‘ఎదుటివాడికి చెప్పేటందుకే  నీతులు ఉన్నాయి’ అన్న మాటలను తు.చ. తప్పకుండా పాటించిన, పాటిస్తున్న కేజ్రీవాల్‌కు రోజులు అస్సలు బాగోలేవు. అవినీతిపై పోరాటం పేరుతో జాతీయ వేదికపైన వెలిసి, అనేకమంది విద్యావంతులైన, నిరక్షరాస్యులైన యువతలో స్ఫూర్తిని, ఆశను నింపిన అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ అవినీతిని తుడిచిపెట్టేందుకు ‘చీపురు’ పట్టుకువస్తే, నమ్మి అందరూ పరిశుద్ధమైన ప్రభుత్వం కోసం ఓట్లు వేసి గెలిపించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ ఎన్ని వేషాలు వేసినా, ఆశచావక అతడిని సమర్ధించుకుంటూనే వచ్చారు. చివరాఖరకు ఎన్ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఇడి) అతడిని అరెస్టు చేసినప్పుడు కూడా వారిలో అతడి పట్ల చిరు ఆశ మిగిలే ఉంది. కానీ, ఎప్పుడైతే ఆప్‌ ‌రాజ్యసభ సభ్యురాలు, పార్టీ సీనియర్‌ ‌నాయకురాలు స్వాతి మాలివాల్‌పై ముఖ్యమంత్రి నివాసంలోనే, ఆయన సన్నిహితులు దాడి చేసినప్పుడే జనాల్లో ఆ ఆశ చచ్చిపోయింది.

లిక్కర్‌గేట్‌ ‌స్కాండల్‌ (‌మద్య విధానంలో అవినీతికేసు)లో ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలకమంత్రులంతా కటకటాలు లెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వారికి తోడుగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా ఎట్టకేలకు ఆధారాలు సంపాదించి పంపారు. తనకు బెయిల్‌ ఇమ్మంటూ ఎన్నిసార్లు కోరినా అంగీకరించని అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల సందర్భంగా అతడికి ఒక మూడు వారాల పాటు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ ఇచ్చింది (విదేశీ శక్తుల హస్తం కారణంగానే ఇది వచ్చిందనే ఆరోపణలున్నాయి). దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న కేజ్రీ మరొక వారం తనకు స్వేచ్ఛ ఇవ్వమని కోరగా కోర్టు ఒప్పుకోకపోవడంతో నిరాశపడ్డట్టున్నారు.

రాజకీయాలలో ఒక గొప్ప మలుపు తీసుకు వస్తాడని భావించిన కేజ్రీవాల్‌ ‌పాలనలో ఏది ముట్టుకున్నా అవినీతిమయమేననే విషయం ఇటీవలే వెల్లడైంది. కోట్లాది రూపాయల విలువైన అతడి అధికారిక నివాసం ‘శీష్‌ ‌మహల్‌’‌ను నిర్మించేందుకు కూడా ఆయన అనేక చెట్లను నరికి, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారట.

విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన

ఆప్‌ ‌పార్టీ ఫోరెక్స్ ‌నిబంధనలను ఉల్లంఘించి రూ.7.08 కోట్ల రూపాయలను వసూలు చేసిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టొరేట్‌ (ఇడి) హోం మంత్రిత్వ శాఖకు తెలియచేసింది. అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ‌సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్‌, ఒమన్‌ ‌సహా ఇతర దేశాలలోని అనేకమంది డోనార్ల నుంచి ఆప్‌ ‌నిధులను అందుకుంది. అయితే, రాజకీయ పార్టీలకు విదేశీ విరాళాలపై ఉన్న నిబంధనలను తప్పించుకునేందుకు ఆప్‌ ‌తన ఖాతా పుస్తకంలో విదేశీ డోనార్ల గుర్తింపును మరుగు పరిచిందని ఈడీ ఆరోపించింది.

విదేశీ విరాళాలకు సంబంధించిన ఈ డేటాను విశ్లేషించినప్పుడు, పలువురు దాతలు ఒకటే పాస్‌పోర్టు నంబర్‌ను, ఒకటే ఇమెయిల్‌ ఐడిలు, మొబైల్‌ ‌నంబర్లను, అవే క్రెడిట్‌ ‌కార్డు నంబర్లను వాడినట్టు తేలింది. ఈ విషయం కూడా పాకిస్తాన్‌ ‌నుంచి హెరాయిన్‌ను స్మగ్లింగ్‌ ‌చేస్తున్న ఒక అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠాకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆప్‌ అం‌దుకుంటున్న విదేశీ నిధులలో అవకతవకలు, ఎఫ్‌సిఆర్‌ఎ ఉల్లంఘనలు బయట పడ్డాయి.

