ఎనిమిది లోక్‌సభ స్థానాలు సాధించిన తెలంగాణకు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రెండు కీలక పదవులు దక్కాయి. అసెంబ్లీ ఎన్నికలలో దగా పడిన బీజేపీ లోక్‌సభ ఎన్నికలలో మాత్రం తనదైన దూకుడును ప్రదర్శించి మంచి మెజారిటీలతో ఎనిమిది మంది సభ్యులను గెలిపించుకుంది. అసెంబ్లీకి 8, లోక్‌సభకు 8 వచ్చే అసెంబ్లీలో 88 అంటూ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి వెంటనే వ్యాఖ్యానించారు కూడా.

 కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను  ప్రధాని నరేంద్ర మోదీ కిషన్‌రెడ్డికి కేటాయించారు. శాంతి భద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ ‌కుమార్‌ను  నియమించారు. కాగా, దేశ అభివృద్ధిలో బొగ్గు ఉత్పత్తి కీలకంగా మారడం, సింగరేణి వంటి సంస్థలు ఇక్కడే కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించడం రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదపడుతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ శాఖ తెలుగువారికి దక్కడం మూడోసారి. గతంలో సినీ ప్రముఖుడు దాసరి నారాయణరావు  కూడా  ఈ శాఖలో పనిచేశారు. తొలుత 2004లో సహాయమంత్రి హోదాలో ఈ శాఖను నిర్వహించగా, ఆ తర్వాత ఇండిపెండెంట్‌ ‌మంత్రిగా వ్యవహరించారు. అయితే ఆయన రాజ్యసభ సభ్యుడిగా కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ప్రాంతం నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌కూడా బొగ్గు గనుల శాఖ సహాయమంత్రిగా వ్యవహరించారు. 2024లో మళ్లీ కిషన్‌రెడ్డిని అదే శాఖ వరించింది.

కిషన్‌రెడ్డి మోదీ 2.0 ప్రభుత్వంలో తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు పర్యాటక-సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కేబినెట్‌ ‌హోదా కల్పించారు. కిషన్‌రెడ్డికి మంత్రివర్గంలో వరసగా స్థానం లభించడం ఆయన విధేయతకు, కష్టించే తత్వానికి మాత్రమే.

తెలంగాణలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వం బండి సంజయ్‌కు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ శాఖ కేబినెట్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా. నిజంగానే ఆయన మీద పెద్ద బాధ్యత ఉంది. ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్‌ ‌వైపు వెలెత్తి చూపడం ఇవాళ్టి నిజం. ఈ నేపథ్యంలో సంజయ్‌ ఈ ‌శాఖ మంత్రిగా నిర్వహించవలసిన బాధ్యతను అంచనా వేయవచ్చు.

బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్‌ ‌దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన పలు సందర్భాల్లో ఆయన పోలీసు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఒకటి రెండు సందర్భాల్లో ఎస్పీ స్థాయి అధికారులు ఆయనపై చేయి కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ ఘటనపై సంజయ్‌ ‌లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా.. సదరు అధికారి ప్రివిలేజ్‌ ‌కమిటీ ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. సంజయ్‌కి హోంశాఖ సహాయమంత్రి పదవిని కేటాయిస్తే.. రాష్ట్ర పోలీసులు మునుపటిలా ఆయన విషయంలో దురుసుగా ప్రవర్తించే అవకాశా లుండవనే అనుకోవాలి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలోను బీజేపీ నేతలకు నల్లేరు మీద నడక కాబోదు. ఆ పార్టీ కూడా బీజేపీ పట్ల కక్షపూరితంగానే వ్యవహ రిస్తుందంటే కొట్టి పారేయలేం. కాగా, గతంలో బీజేపీ సీనియర్‌ ‌నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ ‌సీహెచ్‌ ‌విద్యాసాగర్‌రావు 1999లో అటల్‌ ‌బిహారీ వాజపేయి కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహా యమంత్రి పదవిని చేపట్టారు. మోదీ 2.0లో కిషన్‌ ‌రెడ్డి కూడా తొలుత ఈ శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా బండి సంజయ్‌కి దక్కడంతో గడచిన రెండున్నర దశాబ్దాల్లో తెలంగాణ వ్యక్తులకు ఈ శాఖ మూడోసారి దక్కినట్లయింది.

ఇద్దరు కేంద్ర మంత్రులకు తెలంగాణ ప్రజలు, బీజేపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు అభినందనలతో ముంచెత్తారు. ఇద్దరూ కష్టపడి పార్టీని నిలబెట్టినవారే. ఇద్దరూ విధేయులే. అధిష్ఠానం రాష్ట్ర నాయకులకు ఇస్తున్న ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE