రామోజీరావు.

ఈ పేరు వినగానే మన మనసు ఏమంటుంది? స్మృతివనం. ఇది తలపులోకి రాగానే, మనదైన మది ఏమైపోతుంది?

1936  అది నవంబరు 16.

2024 జూన్‌ 6. ‌రాసేందుకు కలం కదలడం లేదు.

ఎప్పటి మాదిరే తెల్లవారింది. తనతోపాటు పెను విషాదాన్నీ తీసుకొచ్చింది.

ఆయన లేరు, భౌతికంగా. లేకుండా పోరు మానసికంగా.

ప్రతీ హృదీ క్షోభించింది. కుటుంబ పెద్దను కోల్పోయినంతగా మౌనంగా రోదించింది. ఎందుకని? అలా అని తను  మహోన్నత హోదాను అలంకరించిందీ లేదు. పదుల సంఖ్యలోని సంస్థలకు స్థాపకత్వం తనదే అయినా; మూడక్షరాల తెలుగు పేరునే శ్వాసించారు. ఆ పత్రికను ఆ రోజూ చదివి, ఆ టీవీని ఆ రోజునా చూసి, అదే రాత్రివేళ చివరన  మూడే మూడు మాటలన్నారు. ఏమిటా మూడు మాటలు?

‘తుది పోరులో నేనే గెలిచాను’

అటు తర్వాత కొన్ని గంటలకే అంతిమ శ్వాస విడిచారు.

చివరిదాకా నిలిచిందీ, చిట్టచివరికి గెలిచిందీ ఆయనే!

ఆ గెలుపు సమాజహిత లక్ష్య సాధనలో, జనస్వామ్య వ్యవస్థాపనలో.

ఎందుకూ? ఏమిటీ? ఎలా? అనేది ఆంధప్రదేశ్‌ ‌వాసులందరికీ తెలుసు. తెలంగాణలోని తెలుగు హృదయాలన్నింటికీ మరింతగా తెలుసు. ఉభయ రాష్ట్రాల వారూ హాయిగా ఊపిరి పీల్చుకున్న ఏవో ఎన్నికల తుది ఫలిత ప్రభావం అది. అంతా రాజకీయ, సామాజిక, పరిపాలనా సంబంధ కీలక అంశం.

ఇప్పుడు మనం అనుకుంటోంది మరో మహా విజయం గురించి.

మనసుల్ని గెలవడం. అందుకే ఆయన రామోజీరావు. అక్షర విజేత.  మరో మాటలో  నిత్యశక్తి. విలక్షణమూర్తి. ఎవ్వరూ మరువని స్ఫూర్తి దీప్తి.

నేల తార నింగికి దూసుకెళ్లడం, వేగు చుక్కగా మారడం అంటే ఇదే!

విశ్వవిఖ్యాత  వాణిజ్యవేత్త. అనేకానేక వ్యాపార వ్యవస్థల అధినేత. ప్రపంచ ప్రసిద్ధి రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాత. రెండవ అత్యున్నత పురస్కృతి పద్మవిభూషణ్‌ ‌స్వీకర్త.

ఎందరు ఎన్ని విధాలుగా పిలిచినా, కీర్తించినా… ‘ఈనాడు’ అనగానే ఆయన గుండె ఉప్పొంగుతుంది.

ఈటీవీ పేరు వినీ వినగానే శతకోటి కాంతిప్రభ ఆ వదనమంతటా పరచుకుంటుంది. రాయడం, చదవడం, చూడటం అంటే అంతంత ప్రగాఢ ప్రేమ ఆయనకి.‘ఈనాడు/ఈటీవీ రామోజీరావు’గా పిలిపించుకునేందుకే ఎంతెంతగానో ఇష్టపడతారు.

‘అక్షరం’ ఆశ, శ్వాస, ఆశించిందీ, శ్వాసించిందీ అక్షరాన్నే!

ముందు పేరు రామయ్య, యువతకు ఆత్మీయ తాతయ్య.

చిరపరిచితమైనది ‘ఛైర్మన్‌’‌గానే.

తన ఇంటి పేరు రాసుకునేందుకు, ఆ తీరున పిలిపించుకునేందుకు అంతగా ఇష్టపడేవారు కారు. రామోజీ అన్నదే అనురక్తికరం. ‘నేను తెలుగువాడిని. నాది తెలుగునాడి. తెలుగుతోనే నా వాడీ వేడీ’- ఇదీ ఆయన అంతరంగ•నాదం.

తెలుగునాట పల్లెటూరులో రైతు కుటుంబాన పుట్టారు. స్వయంశక్తితో అంచెలంచెలుగా ఎదిగారు. మహాత్కృష్ట స్థాయికి చేరుకున్నా, తెలుగునేలను వీడలేదు. తెలుగు నాటనే ఉండి, ప్రత్యేకించి పత్రికారంగాన్ని పండించారు.  చలనచిత్ర నిర్మిత శక్తి సంపన్నతతో ఎంతెంతో సాధించగలిగారు. పోరుపటిమకు ప్రతీకగా… జీవనరంగంలో ప్రతిఘటన అంటే ఏమిటో నిరూపించి చూపించారు.

పిల్లల పేర్లు కిరణ్‌, ‌సుమన్‌. ‌మనుమడు సుజయ్‌, ‌మనుమరాళ్లు పేర్లలోనూ  ముచ్చటగా మూడే అక్షరాలు. సహరి, బృహతి, సోహన, దివిజ… అలా.

ఒకటి తర్వాత మరొకటి ఏదీ ఉండకూడదన్నది ఏకైక సిద్ధాంతం. అగ్రగామిగా ఉండాలన్నదే నిరంతర తపన.

ఆ అగ్రేసరత్వం కోసమే జీవితమంతా పరితపించి సొంతం చేసుకున్నారు. తన మానసపుత్రిక అయిన పత్రిక కోసం రామోజీరావు అందరు చదువరుల మాదిరిగానే వేచి ఉండేవారు. తెల్లవారడానికి ముందే ఏ మూడున్నరకో లేచి లైట్లు వేసి ఆసాంతం చదివేవారు / చదువుకునేవారు. అదీ సమయపాలన.

కాలంతో పోటీ పడటం జర్నలిస్టుల లక్షణం. ఆయనా అంతే. సమయంతో పరుగు తీస్తుండేవారు. ఏ పని అయినా సరే టైమ్‌ ‌ప్రకారం జరిగి తీరాల్సిందే!

88 సంవత్సరాల వయసులోనూ తన పని తాను చేసుకుంటూనే ఉన్నారు. ప్రాయాన్ని జయించారు. అనారోగ్యాన్నీ ఓడించారు. విశ్రాంతి అన్నదే తెలియదు ఆయనకి. అక్షర కదనోత్సాహి.

ఆలోచనలన్నీ తెల్లవారు జాము నడకవేళ ఉదయించేవి. అటు తర్వాత రూపుదిద్దుకుని, ఆచరణలుగా మారి అసంఖ్యాకుల జీవితాల్లో వెలుగులు నింపాయి అవి.

క్షణంలోనే ఎన్నెన్ని సమాలోచనలో! ఆ క్రమంలోనే సదాచరణలు.

విజ్ఞానం అనే పదం తనకు పరమానందం. అందుకే వేలాది పుస్తకాలతో ఫిల్మ్‌సిటీ ప్రాంగణంలోనే రామోజీ విజ్ఞాన కేంద్రం విరాజిల్లుతోంది. ఎవరు, ఏ రచన చేయాలన్నా, ఏ అంశంమీద రాయాలన్నా, టీవీ పోగ్రాం రూపొందించాలన్నా సర్వ సమస్త సకల వివరాలతో,   పూర్వాపరాల క్రోడీకరణ / సమీకరణలతో వందలాది క్లిప్పింగుల సంసిద్ధంగా ఉంటాయక్కడ. తెలుగుతో పాటే అనేకానేక భాషల్లో దిన, వార, పక్ష, మాస, త్రైమాసిక, అర్ధవార్షిక, సంవత్సర పత్రికలూ, పుస్తకాలూ సంపుటాలూ, సంకలనాలూ అనేకం.

అక్షరమే మనందరికీ రక్ష అని పిన్నలూ పెద్దలందరికీ తరచూ చెప్తుండేవారు. మాటలూ, రాతల్లోని అంతస్సారాన్ని గ్రహించి సమగ్ర అధ్యయనం చేయాలనేవారు.

మీరు ఏం చేస్తారన్నది ప్రపంచానికి చాటి చెప్పాలి అనేవారు ఎప్పుడూ.

– మేధతో పరిశ్రమించండి, ఇష్టంతో కష్టపడి పనిచేయండి, ఫలితం వచ్చి తీరుతుంది. ఘన విజయానికి మెట్లు ఇన్ని అని ఉండవు. పనిలో లీనమవడమే మొదటి, కడపటి మెట్టు. అప్పుడే అగ్రత ఏరికోరి వరిస్తుంది.

– మన చుట్టూ ఉన్నవారే మనకు ఎంతో తెలిసేలా చేస్తారు. దీనికి ప్రత్యేక శిక్షణలూ, తర్ఫీదులూ మరేవీ అక్కర్లేదు. అనుభవాలే పాఠాలు నేర్పుతాయి.

– ఎంతో సంపద ఉంది. నాకు సంతుష్టినిచ్చేది మాత్రం తెలుగు పద సంపద. అంతటినీ సమీకరించాలన్నదే నా పరమాశయం. తెలుగు – తెలుగు, ఆంగ్లం- తెలుగు నిఘంటువుల నిర్మాణ క్రియను జీవిత లక్ష్యం చేసుకున్నారు. సంపూర్ణ రీతిన ‘మహా నిఘంటువు’ను ప్రజలందరికీ అపూర్వ, అపురూప కానుకగా సమర్పించాలన్నదే అత్యంత ప్రధాన ధ్యేయం. (ఛైర్మన్‌ ‌సంకల్పశక్తిని సాకారానికి తెచ్చేందుకే రామోజీ ఫౌండేషన్‌ ‌నిర్వహణలోని నిఘంటు బృందం అవిరళ కృషి కొనసాగిస్తోంది. ‘ఈనాడు’ పత్రిక ఆరంభించి వచ్చే ఆగష్టు నాటికి అర్ధశతాబ్ది సందర్భం. ఆ మహోత్సవాల నిర్వహణ తరుణం.  అదే విధంగా రామోజీరావు పుట్టిన నెల నవంబరు కల్లా ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరణ నిర్వహింపచేయాలని  బృందం సంసిద్ధమవుతోంది. ఇంతలోనే… ఇలా కావడం అందరి మదినీ వ్యధా భరితం చేస్తోంది. అయినా… ఆయన స్వప్నానికి సాకార రూపమివ్వాలన్న కృతనిశ్చయం నిఘంటు నిర్మాణ బృందాన్ని మరింత వేగవం తంగా నడుపుతోంది. మహనీయ ఆశయుని ఆశీస్సులు ఆ లోకం నుంచి ఈ లోకానికి ప్రసరిస్తాయన్నదే ప్రగాఢ విశ్వాసం.)

–  ‘ఈనాడు’తోనే తనకు ఆత్మానందమని ఎన్నోసార్లు తెలిపారాయన.  తన దృష్టిలో ఆ పత్రిక వ్యాపారం కాదు, పాఠక సేవాబాధ్యత. ‘ఎప్పటికీ ముందే   ఉండాలని అనుకుంటాను. అలా అని ఇతర పత్రికలు ఉండరాదనీ కాదు. వాటిని పోటీ పత్రికలుగా కాదు; సాటి పత్రికలుగా భావిస్తాను’ అన్నారొకసారి. ఏ పత్రిక అగ్రగామిత్వమైనా ప్రజల ప్రయోజనాల గురించిన నిబద్ధతతోనే సాధ్యమవుతుంది, నిలబడుతుంది.. అన్నది ఆయన సుస్థిర అభిప్రాయం, ఆచరణ మార్గం కూడా.

–  ఇంకా ఆ మాటల్లోనే చెప్పాలంటే ..

–   సంతోషం ఓ మానసిక స్థితి. ఆ సంతోషం నాకు పత్రికతోనే లభిస్తుంది.

–    ఇప్పటిదాకా నా ఆరోగ్య రహస్యం… నా సంకల్ప బలంలోనే ఉంది.

–   నా తర్వాతి తరానికి నేను రాసి ఉంచిన వీలునామాలో ఆస్తిపాస్తుల సమాచారం కాదు; సిబ్బందికి హితవచనమే ఉంటుంది.

–   సృజనతో సవాల్‌ను అధిగమించడమే ఉద్యోగధర్మం.

–    ముదిమి మీద పడుతోంది. నా మది ‘మార్పు నిత్యం- సత్యం’ అని ఘోషిస్తోంది.

–  ఈ వార్థక్యాన్నీ సార్థకం చేసుకోవాలని తపిస్తున్నాను. అందువల్లనే భావి ప్రణాళికను ముందుగానే సిద్ధంచేసి, కలం యోధులకు అందిస్తున్నాను.

–   నా జీవిత కొవ్వొత్తి రెండువైపులా వెలుగుతోంది. ఈ లోగా నా కన్నబిడ్డల వంటి ఉద్యోగులందరికీ ఇంకెంతో మేలు చేయాలన్నది నా పరితాపం. ప్రత్యక్ష, పరోక్ష రీతుల్లో అర లక్షమంది ఉన్నారు. వారంతా ఇంకెంతో నిబద్ధమయ్యేంత పునాది అందించానన్నదే నా ఆనందం, ఆశయ భావ ప్రభావం.

–  ఏ మనిషికైనా విజ్ఞానం కావాలి. వికాసం జతచేరాలి. సమాచారం చెలిమి చేయాలి. వినోదం మిత్రపాత్ర పరిపోషించాలి. ఈ అన్నీ అక్షరంతోనే ప్రత్యక్షమవుతాయి. జైత్రయాత్రకు దోహదంగా మారతాయి.

ప్రధాని నరేంద్రమోదీ అన్నట్లు – సర్వసాధారణ కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు భిన్న రంగాల్లో అద్భుతంగా రాణించారు. మీడియా, సినిమాలు, వినోద రంగం, వ్యవసాయం, విద్య, పాలనా వ్యవస్థలపైన చెక్కు చెదరని ముద్రవేశారు. ఎంత సాధించినా, మూలాలను ఏనాడూ విస్మరించని కీలక లక్షణమే ఆయనను విలక్షణంగా తీర్చిదిద్దింది.

హృదయ విదారక విషాద చరితలు పత్రికలో ప్రచురితమై, టీవీలో ప్రత్యక్షమై సహాయాలు వెల్లువెత్తాయి. మరో కోణంలో – సామాజిక దురన్యాయాల మీద కదన కథానాలనేకం న్యాయం కల్పించాయి. ఏకంగా ప్రభుత్వ దురాగతాలపైన పూరించిన అక్షర సమరశంఖం ప్రజాతీర్పుగా ప్రతిధ్వనించిన సందర్భాలు ఇప్పుడూ మనకు వినిపిస్తూనే ఉన్నాయి.

కాలం కంటే వేగంగా పరిగెత్తినా, శారీరక, మానసిక ఆరోగ్యాల సమతుల్యత తుదివరకూ సాధించినా, వైఫల్యాలనే అవకాశాలుగా మలచుకోవాలని కొన్నిసార్లు నిరూపించి చూపించినా, పుస్తకాలను మించిన ప్రేమ కానుకలు లేవని కుటుంబానికి చాటి చెప్పినా, తన ముద్దుల మనువడికి చివరగా ఏం చెప్పారో తెలుసా?

‘నేను వెళ్లిపోయినా కంట నీరు పెట్టుకోవద్దు

బేలగా, దీనంగా మారవద్దు

మరణం.. కాలపరిణామం

ఆ విధంగానే భావించు. నీదైన ఆశయాన్ని సాధించు.’

ఆఖరి రోజుల్లో

‘నా జీవన గమనాన మబ్బులు…వానగా కురవడానికా? తుఫానుగా విజృంభించడానికా? కాదు కాదు, నా మలిసంధ్య వేళ గగనాన సరికొత్త రంగులద్దడానికి’ అనే కవితను స్మరించుకున్నారు.

మరణానికి ముందే స్మారక కట్టడాన్ని నిర్మించుకున్నారు. అదే స్మృతివనం.

ఈ క్షణాన మనకు ఏమనిపిస్తోంది?

‘సేవకు మరణం ఉండదు’ అనే కదా!

-జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

 

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సంతాపం

ఈనాడు మీడియా గ్రూపు చైర్మన్‌, ‌ఫిల్మ్ ‌సిటీ వ్యవస్థాపకుడు రామోజీరావు మరణం పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌సంతాపాన్ని వ్యక్తం చేసింది. ‘ఈనాడు, ఫిల్మ్‌సిటీ వ్యవస్థాపకుడు శ్రీ రామోజీరావు మరణం జర్నలిజం, సినీ రంగాలకు పెద్ద లోటు,’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటనలో అన్నారు.

About Author

By editor

Twitter
YOUTUBE