నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో కొలువుతీరిన ఎన్‌డియే ప్రభుత్వంలో ఆంధప్రదేశ్‌కు సముచిత స్థానం లభించింది. భారతీయ జనతా పార్టీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు, కూటమిలోని తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీలు కింజరపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రిపదవులు లభించాయి. కేంద్రంలో ఎన్‌డీఏ, రాష్ట్రంలో బీజేపీ, తెదేపా, జనసేన కూటమి ప్రభుత్వాలు ఏర్పడటంతో రాష్ట్ర ప్రగతి వేగం పుంజుకుంటుందని భావించవచ్చు.

వైసీపీ సర్కారు అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరగలేదు. అమరావతి ఆగిపోయింది. పోలవరం మొదలుకొని హంద్రీనీవా వరకు గల సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్‌లు, గృహనిర్మాణం, నీటి సరఫరా, రహదారుల నిర్మాణం ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆ ప్రభుత్వం నిలిపివేసింది.. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఏర్పడిన డబులింజన్‌ ‌సర్కారు ఈ అభివృద్ధిని తిరిగి ప్రారం భించనుంది. నూతనంగా పగ్గాలు చేపట్టిన కేంద్ర మంత్రులు అభివృద్ధిని వేగవంతం చేయనున్నారు.

ఏడేళ్ల తర్వాత పదవులు

రాష్ట్రానికి దాదాపు ఏడేళ్ల తర్వాత కేంద్రంలో మంత్రి పదవులు లభించాయి. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో విజయనగరం నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందిన సీనియర్‌ ‌నేత అశోకగజపతిరాజుకు కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన్‌ ‌శాఖ మంత్రి పదవి లభించింది. అప్పటి తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరికి కూడా కేంద్రంలో మంత్రి పదవి లభించింది. వారిద్దరితో పాటు బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పట్టాణాభివృద్ధిశాఖ మంత్రిగా కీలకమైన శాఖ మోదీ అప్పగించారు. ఆ తర్వాత రాష్ట్రానికి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయింది. 2019 ఎన్నికలకు ముందే కూటమిలో విభేదాలు తలెత్తడంతో టీడీపీ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడంతో రాష్ట్రంలో రెండు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ తొలిసారిగా రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంది. ఆ పార్టీ నుంచి 22 మంది ఎంపీలు గెలుపొందినప్పుటికీ కేంద్రంలోని బీజేపీ సొంత జలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, రాష్ట్ర ఎంపీల మద్దతు బీజేపీకి అవసరం లేకపోయింది. వైసీపీ అధినేత వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. బయటనుంచి మద్దతు మాత్రం ప్రకటించారు. దీంతో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేయడం రాష్ట్రం నుంచి కూటమి 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడంతో మరోసారి కేంద్రంలో టీడీపీ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే మోదీ మంత్రివర్గంలో తెలుగు దేశానికి రెండు పదవులు లభించాయి. బీజేపీకి కూడా ఒక మంత్రి పదవి లభించింది.

అంచలంచెలుగా శ్రీనివాసవర్మ

శ్రీనివాసవర్మ భీమవరం వాసి. విద్యావేత్త. బీజేపీ వర్మగా అందరికీ సుపరిచితులు. ఆయన తాతగారు భూపతిరాజు బాపిరాజు స్వాతంత్య్ర సమరయోధుడు. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివా సవర్మ చిన్ననాటి నుంచి సేవాభావం, నాయకత్వ లక్షణాలతో ముందడుగు వేశారు. 1990లో బీజేపీలో నిరంతరం శ్రమించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, జాతీయ కౌన్సిల్‌ ‌సభ్యుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంటు కన్వీనర్‌, ‌జిల్లా అధ్యక్షుడిగా, జోనల్‌ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2020లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితు లయ్యారు. భీమవరం ప్రాంతంలో పలు ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. బైపాస్‌ ‌రోడ్డులో రైల్వే గేటు సమస్యలను అప్పటి కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కొటికలపూడి గోవిందరావు నాయకత్వంలో పాలకమండలి సమష్టి కృషితో ఆ సమస్యను పరిష్కరించారు. భీమవరం పురపాలక మండలిలో 2014 నుంచి 2019 వరకు బీజేపీ పక్ష నాయకుడిగా వ్యవహరించారు. కేంద్ర నాయకులతో సన్నిహితంగా ఉంటూ పట్టణానికి వివిధ పథకాల ద్వారా నిధులు సాధించేలా కృషి చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా అధిష్టానం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ వచ్చారు. అందుకే బీజేపీ వర్మగా అందరికీ సుపరిచితులయ్యారు. పార్టీలో వివిధ పదవుల్లో పనిచేసిన ఆయన కేంద్ర కమిటీ నాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. సమస్యల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం భరోసా కల్పించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడంలో వర్మ ముందుండేవారు. భీమవరం రుచులు చూడాల్సిందేనంటూ పట్టుబట్టేవారు.

ఎన్నికలకు ముందు తెదేపా, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత నరసాపురం ఎంపీ స్థానం కీలకంగా మారింది. కూటమి నుంచి ఏ పార్టీ ఇక్కడ బరిలోకి దిగుతుందో అనే ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో అనూహ్యంగా బీజేపీ తన అభ్యర్థిగా శ్రీనివాసవర్మ పేరును తెరపైకి వచ్చింది. ఆయన నామినేషన్‌ ‌పత్రం దాఖలు చేసిన నాటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్లి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారానికి రాజమహేంద్రవరం వచ్చిన ప్రధాని మోదీ, ‘నీ పరిస్థితి ఏంటీ..’ అని వర్మను అడగగా, ‘గెలుస్తాను సార్‌..’ అని సమాధానం చెప్పారు.‘ గెలిచిరా.. నీకు ఏం చేయాలో అది చేస్తా..’ అని మోదీ హామీ ఇచ్చారు. హామీని మోదీ వెంటనే నెరవేర్చి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కేంద్ర సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ నియమితులైన సందర్భంగా ఢిల్లీలో జిల్లా పార్టీ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. భీమవరంలోని బీజేపీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన సతీమణి వే•ంకటేశ్వరిదేవి చేతుల మీదుగా కేక్‌ ‌కట్‌ ‌చేసి ఆమెకు గౌరవ సత్కారం చేసి వేడుకలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భాజపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

అతిపిన్నవయస్కుడు రామ్మోహన్‌నాయుడు

తండ్రి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ ‌నేత కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి శ్రీకాకుళం పార్లమెంట్‌ ‌సభ్యుడుగా మూడుసార్లు విజయం సాధించారు. నరేంద్రమోదీ మూడవ ప్రభుత్వంలో మంత్రిగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తాజా మంత్రి వర్గంలో ఆయనే అతి పిన్న వయస్కుడు. 2013లో జిల్లా అంతటా సైకిల్‌ ‌యాత్ర చేపట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్తేజం తెచ్చారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి తొలి దఫా పోటీచేసి అనూహ్య మెజార్టీతో గెలుపొందారు. అలాగే పార్లమెంట్‌లో శ్రీకాకుళం జిల్లా ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ.. తెలుగురాష్ట్రాల సమస్యలను కూడా పార్లమెంట్‌లో చర్చిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. 2019లో శ్రీకాకుళం పార్లమెంట్‌ ‌పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఓటమిచెందినా కొద్దిపాటి మెజార్టీతో రామ్మోహన్‌ ‌నాయుడు గెలుపును అందుకున్నారు. 2024 ఎన్నికల్లో జిల్లాలో గతంలో ఎవరికీ లభించనంతగా మెజార్టీతో ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడల్లా కేందప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు అత్యంత ప్రాధాన్యం లభిస్తూనే ఉంది. గతంలో ఎర్రన్నాయుడికి మంత్రి పదవి లభించింది. ఆ తర్వాత 2014లో విజయనగరం నుంచి అశోక్‌ ‌గజపతిరాజు కేంద్రమంత్రి అయ్యారు. ఇప్పుడు రామ్మోహన్‌నాయుడికి అవకాశం ఇచ్చారు.

డాక్టర్‌ ‌నుంచి కేంద్ర మంత్రిగా..

తెనాలి తాలూకా బుర్రిపాలెం నివాసి పెమ్మసాని చంద్రశేఖర్‌ ‌గుంటూరు ఎంపీగా తొలిదఫాలోనే గెలిచి కేంద్రమంత్రి పదవిని అందుకున్నారు. ఆయన వైద్యుడిగా అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదిగారు. తెదేపా ఎన్నారై విభాగంలో పనిచేశారు. జన్మభూమిపై మమకారంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రానికి వచ్చారు. తెదేపా తరపున గుంటూరు నుంచి మొదటిసారి పోటీచేసి గెలిచారు. లోక్‌సభ•లో అత్యంత సంపన్నుడైన ఎంపీ (రూ.5,700 కోట్లు) ఈయనే కావడం విశేషం. మోడీ కేబినెట్లో అనూహ్యంగా సహాయ మంత్రిగా చోటు సంపాదిం చారు.

1996-98 నడుమ కేంద్రంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ ‌కేబినెట్‌లో నాటి తెదేపా బాపట్ల ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రిగా పనిచేశారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత తెదేపా ఎంపీగా పెమ్మసానికి మంత్రి పదవి దక్కింది. ఆయన రాజధాని ప్రాంతం నుంచి ఎంపీగా గెలుపొందడం కూడా ఈ పదవి రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు.. రాజధాని అమరావతి పునరుజ్జీవంపై దృష్టి సారించారు. మోదీ కేబినెట్లో రాజధాని ప్రాంత ఎంపీ ఉంటే ఢిల్లీ నుంచి సాయం పొందడం సులువవుతుందని భావించారు. పెమ్మసానికి మంత్రి పదవి దక్కడంపై రాజధాని రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. పెమ్మసాని తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. సాంబశివరావు వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. తెదేపా ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా పనిచేశారు. చంద్రశేఖర్‌ ఎం‌సెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ ‌కళాశాలలో ఎంబీబీఎస్‌ ‌సీటు సాధించారు. అమెరికా పెన్సిల్వేనియాలో పీజీ పూర్తి చేశారు. జాన్స్ ‌హాప్కిన్స్ ‌వర్సిటీ, సినాయ్‌ ‌హాస్పిటల్లో డాక్టర్గా పనిచేశారు. అమెరికాలో లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యూ వరల్డ్’ ‌పేరుతో ఆన్లైన్‌ ‌శిక్షణ సంస్థను స్థాపించారు. తొలి నుంచి తెదేపాతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్‌ ఎన్నారై విభాగం తరపున క్రియాశీలంగా వ్యవహ రించారు. ఆయన భార్య డాక్టర్‌ శ్రీ‌రత్న, వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

-టిఎన్‌. ‌భూషణ్‌

‌వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE