‌ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 2014లో బాధ్యతలను స్వీకరించిన అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన తొలి ఉపన్యాసంలో ‘స్వచ్ఛ భారత్‌’ ‌గురించి మాట్లాడినప్పుడు అనేకమంది నవ్వుకున్నారే తప్ప దేశాభివృద్ధికి అది తొలి అడుగు అని భావించలేదు, ఊహించలేదు. అభివృద్ధి చెందుతున్న, కనీస మౌలిక సదుపాయాలు లేని దేశంగా భారత్‌కు ప్రపంచంలో ఉన్న ఇమేజ్‌ను చెరిపివేసి, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు ఇదే మొదటి చర్య అవుతుందనుకోలేదు. స్వచ్ఛ భారత్‌ ‌నుంచి గ్రామాలలో బహిరంగ మలవిసర్జన వరకు అసలు రాజకీయ, ఆర్ధిక అంశాలనే భావన కూడా మన రాజకీయ పార్టీలకు అప్పటివరకూ లేదు. దేశాన్ని అభివృద్ధి పట్టాలను ఎక్కించి, దానిని వికసిత భారతమనే గమ్యానికి చేర్చేందుకు ఇది తొలి యత్నం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు, మొత్తంగా దేశంలోని ప్రతి పౌరుడు కడుపు నింపుకుని, ఆత్మగౌరవంతో జీవించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మనందరం తెలుసుకోవలసిందే.

భౌతిక సంపద, సాంస్కృతిక, ఆధ్యా త్మికతల పరంగా అంబరాన్ని చుంబించిన భారత దేశాన్ని తిరిగి సుప్రతిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రూపొందించిన పత్రమే ‘వికసిత భారత్‌’ 2047. ‌భారతదేశం రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించిన ఒక శతాబ్దంలోనే దానిని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రధాని మోదీ ఉద్దేశానికి ఇది బ్లూప్రింట్‌. ‌సంపన్న దేశం లేదా దేశ సౌభాగ్యం అన్నది కేవలం నినాదం కాదు. సామాజిక పరివర్తనలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే కృషికి చుక్కాని ఈ వికసిత భారత్‌ ‌సంకల్పం.

ఆర్ధిక వృద్ధి నుంచి సమ్మిళిత అభివృద్ధి వరకూ, సాంస్కృతిక ఆవిష్కరణలను స్వీకరించే వరకూ అనేక అంశాలు ఇందులో పొందుపరిచారు. ప్రతి పౌరుడు ఆర్ధిక వ్యవస్థలో భాగస్వామి అయ్యేలా వారిని బలోపేతం చేయడం వికసిత భారత కీలక లక్ష్యం. బలమైన, సమ్మిళిత, పూర్తి స్థాయిలో ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలు కలిగిన ఆర్ధిక వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది. పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్ధిక వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడం, వివిధ పరిశ్రమ లలో ఆవిష్కరణలను పెంపొందించడం వంటివన్నీ ఇందులో భాగమే. వాణిజ్య వ్యాపారాల విస్తరణకు తగిన పర్యావరణాన్ని సృష్టించడం, తద్వారా ఉపాధిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ‘మేడ్‌ ఇన్‌ ఇం‌డియా’, ‘డిజిటల్‌ ఇం‌డియా’, ‘స్టార్టప్‌ ఇం‌డియా’లే మంచి ఉదాహరణలు. డిజిటీకరణ, దేశీయ ఉత్పత్తి, వృద్ధి చెందుతున్న స్టార్టప్‌ ‌సమాజ సాయంతో లక్షల కోట్లమంది ప్రజలను దారిద్య్రం నుంచి బయటపడేసి, దేశ సంపూర్ణ ఆర్ధిక సామర్ధ్యాన్ని గ్రహించాలని మోదీ ఆశిస్తున్నారు.

ప్రతి పౌరుని జీవన ప్రమాణాలను మెరుగు పరిచి, నిలకడైన వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం అన్నది వికసిత భారత్‌ ‌దార్శనికతలో మరొక కీలక అంశం. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలలో ఉన్న అంతరాలను పూరించి, ప్రభుత్వం ప్రపంచ స్థాయి రహదారులు, రైళ్లు, రేవులను నిర్మించడం నుంచి డిజిటల్‌ అనుసంధానతను పెంచడం, పట్టణ మౌలిక సదుపాయాలను నవీకరించడం వరకూ పలు పనులను చేపట్టింది. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే గృహాలను అందించడం, అనుసంధానతను పెంచడం ద్వారా జీవించదగిన, నిలకడైన నగరాలను నిర్మించేందుకు ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన, భారతమాల, సాగరమాల, స్మార్ట్ ‌సిటీస్‌ ‌మిషన్‌ ‌వంటి ప్రాజెక్టులకు కట్టుబడి ఉంది. వందే భారత్‌ ‌రైళ్లు, ఉడాన్‌ ‌చొరవ వంటివన్నీ కూడా సాధారణ పౌరుడికి ఆటంకాలు లేని ప్రయాణ అనుభవాన్ని కల్పిస్తు న్నాయి. దీనితో పాటుగా నగరాలలో, మెట్రో రైళ్ల విస్తరణ కూడా ప్రజలకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఉత్పాదకను పెంచి, ఆర్ధిక సామర్ధ్య శక్తిని వెలికితీసి, మౌలిక సదుపాయాలలో పెట్టుబడి ద్వారా పౌరుల సాధారణ జీవన ప్రమాణాలను పెంచేందుకు జరుగుతున్న కృషి బృహత్తరమైంది.

సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సంక్షేమం నుంచి ఆర్ధిక వృద్ధి ఫలాలు అందరికీ మేలు చేకూర్చాలన్నది వికసిత్‌ ‌భారత్‌ ‌ప్రాధాన్యతలలో ప్రధానమైంది. బడుగు బలహీన వర్గాలకు, అణచివేతకు గురవుతున్న వర్గాలకు తోడ్పాటునందించేందుకు, సామాజిక భద్రతను, ఆరోగ్య సంరక్షణను, విద్యను విస్తరింప చేసేందుకు అనేక మైలు రాయి చొరవలను ప్రభుత్వం చేపట్టింది. ‘ఆయుష్మాన్‌ ‌భారత్‌, ‌స్వచ్ఛభారత్‌ అభియాన్‌, ‌బేటీ బచావో, బేటీపఢావో, ప్రధాన మంత్రి జన్‌ధన్‌ ‌యోజన’ వంటి పథకాలన్నీ ఆరోగ్యం సంరక్షణ, సమ్మిళిత ఆర్థిక విధానాలు, జెండర్‌ ‌సమానత్వం, స్వచ్ఛత వంటి అంశాలకు ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉందో సూచిస్తాయి. సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా పౌరులంతా భౌతిక వృద్ధిని సాధించేలా, మరింత సమ్మిళిత, సమ సమాజాన్ని సృష్టించేందుకు ప్రధాని మోదీ తన యత్నంలో సఫల మయ్యారనే చెప్పాలి. ‘జన ఔషధీ కేంద్రాల’ ఏర్పాటు వంటి చొరవల ద్వారా ఔషధాలపై 80 శాతం రాయితీ ఇచ్చి పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ. 30వేల కోట్ల రూపాయలను ఆదా చేశారంటే, ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ? కానీ అది నిజం.

ఇక పర్యావరణ పరిరక్షణ విషయానికి వస్తే, మరింత స్వచ్ఛమైన, హరిత భారత్‌ను సృష్టించాలన్నది వికసిత భారత్‌ ‌లక్ష్యం. ఇందుకోసమై ప్రభుత్వం పునరుజ్జీవ ఇంధన వినియోగం, జల సంరక్షణ, పరిశుభ్రతను ప్రోత్సహించడం కోసం స్వచ్ఛ భారత్‌ అభియాన్‌, ‌జల జీవన్‌ ‌మిషన్‌, ‌జాతీయ సౌర మిషన్‌ ‌వంటి చొరవలను అమలు చేస్తోంది. ప్రపంచ స్థాయిలో నిలకడైన అభివృద్ధి సూత్రాలను, అంతర్జాతీయ సౌర కూటమిని ప్రధాని మోదీ సమర్ధించారు. పర్యావరణ సమస్యలను తగ్గించి, భవిష్యత్‌ ‌తరాలకు నిలకడైన భవిష్యత్తును అందించడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, అది పరిరక్షణ చొరవలను, వాతావరణ మార్పులను తట్టుకోగల మౌలిక సదుపాయాలు, పునరుజ్జీవ ఇంధనానికి ప్రోత్సాహాన్ని అందిస్తోంది. గుర్తింపు పొందిన అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలను సమర్ధించేందుకు కట్టుబడి ఉండడమే కాక, 2030 నాటికి తమ వ్యవస్థాపిత విద్యుత్‌ ఇం‌ధన సామర్ధ్యాన్ని శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి చేసేందుకు భారత్‌ ‌కట్టుబడి ఉంది.

పాలనలో పారదర్శకతను, సామర్ధ్యాన్ని పెంచేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవడం అన్నది వికసిత భారత్‌ ‌కీలక లక్ష్యాలలో ఒకటిగా ఉంది. ‘ఆధార్‌, ‌డైరెక్ట్ ‌బెనిఫిట్‌ ‌ట్రాన్స్‌ఫర్‌ (‌డిబిటి)’ వంటి వేదికల ద్వారా సబ్సిడీల, సంక్షేమ ప్రయోజనాల పంపిణీని క్రమబద్ధం చేసి, లీకేజీలను తగ్గించి, లక్ష్యిత లబ్ధిదారులకు నేరుగా అవి చేరేలా ఏర్పాట్లు చేసింది. దాదాపు 10 కోట్ల నకిలీ ఎంట్రీలను తొలగించి, ఆర్ధిక లీకేజీలను విజయ వంతంగా నిర్మూలించేందుకు టిడిబిటి తోడ్పడింది. అలాగే, డిబిటి అన్నది దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు దేశంలోని దళారుల చేతుల్లో పడకుండా కాపాడింది.

అదనంగా, ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌వంటి పథకాలు డిజిటల్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు సాంకేతికతను ఉపయోగించు కున్నాయి. తద్వారా పౌరులు తేలికగా, ఎటువంటి ఆటంకాలూ లేకుండా ఆరోగ్య సంరక్షణ సేవలను వినియోగించుకునేందుకు తోడ్పడింది. మొత్తం మీద, సంక్షేమ ప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ ఉద్ఘాటన అన్నది సమ్మిళిత వృద్ధి, పౌరులందరినీ సాధికారం చేయడం కోసం అది ఎంతగా కట్టుబడి ఉన్నదో పట్టి చూపుతుంది.

ప్రధాని మోదీ వికసిత భారత దార్శనికతో స్ఫూర్తి చెందిన భారత్‌ ‌నేడు ప్రతి రంగంలోనూ గణనీయ మైన పురోగతిని సాధిస్తోంది. అది చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన తొలి దేశంగా కావచ్చు లేదా ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థ దిశగా వడివడిగా అడుగులు వేయడం కావచ్చు, భారత్‌ ‌నిస్సందేహంగా అభివృద్ధి మార్గంలో పరుగులు తీస్తున్నది. ‘ప్రషాద్‌’, ‘‌స్వదేశ్‌ ‌దర్శన్‌’ ‌వంటి పథకాల ద్వారా భారతీయ సంస్కృతి ప్రపంచ వేదికపై విస్తృతమైన ప్రచారాన్ని పొందడమే కాదు దేశీయంగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేశాయన్నది మన కళ్ల ఎదుట కనిపిస్తున్న విషయం.

భారతదేశ సంపూర్ణ సామర్ధ్యాన్ని వెలికతీయడం ద్వారా ముందెన్నడూ లేనంత అభివృద్ధి, సంపన్నత దిశగా మళ్లించేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక, సంచలనాత్మక ప్రణాళికే వికసిత భారత్‌ ‌దార్శనికత. జన్‌ ‌భాగీధారీ (ప్రజల భాగస్వామ్యం)నే ఆధారంగా మరింత బలమైన, సమ్మిళిత సమా ఏర్పాటే దేశ విజయానికి ఆధారం కావాలన్నది దీని లక్ష్యం. ఇందుకు అదనంగా, ప్రభుత్వం మౌలికసదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమం, ఆర్ధిక సాధికారత, నిలకడైన పర్యావరణంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది.

ఇప్పుడు వికసిత భారత్‌ ‌దిశగా చేపట్టిన పథకాల అభివృద్ధి చూద్దాం

స్వచ్ఛభారత్‌ ‌మిషన్‌

‌ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌’‌ను ప్రకటించినప్పుడు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నవారు అతి తక్కువమంది అన్నది నిర్వివాదం. స్త్రీల భద్రత నుంచి ఆరోగ్యం వరకూ ఇందులో ఇమిడి ఉన్నాయి కనుకనే ప్రధాని ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి అమలు చేశారు.

 ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టి ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు. పారిశుద్ధ్యంతో పాటుగా, మరుగుదొడ్లు లేని కారణంగా గ్రామాలలో స్త్రీలు బహిరంగ మలవిసర్జన చేయాల్సిన అవసరం లేకుండా వారికి ఇజ్జత్‌ ‌ఘర్‌ల పేరుతో మరుగుదొడ్లను నిర్మించడం ప్రారంభించారు. ఈ పథకం ప్రకటన అనంతరం భారత్‌లో పారిశుద్ధ్య కవరేజీ అనేది 2014లో 39 శాతంగా ఉండగా, 2019లో నూటికి నూరు శాతాన్ని సాధించింది. ఈ పథకం కింద 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడం దేశంలో 80 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితం (ఓపెన్‌ ‌డిఫెకేషన్‌ ‌ఫ్రీ- ఓడీఎఫ్‌) ‌కాగా, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 4.89 లక్షల గ్రామాలు ఓడీఎఫ్‌ ‌ప్లస్‌ ‌హోదాను దక్కించుకున్నాయి. వీటికి అదనంగా నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఓడీఎఫ్‌ ‌ప్లస్‌ ‌మోడల్‌ ‌హోదాను సాధించి, పారిశుద్ధ్య పద్ధతుల్లో అద్భుతాలను ప్రదర్శిం చాయి. దీనిని బట్టి ప్రజలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో, పథకం ఎంత పద్ధతిగా అమలు అయిందో అర్థం చేసుకోవచ్చు.

పాఠశాలల్లో మరిన్ని మరుగుదొడ్లను నిర్మించిన కారణంగా ఆడపిల్లల డ్రాపౌట్‌ ‌రేట్లు తగ్గిపోయాయి. ఆడపిల్లలకు ఇది చాలా సున్నితమైన అంశంగా ఉండేది కనుకనే వారు మధ్యలోనే చదువు మానుకో వలసి వచ్చేది. అలాగే, పని ప్రదేశాలలో కూడా వీటి నిర్మాణం పని చేసే మహిళలకు మేలు చేసింది.

ఈ మరుగుదొడ్ల నిర్మాణాలతో పలు వృత్తి పనులవారికి-మేస్త్రీలు, కూలీలు, పారిశుద్ధ్య పనివారు వంటివారికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. వీటి ప్రణాళిక, అమలుతో పాటుగా, పారిశుద్ధ్య కార్యక్ర మాల పర్యవేక్షణలో మహిళలు ఎక్కువగా పాలుపంచు కున్నందున వారికే ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవన్నీ కలిసి దేశంలో మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రభావితం చేశాయి.

ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే 2022 అక్టోబర్‌ ‌నాటికి దాదాపు 70 లక్షల ఆవాసాల, కమ్యూనిటీ, ప్రజా మరుగుదొడ్లు నిర్మాణం అయ్యాయి. పట్టణ/ నగర భారతం బహిరంగ మలవిసర్జన రహిత హోదాను సాధించింది. మొత్తం 4,715 పట్టణ స్థానిక సంస్థలూ పూర్తిగా ఓడీఎఫ్‌ అని ప్రకటించాయి. దేశంలో మార్పుకు ఈ పథకం నాంది పలికిందనడం అసమంజసం కాదు.

ఈ పథకం మహిళలకు నెలసరి పారిశుద్ధ్యాన్ని పాటించడం గురించి అవగాహనను పెంచడంలో విజయవంతం అయింది. ముఖ్యంగా, పారిశుద్ధ్య సౌకర్యాలు పెరగడం అన్నది మహిళల్లో నెలసరికి సంబంధించి ఆరోగ్యవంతమైన అలవాట్లు చేసుకోవడానికి తోడ్పడింది. జాతీయ ఆరోగ్య, కుటుంబ సర్వే -5 ప్రకారం దాదాపు 78శాతం మహిళలు, ఆడపిల్లలు ఆరోగ్యవంతమైన నెలసరి పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

ప్రపంచ పటంలో భారత ఆర్ధిక వ్యవస్థ

ప్రధానమంత్రి జన్‌ధన్‌ ‌యోజన

న్యూఢిల్లీలో 2014 ఆగస్టు 28న 1.5 కోట్ల ఖాతాలతో ఆరంభమైన ఈ యోజన కారణంగానే నేడు మనం వాడుతున్న యుపిఐ సాధ్యమైంది. అత్యంత నిరుపేదలను బ్యాంకు ఖాతా సౌకర్యంతో అనుసంధించాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను నేరుగా ఈ అకౌంట్ల లోకి పంపడం ద్వారా ఎంతో అవినీతిని ప్రభుత్వం అరికట్టగలిగింది. ఈ ఖాతా తెరిచిన వారికి డెబిట్‌ ‌కార్డు కూడా ఇవ్వడమే కాదు, దీనితో ప్రతి పేద కుటుంబానికీ లక్ష రూపాయల మేరకు బీమా రక్షణ కల్పించారు.

పథకాన్ని అవహేళన చేసినవారికి నేడు ఆ గణాంకాలను చూస్తే కళ్లు తిరుగుతాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023 నవంబర్‌ ‌వరకూ తెరిచిన ఖాతాల సంఖ్య 51.04 కోట్లు కాగా, 28.29 కోట్లు మహిళ కోసం చేసినవి. గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో తెరిచిన ఖాతాలు 34.04 కోట్లు కాగా, 34.63 కోట్ల ఖాతాదారులకు ‘రూపే’ డెబిట్‌ ‌కార్డులను జారీ చేశారు. దేశంలో 2015 ఆగస్టు నాటికి 17.9 కోట్లుగా ఉన్న జన్‌ధన్‌ ‌ఖాతాల సంఖ్య 2023 నాటికి మూడు రెట్లు పెరిగి 51 కోట్లకు చేరుకుంది.

ఈ ఖాతాల కారణంగా, ఆ పేద కుటుంబాలకు ఉజ్జ్వల గ్యాస్‌ ‌కనెక్షన్‌, ‌డైరెక్ట్ ‌బెనిఫిటి ట్రాన్సఫర్‌ ‌సదుపాయం, పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన వంటి వాటికి ఇచ్చే నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ ‌సమయంలో ఈ ఖాతాదారులకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేరాయి. ఈ ఖాతాల కారణంగా 2023 అక్టోబర్‌ ‌నాటికి 100 శాతం గ్రామాలు బ్యాంకింగ్‌ ‌సౌకర్యంతో అనుసంధానమయ్యాయి. అక్షరాస్యతతో సంబంధం లేకుండా నేడు చిన్నస్థాయి వ్యాపారులు, హాకర్లు కూడా యుపిఐ వాడుతున్నారంటే అందుకు ఆధారం ఈ ఖాతాలేనన్నది నిర్వివాదం.

గ్రామీణ విద్యుదీకరణ

వికసిత భారత్‌ ‌దిశగా మరొక పెద్ద అడుగు ప్రతి గ్రామాన్నీ విద్యుద్దీకరించడం . భారత ప్రభుత్వం వివిధ పథకాలు చేపట్టినప్పటికీ, ఏప్రిల్‌ 1, 2015 ‌నాటికి 18,542 గ్రామాలను విద్యుదీకరించలేదు. 69వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15 ఆగస్టు, 2015లో ప్రధానమంత్రి మిగిలిన గ్రామాలన్నింటినీ 1000 రోజుల్లో రాష్ట్రాలు, స్థానిక సంస్థల తోడ్పాటుతో విద్యుదీకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశలో ఏప్రిల్‌ 28, 2018‌లో దేశంలోని మొత్తం గ్రామాలను విద్యుదీకరించి మైలురాయి విజయాన్ని సాధించారు. మణిపూర్‌ ‌రాష్ట్రంలోని లీసంగ్‌ అన్నది విద్యుదీకరించిన ఆఖరి గ్రామం కావడం విశేషం. ఈ విషయాన్ని 2018లో అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఇఎ) గుర్తించడమే కాదు, 2018 ప్రపంచ విజయ గాథలలో ఒకటిగా దీనిని ప్రశంసించింది. దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో భారత ప్రభుత్వం 100 శాతం గ్రామీణ విద్యుదీకరణను సాధించింది.

ఈ పథకంలో భాగంగా, ప్రభుత్వం 18374  గ్రామాలకు, 2.86 కోట్ల ఆవాసాలకు విద్యుత్‌ ‌కనెక్షన్లను అందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించింది. వీటితో పాటుగా, ఉన్నవాటికి తోడు 2927 కొత్త సబ్‌ ‌స్టేషన్లను జోడించి, ఉనికిలో ఉన్న 3965 సబ్‌స్టేషన్లను ఆధునీకరించి, 6,92,200 పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను స్థాపించడమే కాక 1,13,938 సర్క్యూట్‌ ‌కిలోమీటర్‌(‌సికెఎం)ల ఫీ•ర్లను వేరు చేసి, 8.5 లక్షల సర్క్యూట్‌ ‌కిలోమీటర్ల మేర హైటెన్షన్‌, ‌లోటెన్షన్‌ ‌లైన్లను జోడించింది/మార్చింది.

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే నరేంద్ర మోదీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దేశంలో అత్యంత నిరుపేదలను కూడా దృష్టిలో పెట్టుకుని, అవి వారికి ఏదో ఒకరకంగా లబ్ధి చూకూర్చేలా పథకాలు రూపొందించి అమలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ హోదానే మార్చివేసేలా ప్రధాని అమలు చేసిన పథకాలు అందుకోని వారు తక్కువ. దేశ పురోగతిలో ప్రజలు కూడా పాలుపంచుకునే విధంగా రూపొందించిన పథకాలు – గ్రామీణ విద్యుదీకరణ, జీఎస్‌టి, స్టార్ట్ అప్‌ ఇం‌డియా, ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌వివరాలు వచ్చేవారం మరిన్ని తెలుసుకుందాం.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE