‌ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం రేపాయి. మూడురోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రవాదులు పంజా విసిరారు. మూడు దాడుల లక్ష్యం ఒక్కటే. ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోకి వచ్చి అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారన్న సత్యానికి భిన్నంగా కశ్మీర్‌ ‌సవ్యంగా లేదు అని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో ఉగ్రవాదులు పెద్ద ప్రణాళికే వేశారు. జూన్‌ 9‌వ తేదీ సాయంత్రం అందరి దృష్టి రాష్ట్రపతి భవన్‌ ‌మీదే నిలిచిన సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఒక్కసారి అలజడి మొదలైంది. మోదీ ప్రమాణ స్వీకారం వీక్షించిన వెంటనే వెలువడిన దాడులకు సంబంధించిన వార్తలు దేశ ప్రజలను నివ్వెరపరిచాయి. అవి మూడు రోజుల పాటు ఆగలేదు.

జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో పాకిస్తాన్‌ ‌సరిహద్దుకు దగ్గరలో శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తుతున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జూన్‌ 9‌న మెరుపుదాడి చేశారు. 9 మంది మరణించగా.. 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు 30 నుండి 40 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్‌ ‌బస్సు డ్రైవర్‌ను తాకింది. అప్రమత్తమైన కండక్టర్‌ ‌స్టీరింగ్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. ఉగ్రవాదులు ఆయనపై కూడా కాల్పులకు జరపడంలో బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. అయినా ఉగ్రవాదులు దాడి ఆపలేదు. ఉగ్రవాదులు ఇద్దరూ పాక్‌క• చెందినవారని అధికారులు చెబుతున్నారు.

‘ముఖాలకు మాస్కులు పెట్టుకొని ఉన్న ఆరేడుగురు తీవ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. తొలుత అన్ని వైపులా కాల్పులు జరిపిన ముష్కరులు బస్సు లోయలో పడగానే అటుగా వచ్చి మళ్లీ కాల్పులు కొనసాగించారు. ఆ సమయంలో తాము చనిపోయి నట్లు నమ్మించేందుకు మౌనంగా ఉండిపోయాం. ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్లడమే ముఖ్యమని అనుకున్నాం. ఓ పది, పదిహేను నిమిషాల తర్వాత స్థానికులు, పోలీసులు వచ్చి మమ్మల్ని కాపాడారు’ అని ప్రాణాలతో బయటపడిన బాధితులు మీడియాకు వెల్లడించారు. యాత్రికులంతా ఢిల్లీ, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌రాజస్థాన్‌ ‌రాష్ట్రాలకు చెందిన వారు.

గ్రామస్థులపై దాడి

జూన్‌10‌వ తేదీన కథువా జిల్లాలోని హీరానగర్‌ ‌సెక్టార్‌లోని సైదా సుఖ్‌వాల్‌ అనే గ్రామంలోకి ఇద్దరు ఉగ్రవాదులు సర్పంచ్‌ (‌ప్రధాన్‌) ఇం‌ట్లోకి తలుపులు బద్దలు కొట్టి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సర్పంచ్‌ను కాపాడుకునేందుకు వచ్చారు. ఈ అలజడికి ఉగ్రవాదులు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలోనే పోలీసులు, పారామిలిటరీ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన కూంబింగ్‌లో రెండో ఉగ్రవాది కూడా మరణించాడు. ఉగ్రవాదులు రాకముందే అదే గ్రామంలో ఒక మెడికల్‌ ‌షాపు యజమాని అమర్‌జీత్‌ ‌సింగ్‌ను ఎవరో గొంతు కోసి చంపారు. ఇది ఉగ్రవాదులే పనే అని అనమానాలు వ్యక్తమ య్యాయి. ఈ ఘటనకు ముందు ఉగ్రవాదులు పలు ఇళ్లకు వెళ్లి తాగేందుకు నీరు అడిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తమ కదలికలపై గ్రామస్థులకు అనుమానం వచ్చిందని గ్రహించి దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

చెక్‌పోస్టుపై దాడి

ఆ తర్వాత జూన్‌ 11 ‌న దోడా జిల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెక్‌పోస్టు మీద ఉగ్రవాదులు విరుచుకు పడ్డారు భదర్వా-పఠాన్‌కోట్‌ ‌రహదారి సమీపంలోని ఈ తాత్కాలిక చెక్‌పోస్టు మీద అర్ధరాత్రి వేళ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తమ తుపాకులకు పని చెప్పారు. ఈ ఘటనలో ఒక జవాను గాయపడగా, ఒక ఉగ్రవాదిని మట్టు పెట్టారు. మిగతా ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వరుస ఘటనలు అందరినీ కలవరానికి గురి చేశాయి కశ్మీర్‌లోయకే పరిమితమై ఉగ్రవాద దాడులు జమ్మూకు విస్తరించాయి. వాస్తవానికి పూంఛ్‌, ‌రాజౌరీ ప్రాంతాలతో పోలిస్తే రియాసీలో ఉగ్ర ఘటనల తీవ్రత తక్కువ. ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజా విసరడం ఆందోళన రేకెత్తిస్తోంది.

దాడి చేసింది ఎవరు?

మొదటి దాడి యాత్రీకులపైన, రెండోది పౌరుల మీద, మూడోది సైన్యంపై సాగాయి. ఇవి ఆకస్మికంగా కాక, ప్రణాళిక ప్రకారం జరిగినవని గమనించవచ్చు. పాకిస్తాన్‌ ‌కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కర్‌-ఎ-‌తాయిబాకు చెందిన విదేశీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని బలగాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. రియాసీలో దాడి తమ పనేనని పాకిస్తాన్‌కు చెందిన లష్కర్‌-ఎ-‌తాయిబా అనుబంధ ముష్కర మూక ‘ది రెసిస్టెన్స్ ‌ఫ్రంట్‌ (‌టీఆర్‌ఎఫ్‌)’ ‌తొలుత ప్రకటించింది. తర్వాత ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక బస్సుపై దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్‌ఎఫ్‌) ‌ప్రకటించుకుంది. ఇటువంటి మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్‌ ‌వరుస ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ‌వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. రియాసీ ఘటనలో కీలక నిందితుడి స్కెచ్‌ను పోలీసులు తయారు చేశారు. నిందితుడి ఆచూకీ వెల్లడిస్తే రూ.20 లక్షలు బహుమతిని ప్రకటించారు. ఉగ్రవాద కమాండర్‌ అబు హమ్జా రాజౌరిలో క్రియాశీల కంగా ఉన్నాడు. అబూ హంజా చిత్రం బయటపడింది. అతడి ఆచూకీ కోసం భద్రతా బలగాల సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌ ‌కొనసాగుతోంది.

ఉక్కుపాదం మోపండి: ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌ 13‌న సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ‌డోభాల్‌, ‌జమ్మూ-కశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌సిన్హాలతో మాట్లాడారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు. స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను సిన్హా ప్రధానికి తెలిపారు. సైన్యం ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించు కొని ఉగ్రవాదులను అణచివేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్‌ 29‌నుంచి అమర్‌నాథ్‌ ‌యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లనూ షా సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారాన్ని జమ్మూకశ్మీర్‌ ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హా ప్రకటించారు.

బాధ్యత లేని విపక్షం

ఉగ్రవాద ఘటనలు జరిగిన సందర్భంలో రాజకీయా లకు అతీతంగా అధికార విపక్షాలతో పాటు దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలవాలి. దురదృష్టవశాత్తు జమ్మూకశ్మీర్‌ ‌ఘటనలకు విపక్షాలు రాజకీయం కోసం ఉపయోగించు కుంటున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతిస్థాపన, ఉగ్రవాద నిర్మూలన ఉత్తదేనంటూ ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ ‌విమర్శిం చింది. రీయాసీ, కథువా, దోడాల్లో జరిగిన ఉగ్రదాడులు పరిస్థితిలో ఏ మార్పూరాలేదనడానికి నిదర్శనమని ఆరోపించింది. పదేళ్లుగా మోదీ చెబుతున్నదంతా అసత్యమని వ్యాఖ్యానించింది. ఇతర విపక్షాలు కూడా ఇదే తరహా విమర్శలు చేశాయి.

దాడుల లక్ష్యం ఏమిటి..?

జమ్మూకశ్మీర్‌లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు దేశ ప్రజలను మరోసారి ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతున్న సమయంలో, బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడటం వెనుక కారణం మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ ‌పరిస్థితుల్ని చక్కదిద్దలేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకేనని భావిస్తున్నారు. గతంలో కూడా ఉగ్రవాదులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించేందుకు ముహూర్తా లను ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ ‌క్లింటన్‌ ‌భారత పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు వచ్చారు. అంతకు ముందు రోజు అనంత్‌నాగ్‌ ‌జిల్లాలోని చిట్టిసింగ్‌ ‌పోరా గ్రామంలో ఉగ్రవాదులు 35 మంది సిక్కు యాత్రికులను కాల్చి చంపారు. ఇలా ఎన్నో!

ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌ను మిగతా దేశంలో అనుసంధానించేందుకు చేపట్టిన కార్యక్రమాలు చాలావరకూ సత్పలితాలు ఇచ్చాయి. సైన్యం ప్రణాళిక ప్రకారం ఉగ్రవాదులను మట్టుపెడుతూ వస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చేస్తున్న కృషి ఫలితంగా కశ్మీరీ యువత టెర్రరిజం నుంచి బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దాడులకు పాల్పడు తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన తర్వాత ఏదో ఒకటి చేయాలని భావించిన పాకిస్తాన్‌ ‌సరిగ్గా మోదీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.

పాకిస్తాన్‌ ‌ప్రమేయం

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ‌రద్దు తరువాత ఉగ్రవాద ఘటనలు ఆరవై శాతానికి పైగా తగ్గిపోయాయంటూ ఈ ఏడాది జనవరిలో హోం మంత్రి అమిత్‌షా చెప్పారు. రాళ్లురువ్వడం నుంచి కాల్పుల వరకూ వచ్చిన మార్పును హోంశాఖ కూడా వివరించింది. టెర్రరిజం తగ్గి టూరిజం పెరిగినందుకు ప్రధానమంత్రి తన ఎన్నికల సభలో సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌ ‌ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఓటు వేశారు. దాడులకు పాల్పడిన వారు స్థానిక ఉగ్రవాదులు కాదు. సరిహద్దు దాటివచ్చిన వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిఘావర్గాలు చెబుతు న్నాయి. యాత్రికులను లక్ష్యంగా చేసుకొని ఇటువంటి దారుణాలకు పాల్పడటం అత్యంత అరుదు. పర్యాటకాన్ని, తీర్థయాత్రలను దెబ్బతీసే ఇటువంటి ఘాతుకాలకు పాల్పడిన పక్షంలో, ఉపాధి దెబ్బతిని ప్రజలు తిరగబడతారని కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, వేర్పాటువాద సంస్థలకు తెలుసు. పాకిస్తా న్‌కు ఇవేమీ పట్టవు. కశ్మీర్‌తో పాటు భారత ప్రజలను భయోత్పాతంలో ముంచడం, శాంతిని భగ్నం చేసి తమ ఉనికిని చాటుకోవడం వారి లక్ష్యాలు.

ఓజీడబ్ల్యూ సహకారం

తినేది దేశ ప్రజల సొమ్ము. చేసేది దేశద్రోహం. వీరే ఓవర్‌ ‌గ్రౌండ్‌ ‌వర్కర్లు (ఓజీడబ్ల్యూ). జమ్మూ కశ్మీర్‌ ‌రాష్ట్రం ప్రభుత్వంలో ఉగ్రవాదుల సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గతంలో ఉగ్రవాద చర్యలు బాహటంగా జరిగేవి. ఇప్పుడు అదును చూసి చేస్తున్నారు. కశ్మీర్‌లో భద్రతాదళాలు చురుగ్గా పనిచేయడంతో ఉగ్రవాదుల ఆటలు అంతగా సాగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ ఉగ్రవాదులకు సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలపై జమ్మూకశ్మీర్‌ ‌ప్రభుత్వం ఇటీవలే నలుగురిని తొలగించింది. ఉగ్రవాదుల దాడులు గతంలో పోలిస్తే కాస్త భిన్నంగా జరుగుతున్నాయి. కొన్ని చిన్నచిన్న గ్రూపులు టార్గెటెడ్‌ ‌కిల్లింగ్స్ ‌చేపడుతు న్నాయి. వీరంతా బాగా శిక్షణ తీసుకుని ఉన్నారు. ‘జంగిల్‌ ‌వార్‌ఫేర్‌’‌లో ఆరితేరారు. అడవుల్లో రోజుల పాటు మకాంవేసి, గుహల్లో నివసిస్తూ అదును చూసి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. త్వరలో భారత సైన్యానికి కొత్త ప్రధాన అధికారి రాబోతు న్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ దశలో ఎన్నికల పక్రియకు ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో రియాసీ ఘటన జరగడం వెనుక ఐఎస్‌ఐ ‌పాత్ర లేదని అనుకోలేం. జమ్మూ కశ్మీర్‌లో తాను అనుకున్నది చేసుకుపోగలిగే అవకాశం భారత ప్రభుత్వానికి లేకుండా చేయడం ఈ దాడి ఉద్దేశం. లష్కరే తోయిబా ప్రకటన ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. భారత ప్రభుత్వం ఈ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది.

-క్రాంతి

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE