– డా. ఐ.వి.మురళీకృష్ణశర్మ

ఓడినవారు తమ పరాజయం బయటపడకుండా ఎదుటివారి విజయాన్ని తక్కువ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఇలానే ఉంది. రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ గతం కంటే మూడోసారి మెరుగుపడ్డాం అనే ఆనందంలో వాస్తప పరిస్థితులను విస్మరిస్తున్నది. ఎన్నికల్లో సంఖ్యాపరంగా గెలిచిన వారిదే అంతిమ విజయం అనే ప్రాథమిక సూత్రాన్ని ఉద్దేశపూర్వకంగా తెలియనట్టు నటిస్తూ బీజేపీపై మానసిక యుద్ధాన్ని ప్రారంభించింది కాంగ్రెస్‌.

240 కంటే 99 ఎక్కువా..?

‘మోదీని ప్రజలు తిరస్కరించారు’, ‘మోదీది నైతిక ఓటమి’ అని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ‘యూపీలో తక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి మోదీ రాజీనామా చేయాలి’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్సాస్పదం. బీజేపీకి 240 స్థానాలు సాధించి పెట్టిన మోదీని ప్రజలు తిరస్కరించారని చెప్పడం, కాంగ్రెస్‌కు 99 స్థానాలే సాధించి పెట్టిన రాహుల్‌గాంధీని ఆమోదించారని భావించడం విచిత్రం. ఇందులో రేవంత్‌ డిమాండ్‌ మరింత హాస్యాస్పదం. జరిగినవి పార్లమెంట్‌ ఎన్నికలన్న సంగతి సానుకూలంగా విస్మరించి అధిష్టానం మెప్పు పొందేందుకు రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిశీలిస్తే కర్ణాటకలో బీజేపీ అధిక స్థానాలు పొందింది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆ పార్టీ ఒక్క స్థానం కూడా సాధించలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీ 8 సీట్లు గెలిచింది. రేవంత్‌ రెడ్డి చెప్పిన సూత్రాన్ని అనుసరించి ఆ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు మొదట రాజీనామా చేసుంటే బాగుండేది.

పదేళ్ల మన్మోహన్‌సింగ్‌/యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపిన ప్రజలు అనంతరం మరో మూడు పర్యాయాలు కాంగ్రెస్‌ను విశ్వసించలేదనే వాస్తవాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పుడైనా గ్రహించాలి. 2004లో 26 శాతం ఓట్లతో 145 సీట్లు, 2009లో 28 శాతం ఓట్లతో 206 సీట్లు సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌, 36 శాతం ఓట్లతో 240 స్థానాలు సాధించిన మోదీని అభిశంసిస్తున్నది. 2014లో కాంగ్రెస్‌ను కేవలం 19 శాతం ఓట్లతో 44 స్థానాలకు, 2019లో 19 శాతం ఓట్లతో 52 స్థానాలకే పరిమితం చేశారు. ఇది ప్రజావ్యతిరేకతకు గీటురాయి. కానీ పదేళ్ల తరువాత సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మూడోసారి కూడా అధికారానికి చేరువగా వచ్చిన పార్టీకి ప్రజామోదం లేదని విమర్శించడం కాంగ్రెస్‌కే చెల్లింది.

మోదీ ఇచ్చిన ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’ నినాదం లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఆయన పాలనను ప్రజలు తిరస్కరించినట్టు సంబరపడుతున్న కాంగ్రెస్‌ నేతలు తాము వంద స్థానాలు కూడా సాధించలేదనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. దేశంలో ఎన్నికలకు ముందు, అనంతరం కూడా మోదీనే మరోసారి ప్రధానమంత్రి అవుతారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవనే వాతావరణం ఎన్నికలకు ముందే నెలకొంది. అది కాంగ్రెస్‌కు కూడా తెలుసు. అందుకే మొదట ఎగ్జిట్‌ పోల్స్‌ చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించిన కాంగ్రెస్‌ అనంతరం నిర్ణయం మార్చుకుంది. ఎన్నికలు ముగియగానే ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు ఈవీఎంపై ఎప్పటిలానే విమర్శలు ఎక్కుపెట్టి ఫలితాల అనంతరం మౌనం పాటించారు.

ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ‘400 పార్‌’ నినాదం

2024 ఎన్నికల్లో గమనించాల్సిన ప్రధాన అంశం ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’ అనే నినాదం ఒక మానసిక యుద్ధం. ఒక పర్యాయమే అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా మూడోసారి అందలమెక్కడం సులభం కాదని తెలిసిన బీజేపీ ప్రతిపక్షాలపై పైచేయి సాధించాలనే లక్ష్యంగా ‘400 పార్‌’ నినాదాన్ని ముందుకు తెచ్చింది. 400 స్థానాలు రాకపోయినా మరోసారి ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ ముందుచూపుతో ఎన్నికలకు ముందే బిహార్‌లో నీతీశ్‌కుమార్‌తో, ఏపీలో చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లతో పొత్తు కుదుర్చుకుంది. అంతిమంగా ‘ఇండి’ కూటమి తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రావడాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఈ పరిణామాలను గమనిస్తే ఎన్డీయే కూటమి ‘ఇండి’ కూటమిపై మానసికంగా చేసిన యుద్ధంలో విజయం సాధించినట్టే.

ఈ ఫలితాలతో దేశంలో బీజేపీ పని అయిపోయి నట్టేనని, రాబోయేది కాంగ్రెస్‌దే రాజ్యం అంటూ బీజేపీ వ్యతిరేకులు పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకించి పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే ఆ ఊహలు వాస్తవికతకు ఎంత దూరంలో ఉన్నాయో తెలుస్తుంది. యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభావం నామమాత్రమే అని ఫలితాలను బట్టి తెలుస్తుంది. యూపీలో బీజేపీని అడ్డుకున్నాం అని తృప్తి చెందుతున్న కాంగ్రెస్‌, అక్కడ ఎస్పీ సహకారంతో సాధించిన సీట్లు 6 మాత్రమే. తమిళనాడులో డీఎంకే స్నేహంతో 9, మహారాష్ట్రలో ఉద్దవ్‌ఠాక్రే, శరద్‌పవార్‌ తోడవడంతో 13 స్థానాలు గెలిచింది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగితే రిక్తహస్తమే. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఇప్పటికీ కోలుకోలేక నోటాతో పోటీపడుతోంది.

అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీతో ముఖాముఖి తలపడిన కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లోనూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కంటే అధిక ఎంపీ స్థానాలు గెలకలేక పోయింది. రాజస్థాన్‌లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి 8 సీట్లు గెలిచింది. పంజాబ్‌లో, కేరళలో ‘ఇండి’ కూటమిలో భాగస్వాములు ఆప్‌, వామపక్షాలపై ఆధిపత్యం సాగించి ఎక్కువ సీట్లు గెలవడం కాంగ్రెస్‌ పార్టీకి కొంత ఉపశమనం. కాంగ్రెస్‌ అధిక స్థానాలు సాధించిన పంజాబ్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ ఆ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. మరోవైపు ఒకప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన కాంగ్రెస్‌ ఇప్పుడు సొంతంగా మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.

ఫలితాల అనంతరం ప్రకటనలతో ఊదర గొడుతున్న రాహుల్‌ గాంధీ మరో అడుగు ముందుకేసి వారణాసిలో ఆయన సోదరి ప్రియాంక వాద్రా పోటీ చేసుంటే నరేంద్ర మోదీ ఓడిపోయే వారని చెప్పడం ఒకరకమైన వెర్రికి పరాకష్ట. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ ప్రభావం అంతుంటే ఆమె 2020లో రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో రెండున్నర శాతం ఓట్లతో కేవలం రెండు స్థానాలే సాధించిందనే విషయాన్ని మర్చిపోయి నట్టున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులు తెలిసిన కాంగ్రెస్‌ 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే బీజేపీపై, నరేంద్ర మోదీపై ప్రకటనలతో మానసిక యుద్ధం ప్రారంభించిందని భావించవచ్చు.

ప్రతిపక్ష హోదా రాగానే సీఎల్పీ నేతగా రాహుల్‌

పదేళ్లు ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని కాంగ్రెస్‌కు ఇప్పుడు ఆ అవకాశం దక్కడంతో పార్టీలో ‘గాంధీ’ కుటుంబం భజన ఊపందుకుంది. 2014, 2019 లోక్‌సభలో సీఎల్‌పీ నేతలుగా మల్లికార్జున్‌ ఖర్గే, అధీర్‌ రంజన్‌ చౌదరీలను ఎంపిక చేసిన పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాగానే రాహుల్‌ గాంధీని సీఎల్‌పీ నేతగా ఎన్నుకునేందుకు సిద్ధమవుతోంది. గతంలో 52 స్థానాలున్న కాంగ్రెస్‌ ఇప్పుడు 99 సీట్లలో గెలవడంతో రాహుల్‌ను కీర్తిస్తున్న భజన పరులు జాతీయ అధ్యక్షులు ఖర్గే ఊసే ఎత్తడం మానేసి ‘గాంధీ’ భజనకు పరిమితమయ్యారు.

1984 ఎన్నికల అనంతరం సొంతంగా మెజార్టీ సాధించని కాంగ్రెస్‌ ఇప్పుడు బీజేపీ 240 సీట్లకే పరిమితమై ఇతర పార్టీలపై ఆధారపడడంతో ప్రస్తుత మోదీ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని వ్యాఖ్యా నిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఎన్డీఏ కూటమి అవకాశవాద రాజకీయాలతో ఏర్పడినది కాదు. కూటమిలోని పార్టీలన్నీ బీజేపీ నేతృత్వంలో కలిసికట్టుగా పోటీ చేశాయి. ఇందుకు భిన్నంగా ఫలితాలు రాగానే కాంగ్రెస్‌ కూటమిలోని పార్టీలను అధికారం కోసం తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నించింది. పాత మిత్రులు జేడీ (యూ)కు గాలం వేయాలని చూసి భంగపడిరది.

ఎన్డీఏలో లుకలుకల కోసం కాచుకొని కూర్చున్న కాంగ్రెస్‌ ‘ఇండి’ కూటమిలో తనకున్న గుర్తింపు ఎంత పదిలమో ఆలోచించాలి. పలు రాష్ట్రాల్లో బలహీన పడుతున్న కాంగ్రెస్‌ భవిష్యత్‌ ‘ఇండి’ కూటమిలోని ఇతర పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది. కాంగ్రెస్‌కు పట్టున్న కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో అవకాశవాద మిత్రులు వామపక్షాలతో, ఆప్‌తో పోరు తప్పదు. ఆప్‌ ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎలా వ్యవహ రిస్తుందో మిలియన్‌ డాలర్‌ ప్రశ్నే. తమిళనాడులో స్టాలిన్‌, మహారాష్ట్రలో శరద్‌ పవార్‌, ఉద్దవ్‌ఠాక్రే ఎలా చెబితే అలా నడుచుకోవాలి. సంచనాలకు కేంద్రమైన మమతా బెనర్జీ ‘ఇండి’ కూటమిలోనే ఉన్నా బెంగాల్‌లో కాంగ్రెస్‌ను చేరదీయరు. యూపీ, బీహార్‌లో అఖిలేష్‌, తేజస్వీలు కాదంటే కాంగ్రెస్‌కు అక్కడ పుట్టగతులే ఉండవు.

ఈ పరిణామాల మధ్య లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం హస్తం నేతల వ్యవహార శైలి, ప్రకటనలు చూస్తుంటే ఓడినా నాదే పైచేయి అన్నట్టు ఉంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజాభిమానం ఉన్ననాళ్లకు అధికారం దక్కుతుంది. ప్రజాగ్రహానికి గురైనవారు చతికిలపడతారు. ప్రజాదరణ ఎలా పొందాలో ఆలోచించకుండా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఆత్మ సంతృప్తికి అనుకూలంగా లెక్కలేసుకుంటూ మనమేమి చెప్పినా, ఏమి చేసినా చెల్లుతుందనుకుంటూ ప్రవర్తిస్తే ఇప్పటికే ముచ్చటగా మూడుసార్లు భంగపడ్డ కాంగ్రెస్‌ హస్తవాసి భవిష్యత్తులో కూడా మారదు.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE