ఇండీ కూటమి వస్తే దేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేస్తారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యకు విపక్షాలు మండిపడ్డాయి. కానీ వాస్తవం అది కాదు అని చెప్పడానికి అవకాశాలు లేవు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మార్కు రాజకీయం, రిజర్వేషన్‌లు ఇదే చెబుతున్నాయి. అంటే మోదీ చెప్పినట్టు ఇండీ కూటమి మాత్రమే కాదు, దానితో అంటీముట్టనట్టు ఉంటున్న ఇతర భాగస్వాములు కూడా హిందువులకు అదే గతి పట్టిస్తారు. కొత్త రిజర్వేషన్‌లలో హిందూధర్మంలోని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలు వెనక్కి పోయి, ముస్లింలు ముందుకు వస్తున్నారు. కానీ ఇది రాజ్యాంగం అంగీకరించదు. అయినా మూర్ఖంగానే విపక్షాలు బుజ్జగింపునే పట్టుకు వేలాడుతున్నాయి. బెంగాల్ ఓబీసీ వ్యవహారమే ఇందుకు గొప్ప ఉదాహరణ.
రాజ్యాంగం అంగీకరించదు కాబట్టి బెంగాల్ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన ఓబీసీ సౌకర్యాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు చెంపపెట్టులాంటి తీర్పు ఇది. ఇలాంటి తీర్పులే దేశమంతటా వచ్చినా విపక్షాలు ముస్లింలను మోసగిస్తూనే ఉన్నాయి. ముస్లిం వర్గాలు కూడా గుడ్డిగా వారినే విశ్వసిస్తున్నాయి. ఆ క్రమం ఏమిటో చూద్దాం. పశ్చిమ బెంగాల్‌లో 77 ఉప కులాలకు కల్పించిన వెసులుబాటు చట్ట విరుద్ధం అని ప్రకటించింది కలకత్తా హైకోర్టు. దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ముస్లింలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేయడం ద్వారా మమతా బెనర్జీ సంతుష్టీకరణ విధానాలను ఎండగట్టింది న్యాయస్థానం. దేశ వ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్, ఇండీ కూటమి పక్షాలకు కూడా ఇదొక హెచ్చరిక. మీరు ముస్లింలను రాజకీయ పరికరాలుగా ఉపయోగించుకుంటున్నారు అని సాక్షాత్తు కోర్టు అభిశంసించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వీ మోడల్‌ను అనుసరిస్తున్నారు. అవే వికాస్ (అభివృద్ధి), విశ్వాస్ (నమ్మకం), వ్యాపార్ (వ్యాపారం). మమతా బెనర్జీ మాత్రం 3టీ విధానాన్ని పాటిస్తారు. అవే తానాషాహి (నియంతృత్వం), టోలాబాజీ (డబ్బులు గుంజడం), తుష్టీకరణ్ (సంతుష్టీకరణ). కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా ఇటీవల బెంగాల్‌లో ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మన దేశంలో సంతుష్టీకరణ రాజకీయాలు చేసే నాయకులకు బహుమతులు ఇస్తే మొదటి స్థానం కచ్చితంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే ఇవ్వక తప్పదు. ఇతర పార్టీలు ఓట్ల కోసం మైనారిటీలను దువ్వినా, బహిరంగంగా అంగీక రించేందుకు ఇష్టపడరు. గుట్టుగానే వారి సంబంధాలు కొనసాగిస్తారు. కానీ మమత దీదీ మాత్రం అంతా బహిరంగమే. కొద్ది సంవత్సరాల క్రితం ‘శ్రీరామ నవమి ఉత్సవాలను జరగనివ్వను.. మొహర్రం రోజున దుర్గాపూజ చేయడానికి వీలులేదు.. దీనిని ముస్లిం సంతుష్టీకరణ అని మీరు అనుకుంటే నా జీవితమంతా ఇదే విధానాన్ని అనుసరిస్తా..’ అన్నారు మమతా బెనర్జీ. భౌగోళికంగా పశ్చిమ బెంగాల్ చాలా సమస్యాత్మక ప్రాంతం. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో పశ్చిమ బెంగాల్‌లోకి చొరబాట్లు కొనసాగుతుంటాయి. గతంలో రాష్ట్రాన్ని పాలించిన వామపక్షాలు తమ ఓటు బ్యాంకు కోసం చొరబాట్లను ప్రోత్సహించాయి. ఈ విధానాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి అందులో ఛాంపియన్‌గా నిలిచారు మమతా బెనర్జీ.
దొడ్డి దారిలో రిజర్వేషన్లు
బెంగాల్‌లో ముస్లింలను మరింత ప్రసన్నం చేసుకోవాలని వారికి ఎలాగైనా రిజర్వేషన్లు కల్పించాలని గతంలో అధికారంలో ఉన్న బుద్దదేవ్ భట్టాచార్య నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగపరమైన చిక్కులు వస్తాయని భావించి వారిని దొడ్డి దారిన ఓబీసీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ ఉపేన్ బిస్వాస్ సారథ్యంలో బీసీ కమిషన్‌ను నియమించారు. ఆ సమయంలో రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వంపై వ్యతిరేకత పతాక స్థాయిలో చేరింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. దీంతో 2010లో కమిషన్ నివేదిక రాకముందే మధ్యంతర నివేదిక ఆధారంగా కమ్యూనిస్టు ప్రభుత్వం 77 ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చింది. వారికి సర్టిఫికెట్లు జారీ చేసింది. కొద్ది కాలానికే ఎన్నికల్లో వామపక్ష ప్రభుత్వం ఓడిపోయి, మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. 2011 సంవత్సరంలో అధికారంలోకి రాగానే ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది మమతా బెనర్జీ. బీసీ కమిషన్ సమగ్ర నివేదిక రాకముందే ఓబీసీ జాబితాను ఆమోదించి 2012లో చట్టంగా మార్చింది. మరో 37 వర్గాలను ఓబీసీలుగా గుర్తించింది. అంటే మొత్తం 114 వర్గాలకు ఓబీసీ కోటా రిజర్వేషన్లు చేరుకున్నాయి. మొత్తం ఓబీసీ రిజర్వేషన్ల శాతం 7 నుంచి 17 శాతానికి చేరింది. ఈ సర్టిఫికెట్లు అడ్డం పెట్టుకొని లక్షలాది మంది విద్య, ఉద్యోగ అవకాశాలను పొందారు. దీన్ని సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానం తలుపులు తట్టారు.
కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు బాంబులా పేలింది. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉప కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథా నేతృత్యంలోని కలకత్తా హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది.
2012లో చేసిన చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కులాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతాన్ని ఏకైక ప్రామాణికంగా పరిగణించారని వ్యాఖ్యానించింది. 77 తరగతుల ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా ఎంపికచేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది. ‘ఈ సమాజాన్ని (ముస్లింలు) రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారు’ అంటూ ధర్మాసనం చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
2011లో టీఎంసీ అధికారంలోకి రాగానే బీసీ కమిషన్ సమగ్ర నివేదిక రాకముందే ఓబీసీ జాబితాను ఆమోదించి చట్టంగా మార్చేసిందని పిటిషనర్ ఆరోపించారు. దీనివల్లే ఓబీసీ జాబితాలో లోటు పాట్లు జరిగాయని హైకోర్టు బెంచ్ ఎదుట వాదన వినిపించారు. దీనివల్ల అసలైన ఓబీసీలకు అన్యాయం జరిగిందన్నారు. దీంతో 2010 ఏప్రిల్ – సెప్టెంబరు మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను, 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలో 2010 తరవాత ఓబీసీలుగా వర్గీకరణ పొందినవారు 5 లక్షల వరకు ఉంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ, వారు యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే 2010కి ముందు రాష్ట్ర ప్రభుత్వం 66 కులాలను ఓబీసీలుగా వర్గీకరించడాన్ని ఎవరూ సవాలు చేయనందున అందులో తాము జోక్యం చేసుకోవడం లేదని న్యాయస్థానం తెలిపింది. ఓబీసీల రిజర్వేషను శాతాన్ని 7 నుంచి 17 శాతానికి పెంచుతూ 2010 సెప్టెంబరులో జారీ చేసిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం కొట్టివేసింది. ఈ తీర్పుపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.
బెంగాల్ బీసీ కమిషన్ చట్టం-1993 ప్రకారం ఓబీసీల కొత్త జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త జాబితాను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలని నిర్దేశించింది.
2010 సంవత్సరం తర్వాత రాష్ట్ర సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు 1993 చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఓబీసీ జాబితాను సమీక్షించి చేరికలు, తొలగింపులపై సిఫార్సులతో శాసనసభకు నివేదిక ఇవ్వాలని, బీసీ కమిషన్‌తోనూ సంప్రదింపులు జరపాలని పశ్చిమబెంగాల్ బీసీ సంక్షేమ విభాగానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టుకు పోతాం: మమత
కలకత్తా హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. దీనిని వ్యక్తీకరించిన తీరు కూడా అత్యంత రాజ్యాంగ విరుద్ధంగానే ఉంది. ‘ఓబీసీ రిజర్వేషన్ల జాబితాను అప్పట్లో రూపొందించింది నేను కాదు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉపేన్ బిస్వాస్ సారథ్యంలోని కమిటీ ఆ లిస్టును తయారు చేసింది. ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చాం. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నింది. ఈ తీర్పును మేం అంగీకరింబోం. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయి’ అని మమతా స్పష్టంచేశారు. సర్వోన్నత న్యాయ స్థానంలో సవాలు చేస్తామని ప్రకటించారు. హైకోర్టు న్యాయమూర్తుల మీద కూడా ఆమె విరుచుకుపడ్డారు. ‘ఒక జడ్జి నేను ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తిని అంటుంటే, మరొకరు బీజేపీలో చేరారు’ అని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
కలకత్తా హైకోర్టు 77 ముస్లిం ఉపకులాల ఓబీసీ హోదాను రద్దుచేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. ‘ముస్లిం అనే పదాన్ని నేను వాడినప్పుడల్లా మతపరమైన ప్రకటనలు చేస్తున్నానని ఆరోపించారు. వాస్తవాలు ప్రజల ముందుంచడం ద్వారా విపక్షాల ఓటుబ్యాంకు రాజకీయాలను బహిర్గతం చేయడమే నేను చేసిన పని’ అన్నారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖండించారు.
కనువిప్పు కలగాలి
స్వాతంత్య్రానికి పూర్వం ముస్లింలీగ్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోసం వాదించేది. ఈ వేర్పాటువాద భావజాలమే దేశ విభజనకు కారణమైంది. అప్పుడా బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పదే పదే ముస్లింలకు రిజర్వేషన్ల మీద మాట్లాడుతోంది. ఓటు బ్యాంకు సంతుష్టీకరణ రాజకీయాల కోసం సమాజంలో చిచ్చుపెట్టి సామాజిక సమరతను దెబ్బ తీస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ‘ఈ దేశ వనరులపై ముస్లింలకు మొదటి హక్కు ఉండాలి’ అని గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు తేగా హైకోర్టు కొట్టేసింది. దీంతో దొడ్డి దారిలో వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనే కుట్రకు తెర లేపారు కాంగ్రెస్ నాయకులు.
ఇప్పటికే రిజర్వేషన్ల జాబితాలో ఉన్న బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోటాను తగ్గించి ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసమే వారిని ఓబీసీల జాబితాలో చేరుస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో చేర్చి రిజర్వేషన్లు కల్పించింది. ఇండీ కూటమిలోని ఇతర పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిలకు రిజర్వేషర్లు ఇవ్వాలంటున్నాయి. మమతా బెనర్జీ తరహాలోనే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ ఈ వాదనను బలంగా వినిపిస్తున్నాయి. హిందువుల న్యాయమైన డిమాండ్లను, రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్‌తో పాటు ఇండీ కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని, త్రిపుల్ తలాక్ రద్దును, ఆర్టికల్ 370 రద్దును, ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నారు. వీటన్నింటిలో కూడా మత కోణాన్ని మాత్రమే చూస్తున్నారు. ఇలాంటి సంతుష్టీకరణ విధానాలు ఆ పార్టీలకు మాత్రమే కాదు దేశానికి కూడా ప్రమాదకరమని గ్రహించాలి. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఈ పార్టీలకు కనువిప్పు కలిగించాలని కోరుకుందాం.
-క్రాంతి