వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
-స్వాతీ శ్రీపాద
అయిదున్నరకల్లా ఠంచనుగా చెవి దగ్గర రొద మొదలు. ‘‘కుహూ …కుహూ’’ ఆగి ఆగి రెండు నిమిషాలకోసారి కోయిలపిల్ల అరుపులు. ఎంత మధురంగా ఉన్నా మంచి నిద్రలోంచి మెలుకువలోకి దిగడానికి మనశ్శరీరాలు సహకరించాలి కదా. అటు ఒత్తిగిలి ఇటు ఒత్తిగిలి ఇహ తప్పదన్నట్టు లేచి ముందుగా అలారం ఆఫ్ చేసి, కళ్లు నులుముకుని లైట్ ఆన్ చేసింది జాను. అప్పుడే అయిదు నలభై. ఒక్క నిమిషం ఒక అయిదు నిమిషాలు పడుకుందామా అనిపించింది. కాని, నిద్రపట్టిందో ఇహ మెళుకువ రావడం ఏ గంటకో.
లేచి కూచుని రెండు నిమిషాల్లో మనశ్శరీరాలు స్వాధీనంలోకి తెచ్చుకుని రోజు వారీ పనిలోకి దిగిపోయింది.
బ్రష్ చేసుకునేలోగా ఎలెక్ట్రిక్ కెటిల్‌లో నీళ్లు స్టౌ మీద పాలు పెట్టి, పిల్లల గదిలోకి తొంగి చూసింది.
అప్పటికే నిద్రలేచిన అత్తగారు మామగారు పక్క బట్టలు మడతలు పెడుతున్నారు. పిల్లలు పెద్ద చదువుల కోసం వెళ్లినా ఇంకా ఆ గది పిల్లల గదిగానే వ్యవహరించడం ఎంత మానుకుందామన్నా కుదరడం లేదే.
గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి డైనింగ్ టేబుల్ మీదుంచి కాఫీ డికాషన్ వెయ్యడానికి సిద్ధమయింది.
‘‘ అప్పుడే లేచేసావా జానూ, అయినా నేను వస్తున్నాగా అన్ని పనులూ నీ నెత్తిన వేసుకుంటే ఎలా చెయ్యగలవు?’’ అత్తగారు మెత్త మెత్తగా నొచ్చుకున్నారు.
‘‘ అదో పెద్ద పనా అత్తయ్యా?’’ అంటూ తన పనిలో మునిగిపోయింది.
‘‘ సరే, తలుపులు దగ్గరకు వేసి వెళ్తున్నాం’’ ఉదయం లేవగానే ఇద్దరికీ ఓ అరగంట నడక అలవాటు చేసింది జానకి.
మొదట్లో వెళ్లలేమని మొరాయించినా ససేమిరా ఒప్పుకోలేదు జానకి,
‘‘మొదలు కొంచం ఇబ్బంది అనిపించినా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్సేపు నడక మంచిది అత్తయ్యగారూ , నెమ్మదిగానే నడవండి’’ అంటూ రెండు మూడు రోజులు ఆవిడతో పాటు వెళ్లి అలవాటు చెసింది.
వాళ్లు తిరిగి వచ్చేసరికి ఇద్దరికీ కాఫీ సిద్ధంగా ఉంచుతుంది.
కూతుళ్లిద్దరూ పీజీ చదువులకు చెరో చోటికీ వెళ్లాక కొంచం వెసులుబాటుగా ఉంది.
అత్తగారు తిరిగి వచ్చి కాఫీ తాగాక వీలైనంత సాయం చేస్తూనే ఉంటారు.
తొమ్మిదింటికల్లా ఇద్దరూ ఆఫీస్‌కు వెళ్లాలి మరి. అయినా తను అదృష్టవంతురాలే అనుకుంది జానకి.
ఆ అదృష్టం వెనక ఎంత స్వయం కృషి, ఎంత సంఘర్షణ.
పెళ్లై కొత్తగా ఆ ఇంటికి వచ్చిన రోజులు గుర్తుకు వచ్చాయి.
చదువు తప్ప మరో లోకం తెలీదు ఇంకా. ఎంతసేపూ పుస్తకాలు పరీక్షలూ అనే సరిపోయేది. అటు చదువు పూర్తయీ కాకముందే మంచి సంబంధం అంటూ పెళ్లి చేసేశారు.
నలుగురాడపిల్లల్లో ఒక్కడే కొడుకు. అమ్మాయిలంతా ఇంకా చిన్నవాళ్లు చదువు కుంటున్నారు.
బెరుకు బెరుగ్గా ఆ ఇంట్లో కాలు పెట్టింది.
గట్టిగా నోరు విప్పి మాటే మాట్లాడేది కాదు. ఆరున్నరకి కాని నిద్రలేచే అలవాటు లేదు. ముందు లేవాలని చూసినా నిద్ర చాలక రోజంతా తలనొప్పితో బాధపడేది.
పెద్దగా పని అలవాటు లేదు. పుట్టింట్లో ఎవరి పనులు వారు చేసుకోడం వల్ల ఎవరి మీదా పెద్ద పని భారం పడేది కాదు.
ఇక్కడ అలాకాదు మరి. తిన్న కంచాల దగ్గరనుంచీ సింక్‌లో పారేసి ఉంచుతారు. ఆడపిల్లలు కాలేజీకి వచ్చినా, చివరి పిల్ల హైస్కూల్లో ఉన్నా ఇక్కడి పుల్ల అక్కడ పెట్టరు. స్నానాలు చేసి బట్టలు బాత్ రూంలో వదిలేసి వెళ్తారు.
తను రాకముందు ఏం చేసే వారో తెలియదు. కాని ఇంటి చాకిరీ మొత్తం కోడలు చెయ్యాలని అత్తగారి అభిలాష. మొహమాటానికి నాలుగు రోజులు చేసే సరికి ఒళ్లు పులిసిపోయి జ్వరం వచ్చేసింది.
భర్త సత్యమూర్తికి తన బాధ చెప్పుకోక తప్పలేదు.
అంతవరకూ ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకోని అతనికి నెమ్మదిగా పరిస్థితులు అర్థమాయ్యాయి.
చెల్లెళ్లను మందలించాడు. ఎవరిపనులు వాళ్లు చేసుకోకపోతే ఎలాగ అన్నాడు.
తల్లి మధ్యలో రాబోతే –
‘‘ నువ్వూరుకో అమ్మా, వాళ్లు తిన్నకంచాలు
కడుక్కోలేరా? విప్పిన గుడ్దలు ఉతుక్కోలేరా? అయినా నువ్వైనా ఒక్కదానవూ ఈ పనులు ఎవరు చెయ్యమన్నారు? పని మనిషిని మాట్లాడు’’ అనేసాడు.
ఎదురుగా ఏం అనలేక ‘‘ ఇప్పుడు పెళ్లాం వచ్చేసరికి పనిమనిషి కావలసి వచ్చింది’’ అని గింజుకుందావిడ.
సత్యమూర్తి పొద్దున తొమ్మిది కల్లా ఆఫీస్‌కి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏడయేది.
ఖాళీగా ఉండటం ఎందుకని గ్రూప్ వన్ పరీక్షలకు చదువు మొదలు పెట్టింది జానకి.
ఖాళీగా ఉన్న ఆదివారం ఏ గుడికో సినిమాకో వెళ్లేవారు.
అదీ తప్పుగానే తోచింది. అత్తగారికీ మామగారికీ. ఒక సెలవురోజు తీరిగ్గా ఉదయమే సత్యమూర్తిని కూచోబెట్టి మొదలు పెట్టారు.
‘‘పిల్లకు ఒక్క పనీపాటా రాదు, ఎంతసేపూ ఆ పుస్తకాలూ చదువులే. సెలవు దొరికే సరికి మీరిలా ఆడపిల్లల ముందు తిరగడం అస్సలు బాగాలేదు. అలా కుదరదు. ఇష్టమైతే ఉండమను లేకపోతే లేదు.’’ అంటూ ఇద్దరూ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పడం.
చివరగా ‘‘ లేదంటే పిల్లను వాళ్లింట్లో దింపేసిరా’’ అన్నారు మామగారు.
సత్యమూర్తి ఖిన్నుడైపోయాడు. ఏం చెప్పాలో తెలియలేదు.
అన్నీ వింటున్న జానకి కాస్సేపు ఆలోచించు తలుపులు వేసి మాట్లాడుకుంటున్న ఆ గది తలుపుతోసి లోపలికి వెళ్లింది.
‘‘అత్తయ్య గారూ , మామగారూ ఇలా వచ్చినందుకు క్షమించండి. కాని నేను చెప్పదలుచు కున్నది చెప్పే వెళ్తాను. పని రాదని నన్ను మా పుట్టింటికి పంపడానికి నేను ఈ ఇంటి కోడలిగా వచ్చాను. పనిమనిషిగా కాదు. ఈ పనులు అవసరం ఉన్నంత వరకే చేసుకోగలం కాని శక్త్తికి మించి కాదు. నేను గ్రూప్ వన్ పరీక్షలకు చదువుకుంటున్నాను. ఈ ఇల్లు నాది. నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చెయ్యాలనే బాధ్యత తలమీద ఉన్నప్పుడు నేనూ ఒక ఉద్యోగం చూసుకోవాలనే చూస్తున్నాను. గుడికీ గోపురాలకీ వెళ్లడం తప్పంటే మీరూ అత్తయ్య గారూ వెళ్లడం లేదా? రేఫు పెళ్లిళ్లు చేసాక మీ కూతుళ్లు, అల్లుళ్లూ, ఊళ్లు వెళ్లరా? అనవసరంగా నా మీద అధికారం చెలాయించాలని చూడకండి. ఈ ఇంట్లో ఉండటం నా హక్కు’’
అనేసి బయటకు వెళ్లిపోయింది. అక్కడితో సాధింపులకు తెరపడింది. అయినా జానకి ఉద్యోగంలో చేరి జీతం ఇవ్వడం లేదని కొంచం కినుకగానే ఉండేది.
నాలుగేళ్ల తరువాత కూతురు పెళ్లికి కట్నం మొత్తం జానకి సమకూర్చడం ఇద్దరినీ సిగ్గుపడేలా చేసింది.
జానకి ఉద్యోగానికి వెళ్లినా పిల్లలను అత్తగారే అరచేతుల్లో పెట్టుకుని చూసుకునే వారు.
‘‘అవసరం వచ్చినప్పుడు కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడాలి కూడా’’ అనుకుంటూ కాఫీ కలపడం మొదలు పెట్టింది.
అరగంటలో తిరిగి వచ్చిన అత్తగారు తోటకూర తరుగుతూ ‘‘పక్కింటి వనజాక్షి కోడలు కూడా వచ్చింది వాకింగ్‌కి. అత్తకూ కోడలికీ ఒక్క నిమిషం పడదట. వేరు కాపురం వెళ్లి పోదామంటే మొగుడు పట్టించుకోడం లేదట’’ ‘‘అదేం పాపం’’ పప్పు కుక్కర్ లో పెడుతూ అడిగింది జానకి.
‘‘అదేమిటే వేరు కాపురం పెడితే ముదికాలానికి తల్లినీ తండ్రినీ చూసేదెవరు? అయినా ఆ జ్ఞానం తలిదండ్రులకూ ఉండాలి. కోడలూ కూతురులాంటిదే కదా అనుకోవాలి. ఇద్దరికిద్దరూ బిగుసుకుపోతే ఇహ అనుబంధాలెక్కడ?’’
‘‘మనమేం చెయ్యగలం?’’
‘‘అలాగని చూస్తూ ఊరుకుంటామా? సాయంత్రం అత్తనూ కోడలినీ రమ్మన్నాను. మనం రాజీ కుదర్చగలమేమో చూద్దాం’’ అందావిడ.
* * *
సాయంత్రం జానకి ఇల్లు చేరేసరికి
వీధివాకిట్లో కుర్చీలు వేసుకుని మామగారూ పక్కింటాయనా మాట్లాడుకుంటున్నారు.
లోపల అత్తగారితో పాటు వనజాక్షీ ఆమె అత్తగారూ ఉన్నారు.
‘‘ఏమ్మా వచ్చావా? మొహం కడుక్కునిరా కాఫీ రెడిగా ఉంది’’ అన్నారు అత్తగారు.
‘‘ఇప్పుడు చెప్పండి. ఎందుకు ఇద్దరూ ఇలా మనసును దుఃఖపెట్టుకుంటున్నారు?’’
పెద్దావిడ కాఫీలు తాగాక మొదలుపెట్టింది.
‘‘ఏం చెప్పను ఆంటీ పెళ్లయి వచ్చినది మొదలు అన్నింటికీ వంకలే. ఏ పని చేసినా నచ్చదు. అందుకే అసలు చెయ్యడమే మానేసా?’’
‘‘వంకలా? ఒక్కపనైనా సవ్యంగా చెయ్యడం వచ్చునా? అసలు ఏదైనా నేర్పితే కదా?’’
‘‘అదుగో అదేనండి మాట్లాడితే మా వాళ్లనెందుకు అనడం? ఇక్కడ ఈవిడకు అన్నీ బాగా వచ్చినట్టు’’
‘‘ఆగండాగండి. ఒకళ్లనొకళ్లు అనుకోడంమాని మీ సమస్య చెప్పండి చాలు’’
‘‘ఈవిడ ఇక్కడ దర్జాగా తిని కూచుంటే చేసి పెట్టడానికి నేనేమీ పనిమనిషిని కాదు’’ అత్తగారి ఈసడింపు.
‘‘ నేను మాత్రం పనిమనిషిగా వచ్చానా?’’ కోడలి విసురు.
గంటన్నర మాట్లాడినా ఇదే వరస.
జానకి కల్పించుకుంది.
‘‘సరే మీ ఇద్దరూ చెప్పాల్సినది అర్థ్ధమయింది. మాకు తోచిన మాట చెప్తాము. వింటారా మీ ఇష్టం, వినకపోడమూ మీ ఇష్టమే.
మీకు రెండు దారులున్నాయి.
ఒకటీ రాజీ అదీ ఒకవైపు నుండి కాదు. వనజా ఒక పది రోజులపాటూ మీ అత్తగారు ఏం మాట్లాడినా మీ అమ్మే అనుకుని చూడు. అలాగే మీ అత్తగారూ నువ్వేం చేసినా కూతురే అనుకుని ఆలోచించాలి. ఇదొక పరీక్ష అనుకుని ప్రయత్నించండి.
రెండోది – ఆవిడకు కొడుకు కావాలి, నీకూ భర్త కావాలి. ఎవరినీ త్యాగం చేసి వదులుకొమ్మని అనలేం కదా?
పైన ఎలాగూ అద్దెకిచ్చారు కదా, ఖాళీ చేయించి పైన ఒకరు ఉండంది.
దూరంగా ఉన్నప్పుడు ప్రేమలు పెరుగుతాయి. కాని ముందు మొదటి మార్గం ట్రై చేసి చూడండి.
పెళ్లిళ్లు కుటుంబాలు కలసి ఉండటానికి కాని విడిపోయేందుకు కాదు. ఏమంటారు అత్తయ్యగారూ
‘‘అంతే అంతే.. తరాల మధ్య స్నేహం పెరగాలి కాని అంతరం కాదు.
పది రోజుల తరువాత విషయం వారి వారి సంస్కారాల మీద విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.’’ అందావిడ.
వచ్చేవారం కథ..
రేపటి వర్తమానం
-వై.మంజుల భావన