కళ, సంగీతాల మాదిరిగానే ప్రకృతి ఆరాధన కూడా ఉమ్మడి భాష వంటిదే. దానికి రాజకీయ, సామాజిక హద్దులు ఉండవు. కానీ ప్రకృతిని ఆరాధించడానికీ, రక్షించుకోవడానికీ మధ్య ఇప్పుడు భేదాన్ని చూడరాదు. పుడమి మన నివాసం. ఇక్కడ ‘మన’ అంటే  మానవాళి అని అర్ధం. కాబట్టి భూమి లేదా పంచభూతాల పరిరక్షణ మానవాళి ఉమ్మడి బాధ్యత. ఆ ఆనందమయ వాతావరణాన్ని ఆహ్వానించడానికి కావలసిన మొదటి షరతు- మనిషికీ, ప్రకృతికీ మధ్య బంధం బద్దలు కాకూడదు. పర్యావరణ పరిరక్షణ ఇవాళ ప్రపంచం ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పర్యావరణం పట్ల మనం వహిస్తున్న విపరీత ధోరణే కారణం. అందుకే ప్రపంచం మొత్తం పర్యావరణాన్ని రక్షించుకోవడం గురించే మాట్లాడుతున్నది. అయితే ఈ మహా స్వప్నం సాకారం కావడానికి విశ్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదా? ఆ ప్రశ్న ఉన్నప్పటికి మంచి ప్రయత్నమే జరుగుతున్నది. దాని ఫలితమే ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్‌ 5). ‌ప్రపంచ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఒకే నాణానికి అటు ఇటు ఉంటాయన్న వాస్తవం మనిషికి అర్ధమవుతున్నదనే అనుకోవాలి.

ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్‌ 5వ తేదీన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్వహిస్తారు. దీని ఇతివృత్తం ‘భూమి పునరుద్ధరణలో, ఎడారీకరణ నిరోధ ప్రకియలో, కరవు కాటకాల నివారణలో ప్రతి ఒక్కరు నిర్వహించగలిగిన భూమిక’. నినాదం, ‘మన భూమి, మన భవిష్యత్తు’

దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి మధ్య ఆసియా ప్రాంతానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించే అవకాశం దక్కింది.  ఈ సందర్భంగా ఇతివృత్తంలో పేర్కొన్న మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన ‘యునైటెడ్‌ ‌నేషన్స్ ‌డెకేడ్‌ ఆన్‌ ఎకోసిస్టమ్‌ ‌రెస్టోరేషన్‌ (2021-30)’  ‌కార్యక్రమం కూడా భూమి పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. జర్మనీ అధ్యక్షులు ఫ్రాంక్‌-‌వాల్టర్‌ ‌స్టెయిన్‌మీర్‌ ‌జూన్‌ 5న బెర్లిన్‌లోని బెల్లివ్యూ భవనంలో నిర్వహించే ‘ఫోరం విత్‌ ‌యూత్‌’ ‌కార్యక్రమంలో పాల్గొని ‘యు.ఎన్‌. ‌డెకేడ్‌ ఆన్‌ ఎకోసిస్టమ్‌ ‌రెస్టోరేషన్‌’ ‌కింద ప్రకృతి పునరుద్ధణకు చేపట్టే కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఎంతో ప్రకటిస్తారు.

ఈ ఏడాది  ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేదిక సౌదీ అరేబియా ఇప్పటికే భూక్షీణత, ఎడారీకరణను అడ్డుకునేందుకు ‘సౌదీ గ్రీన్‌ ఇనిషియేటివ్‌’ ‌పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. దీని కింద దేశంలో 30శాతం ప్రాంతాన్ని ‘సురక్షిత ప్రకృతి’ ప్రదేశంగా తీర్చిదిద్దనుంది. దీనితోపాటు దేశవ్యాప్తంగా 10 బిలియన్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది.  కరవు, ఎడారీకరణ, భూక్షీణత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోని 40 మిలియన్‌ ‌హెక్టార్ల భూమిని  పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి సంప్రదాయిక దేశం సౌదీ అరేబియాలో 2015 పర్యావరణ దినోత్సవం సందర్భంగా 15 మంది మహిళలు రెండువేల ప్లాస్టిక్‌ ‌బ్యాగ్‌లను రీసైకిల్‌ ‌చేయడం అప్పట్లో వార్తలలో నిలిచింది.

పడిపోతున్న భూమి స్థాయి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1/5వ శాతం భూమి స్థాయి పడిపోయింది. సరస్సులు శుష్కించి పోతున్నాయి. అడవులు క్రమంగా అంతరిస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు చెత్తకుండీలుగా మారుతున్నాయి. ఈ స్థాయి పర్యావరణ అంశాల క్షీణత నమోదు కావడం ప్రపంచ వ్యాప్తంగా మూడు బిలియన్ల మంది ప్రజల జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నదనే. ప్రస్తుత నిర్లక్ష్య వైఖరే కొనసాగితే పరిస్థితి మరింత దుర్భరం కాకమానదు.  ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు యు.ఎన్‌. ‌డెకేడ్‌ ఆన్‌ ఎకోసిస్టమ్‌ ‌రిస్టోరేషన్‌ (‌పర్యావరణ పునరుద్ధరణకు దశాబ్దకాల లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి చేపట్టిన కార్యక్రమం)కు  ప్రపంచ దేశాలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. 2021లో ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం, ఇప్పటికే మానవాళివల్ల పర్యావరణానికి జరిగిన హానిని నివారించి, పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడం. ఇందులో భాగంగా ఆయా దేశాలు రాబోయే మూడేళ్ల కాలంలో బిలియన్‌ ‌హెక్టార్ల భూమిని  (ఇది సౌదీ అరేబియా కంటే విస్తీర్ణంలో నాలుగు రెట్లు అధికం) పునరుద్ధరించడానికి శపథం చేశాయి. ఈ ప్రయత్నం ఇంకా ప్రారంభదశలోనే ఉన్నప్పటికీ, ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉండటం విశేషం. 2030 నాటికి మనం కనీసం 1.5బిలియన్‌ ‌హెక్టార్ల భూమిని పునరుద్ధరించగలిగితే భూమిపై ‘వెబ్‌ ఆఫ్‌ ‌లైఫ్‌’ (పర్యావరణంలోని జీవులు, నిర్జీవుల మధ్య ఉండే సంబంధం)ను పరిరక్షించడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ క్షీణతను సమర్థంగా అడ్డుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనే చెప్పాలి. ఇందులో భాగంగా పర్యావరణ మార్పులను అడ్డుకునేందుకు సౌదీ అరేబియా 2.5 బిలియన్‌ ‌డాలర్లు ఖర్చుచేయనున్నది. మరో ముఖ్యాంశ మేమంటే భూమికి జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి దాన్ని నివారించడానికి ముందడుగు వేస్తున్న తొలితరం కూడా ఇదే. భావి తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఈ తరంపై ఉంది. ఇందుకోసం తక్షణం వన్యప్రాణులకు స్వర్గధామంగా ఉండేరీతిలో అడవుల పునరుద్ధరణ, నేల పరిరక్షణ పనులు తక్షణమే చేపట్టాలి. వీటివల్ల  అడవులు, నదులు పునరుజ్జీవితమైతే కర్బన స్థిరీకరణ జరిగి భూవాతావరణానికి రక్షణ దొరుకుతుంది. అంతేకాదు వివిధ తెగల ప్రజలు నివసించే ప్రాంతాల చుట్టుపక్కల ప్రదేశాలు ప్రకృతి విపత్తుల నుంచి వారికి రక్షణ కల్పించే విధంగా రూపొం దుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తీవ్రమైన ప్రకృతి విపత్తుల బారిన పడటం చూస్తూనే ఉన్నాం. క్షీణదశలోని భూములను పునరుద్ధరించడానికి ఖర్చుచేసే ప్రతి డాలరుకు ప్రతిఫలంగా 30 డాలర్ల మేర ప్రయోజనం కలుగుతుంది. 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనైరోలో జరిగిన సదస్సు సందర్భంగా వాతావరణ మార్పు, జీవవైవిధ్యం, భూక్షీణతను నివారించేందుకు ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ మూడు లక్ష్యాల సాధన ప్రపంచదేశాల ప్రథమ కర్తవ్యం. భూసారం పెరిగితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం సులభం.  భూమిని ఎంతగా కాపాడతామో అంతేస్థాయిలో పేదరిక నిర్మూలన సాధ్యం కాగలదు. ఇప్పటివరకు పర్యావరణాన్ని ఎంతగానో పాడుచేశాం. కానీ ఇక ముందు దీన్ని నివారించి, పునరుద్ధరించడం ద్వారా రేపటి తరాలకు మంచి భవిష్యత్తును అందించవచ్చు.

నష్టాన్ని పెంచుతున్న భూవినియోగం

ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 54% వరకు పసరిక బయళ్లు (•ఙ•అఅ•), చిన్న పొదలు(ష్ట్రతీబశ్రీ•అ•), తేమ నేలలు (•వ•శ్రీ•అ•), మంచుటెడారులు (•బఅ•తీ•) ఆక్రమించాయి. ప్రపంచంలోని మొత్తం ఆహార ఉత్పత్తిలో 1/6శాతం వీటినుంచే జరుగుతోంది. అంతేకాదు ప్రపంచంలో 1/3వ వంతు కార్బన్‌ ‌నిల్వలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉండటం విశేషం. ‘యు.ఎన్‌. ‌కన్వెన్షన్‌ ‌టు కంబాట్‌ ‌డిజర్టిఫికేషన్‌’ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ భూముల వినియోగం విపరీతంగా పెరగడం వల్ల జీవ వైవిధ్యానికి వాటిల్లుతున్న నష్టాన్ని, వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్న తీరును ఈ నివేదిక వివరించింది. ఈ భూములపై ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్ల జనాభా తమ జీవనోపాధి కోసం ఆధారపడుతున్నారు. ఈ భూముల పరిరక్షణ, స్థిరీకరణకోసం ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించాలని నివేదిక స్పష్టం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం రెండు బిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో భూక్షీణత నెలకొంది. ప్రపంచ జనాభాలో సగంమందిపై దీని ప్రతికూల ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో కొన్నివేల జాతుల  మొక్కల ఉనికి ప్రమాదంలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా భూక్షీణత క్రమంగా విస్తరిస్తుండటం, కరవు నెలకొనే కాలం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారి భూక్షీణత మొదలైతే దాన్ని పునరుద్ధరించడం చాలా కష్టం. అయినప్పటికీ పటిష్టమైన భూమి పునరుద్ధరణ చర్యల ద్వారా భూక్షీణతను, ఎడారీకరణను, కరవు కాటకాలను సమర్థంగా నిరోధించవచ్చు. దీనివల్ల జీవనోపాధులు పెరిగి, పేదరికం తగ్గుముఖం పడుతుంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న తీవ్రమార్పులను అడ్డుకొని, స్థితిస్థాపకతను కలుగజేయవచ్చు. కేవలం 15 శాతం భూమిని పునరుద్ధరిం చడం ద్వారా, అంతరించి పోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జాతుల్లో 60శాతం వరకు రక్షించవచ్చు. ఈ భూక్షీణత, క్షామం, ఎడారీకరణకు మూలమైన వాతావరణ మార్పును అడ్డుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఈ నేపథ్యంలో లాటిన్‌ అమెరికాలోని, హై ఆండిస్‌ ‌ప్రాంతానికి చెందిన ఐదు దేశాల్లోని వివిధ తెగల ప్రజలు వాతావరణ మార్పును తట్టుకునేవిధంగా నీటి నిల్వలను పెంచుకునేందుకు చేపడుతున్న చర్యలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 75శాతం విత్తన పంటలు, పండ్లతోటలు ప్రధానంగా తేనెటీగల వంటి పరాగసంపర్క కారకాలపై ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్న వ్యవసాయ కార్యకలాపాలవల్ల ఈ పరాగసంపర్క కారక కీటకాల మనుగడ ప్రమాదంలో పడింది. వీటి పరిరక్షణ కోసం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక ‘ప్రాక్టికల్‌ ‌గైడ్‌’ను రూపొందించారు. దీన్ని అధ్యయనం చేయడం ద్వారా తేనెటీగలను ఏవిధంగా పరిరక్షించవచ్చనేది స్పష్టంగా తెలుస్తుంది. 2004లో సునామీ వచ్చిన తర్వాత శ్రీలంక పెద్దఎత్తున మడ అడవులను పెంచేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా నాటిన మొక్కల్లో మూడుశాతం మాత్రమే బతకడంతో తక్షణం తన వ్యూహంలో మార్పుతీసుకొచ్చి, మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ కూడా చేపడుతోంది. ఈ మడ అడవులు సముద్ర తుపానులు, సముద్రపు అలలవల్ల నేల కోతకు గురికాకుండా రక్షణగా నిలుస్తాయి. మడ అడవుల పెంపకం కోసం శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 5వేల కుటుంబాలు లబ్ధ్ది పొందడమే కాదు నాలుగువేలమందికి ఉపాధి లభించింది.

వుడ్‌ ‌వైడ్‌ ‌వెబ్‌పై పరిశోధనలు

మొక్కలు కొన్ని వేల శిలీంధ్రాలు, బ్యాక్టీరియా సహాయం లేకుండా మనుగడ సాగించలేవు. అవి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలు తమ వేళ్లద్వారా సులభంగా తీసుకునేందుకు సహకరిస్తాయి. ఇవి మొక్కల వేళ్లపై ఆశ్రయం కల్పించుకొని జీవిస్తాయి. ఈవిధంగా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మొక్కల మధ్య సమన్వయ జీవనం కనిపిస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే ఆ విధంగా ‘వుడ్‌ ‌వైడ్‌ ‌వెబ్‌’ను ఏర్పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘వుడ్‌ ‌వైడ్‌ ‌వెబ్‌’కు దోహదం చేస్తున్న 70 దేశాల్లోని వివిధ మొక్కలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ‘యునైటెడ్‌ ‌నేషన్స్ ‌డెకేడ్‌ ఆన్‌ ఎకోసిస్టమ్‌ ‌రెస్టోరేషన్‌’ అడ్వయిజరీ బోర్డు సభ్యుడు, ప్రముఖ పర్యావరణ వేత్త థామస్‌ ‌క్రౌథర్‌ ‘వుడ్‌ ‌వైడ్‌ ‌వెబ్‌’ ‌వల్ల కలుగుతున్న అద్భుతాలను ఆవిష్కరించడమే కాకుండా మొక్కలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాల మధ్య ఉండే అనుసంధానాన్ని పరిరక్షించేందుకు ‘యునైటెడ్‌ ‌నేషన్స్ ‌డెకేడ్‌ ఆన్‌ ఎకోసిస్టమ్‌ ‌రిస్టోరేషన్‌’ ఏవిధంగా కృషిచేస్తున్నదీ ‘అవర్‌ ‌లివింగ్‌ ‌వరల్డ్’ ‌పేరుతో ఒ.టి.టి. ప్లాట్‌ఫామ్‌ ‌నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీలో విపులంగా వివరించారు. అంతేకాకుండా ‘కిస్‌ ‌ది గ్రౌండ్‌’ ‌పేరుతో చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఇప్పటివరకు మనం గుర్తించని నేలకు సంబంధించిన వాతా వరణ పరమైన అంశాలను చక్కగా వివరించింది. ప్రముఖ నటుడు వూడీ హారిల్సన్‌ ‌దీనికి వ్యాఖ్యాత. నేల పునరుద్ధరణ విధానాలు, దేశాలు వాతా వరణాన్ని ఏవిధంగా స్థిరీకరించవచ్చు, కోల్పోయిన పర్యావరణ వ్యవస్థలను పూర్వస్థితికి తీసుకువచ్చే విధానాలు, సమృద్ధిగా ఆహార సరఫరా సాధ్యమెలా? అన్న అంశాలపై ఈ డాక్యుమెంటరీ చక్కగా వివరించింది.

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఈ శతాబ్దంలో భూతాపం పెరుగుదల 1.50 సెల్షియస్‌కు దిగువన ఉండేలా చూడాలంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాల పరిమాణాన్ని 2030 నాటికి సగానికి తగ్గించక తప్పదు. వాయు కాలుష్యాన్ని నిర్ధారిత సురక్షిత మార్గదర్శకాల ప్రకారం పరిమితం చేయడానికి చర్యలు తీసుకోకపోతే ఇది నిర్దేశిత పరిమాణాల కంటే 50 శాతం పెరగడం తథ్యం. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల మాత్రమే కాదు వరదలు, తుపానులు, క్షామం వంటి విపత్తులను కూడా ప్రపంచం గత ఏడాది చవిచూసింది. అందువల్ల వాతావరణమార్పును పట్టించుకోకుండా, భూమి పునరుద్ధరణపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది ఒక చేత్తో ఇస్తూ, రెండో చేత్తో పుచ్చుకోవడం వంటిదని గ్రహించాలి.  ప్రపంచ దేశాలు బిలియన్ల హెక్టార్ల భూమిని పునరుద్ధరిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చాయి. అంటే ఈభూమి విస్తీర్ణం చైనా కంటే ఎక్కువ. ఆయా దేశాలు తమ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ పర్యావరణ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న సౌదీ అరేబియా, పునరుద్ధరణ లక్ష్యాలు, వాతావరణ మార్పులపై నత్తనడకన చేపడుతున్న కార్యక్రమాలు, ప్రకృతి పరిరక్షణతో పాటు కోట్లాదిమంది ప్రజల జీవన భృతులు, ఆహార భద్రతను మరింత పటిష్టం చేసేదిశగా సహచరదేశాలు మరింత వేగంగా చర్యలు చేపట్టేలా ప్రేరణ కలిగించాలి.

 భారత్‌ ‌తీసుకుంటున్న చర్యలు

మనదేశంలో అటవీ పర్యావరణ పరిరక్షణకోసం 1998 నుంచి ‘పర్యావరణ అభివృద్ధి ట్రస్టు’ (ఈఐటీ) పనిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించి స్ఫూర్తి నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2015లో  దేశ రాజధాని ఢిల్లీలో కదంబ మొక్కను నాటారు. అదే ఏడాది ఇటలీ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇవ్వగా ‘ధరిత్రిని పోషించండి-జీవులకు శక్తినివ్వండి’ అనేది ఇతివృత్తం. భూమికి, జీవులకు సూర్యుడినుంచి గ్రహించిన శక్తిని అందించేది మొక్కలు మాత్రమే. ప్రధాని కదంబ మొక్కను నాటడానికి నేపథ్యమిదే!  2018లో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. ‘ప్లాస్టిక్‌ ‌కాలుష్యాన్ని ఓడించాలి’ అనేది నాటి ఇతివృత్తం. 2022 నాటికి ‘సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌’ను పూర్తిగా తొలగించాలని భారత ప్రభుత్వం ప్రతిన పూనిన సంవత్సరం ఇదే.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో రాజ్యాంగంలో వివరించారు. 48-ఎ అధికరణం, పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రాల బాధ్యతలను స్పష్టంగా వివరించింది. ‘దేశవ్యాప్తంగా అడవులు, వన్యప్రాణుల పరిరక్షణలో భాగంగా రాష్ట్రప్రభుత్వాలు పర్యావరణ నిరంతర పరిరక్షణ, అభివృద్ధికోసం కృషిచేయాలి’ అని పేర్కొంది. 51-ఎ అధికరణం, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాథమిక విధిగా పేర్కొంది. ‘అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణుల పట్ల కనికరం చూపుతూ ప్రకృతిలో భాగమైన పర్యావరణ రక్షణ, అభివృద్ధి ప్రతి భారత పౌరుడి విధి’ అని స్పష్టం చేసింది.

మిషన్‌ ‌లైఫ్‌

‌భారత్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ‘మిషన్‌ ‌లైఫ్‌’ (పర్యావరణ హిత జీవనశైలి) పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో ‘లైఫ్‌’ (జీవం) అనే భావనను ప్రధాని నరేంద్రమోదీ  నవంబర్‌ 1, 2021న గ్లాస్గోలో జరిగిన వాతావరణ మార్పు సదస్సు సందర్భంగా ముందుకు తీసుకువచ్చారు.  ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత జీవనశైలిలో తీసుకురావలసిన మార్పు ప్రాధాన్యతను ఈ భావన నొక్కి చెబుతోంది. ఇందుకోసం అనుసరిం చాల్సిన సుస్థిర జీవనశైలులకోసం ప్రపంచం అన్వేషించాల్సిన అవసరాన్ని ఈ భావన గుర్తుచేస్తోంది. మరోమాటలో చెప్పాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. అక్టోబర్‌ 22, 2022న గుజరాత్‌ ‌రాష్ట్రానికి చెందిన ఏక్తానగర్‌లోని యూనిటీ స్టాచ్యూ వద్ద ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్‌ ‌సమక్షంలో ప్రధాని నరేంద్రమోదీ ‘మిషన్‌ ‌లైఫ్‌’ను మనదేశంలో ప్రారంభించారు.

నిజానికి భారత్‌లో తరతరాలుగా అనుసరిస్తున్న సంస్కృతీ సంప్రదాయాలు, జీవనశైలి సుస్థిర పర్యావరణానికి దోహదం చేసేవే. మన పురాతన గ్రంథాలు కూడా ప్రకృతితో మమేకమై జీవించడమే ఆమోదయోగ్యమని స్పష్టం చేస్తున్నాయి. మిషన్‌ ‌లైఫ్‌కు సంబంధించి తీసిన షార్ట్‌ఫిల్మ్‌లు పర్యావరణానికి అనుకూల జీవనశైలి విధానాలను చక్కగా వివరించాయి. అంతేకాదు మన జీవనవిధానం ప్రకృతిని పరిరక్షిస్తు ఏవిధంగా కొనసాగాలనేది వీటి ప్రధాన ఇతివృత్తం. ముఖ్యంగా మూర్ఖత్వంతో విచ్చలవిడి వినియోగంనుంచి, విజ్ఞతతతో కూడిన సావధానయుక్తంగా ఉపయోగించుకోవడం వైపు ఏవిధం గా మరలాలో కూడా ఈ షార్ట్ ‌ఫిల్మ్‌లు వివరించాయి.

ఏడు ఇతివృత్తాలు

మిషన్‌ ‌లైఫ్‌ను ప్రోత్సహించేందుకు ఏడు ఇతివృత్తాల్లో నిక్షిప్తమైన 25 అంశాలను భారత ప్రభుత్వం గుర్తించింది. ఇంధనం, నీటిని పొదుపుగా వాడటం, ప్లాస్టిక్‌, ఈ-‌వ్యర్థాలను తగ్గించడం, సుస్థిర ఆహారవ్యవస్థలను అవలంబించడం, వ్యర్థాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అనేవి ఏడు ఇతివృత్తాలు. మిషన్‌ ‌లైఫ్‌ ‌ప్రతి ఒక్కరూ రోజూ పాటించే అనుసరించే జీవనశైలిలో స్వల్ప మార్పులు తెచ్చుకున్నట్లయితే, క్రమంగా ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఒక క్రమశిక్షణాయుత జీవన విధానానికి దోహదం చేస్తుంది. ఈవిధమైన జీవనవిధానాలు కొన్ని సంవత్సరాల్లో వాతావరణంలో సానుకూల మార్పులు తప్పక తీసుకువస్తాయి. ఇదే మిషన్‌ ‌లైఫ్‌ ‌ప్రధాన లక్ష్యం. అందువల్ల ప్రపంచం మారాలని తలపోసేవారు, ముందుగా ఆ మార్పును తమ నుండే ప్రారంభించాలి. పర్యావరణ మార్పునకు బాధ్యతాయుతంగా చేసే వ్యక్తిగత ప్రయత్నం మన ఉమ్మడి భవిష్యత్తును పరిరక్షిస్తుంది. ఆవిధంగా పర్యావరణ మార్పునకు మనం చేసిన కృషి భావితరాలకు ఇప్పటికన్నా మంచి పర్యావరణాన్ని అందిస్తుంది.

అడవులు మానవాళికి ఊపిరితిత్తుల వంటివి. నదులు నెత్తురు వంటివి. భూమి నివాసం. వీటిని ధ్వంసం చేసుకుంటూ ఏ జాతీ మనుగడ సాగించలేదు.అందుకే భూరక్షణ ఎంతటి మహోద్యమానికైనా సిద్ధంకావాలి. ఇవాళ పోరాడవలసింది భూమి కోసమే కాదు, భూరక్షణం కోసం కూడా.

బైష్నోయీ ఉద్యమం

ఈ ఉద్యమం 1700 సంవత్సరంలో రాజస్థాన్‌లోని  మార్వార్‌కు చెందిన ఖేజర్లీలో చోటుచేసుకుంది. అమృతాదేవి నాయకత్వంలో ఖేజర్లీ ప్రాంతంలోని బైష్ణోయీ గ్రామం దీని కేంద్రస్థానం.తాము పవిత్రంగా భావించే వృక్షాలను రాజసైనికులు కొట్టేస్తుంటే, అమృతాదేవి నాయకత్వంలో గ్రామ ప్రజలు వృక్షాలను కౌగలించుకోవడం ద్వారా దీన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 363 మంది బైష్ణోయి గ్రామస్థులు మరణించారు. గురుమహరాజ్‌ ‌జంభాజీ బోధనలకు ప్రభావితులైన గ్రామస్థులు మొక్కల పరిరక్షణకు పూనుకున్నారు. ఆయన 1485లో బైష్ణవీ మతాన్ని స్థాపించాడు. మొక్కలకు, జంతువుకు హాని తలపెట్టకూడదనేది ఈ మతసిద్ధాంతం. తర్వాత విషయం తెలుసుకున్న మహారాజు ప్రజలకు క్షమాపణలు చెప్పి, ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రదేశంగా ప్రకటించాడు.

పర్యావరణ దినోత్సవ నేపథ్యం, ప్రస్థానం

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించడమే ప్రధాన లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏటా జూన్‌ 5వ తేదీన జరుపుకుంటారు.  దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తమ మద్దతునిస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణానికి మద్దతుగా ఐక్యరాజ్యసమితి పరివ్యాప్త దినంగా కూడా దీన్ని పరిగణిస్తారు. మొట్టమొదటిసారి పర్యావరణ దినోత్సవాన్ని 1973లో జరుపుకున్నారు. సముద్రాల  కాలుష్యం, అధిక జనాభా, భూతాపం, సుస్థిరాభివృద్ధి వంటి సమస్యలకు దీన్ని ఒక వేదికగా తీసుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు చేరువ కావడానికి ఒక వేదికగా ఉపయోగపడుతోంది. మొత్తం 143 దేశాలు ఇందులో భాగస్వాములు. ఏటా ఈ కార్యక్రమానికి ఒక ‘ఇతివృత్తం’, ‘బిజినెస్‌ ‌ఫోరం’ను నిర్ణయిస్తారు. నిజానికి 1972లో మొట్టమొదటిసారి ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ ప్రారంభించారు. అదే ఏడాది జూన్‌ 5-12 ‌తేదీల మధ్యకాలంలో మానవ పర్యావరణంపై స్టాక్‌హోమ్‌లో, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు సందర్భంగా దీన్ని ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో మానవ ప్రతిస్పందన, పర్యావరణాల ఏకీకరణపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1973లో ‘కేవలం ఒకే భూమి’ అనే ఇతివృత్తంతో మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (డబ్ల్యు.ఇ.డి) నిర్వహించారు.

ప్రపంచ దేశాలమధ్య కుదిరిన పర్యావరణ ఒప్పందాల్లో కొన్ని చట్టబద్ధంగా  లోబడి ఉండాల్సినవి కాగా మరికొన్ని ప్రవర్తనా నియమావళికి సంబంధించి నవి. ఈ ఒప్పందాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1910 నుంచి యూరప్‌, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 1945 తర్వాత ఏర్పాటైన అనేక సాంకేతికపరమైన సంస్థలు ఈ పర్యావరణానికి సంబంధించిన ఇతివృత్తాలపై ఎన్నో వివరణలు ఇచ్చాయి. 1960 చివరి నాటికి పర్యావరణ ఉద్యమం అంతర్జాతీయంగా సంస్థాగత సహకారం అవసరాన్ని నొక్కి చెప్పింది. 1972లో స్టాక్‌హోంలో జరిగిన మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సు (యునైటెడ్‌ ‌నేషన్స్ ‌కాన్ఫరెన్స్ ఆన్‌ ‌ది హ్యూమన్‌ ఎన్విరాన్‌మెంట్‌) ‘ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు’ను సుస్థిరం చేసింది. ఇది తర్వాతి సంవత్సరం 1973లో ‘ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం’ ఏర్పాటుకు దోహదం చేసింది. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాల్లో ప్రముఖంగా చెప్పుకోవలసింది 1997లో జరిగిన ‘క్యోటో ప్రొటొకాల్‌’, 2015లో జరిగిన ‘ప్యారిస్‌ ఒప్పందం’. 2021, అక్టోబర్‌ 8న ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి ఒక తీ ర్మానాన్ని ఆమోదించింది. ‘ఆరోగ్యం సుస్థిర పర్యావరణం సార్వజనీన హక్కు’గా ఈ తీర్మానం పేర్కొంది. ఇదే మండలి తన 48/13 తీర్మానంలో కొత్తగా ఆమోదించిన ఈ హక్కును అమలు చేయడానికి ప్రపంచ దేశాలు ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయాలని కోరింది. అదేవిధంగా 2022 జులై 28న ఐక్యరాజ్య సమితి సాధారణసభ ఆమోదించిన తీర్మానం, ‘స్వచ్ఛమైన, ఆరోగ్యమైన, సుస్థిరమైన పర్యావరణం విశ్వజనీన హక్కు’గా పేర్కొంది.

పర్యావరణం మన మనుగడకు ఎంతో కీలకం. ఎందుకంటే ప్రకృతి మన ఉనికికే ముఖ్యమైన ప్రకృతి, సూర్యోదయం, నదుల పరవళ్లు, చెట్లు, అందమైన పూతోటలు, జంతువులు, పక్షులు వంటివి మనతో కలసి సహజీవనం చేస్తున్నాయి. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి, ప్రకృతి, జీవజాలం మన జీవనానికి ఎంత ముఖ్యమైనవో వివరించారు..

మానవులు, జంతువులు కలిసి జీవిస్తాయి. ప్రకృతి ప్రత్యేకతే ఇది.

భూమిపై జీవించే ప్రతి ప్రాణి కూడా ఆక్సిజన్ను పీల్చుకుని, కార్బన్‌ ‌డయాక్సైడ్ను బయటికి వదులుతూ ఉంటుంది. ఈ కార్బన్‌ ‌డయాక్సైడ్ను చెట్లు పీల్చుకుని, ఆక్సిజన్ను బయటికి విడుదల చేస్తాయి. ఇదే ప్రకృతి మన మనుగడ కోసం చేసిన ఏర్పాటు. భారత్‌లో 24 శాతం వృక్ష సంపద ఉంది. చెట్లు పెంచే విస్తీర్ణం మరింత పెరుగుతోంది. గత ఏడేళ్లలో, చెట్ల పెంపకం 15,000 చదరపు కి.మీలకు పెరిగి, ప్రస్తుతం ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజా ఉద్యమంగా మారిన ఈ చెట్ల పెంపకం కింద ప్రతి ఏడాది కోట్ల కొద్ది చెట్లను ప్రజలు నాటుతున్నారు. పెద్ద పెద్ద చెట్లను కొట్టివేయకుండా కాపాడుతున్నారు. ఒకవేళ ఏదైనా అభివృద్ధి పథకాన్ని అటవీ ప్రాంతంలో చేపడితే.. ఎంత మొత్తం భూమిని తీసుకుంటున్నారో, ఆ మేర మరో ప్రాంతంలో కేటాయించేలా సరికొత్త విధానాన్ని మేము రూపొందిస్తున్నాం. అక్కడ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, చెట్లను పెంచుతాం. ప్రతి ఏడాది అటవీ ప్రాంతం ఏ మేర పెరుగుతుందో ఎలక్ట్రానిక్‌ ‌మేము పర్యవేక్షిస్తున్నాం. ఈ సమాచారమంతా ప్రజలకు అందుబాటులో ఉంటోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అధ్యయనాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ అధ్యయనంలో చెట్ల పెంపకం ప్రతి ఏడాది పెరుగుతూ ఉందని వెల్లడైంది.

జీవవైవిధ్యం కాపాడే దేశాలలో భారత్‌ ‌ముఖ్యమైన దేశంగా ఉంది. భారత్‌లోనే పర్యావరణ జీవవైవిధ్యం అత్యధికంగా ఉంది. ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారత్‌ ‌లో కేవలం 2.5 శాతం మాత్రమే ఉంది. ప్రపంచంలో ఉన్న వర్షపునీటి వనరులలో కేవలం 4 శాతమే భారత్‌లో ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సుమారు 18 శాతం భారత్‌లోనే నివసిస్తున్నారు. జంతువులు, పక్షులు కూడా మనుషులతో కలిసి ఈ భూమిపై నివసిస్తున్నాయి. వీటన్నింటికీ కూడా భూమి, నీరు, ఆహారం కావాల్సి ఉంది. ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం భారత్నే కలిగి ఉంది. ప్రపంచంలోని 70 శాతం పులులు, 70 శాతం ఆసియా సింహాలు, 30,000కు పైగా ఏనుగులు, 3,000 ఖడ్గమృగాలు భారత్‌లో ఉన్నాయి. మన దేశంలో ఉన్న జీవవైవిధ్యాన్ని ఇవి సూచిస్తున్నాయి. భారత్‌లో చెట్ల పెంపకం పెరగడం వల్ల, జీవవైవిధ్యం కూడా మెరుగు పడుతుంది. పులులు, సింహాల సంఖ్య, ఏనుగులు, ఖడ్గమృగాల సంఖ్య కూడా పెరుగుతోంది.

-జమలాపురపు విఠల్ రావు

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE