే ఇద్దరు అమెరికాలో జన్మనిచ్చారు. ఈ కుట్రకి ఉగ్రవాదులు, పేదరికంతో బాధపడే సమూహాలే ఆయుధాలు. సంక్షేమం కూడా మరొక పదునైన ఆయుధమే.  మరిన్ని సంక్షేమ పథకాలు కావాలంటారు. సంక్షేమ పథకాల కోసం పెద్ద సంఖ్యలో జనాన్ని నమోదు చేయించే పనిని భుజస్కంధాల మీద వేసుకుంటారు. కనీస ఆదాయ హామీ ఇవ్వాలంటారు. దేశ ఆదాయాన్ని చేతికి ఎముక లేని రీతిలో కేంద్ర ప్రభుత్వమే పంచాలంటారు. సంపద సృష్టించినట్టు సంక్షోభాలని సృష్టిస్తారు. అశాంతిని వండి వారుస్తారు. ఆ ఇద్దరు 1966లో ది నేషన్‌ పత్రికలో ‘ది వెయిట్‌ ఆఫ్‌ ది పూర్‌: ది స్ట్రాటజీ టు ఎండ్‌ పావర్టి’ పేరుతో రాసిన వ్యాసంలో ఈ కుట్ర గురించి చెప్పారు. రిపబ్లికన్‌ పార్టీ చతికిలపడిన ఆ కాలంలో డెమాక్రటిక్‌ పార్టీయే ఫెడరల్‌ ప్రభుత్వాన్నీ, రాష్ట్రాలనీ జమిలిగా ఏలడం వీరికి నచ్చలేదట.

ఇప్పుడు ఈ విన్యాసమే భారత్‌లో తుచ తప్పకుండా అమలు చేయాలని కాంగ్రెస్‌  తంటాలు పడుతున్నది. మహాలక్ష్మి పథకం కింద ఇంటికో మహిళ వంతున ఎంపిక చేసి సంవత్సరానికి లక్ష రూకలు చేతిలో పోస్తామని కార్డులు పంచడం ఇలాంటి కుట్ర కాదా? ఆప్‌ అనే విద్రోహక సిద్ధాంతాల పార్టీ సగర్వంగా ఆరంభించిన ఈ కుట్రను కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. పంజాబ్‌లోనూ ఇదే జరుగుతోంది. ఇవన్నీ క్షణాలలో ఖజానా ఖాళీ అయ్యేందుకు వీలుగా ఉండే పథకాలని ప్రవేశపెట్టాయి. కన్నడ సిద్ధుడి పాట్లు చూశాక కూడా తెలంగాణ ప్రభుత్వం అదే బాటలోకి మళ్లింది. ఇదంతా ప్రజాధనంతో పార్టీలకు ఓట్లు కొనే పథకాన్ని దొడ్డితోవన అమలు చేయడమే. కానీ ఈ క్లొవార్డ్‌`పివెన్‌ కుట్ర తాము తీసుకున్న గోతిలో తామే పడేందుకే ఉపకరిస్తుందని మైఖేల్‌ టామ్‌స్కీ అనే మరొక మేధావి 1990లోను 2011లో కూడా ఎలుగెత్తి చాటాడు. అయినా అధికారం కోసం ప్రజాతీర్పును ఇంత ఘోరంగా అవమానిస్తారా? పార్లమెంట్‌ను స్తంభింపచేయడం, షాహీన్‌బాగ్‌లను, రైతు ఉద్యమాలను విపక్షాలు యథాశక్తిన  ప్రజల మీద రుద్దుతాయని ఊహించవచ్చు. కుట్రనే కాదు, అది తెచ్చే దుష్ఫలితాలను కూడా తెలుసుకోవాలి. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ వంటి దారుణ పరిణామం ఫలితం చూసి కూడా కాంగ్రెస్‌ కుట్రల బాటను వీడడం లేదు.

About Author

By editor

Twitter
YOUTUBE