అధికారం ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా.. ఎదుటివాళ్లను కనీసం లెక్కచేయకుండా కంటిచూపుతోనే శాసిస్తూ సకల రంగాలనూ, సకల శాఖలనూ కబంధ హస్తాల్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమంగా తేటతెల్లమవుతోంది. ఓవైపు.. ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు పెంచుకోవడం, మరోవైపు నియంతృత్వ పాలనతో ప్రజల ఆస్తులను, ప్రభుత్వ వ్యవస్థలను సొంత జాగీరులా, తమ గడీలుగా మలచుకోవడం, అధికారం తమకే శాశ్వతం అనేలా వ్యవహరించడం ఏ స్థాయికి తీసుకెళ్తుందో, ఎలాంటి అనుభవాలను రుచిచూపిస్తోందో రాష్ట్రంలో కొద్దినెలలుగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్‌) ‌గా మారిన ఒకప్పటి ఉద్యమపార్టీ తెలంగాణ రాష్ట్రసమితి అగ్రనేతల పరిస్థితి ఇప్పుడు పెనంలోంచి పొయ్యిలో పడినట్లుగా తయారయ్యింది. ఉద్యమపార్టీగా ప్రజల సెంటిమెంట్‌ను అస్త్రంగా మలచుకొని అధికార పీఠంపైకి ఎక్కిన బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం,రాష్ట్రంలో ఏం జరగాలన్నా, ఏం చేయాలన్నా తమ కనుసన్నల్లోనే సాగాలన్న తీరులో వ్యవహరించింది. అలా పదేళ్ల నియంతృత్వ పాలనకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి అధికార పీఠం అప్పగించారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గత పదేళ్ల పాలన దుర్మార్గాలను,అవినీతి అక్రమాలను బయటపెడుతూ వస్తోంది. సంపాదనే ధ్యేయంగా, కమీషన్లే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనుయాయులకు కట్టబెట్టిన సర్కారు సొమ్ము వివరాలను బయటకు లాగుతోంది. దీంతో, కేసీఆర్‌ ‌కుటుంబం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇన్నాళ్లు రాజభోగాలు అనుభవించిన కుటుంబ సభ్యులు ఏ రోజు ఏ కుంభకోణం బయట పడుతుందో, ఏ కేసు నమోదవుతుందో అన్న భయాం దోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి, అటు కమిషన్లకు, మరోవైపు న్యాయస్థానాలకు ఏమని వివరణ ఇచ్చుకోవాలన్న ఆలోచనల్లో కకావికలమై పోతున్నారు.

వెంటాడుతోన్న నోటీసులు

కష్టాల మీద కష్టాలు…

 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కల్వకుంట్ల కుటుం బానికి కష్టాలు మొదలయ్యాయి. పదేళ్ల అధికారాన్ని కోల్పోవడం, కేసీఆర్‌ ‌బాత్‌రూంలో జారిపడటం వరుసగా జరిగాయి. అధికారం పోవడంతో కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోయారు. కేసీఆర్‌ ‌కూతురు కవిత మద్యం అక్రమ వ్యవహారంలో జైలు పాలయ్యారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ తన చరిత్రలో ఎరుగని పరా జయం చవిచూసింది. ఫోన్‌ ‌టాపింగ్‌, ‌కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌స్కాం, ఈడి దాడులు, గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు అంటూ రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం అక్రమాలను బయటకు తీస్తోంది.

ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌ ‌తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే తారక రామారావుకు ఊహించని షాక్‌ ‌తగిలింది. తాజాగా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్‌ ఎన్నికను సవాల్‌ ‌చేస్తూ సిరిసిల్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌ ‌రెడ్డి, లగ్సిటి శ్రీనివాసులు వేరువేరుగా పిటిషన్లు దాఖలుచేయగా, కేటీఆర్‌ ‌తో పాటు ఎన్నికల అధికారులకు, సిరిసిల్ల ఆర్వోలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు. ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో కేటీఆర్‌ ‌చూపించిన లెక్కలు తప్పుగా ఉన్నాయన్నది ప్రత్యర్థుల అభ్యంతరం. అఫిడవిట్‌ ‌లో ఆయన త•న ఆస్తుల వివరాలు సరిగా పొందుపరచలేదని ఈ పిటిషన్‌లో ఎత్తిచూపారు. కేటీఆర్‌ ‌కుమారుడు హిమాన్షు పేరుతో ఆస్తులు ఎలా వచ్చాయి? అంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో మైనర్‌గా ఉన్న కుమారుడు పేరుపైన 36 ఎకరాలు ఉన్నాయని, దానికోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశాడని, ఆ డబ్బంతా ఎక్కడిది..? అనే వివరాలను తెలపాలని పిటీషనర్లు దావాలో తెలిపారు. కేటీఆర్‌ ‌తన కొడుకు హిమాన్షు పేరుతో ఆస్తులు కూడబెట్టి నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కేటీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కూడా కొడుకు పేరు మీదనే ఉందని సమాచారం. కొడుకు పేరు మీద విదేశాలలో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్య, మైనర్‌ ‌కూతురు మాత్రమే తనపై ఆధారపడి ఉన్నారని, కొడుకు హిమాన్షు తనపై ఆధారపడి లేడని కేటీఆర్‌ ఎన్నికల సమయంలో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని హైలెట్‌ ‌చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి, లెగిసెట్టి శ్రీనివాస్‌ ‌విడివిడిగా హైకోర్టులో పిటిషన్‌ ‌వేశారు. గత ఏడాది మేజర్‌ అయిన హిమాన్షు ఒక్కసారిగా అంత డబ్బు ఎలా చెల్లించారనేది అనుమానాలకు తావిస్తోంది. కొడుకుకు తండ్రి సహాయం చేసి ఉండొచ్చని పిటీషనర్లు పేర్కొంటున్నారు. కోర్టుకు ఒకవేళ కేటీఆర్‌ ‌వివరణ ఇవ్వకపోతే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందా..? అనే అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసును విచారించిన హైకోర్టు, నాలుగు వారాల్లో కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ఆదేశిస్తూ, నోటీసులు ఇచ్చింది.

మెడకు చుట్టుకుంటోన్న నిర్ణయాలు,

పొరపాట్లు :

అనేక విధాన నిర్ణయాలలో అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణల మేరకు జ్యుడిషియల్‌ ‌కమిషన్లు వెలికితీస్తున్న అంశాలు కేసీఆర్‌ ‌కుటుం బానికే తగులుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులను బాధ్యులు చేసి విచారిస్తున్నా.. చివరకు ఆ నిర్ణయాల వెనుక ఉన్నది కేసీఆర్‌ ‌కుటుంబం అనే రహస్యాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేకుండా సాగిన అవినీతి, కమీషన్లు వంటి అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత విషయం లో చూపలేదనే కఠోర వాస్తవాలు బయటపడు తున్నాయి. దీనిమీద జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌నేతృత్వంలోని న్యాయవిచారణ సంఘం విచారణ చేస్తోంది. గొర్రెల స్కామ్‌లోనూ దాదాపు రూ. వెయ్యి కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. విద్యుత్‌ ‌కొనుగోలు ఒప్పందాల్లోని అక్రమాలపై జస్టిస్‌ ‌నర్సింహారెడ్డి కమిషన్‌ ‌విచారణ జరుపుతోంది. అధికారంలో ఉన్నప్పుడు నియంతృ త్వంగా వ్యవహరించిన కేసీఆర్‌ ‌కుటుంబానికి ప్రభుత్వం మారగానే చిక్కులు ఎదురవుతున్నాయి.

అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ ‌బొక్కబోర్లా పడింది. ఒక్క సీటు కూడా సాధించ లేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించు కున్న 39 మందిలో, ఆ పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని ఆపుకోలేని పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

షాకిస్తున్న కరెంట్‌ ఒప్పందం

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం హయాంలో కుదిరిన ఛత్తీస్‌గఢ్‌ ‌విద్యుత్‌ ‌కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి, భదాద్రి థర్మల్‌ ‌ప్లాంట్ల విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్‌ ‌నర్సింహారెడ్డి కమిషన్‌ ‌నోటీసులు ఇచ్చింది. అయితే, ఆ కమిషన్‌నే వైదొలగాలంటూ కేసీఆర్‌ 12 ‌పేజీల లేఖ రాయడం రాజకీయంగానే కాదు.. న్యాయవర్గాల్లోనూ చర్చను లేవనెత్తింది. జూన్‌ 15‌వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కమిషన్‌ ‌పేర్కొనగా, కేసీఆర్‌ ‌సమాధానం ఇవ్వడం అటుంచి, తనదైన శైలిలో జవాబిచ్చారు. రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారని లేఖలో ఆక్షేపించారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ ‌విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామన్నారు. అంతేకాదు, విచారణ కమిషన్‌ ‌బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి సూచించారు.

విచారణ నిష్పక్షపాతంగా కాకుండా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. తనను, తమ పార్టీని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర జరగుతోందని ఆరోపించారు. ఈ అంశంపై కమిషన్‌ ‌కూడా స్పందిస్తూ, కేసీఆర్‌ ‌లేవనెత్తిన అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించాల్సి ఉందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన సమాధానాలకు, వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందని జస్టిస్‌ ‌నర్సింహారెడ్డి కమిషన్‌ ‌పేర్కొంది. కేసీఆర్‌ ‌లేఖ విమర్శలకు తావిచ్చింది. అక్రమాలు జరగకపోతే, అవాస్తవాలపై విచారణ జరుగుతోందనుకుంటే, అప్పటి పరిణామాలపై పారదర్శకంగా సమాధానాలు ఇవ్వొచ్చు కదా అని ప్రభుత్వం, న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఒప్పందాలపై గుట్టువిప్పిన డిస్కంలు :

ఛత్తీస్‌గఢ్‌ ‌నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ‌పంపిణీ సంస్థలు జ్యుడిషియల్‌ ‌కమిషన్‌కు తెలిపాయి. బహిరంగ మార్కెట్‌లో చౌకగా కరెంటు లభిస్తున్నా, అంతకుమించి సొమ్మును ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఒక్కో యూనిట్‌ను రూ.3.90లకే కొనేందుకు ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు విద్యుత్‌ ‌కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుందని కేసీఆర్‌ ‌జ్యుడిషియల్‌ ‌కమిషన్‌ ‌ఛైర్మన్‌కు లేఖలో పేర్కొన్నారు.

ఆ పీపీఏ, తదనంతర పరిణామాలపై అటు ప్రభుత్వానికి, ఇటు జ్యుడిషియల్‌ ‌కమిషన్‌కు డిస్కంలు తాజాగా సమగ్ర సమాచారం అందజేశాయి. ఛత్తీస్‌గఢ్‌ ‌నుంచి ఒక్కో యూనిట్‌ ‌కరెంటు రావడానికి అయిన ఖర్చు రూ.5.64లకు చేరడంతో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాయి. యూనిట్‌ ‌కొనుగోలు ధర రూ.3.90 మాత్రమే అని కేసీఆర్‌ ‌తెలిపారు. కానీ, 2017 నుంచి 2022 వరకు కొన్న 17,996 మిలియన్‌ ‌యూనిట్లకు ఛత్తీస్‌గఢ్‌కు తెలంగాణ డిస్కంలు రూ.7,719 కోట్లు చెల్లించాయి. ఇంకా రూ.1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని డిస్కంలు చెబుతున్నాయి. విద్యుత్‌ ‌సరఫరా లైన్‌ ‌ఛార్జీలు రూ.1,362 కోట్లు దీనికి అదనం. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్‌ ‌ఖర్చు రూ.5.64 అయిందని డిస్కంలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రూ.3.90 చొప్పున చెల్లించాల్సిన ధరతో పోలిస్తే దాదాపు రూ.3,110 కోట్ల అదనపు భారం పడిందని తెలిపాయి.

మూడు నెలలుగా తీహార్‌ ‌జైల్లో కవిత :

ఇక.. అటు చూస్తే కేసీఆర్‌ ‌కూతురు కవిత ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అరెస్ట్ అయి మూడు నెలలు దాటింది. ఢిల్లీ మద్యం విధానం, మనీలాండరింగ్‌ ‌కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రెండు దఫాలుగా 10రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు జ్యూడీషియల్‌ ‌కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడీషియల్‌ ‌కస్టడీని కోర్టు పొడిగిస్తూ వస్తోంది. తీహార్‌ ‌జైల్‌ ‌లో జ్యూడీషియల్‌ ‌కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్‌ 11‌న కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ రౌస్‌ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్‌ ‌కస్టడీ విధించింది. ఆ కేసులో జ్యూడీషియల్‌ ‌కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది. కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో కవిత గడుపుతున్నారు. లిక్కర్‌ ‌కేసులో ఈడీ, సీబీఐల అరెస్ట్‌లను సవాల్‌ ‌చేస్తూ, బెయిల్‌ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యూలర్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్లను ఇప్పటికే రౌస్‌ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది.

ఇలా వరుసబెట్టి చిక్కులు ఎదురవుతుండటం కల్వకుంట్ల ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చివరకు కుటుంబసభ్యులందరూ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితులు దాపురించాయని… విచారణ సంస్థలు, న్యాయ కమిషన్లతో పెట్టుకొని వివాదాలను మరింత జఠిలం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

– సుజాత గోపగోని, 

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE