రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారం దక్కినా, అది అందుకుంటున్నట్టు  వార్తాపత్రికలలో ఫోటో వచ్చినా గొప్ప సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ  అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి నుంచి అందుకున్న నాటి ఫోటో మావోయిస్టులు పంచిపెట్టిన కరపత్రంలో కనిపిస్తే ఏమౌతుంది? జీవితంలో అంతకంటే భయానక క్షణాలు ఉండవు. హేమ్‌చంద్‌ ‌మాంఝీ పరిస్థితి ఇప్పుడు అదే.

ఆయనొక గిరిజనుడు. 20వ ఏడు వచ్చినప్పటి నుంచి తన గిరిజన సమాజానికి  వైద్యసేవలు అందిస్తున్నారు కూడా. అందుకే ఆయనను ఆయన వర్గీయులంతా సగౌరవంగా ‘వైద్యరాజ్‌’ అని పిలుచుకుంటారు కూడా. చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ ‌జిల్లాలో ఉన్న మారుమూల గ్రామంలో ఆయన ఉంటారు. 72 ఏళ్ల హేమ్‌చంద్‌ ‌సేవలు అసమానమైనవి. సంప్రదాయక గిరిజన వైద్యానికి ఆయన గొప్ప గుర్తింపు తెచ్చారు కూడా. ఆయన కేన్సర్‌కు కూడా మందు ఇచ్చేవారు. వీటికి గుర్తింపుగానే ఆయనను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన ఏమీ కాదు. పద్మశ్రీ తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, గడచిన 52 ఏళ్లుగా చేస్తున్న వైద్యానికి కూడా స్వస్తి పలికారు. కారణం మావోయిస్టుల బెదిరింపు.

మే 26, 2024న రాత్రి హేమ్‌చంద్‌ను నక్సలైట్లు బెదిరించారని పోలీసులు కూడా తెలియచేశారు. చమేలీ, గౌరదండ గ్రామాలలో నిర్మిస్తున్న రెండు మొబైల్‌ ‌టవర్లకు నిప్పు పెట్టిన నక్సల్స్ అక్కడే ఒక బ్యానర్‌ ‌కట్టి, కొన్ని కరపత్రాలు కూడా వదలి వెళ్లారు. ఇవన్నీ చోటేదొంగార్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోనివే. ఆ కరపత్రంలోనే హేమ్‌చంద్‌ ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నప్పటి ఫోటో ప్రచురించారు. ముడి ఇనుము ఖనిజానికి సంబంధించి  చోటే దొంగర్‌లో నిర్మిస్తున్న ఒక ప్రాజెక్టులో హేమ్‌చంద్‌కు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయని నక్సల్‌ ‌కరపత్రంలో ఆరోపించారు.

ఈ ఆరోపణలను హేమ్‌చంద్‌ ‌చాలా ధైర్యంగా ఖండించారు. ఆ ఇనుప ఖనిజం ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి ముడుపులు తీసుకోలేదని ఆయన ప్రకటించారు. ముడుపులు తీసుకున్న వ్యక్తి పురస్కారం ఎలా తీసుకుంటాడని మావోయిస్టులు ప్రశ్నించడం కూడా ఆయనను బాధించినట్టే ఉంది. ‘నేను పద్మశ్రీ పురస్కారం కోరుకోలేదు. అది దశాబ్దాలుగా నేను ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇచ్చిన పురస్కారం. అలాగే చిరకాలంగా వనమూలికా వైద్యానికి తెచ్చిన గుర్తింపును చూసి ఇచ్చినది.కేన్సర్‌ ‌సహా పలు రుగ్మతలకు నేను జాది-బూతా (వనమూలిక) ఇచ్చి నయం చేశాను’ అని ఆయన ఘాటుగానే స్పందించారు.

చూడబోతే నక్సలైట్లు మాంఝీ కుటుంబం మీద ఏదో కక్ష పెంచుకున్నట్టే కనిపిస్తుంది. ‘ఇంతకు ముందు వాళ్లు (నక్సల్స్) ‌నా మేనల్లుడు కోమల్‌ ‌మాంఝీని కూడా చంపారు. ఇలా ముడి ఇనుప ఖనిజం ఆరోపణలతోనే చంపారు. నిజానికి అవన్నీ అబద్ధాలే. అసలు మా కుటుంబమే నక్సల్స్ ‌వల్ల ప్రాణభయంతో జీవిస్తున్నది అని కూడా ఆయన వివరించారు.

నిరుడే కోమల్‌ను నక్సలైట్లు హత్య చేశారు. పోలీసులను ఆశ్రయించగా వారే రక్షణ కల్పిస్తున్నారు. నిజానికి హేమ్‌చంద్‌ ‌వైద్యుడు మాత్రమే కాదు, సమాజ సేవకుడు కూడా. పోలీసు పహారాలోనే ఆయన గిరిజన ప్రాంతాలలోని సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ ఉండేవారు. అందులో ప్రధానంగా గిరిజనులకు ఇళ్లు కట్టివ్వడం గురించి అధికారులతో నిరంతరం మాట్లాడుతూ ఉండేవారు. ఇంతకీ నక్సలైట్లు ఆరోపించిన ముడి ఇనుప ఖనిజం ప్రాజెక్టు జైస్వాల్‌ ‌నీకో ఇండస్ట్రీస్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థ వారిది. ఆ ప్రాజెక్టును, ఆ కంపెనీని కూడా చిరకాలంగా నక్సలైట్లు వ్యతిరేకిస్తున్నారు.

కోమల్‌కు పట్టిన దుస్థితి హేమ్‌చంద్‌కు పట్టకుండా పోలీసులు కాపాడగలరా? వేచి చూడాలి.  అయినా పద్మ పురస్కారాల మీద, నిజానికి ప్రభుత్వం ఇచ్చే ఏ పురస్కారం మీద గౌరవం లేని నక్సల్స్ ఇప్పుడు ఈ తర్కం ఎందుకు తీసుకువచ్చినట్టు? ముడుపులు తీసుకున్న నీవు పురస్కారం ఎలా తీసుకున్నావని నిలదీయడం ఎందుకు?

About Author

By editor

Twitter
YOUTUBE