ఆ సందర్భంగా, ఫజిల్కాలోని ప్రత్యేక కోర్టు నాటి భోలాత్‌ ఆప్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ ‌సింగ్‌ ‌ఖైరాను నిందితుడిగా విచారణ ఎదుర్కొనవలసిందిగా సమన్లు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా, ఖైరా, అతడి సహచరులపై నిర్వహించిన సోదాలలో విదేశీ విరాళాలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలు బయటపడటంతో ఈడీ వాటిని స్వాధీనం చేసుకుంది. పంజాబ్‌లో 2017లో ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండేళ్లముందు అంటే 2015లో ఆప్‌ ‌పార్టీ అమెరికాలో ఏర్పాటు చేసిన విదేశీ నిధుల సేకరణ ప్రచారం సందర్భంగా మొత్తం 1,19,000 డాలర్లు విదేశీ చందాలు వసూలు అయ్యాయి.

కాగా, ఆప్‌ ‌పార్టీ చెక్కుల ద్వారా, ఆన్‌లైన్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా విదేశీ విరాళాలను అందుకుంటున్న విషయాన్ని ఆప్‌ ‌జాతీయ కార్యదర్శి పంకజ్‌ ‌గుప్తా అంగీకరించినట్టు ఈడీ ప్రకటించినా, ఇదంతా ఈడీ, సీబీఐ, హోంమంత్రిత్వ శాఖ, ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌పన్నిన కుట్రంటూ ఆప్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆప్‌ ‌మీద బురదజల్లేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర అని కూడా ఢిల్లీ మంత్రి అతీషీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారే తప్ప అసలు విషయాలలో నిజానిజాలేమిటన్న విషయం బయటపెట్టకపోవడం గమనార్హం.

మనీ లాండరింగ్‌ ‌కేసులు

నక్కలెరుగని బొక్కలా అన్న సామెతలా ఇండియన్‌ ‌రెవిన్యూ సర్వీసెస్‌ అధికారి అయిన కేజ్రీవాల్‌కు చట్టంలో ఉండే లొసుగులు తెలుసు. అందుకే ఎక్కడా చిక్కకుండా వందల కోట్ల మద్య విధాన స్కాంను నడిపించేశారు. ముఖ్యమంత్రిగా టీం లీడర్‌ అయినప్పటికీ, ఏ ఫైలు మీదా సంతకాలు పెట్టకుండా తప్పించుకున్నాననుకున్నారు. కానీ ఎత్తుకుపై ఎత్తులు వేయగల ఈడీ అధికారులు మాత్రం చిన్నదో చితకదో ఆధారాన్ని కోర్టుకు చూపడంతో వెంటనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవలసిందిగా కోర్టు ఆదేశించింది. ఈడీ సమన్లను తొమ్మిదిసార్లు తిరస్కరిస్తే జరిగేది ఇదే అని తెలిసినప్పటికీ, ఎన్నికల తేదీల ప్రకటనల వరకూ వాయిదా వేస్తూ వచ్చారు. ఆ సమయంలో తనను అరెస్టు చేస్తే తనకు సానుభూతి వస్తుందని ఊహించారు. అయితే, కేజ్రీవాల్‌ ఒక్కొక్క లీలా బయటపడుతుండడంతో పరువుపోయిందే తప్ప ఫలితం దక్కలేదు.

చార్జిషీటులో పార్టీ పేరు కూడా!

కేంద్ర ఏజెన్సీలు ఎక్సైజ్‌ ‌విధానం కేసుకు సంబంధించి దాఖలు చేసిన ఛార్జిషీటులో అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌నే కాదు, ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా నిందితు లుగా చేర్చింది. ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీపై మనీ లాండరింగ్‌ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. ఈడీ దాఖలు చేసిన ఈ కేసుకు సంబంధించి ఎనిమిది ఛార్జిషీట్లను దాఖలు చేసి 18మందిని ఇప్పటివరకూ అరెస్టు చేసింది. అంతేకాదు, బీఆర్‌ఎస్‌ ‌నాయకురాలు కె.కవిత, నలుగురు ఇతర నాయకులపై కూడా ఇటువంటి ఫిర్యాదునే నమోదు చేసింది.

ఢిల్లీ ఎక్సైజ్‌ ‌స్కాంలో కేజ్రీవాల్‌ ‌సూత్రధారి కావడమే కాదు, కీలక కుట్రదారు అని కూడా ఏజెన్సీ చేసిన ఆరోపణలలో ఏ మాత్రం అసత్యం లేదు. గోవా ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ ‌సెవెన్‌ ‌స్టార్‌ ‌హోటల్‌లో ఉండటమే కాదు, ఆయన బిల్లులను పాక్షికంగా ఈ కేసులో నిందితుడు ఒకరు చెల్లించినట్టు తమ వద్ద ప్రత్యక్ష ఆధారాలున్నాయని, ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్‌ ‌విధానాన్ని రూపొందించడంలో అతడే కీలక పాత్ర పోషించాడనే వాదనలు సుప్రీం కోర్టులో జరిగాయి. అతడు ఢిల్లీ మంత్రులు, ఆప్‌ ‌నాయకులు ఇతరులతో కలిసి పని చేశాడనే ఆరోపణలు కూడా ఏజెన్సీ చేసింది.

ఆప్‌ ‌రాజకీయ పార్టీ అయినందున ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద దానిని ఒక సంస్థగా నిర్వచిస్తారని, కనుక దానిని పిఎంఎల్‌ఎ 70‌వ సెక్షన్‌ ‌కింద కంపెనీగా వర్గీకరించి, విచారించవచ్చని ఈడీ అభిప్రాయపడింది. నేరం జరిగిన సమయంలో ఈ కంపెనీకి అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌ ఇన్‌చార్జి కనుక మనీలాండరింగ్‌ ‌వ్యతిరేక చట్టం కింద అతడే దోషి కనుక అతడిని విచారించి, శిక్షించాలని కూడా సూచించింది.

పులి మీద పుట్రలా స్వాతీ మాలివాల్‌ ‌కేసు

పార్టీ అధినేత కేజ్రీవాల్‌ అరెస్టు సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు – స్వాతి మాలివాల్‌, ‌రాఘవ్‌ ‌చద్దాలు దేశం బయట ఉండ టమే కాదు, వారు ప్రకటనలు చేయడం కానీ, హడావిడిగా పరుగెత్తుకు రాకపోవడం కానీ జరుగకపోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు మాత్రం అక్కడ ఏవో లెక్కలు సరి చేయడానికి వెళ్లుంటారని భావించారు. కారణాలేవైనా, మొత్తానికి కేజ్రీవాల్‌కు బెయిల్‌ ‌వచ్చిన తర్వాత మాత్రమే వీరిరువురూ భారత్‌లో ప్రత్యక్షమయ్యారు.

వీరిలో స్వాతి మాలివాల్‌ ‌దాదాపు రెండు దశాబ్దాలుగా కేజ్రీవాల్‌తో కలిసి పని చేస్తున్న వ్యక్తి. అతడు ‘అన్నా ఆందోళన’కు ముందు స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న కాలం నుంచీ స్వాతి కూడా కేజ్రీవాల్‌తో కలిసి పని చేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతిని మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిని చేసి, అనంతరం రాజ్యసభ ఎంపీని చేశారు. ఇంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, ఆమె కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు అతడి అధికారిక నివాసాన్ని వెడితే పిఎ బిభవ్‌ ‌కుమార్‌ ‌చేత కొట్టించడం, ఆ విషయాన్ని స్వయంగా మాలివాల్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రజలు నివ్వెరపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచీ స్వాతి వ్యక్తిత్వ హననం ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి నివాసం నుంచి సిసిటివి డివిఆర్‌ను స్వాధీనం చేసుకోవడంతో స్వాతి మీద మాటల దాడులు ప్రారంభమయ్యాయి. చిత్రమైన విషయమేమిటంటే, ఘటన జరిగిన సమయంలో డిజిటల్‌ ‌వీడియో రికార్డర్‌ ‌బ్లాంక్‌గా ఉందని పోలీసులు ఆరోపించారు. వాస్తవానికి స్వాతిమాలివాల్‌పై జరిగిన ఘటన తీవ్రమైనదని, ప్రాణహాని కలిగించగలిగి ఉన్న కేసని తన రిమాండ్‌ ‌పత్రంలో పోలీసులు పేర్కొన్నారు.

ఇందుకు తోడుగా పోలీసులు కేజ్రీవాల్‌ ‌పిఎ బిభవ్‌ ‌కుమార్‌ను ఈ కేసులో అరెస్టు చేయడంతో, ఆప్‌ ‌బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేసే ప్రయత్నం చేసి విఫలమైంది. బిభవ్‌ ‌కుమార్‌ ‌పోలీసులతో సహకరించకపోవడమే కాదు, సమాధానాలను కూడా సరిగ్గా ఇవ్వలేదని పోలీసులు ఆరోపించారు. ఒక పార్లమెంటు సభ్యురాలిపై తీవ్రమైన దాడి జరిగిన కేసు ఇదని, నిర్దిష్టమైన, సూటి ప్రశ్నలు వేసినప్పటికీ దర్యాప్తులో సహక రించేందుకు నిందితుడు ముందుకు రాలేదనివారు రిమాండ్‌ ‌పత్రంలో వ్యాఖ్యానించడం గమనార్హం.

అలాగే బిభవ్‌ ‌తన ఫోనును ముంబైలో ఫార్మాట్‌ ‌చేయించుకున్నాడని, తన మొబైల్‌ ‌పాస్‌వర్డ్‌ను చెప్పడం లేదని వారు పేర్కొన్నారు. స్వంతదారు అందుబాటులో లేకుండా అందులో యాప్‌లను కూడా ఉపయోగించలేరని, మొబైల్‌ ‌డేటాను సేకరించి, వాస్తవాలను నిర్ధారించేందుకు అతడిని నిపుణుల వద్దకు తీసుకువెళ్లవలసి ఉంటుందని పోలీసులు చెప్పడం గమనార్హం. అతడిని వదిలి పెడితే, ఆధారాలను తారు మారు చేసే అవకాశం ఉందని వారంటున్నారు.

తాజాగా అతిషీకి సమన్లు

తాజాగా, మే 28న ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు మంత్రి, ఆప్‌ ‌నాయకురాలు అయిన అతిషీకి పరువు నష్టం దావాలో సమన్లు జారీచేసింది. ఆప్‌ ‌నాయకులు బీజేపీలో చేరేందుకు 20-30 కోట్ల రూపాయలను ఇవ్వచూపుతూ తమ దగ్గరకు వచ్చారన్న ఆరోపణలకు ప్రతిగా ఢిల్లీ బీజేపీ మీడియా అధిపతి ప్రవీణ్‌ ‌శంకర్‌ ‌వేసిన పరువు నష్టం కేసులో ఆమె జూన్‌ 29‌న కోర్టులో హాజరుకావలసిందిగా పేర్కొంది. తమ శాసనసభ్యులను వలవేసి పట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తునదని, అందుకు లంచం కూడా ఇవ్వచూపిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది.

ఈ ఆరోపణలు తన పార్టీ ప్రతిష్ఠను, తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయంటూ వేసిన కేసుకు స్పందిస్తూ, అతిషీని దోషిగా గుర్తించి సమన్లు జారీ చేసింది. కేవలం ఆమే కాకుండా, ఒక్కొక్కరికీ 25 కోట్లు ఇస్తామంటూ  బీజేపీ ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిందంటూ ఆప్‌ అధినేత అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌సోషల్‌ ‌మీడియాలో చేసిన పోస్ట్‌ను కూడా పేర్కొన్నారు.

రాజ్యాంగం చదవాలి

ఆప్‌ ‌సహా ప్రతిపక్షాలు అన్నీ కూడా ప్రధాని మోదీ ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఈ ఆరోపణలు చేస్తున్నవారంతా దేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని సరిగ్గా చదవడం మంచిదంటూ సూచించారు. ఎవరు జైలుకు వెడతారన్న విషయాన్ని ప్రధాని మోదీనే నిర్ణయిస్తారంటూ కేజ్రీవాల్‌ ‌చేసిన ఆరోపణలకు స్పందిస్తూ, వారు రాజ్యాంగాన్ని, చట్టాన్ని సరిగ్గా చదివితే తాను ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం ఉండదు అంటూ మోదీ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ ‌మంజూరు చేసిన తర్వాత, తన ప్రచారంలో భాగంగా ఆయన బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్రంగా ధ్వజమెత్తారు

About Author

By editor

Twitter
YOUTUBE