వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘చాలాకాలం తర్వాత స్నేహితుడు భాస్కర్ వస్తున్నట్లు ఫోన్ వచ్చినప్పటి నుంచీ వాసు తెగ సంబరపడిపోతున్నాడు.
‘భాస్కర్ ఇప్పుడెలా ఉంటాడు. పిల్లలు పెద్ద వాళ్లయి ఉంటారు. ఉద్యోగాల్లో స్థిరపడతారు. రిటైర్ అయ్యాక పెన్షన్ బాగానే వస్తుంది. శేష జీవితాన్ని హాయిగా గడుపుతుంటాడు. ఇంతకాలానికి వస్తున్నాడు, చెప్పుకోవాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి.
‘శాంతా మా ఫ్రెండ్ భాస్కర్ వస్తున్నాడు. వాడికిష్టమైన వంటలు చేసిపెట్టు, మర్చిపోయాను. నువ్వు చేసే పులిహోర, వడ అంటే వాడికి చాలా ఇష్టం. కాకరకాయలు వెల్లుల్లి కారంపెట్టి వేయించు.
‘సరే లేండి. రేపు కదా మీ ఫ్రెండ్ వచ్చేది. మీరు చెప్పినవన్నీ చేస్తాను. పొద్దుపోయింది పడుకోండి. రేపు మీ ఫ్రెండ్‌తో గంటల తరబడి కబుర్లు చెప్పుకోవాలి.’’
‘భార్య మాటలకు నవ్వుకొన్నాడు వాసు. ఎందుకో నిద్ర పట్టటంలేదు. భాస్కర్‌ని ఎపుడెపుడు చూస్తానా అని ఆరాటంగా ఉంది.
ట్రైన్ వచ్చేసమయానికి పెందలాడే లేచి బయలుదేరాడు స్టేషన్‌కి. ఈ అవతారంతో ఇలాగే వెళ్తారా! కాస్త మాసిన గెడ్డం గీసుకొని మంచి బట్టలన్నా వేసుకోండి. ఆ చేతిలో పాత గొడుగు సంచీ మిమ్మల్ని చూసి మీరు స్నేహితుడని చెప్పుకోవటానికి ఫీలవుతాడంది.
‘మేమేం కాబోయే వియ్యంకులంగాం. చిన్ననాటి స్నేహితులం. నేనెలా ఉన్నా మా స్నేహం మారదు. మనిషి అవతరాన్ని చూడరు. మంచి మనసా? కాదా? ఎలాంటి వాడు? అని చూస్తారు. స్నేహితుల మధ్య డబ్బు, ఐశ్వర్యం గుర్తుకు రావు అంటూ స్టేషన్‌కి బయలుదేరాడు వాసు.
‘మరికొద్ది నిమిషాల్లో బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వస్తున్నట్లు ఎనౌన్స్ వినిపించగానే 6వ నెంబరు ప్లాట్‌ఫాం మీదకి వెళ్లి డి-ఫైవ్ రిజర్వేషన్ కంపార్ట్‌మెంటు దగ్గ •ఆగాడు.
భాస్కర్ లగేజీ చేత్తో పట్టుకొని దిగుతుంటే ఒళ్లంతా కళ్లు చేసుకొని చూస్తూ చేతిలో లగేజీ అందుకొని, ‘ఎంత కాలమైందిరా నిన్ను చూసి. అమెరికా నీళ్లు బాగా వంట బట్టినట్లున్నాయి. మీ చెల్లాయి ఉప్మా పెసరట్టు వేడివేడిగా చేస్తానంది. త్వరగా పద’ అంటూ తొందర పెట్టాడు.
సూటుబూటు వేసుకొని దర్జాగా ఉన్నాడు భాస్కర్. మాసిపోయిన లాల్చీ పైజమాలో మాసిన గెడ్డం చేతిలో సంచి, గొడుగు పట్టుకొన్న వాసుని చూసి చుట్టుపక్కలవాళ్లు విస్తుబోతున్నారు.
‘‘ఒక్క క్షణం భాస్కర్ మనసు చిన్నబోయింది. ఇంకా నీలో మార్పురాలేదా! అప్పటికీ ఇప్పటికీ వేషంలో మార్పు లేదన్నాడు భాస్కర్.
‘‘నేనేమన్నా కుర్రాడినా! ఫ్యాషన్‌గా డ్రస్‌లు వేసుకొని తిరగటానికి. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఈ వయసులో నాకెందుకు చెప్పు?
‘స్నేహితులిద్దరూ మాట్లాడుకొంటూ స్టేషన్ బయటికొచ్చారు. ఆటో పిలుస్తున్నాడు వాసు. ఎక్కడి నుంచో ఇన్నోవా కారొచ్చి భాస్కర్ ముందాగింది. కారులో నుంచి ఖరీదైన వ్యక్తి దిగాడు. చేతివేళ్లకి ఉంగరాలు, మెడలో గోల్డ్‌చైన్, నల్లకోటు వేసు కొన్నాడు. చూడటానికి లాయర్‌లా ఉన్నాడు.
‘నమస్కారం, మీరొస్తున్నట్లు మీ అల్లుడు సుధీర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు.’ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాను. రండంటూ కారు దగ్గరికి నడిచాడు.
‘ఆయనతో వెళ్లకపోతే అల్లుడు బాధపడతాడు. ఇపుడు వాసు వెంట వెళ్లకపోతే బాగుండదు’ సంకటంలో పడ్డాడు భాస్కర్.
ఆటో పిలుస్తున్న వాసుని పిలిచి ‘సారీరా? ఇతను మా బంధువు రామ్మోహనరావుగారని పెద్దలాయరు. వాళ్లింటికి వెళ్తున్నాను. రేపు తప్పకుండా మీ ఇంటికి వస్తానురా! ఏమీ అనుకోకు’ అంటూ ఆయనతోపాటు కారెక్కాడు.
ఇంటికి వచ్చిన భర్తను చూసి, ‘మీరొక్కరే వచ్చారు. మీ ఫ్రెండ్ రాలేదా’ అడిగింది భార్య శాంతి.
‘వాడు ఇదివరకు భాస్కర్ కాదు. కారులో వచ్చిన బంధువులింటికి వెళ్లాడు. రేపు వస్తాడట’ అన్నాడు నిరాశగా.
భర్త మనసులోని బాధని అర్థం చేసుకొంది శాంత. ‘పోనీలెండి. ఈ మాత్రానికే ఎందుకు బాధపడతారు. అతను బాగా కావల్సినవాడు కావచ్చు, రేపు వస్తానన్నారుగా. పదండి ఉప్మా పెసరట్లు రెడిగా ఉన్నాయి’ అంటూ ప్లేటులో పెట్టుకొని వచ్చి భర్తకి అందించింది.
భాస్కర్ అలా వెళ్లిపోవడం వాసుకి బాధని పించింది!
ఎదురు చూసినంతసేపు నిలువలేదు ఆనందం.
రామ్మోహన్‌రావు కారు దిగి భాస్కర్‌ని లోపలికి తీసుకెళ్లాడు. అధునాతనమైన బిల్డింగ్, హంగు ఆర్భాటాలతో బాగా కట్టించాడు. ఇంట్లో బొచ్చుకుక్క అటూ ఇటూ తిరుగుతున్నది. భార్యాపిల్లలకి పరిచయం చేసి ఏసీరూములో కూర్చోపెట్టాడు.
వంట మనిషి రంగమ్మ టిఫిన్ టేబుల్ మీద పెట్టింది. ఈ లోగా భాస్కర్ స్నానం చేసి వచ్చాడు. ఇద్దరూ టిఫిన్ తినటం పూర్తికాగానే బంగళా అంతా తిప్పి చూపించాడు. కూతురికి ఈ మధ్యనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు.
ఇల్లు చాలా బాగుంది. సిటీలో ఇంత పెద్ద ఇల్లున్నదంటే చాలా పెద్ద విశేషమే.
‘ఇంకా రెండుచోట్ల స్థలాలు కొనిపడేశానులే. అవకాశం ఉన్నపుడే నాలుగు డబ్బులు సంపాదించు కోవాలంటారు’ ఉన్న అరగంటలో తన సంపాదన ఇల్లు, స్థలాల గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఎంత సేపటికీ ఆస్తి, అంతస్తు, కోర్టు, కేసుల గురించే చెప్పటం సరిపోయింది.
‘మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను కోర్టు పని మీద వెళ్లి వస్తాను ’ అని వెళ్లినవాడు మధ్యాహ్నం మూడు గంటలు దాటినా రాలేదు. గదిలో మంచం మీద అలాగే పడుకొన్నాడు. బాగా నిద్రపట్టేసింది. ఎవరిగదుల్లో వాళ్లున్నారు. ఎవరూ వచ్చి పలకరించ లేదు. భార్య టి.వి.వదిలి రాలేదు. ఒక్కడికే బోర్‌గా ఉంది.
‘అయ్యగారూ! భోజనానికి రండి. లాయర్‌గారు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందిట. మిమ్మల్ని తినేయమన్నారు’ అంటూ పిలిచి వెళ్లింది వంటమనిషి రంగమ్మ. టేబుల్‌మీద అన్నీ పెట్టి వెళ్లింది. ప్లేట్లలో తానే వడ్డించుకొని తిన్నాడు. ఒంటరిగా గదిలో ఉండబుద్ధి కాలేదు భాస్కర్‌కి.
ఉదయమనగా వెళ్లినవాడు రాత్రికి ఇంటికి వచ్చాడు రామ్మోహన్‌రావు. ‘సారీ! కోర్టులోనే సరి పోయింది. అర్జెంటుగా కేసు పనిమీద హైద్రాబాద్ వెళ్లాలి. మిమ్మల్నిలా ఒంటరిగా వదిలేయటం బాధగా ఉంది. ఏమీ అనుకోకండి. రాత్రికి భోజనం చేసి పడుకోండి. తెల్లవారాక మీ ఫ్రెండ్ వాళ్లింటికి వెళ్లవచ్చు’ అంటూ గదిలోకెళ్లి బట్టలు సర్దు కొంటున్నాడు.
‘‘మాటామంచీ లేకుండా, పలుకరించే వాళ్లు లేక ఒంటరిగా ఉండబుద్ధి కాలేదు. వాసు వాళ్లింటికెళ్తా నంటూ బ్యాగ్ తీసుకొని బయలుదేరాడు.
వాసు ముందుగదిలో కూర్చుని భార్యతో మాట్లాడుతున్నాడు. భాస్కర్ ఫోనన్నా చెయ్యలేదు అనుకొన్నాడు.
వాకిలి ముందు ఆటో ఆగిన చప్పుడికి భార్యా భర్తలు తలతిప్పి చూశారు. ఆటో అతనికి డబ్బులిచ్చేసి •గేటు తీసుకొని వస్తున్న భాస్కర్‌ని చూడగానే వాసు ముఖం విప్పారింది.
‘ఇపుడా మా ఇంటికి రావటం’ అంటూ నిష్టూర మాడింది శాంత.
‘మీరు వెళ్లమనేదాక వెళ్లను సరేనా?’ అంటూ కుర్చీలో కూర్చున్నాడు. ముగ్గురూ నవ్వుకొన్నారు.
‘శాంతబొబ్బట్లు తీసుకురా’ అన్నాడు వాసు. ముగ్గురికీ మూడు పేట్లలో సర్దుకొని తెచ్చింది.
‘ఇవాళేమిటి స్పెషల్’ అంటూ బొబ్బట్లు తుంచి నోట్లో పెట్టుకొన్నాడు భాస్కర్
‘నువ్వు మా ఇంటికి రావటమే స్పెషల్. అంత కన్నా ఏమీ లేదు. అపుడే నిన్ను వదిలి పెట్టారా! ఇంత తొందరగా వస్తావనుకోలేదు’ అన్నాడు వాసు.
‘క్షమించరా! ఎంతో ఆప్యాయంగా నన్ను తీసుకువెళ్లటానికి స్టేషన్‌కి వచ్చావు. ఇంతలో ఆ రామ్మోహనరావు వచ్చి తన వెంట తీసుకెళ్లాడు. మా అల్లుడి చుట్టం గదా అని వెళ్లాను. నిన్ను నిరాశపరిచి నందుకు నాకే చాలా బాధగా ఉంది’.
‘భలేవాడివే! బంధుత్వానికిచ్చే విలువ బంధుత్వానికివ్వాలి. క్షమాపణలు స్నేహం మధ్య ఉండకూడదు’
‘మీరు మాట్లాడుకొంటూ ఉండండి. నేను భోజనానికి ఏర్పాట్లు చేస్తాను’ అంటూ శాంత లోపలికి వెళ్లింది.
చాలాకాలం తర్వాత కలుసుకొన్నందుకు ఇద్దరూ కబుర్లలో పడిపోయారు. సమయమే తెలియలేదు.
‘ఆకలేమైనా వేస్తున్నదా! కబుర్లతో కడుపు నిండిపోయిందా! రండి భోజనం వడ్డిస్తా’ నంటూ పిలిచి వెళ్లి టేబుల్‌మీద కంచాలు, మంచి నీళ్ల గ్లాసులు సిద్ధం చేసింది.
ములక్కాడచారు, కందిపచ్చడి, ఆవకాయ, బెండకాయ వేపుడు. అన్నీ దగ్గరుండి వడ్డిస్తుంటే ఉదయం భోజనం గుర్తుకొచ్చింది భాస్కర్‌కి. ఒంటరిగా ఏదో తిన్నానంటే తిన్నానని లేచి వచ్చాడు.
‘మా చెల్లాయి చేతి వంట చాలా రుచిగా ఉంది. పది రకాలు పెట్టి వడ్డించుకొని తినమంటే కడుపు నిండదు. ఆప్యాయతతో పెట్టే పచ్చడి మెతుకులైనా విందు భోజనంలా ఉంటుంది’ అంటూ కడుపు నిండా తిన్నాడు.
రాత్రికి ఉన్నట్లుండి గుండె నొప్పితో బాధ పడుతున్నాడు భాస్కర్. వాసు లేచి వచ్చి చూసేసరికి గుండె పట్టుకొని కూర్చున్నాడు.
‘భాస్కర్ ఏమైంది?’ అంటూ కంగారు పడ్డాడు వాసు.
‘ఏమీ లేదురా! ఛాతీలో నొప్పిగా ఉంది. అదే తగ్గిపోతుందిలే’
‘భలేవాడివి. ముందు హాస్పిటల్‌కి వెళ్దాం. చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ముప్పు’
‘ఆ టెస్ట్‌లు, ఈ టెస్ట్‌లనీ బోలెడంత డబ్బు గుంజుతారు. ఈ రాత్రికి చూద్దాం. తగ్గకపోతే రేపు వెళ్లచ్చులే హాస్పిటల్‌కి. మీరెళ్లి పడుకోండి. అనవస రంగా మీ నిద్ర పాడు చేశాను’ అన్నాడేగాని రాను రాను నొప్పి ఎక్కువైంది.
ఇక లాభం లేదనుకొని వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌చేసి హాస్పటల్లో చేర్పించారు.
హార్ట్ బ్లాకయింది. ఆపరేషన్ చెయ్యాలన్నారు. కొన్ని టెస్ట్‌లు చెయ్యాలి ముందు యాభైవేలు డబ్బు కడితే ఏ సంగతి చెప్తామన్నారు డాక్టరు.
యాభైవేలా! ఇప్పుడు తన దగ్గరంత డబ్బులేదు. కొడుకులకి ఫోన్ చేయమన్నాడు భాస్కర్.
నంబర్లు తీసుకొని భాస్కరం కొడుకులకిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఇప్పుడు మేము వచ్చే పరిస్థితుల్లో లేము. సమయానికి ఫ్లైట్స్ దొరకడం కష్టం. మేం వచ్చి మాత్రం ఏం చేస్తామంటూ ఫోన్ చేశారు.
‘నిర్ఘాంతపోయాడు వాసు. వాళ్లు రావటానికి వీలు కాకపోతే కనీసం డబ్బు పంపించవచ్చుగదా! ఆపరేషన్ అంటే లక్షలతో కూడుకొన్నది. అంత డబ్బు ఎలా సర్దగలం. శాంతా! ఇప్పుడేం చేద్దాం’ అన్నాడు.
‘నేనింటికి వెళ్లి డబ్బు తెస్తాను. యాభై వేలు కడితేనేగాని ట్రీట్‌మెంటు మొదలుపెట్టరు’ అంటూ ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్లి బీరువాలో నుంచి యాభైవేలు తెచ్చి హాస్పిటల్ కౌంటర్లో కట్టి వచ్చాడు.
‘ఆ డబ్బు ఎక్కడి నుంచి తీశారు? అందులోనే కదా! ఎన్నాళ్ల నుంచో ఇల్లు కొనుక్కోవాలనుకొన్నాం. రూపాయి రూపాయి కూడాబెట్టి దాచాం. పాత ఇల్లు చవకగా వచ్చిందని ఆశపడ్డాం. ఇప్పటికైనా సొంత ఇల్లు అమరుతుందనుకొన్నాం. రిటైర్ అయిన డబ్బంతా పిల్లలకే ఖర్చుపెట్టారు. ఎన్నాళ్లని అద్దె ఇంట్లో ఉంటాం చెప్పండి. తిరిగి ఆ డబ్బు సమ కూర్చటం ఎంత కష్టమో మీకు తెలీదా’ భర్తను నిలదీసింది శాంత!
‘మనిషి ప్రాణం ముఖ్యం. ఇల్లు కొంటానికి మరి కొంతకాలం ఆగుదాం. పోయిన ప్రాణం తిరిగి రాదుగా. ఆ డబ్బు ఒక ప్రాణం నిలబెడితే చాలు. సమయానికి అదే సమకూరుతుంది’ భార్యకి నచ్చచెప్పాడు.
హాస్పటల్‌లో భాస్కర్‌కి టెస్ట్‌లన్నీ చేసి హార్ట్‌బ్లాక్ అయినచోట స్టంట్స్ వేశారు. వారం రోజుల తరువాత ఇంటికి పంపించారు.
‘మా అబ్బాయిలు డబ్బు పంపించారా! తండ్రి కోసం ఆ మాత్రం పంపరా ఏమిటి? నిజంగా మీరిద్దరూ నా పాలిటి దేవతలు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను’ అంటూ వాసు రెండు చేతులు పట్టుకొన్నాడు భాస్కరం.
జన్మలూ, రుణాలేమిటి? హాయిగా విశ్రాంతి తీసుకోమంటూ ఇంటికి రాగానే గదిలో మంచం ఏర్పాటు చేశారు. భాస్కర్ ప్రశాంతంగా పడు కొన్నాడు.
భార్య సుమతి కూతురికి పురుడు పోయటానికి వెళ్లింది. ఈ విషయం వాళ్లవరకూ వెళ్ళనీయలేదు.
‘వాళ్లసలు కొడుకులేనా? కనిపెంచి ఇంత వాళ్లని చేసే అన్నీ మర్చిపోయి ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు ఉన్న ఊరుని, కన్నవాళ్లని వదిలేసి డాలర్ల మోజులో పడిపోతారో! తండ్రికి ఆపరేషన్ చెయ్యాలంటే రావటానికి వీలు పడదని సాకులు చెప్తారా! కనీసం ఎలా ఉన్నదంటూ పలకరించకపోగా హాస్పటల్ ఖర్చులు కూడా పంపలేదు. వీళ్లా కొడుకులు. వీళ్ళసలు మనుషులేనా! ఇల్లు కొనడానికి దాచిన డబ్బులు ఉండబట్టి సరిపోయింది. లేకపోతే మీ స్నేహితుడి పరిస్థితి ఏమయ్యేది?’ అంది శాంత.
భాస్కర్ కొడుకులిద్దరూ పట్టించుకోనందుకు వాసు కూడా బాధపడ్డాడు. ‘ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. రేపు మన పరిస్థితి అలా కాకూడదని హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాను. ఇపుడు ఈ విషయాలేవి భాస్కర్‌కి తెలియనివ్వకూడదు. మనసు పాడు చేసుకొంటాడు. నిదానంగా చెబుదాంలే’ అన్నాడు.
‘ఏంటిరా! వాసూ. నువ్వు చెప్పేది నిజమా! ఇంత దుర్మార్గులా నా పిల్లలు? హాస్పిటల్ ఖర్చులకి డబ్బు పంపించారనుకొన్నాను. వాళ్లు పంపలేదంటే ఇప్పుడర్థమైంది. ఇంట్లో చాకిరీ చేసి పెట్టి వాళ్లిద్దరూ ఉద్యోగాల నుంచి ఇంటికి వచ్చేదాకా ఇంటికి కాపలాగా ఉండేవాళ్లు లేరని గాబోలు – వేళకు సరైన తిండి నిద్రలేక ఆరోగ్యాలు పాడయిపోతుంటే ఉండకుండా వచ్చేశామని మా మీద కక్ష పెంచుకొని ఉంటారు. వాళ్ల అవసరాల కోసం మమ్మల్ని వాడు కొన్నారు. నేనింకా మా పిల్లలు డబ్బు పంపి ఉంటా రనుకొన్నాను.
అంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టావా! ఇల్లు కొనుక్కొందామనుకొన్న డబ్బు నా కోసం వాడావంటే నువ్వు నిజంగా దేవుడివేరా!’
‘నన్నంతగా పొగడక్కర్లేదు. సమయానికి ఉంది కాబట్టి ఖర్చుపెట్టాను. ఎలాగైతేనేం. సేఫ్‌గా బయట పడ్డావు. అంతే చాలు’
‘డబ్బు మళ్లీ సంపాదించుకోవచ్చు. మన స్నేహం తిరిగి రాదుగా. పక్కనున్న వాళ్లని కూడా తిన్నావా? లేదా? అని అడగరు. కన్న తల్లిదండ్రుల్ని కూడా పట్టించుకోలేనివారున్నారంటే ఏం చెప్పుకోవాలి. అందుకే అన్నారు బంధువుల కన్నా స్నేహానికున్న విలువ గొప్పదని.
‘మానవత్వానికి నిలువుటెత్తు అద్దం. నీ వేషధారణ చూసి చులకనగా చిన్న చూపు చూసినా నువ్వు నా మిత్రుడివి అని చెప్పుకోవటానికి గర్వ పడుతున్నానురా! ఆ రామోహన్‌రావును చూశాక తెలిసింది. గొప్పవాళ్లు తమ గొప్పదనం చూపించ టానికేగాని చేతల్లో లేదని తెలుసుకొన్నాను.
భాస్కర్ ఆరోగ్యం కుదుటబడ్డాక బెంగుళూరు వెళ్లిపోయాడు. వారం రోజుల తర్వాత పోస్ట్‌లో ఒక కవరొచ్చింది వాసు పేరున. దాంట్లో పది లక్షల చెక్కుంది. దాంతో పాటు ఒక ఉత్తరం.
‘మిత్రమా! స్నేహబంధం ఎంత గొప్పదో తెలియచేశావు. మాట్లాడేందుకు మనుషులు కరవైన ఈ రోజుల్లో నీ సాంత్వన నాకు చాలా హాయినిచ్చింది. చిన్నప్పటి నుంచీ నువ్వింతే. అడిగినా, అడక్క పోయినా సహాయం చేయటం నీ కలవాటు. స్నేహం అంటే అరమరికలు లేనిదై ఉండాలి. నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. ఇంత డబ్బు ఎక్కడిది అనుకొంటున్నావా? ఉద్యోగంలో ఉండగా పాతిక లక్షలకి ఇన్సూరు చేయించాను. సమయానికి ఆ డబ్బు వచ్చింది. ఈ విధంగా నీ రుణం తీర్చుకొనే అవకాశం కలిగింది. కాదనకుండా చెక్కుని తీసుకొని మన స్నేహాన్ని పదికాలాలపాటు నిలవాలని కోరు కొంటావు కదూ!
నీ మిత్రుడు
భాస్కర్.
ఉత్తరం చదవటం పూర్తయింది. భార్య శాంత చేతికి ఆ కవరు అందించాడు.
-తాటికోల పద్మావతి