బీజేపీ తన గమనాన్ని, నడతను సరి చేసుకోవలసిన అవసరాన్ని లోక్‌సభ 2024 ఎన్నికల ఫలితాలు సూచించాయి. అనేక కారణాల వల్ల వారికి తగినంత అనుకూలంగా ఫలితం రాలేదు. అయితే పార్టీకి తన లోటుపాట్లను అంగీకరించే నిజాయతీ ఉండటం, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు అంగీకరించడం ప్రశంసించవలసిన విషయం. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ కార్యకర్తలకు, అనేకమంది నాయకులకు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక రియాలిటీ చెక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ 400+ నినాదం తమకు లక్ష్యమని, ప్రతిపక్షాలకు సవాలు అనే విషయాన్ని వారు గుర్తించలేదు. క్షేత్ర స్థాయిలో కష్టించి పనిచేసి లక్ష్యాలను సాధించినప్పటికీ సోషల్ మీడియాపై పోస్టర్లను, సెల్ఫీలను పంచుకోలేదు. మోదీ కాంతిలో ప్రకాశాన్ని అనుభవిస్తూ తమ లోకంలో తాముండటం వల్ల వారు వీధులలో ఎలుగెత్తుతున్న గొంతుకలను వినలేదు. నేను ముందస్తుగానే విశ్లేషిస్తున్నాను. ఈ ఎన్నికలలో సంక్లిష్టమైన ఫలితాల నుంచి నేర్చుకోవలసిన అనేక పాఠాలు కూడా ఉన్నాయి.
ఈ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ కోసం ఆర్‌ఎస్‌ఎస్ పని చేయలేదన్న అపోహ లేదా పరోక్ష నిందను నేను మొదటగా ప్రస్తావించాలి. సూటిగా చెప్పాలంటే, ఆర్‌ఎస్‌ఎస్ అనేది బీజేపి క్షేత్రస్థాయి శక్తి లేదా దళం కాదు. నిజానికి, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి తనదైన కార్యకర్తలు ఉన్నారు. ఓటర్లను చేరుకోవడం, పార్టీ అజెండాను వివరించడం, తత్సంబంధిత సాహిత్యాన్ని, ఓటరు కార్డు తదితరాలను పంచే రొటీను ఎన్నికల పని దానిదే. ఆర్‌ఎస్‌ఎస్ దేశాన్ని, పౌరులను ప్రభావితం చేసే సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఒక్క 1973-1977 కాలంలో మినహా, ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకోలేదు. అది అసాధారణమైన సమయం కావడంతో ప్రజాస్వామిక పునరుద్ధరణ కోసం అది పని చేసింది.
2014లో ‘నూరు శాతం ఓటింగ్’కు పిలుపిచ్చింది. ఈ ప్రచారం ఫలితంగా చెప్పుకోదగిన రీతిలో ఓటింగ్ శాతం పెరగడమే కాదు, ప్రభుత్వం/ పాలనలో కూడా మార్పు కనిపించింది. ఈసారి కూడా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఓటును ఒక విధిగా భావించి వెళ్లి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు 10-15 మందితో చిన్న స్థాయిలో స్థానిక, వీధి, భవన సముదాయాలు, కార్యాలయ స్థాయి సమావేశాలను నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. వాటిలో జాతి నిర్మాణం, జాతీయ సమగ్రత, జాతీయ శక్తులకు సమర్ధన వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. కేవలం ఢిల్లీలోనే అటువంటి సమావేశాలను 1,20,000 నిర్వహించారు. నేను ఆఖరుసారి వినే సమయానికి ముంబైలో 60,000 సమావేశాలు జరిగాయి. కనుక, ఎంత తక్కువ చేసి చెప్పినా అటువంటి సమావే శాలు 20 లక్షలకు పైగా నిర్వహించారని చెప్పవచ్చు.
అభ్యర్ధుల ఎంపికలో సమగ్ర విధానం
మోదీజీనే 543 స్థానాలలో పోటీ చేస్తారన్న భావనకు పరిమిత విలువే ఉంటుంది. స్థానిక నాయకులను, వారు చేసిన పనిని విస్మరించి అభ్యర్ధులను మార్చి, వేరొకరిని వారిపై రుద్దినప్పుడు, ఫిరాయింపుదారులకు ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు ప్రతిస్థానంలోనూ మోడీనే అన్న భావన స్వీయ పరాజయానికి దారి తీస్తుంది. ఆలస్యంగా వచ్చిన వారికి స్థానం కల్పించేందుకు బాగా పని చేస్తున్న పార్లమెంటేరియన్లను బలి చేయడం బాధపెడుతుంది. ఈసారి అభ్యర్ధులలో దాదాపు 25శాతం అభ్యర్ధులు వలుసపక్షులే. గత హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో 30శాతంమంది తిరుగుబాటు చేయడంతో బీజేపీ పరాజయం పాలైన అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఇది జరిగింది. స్థానిక సమస్యలు, అభ్యర్ధి ట్రాక్ రికార్డు ముఖ్యమైనవేనన్నది వాస్తవం. స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆసక్తి చూపకపోవడానికి ఇది కూడా ఒక కారణం.
అందుబాటులో లేని నేతలు
గత కొన్ని ఏళ్లుగా బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, సాధారణ పౌరుల ఫిర్యాదు ఏమిటంటే, మంత్రులను మరచిపొండి, తమ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను కలుసుకోవడం అత్యంత క్లిష్టం లేదా అసాధ్యం కావడం. తమ సమస్యల పట్ల స్పందన లేకపోవడం మరొక కోణం. బీజేపీ నుంచి ఎన్నికైన ఎంపీలు, మంత్రులూ ఎప్పుడూ ‘బిజీ’గా ఎందు కుంటారు? తమ నియోజక వర్గాలలో ఎందుకు కనిపించరు? సందేశాలకు స్పందించడం ఎందుకంత కష్టం? ఐదేళ్ల కాలంలో తన నియోజకవర్గంలో కనీసం మూడుసార్లు తీవ్రంగా పర్యటించిన ఎంపీలు ఎవరైనా ఉన్నారా అంటే, వారిని వేళ్లపైనే లెక్కించవచ్చు. హిందూ-సిక్కు సమైక్యతను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన సాంస్కృతిక సంస్థ ఎటువంటి అధికారిక కార్యాలయం, సిబ్బంది లేకుండా మూడేళ్ల తర్వాత ఏర్పాటైంది. మహారాష్ట్రలో గత బీజేపీ-శివసేన ప్రభుత్వం ఉన్న సమయంలో మంత్రి ‘బిజీ’గా ఉన్నందున ఇలా జరిగింది. కాగా, ఎంవీయే ప్రభుత్వం వచ్చిన వారంలోనే దానిని రద్దు చేయడం మరో విచిత్రం. మహాయుతి ప్రభుత్వం తిరిగి రావడంతో గత ఏడాదిగా ఆ బృందం నియామకం కోసం ఎదురు చూస్తోంది!
నిరంతరం ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక వేదికలపై వేగంగా స్పందించే నేతలు బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల హత్యలు జరిగినప్పుడు మాత్రం సాధారణంగా మౌనం పాటిస్తుంటారు. తన కార్యకర్తలను బీజేపీ నాయకత్వం పట్టించుకోదన్న భావన వేళ్లూనుకుంది. కాస్త స్పందించి, బహిరం గంగా వారికి మద్దతును చూపడం అంత క్లిష్టమైన పనా? రాముడిని, హిందూ ధర్మాన్ని నిరంతరం అవమానపరిచే వారికి ఎర్రతివాచీతో ఆహ్వానం లభిస్తుండగా, ఆమె కేవలం ‘హదీజ్’ను మాత్రమే ప్రస్తావించిందని నేను పదే పదే చెప్పినప్పటికీ, నూపుర్ శర్మ వంటి చిన్న వయసు నేతను బహి రంగంగా, కటువుగా నిందించారు. ఒకవేళ ఆమె తప్పు చేసిందనుకున్నా, మీకోసం ముందువరుసలో నిలబడే యోధులను అలాగేనా చూసేది? పశ్చిమ బెంగాల్, కర్నాటక, తమిళనాడు లేదా కేరళ వంటి క్లిష్టమైన యుద్ధక్షేత్రాలలో కార్యకర్తలు భద్రతా భావనతో ఎలా ఉండగలరు?
అనవసర రాజకీయం
అనవసరమైన రాజకీయాలకు, నివారించదగిన వ్యూహాలకు మంచి ఉదాహరణ మహారాష్ట్ర. ఒకపక్కన విడిపోయిన శివసేన, బీజేపీలకు తగినంత మెజారిటీ ఉన్నప్పటికీ అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఫ్యాక్షను బీజేపీలో చేరింది. ఇంటిలో గొడవల కారణంగా మరొక రెండు మూడేళ్లలో ఎన్సీపీ శక్తిని కోల్పోయి, శరద్‌పవార్ తెరపై నుంచి అదృశ్యమయ్యే వాడు. ఇటువంటి తప్పుడు అడుగు ఎలా వేశారు? ఇటువంటి కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడి, వేధింపులకు గురైన బీజేపీ మద్దతుదారులు ఈ పరిణామంతో బాధపడ్డారు. ఒక్క దెబ్బతో బీజేపీ తన బ్రాండ్ విలువను తగ్గించుకుంది. మహారాష్ట్రలో మొదటిస్థానంలో ఉండేందుకు ఏళ్ల తరబడి పోరాటం చేసిన తర్వాత అది కూడా ఎటువంటి తేడా లేకుండా మరొక రాజకీయ పార్టీ అయిపోయింది.
కాషాయ తీవ్రవాదం-హిందువులకు వేధింపులు అనే అబద్ధపు ప్రచారాన్ని చురుకుగా ప్రోత్సహించి, 26/11 ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర అని, ఆర్‌ఎస్‌ఎస్ ఒక తీవ్రవాద సంస్థ అనే ముద్ర వేసిన కాంగ్రెస్ నాయకులు తాము అంతకుముందు చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపాన్ని కానీ, తమ బాస్‌ల ఒత్తిడి కారణంగా అలా మాట్లాడమంటూ క్షమాపణను కానీ చెప్పకుండానే బీజేపీ నేతలుగా చేర్చుకోవడం పెద్ద తప్పు. ఇది బీజేపీ స్థాయిని తక్కువగా చూపడమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్ సాను భూతిపరులను తీవ్రంగా బాధపెడుతోంది. కేవలం బీజేపీ నాయకులు మాత్రమే నిజమైన రాజకీయాలను అర్థం చేసుకోగలరని, ఆర్‌ఎస్‌ఎస్ బంధువులు పల్లెటూరి బైతులనే తప్పుడు అహంకారం చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేయగలం? గత కొన్ని సంవత్సరాలలో నావంటి వ్యక్తులు కొన్ని ఆందోళనలను వ్యక్తం చేసినప్పుడు, ‘‘నువ్వు మరీ సున్నితంగా ఉన్నావు, అంతా బానే ఉంది,’ అంటూ వివిధ నాయకులు స్పందించారు. మరింత వినోదాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఏవో కొన్ని సమస్యలపై బీజేపీని మేం విమర్శించి నప్పుడు అత్యుత్సాహంతో కూడిన సోషల్ మీడియా యోధులు మా వంటి వారిని ట్రోల్ చేయడం.
వివిధ వర్గాలతో చర్చల ప్రాముఖ్యత
మోదీ 3.0 నుంచి ఆశిస్తున్నవి అంటూ నేను రాసిన గత వ్యాసంలో, సెమినార్ హాళ్లలో బాగా స్థిరపడిన వ్యక్తుల భావనలను రుద్దడం కాకుండా ప్రభుత్వ అధికారులు వివిధ వర్గాలతో, బృందాలతో చర్చించి, వారి ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఏమిటి అని తెలుసుకొని అమలు చేస్తే బాగుంటుందని సూచించాను. ఆ పంథాలోనే ప్రతిష్ఠాత్మక ఆలోచనలు కలిగి ఉన్న ఒక ఒక మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ చేపట్టిన పనికి నేను సాక్షిని. అతడు అటువంటి వందలాది సమావేశాలను నిర్వహించి, అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ మద్దతు లేక పోవడంతో చేతులు కాల్చుకున్నాడు. ఈ యత్నంలో అనేక సునిశిత విషయాలు తెలిశాయి. క్షేత్రస్థాయి లోని బీజేపీ కేడర్ ఈ పనిని తప్పనిసరిగా చేయగలదు. ప్రజలతో పునః అనుసంధానం కావడానికి, వారి నుంచి తెలుసుకుని, ప్రభుత్వానికి ఇన్‌పుట్లను అందించడానికి ఇది ఒక గొప్ప మార్గం. అటువంటి సంభాషణలు జరిగి ఉంటే నడతను మార్చుకోవడమే కాదు, భూసేకరణ చట్టాలు, వ్యవసాయ చట్టాలు, అగ్నివీర్ పథకం వంటి కీలక చట్టాలను చర్చల ద్వారా కాపాడుకొని ఉండేవారు.
హిందుత్వ
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా బీజేపీకి కేంద్ర ఇతివృత్తం హిందుత్వమే. దాని శ్రేయోభిలాషులను కలిపి ఉంచే జిగురు అది. జాతీయ పునరుద్ధరణకు దారి తీసే సాంస్కృతిక పునరుజ్జీవన ప్రాముఖ్యతను బాగానే అర్థం చేసుకున్నాం. వికాస్, విరాసత్ (వారసత్వం) అన్న మోదీజీ నినాదాలు దానికి సంకేతమే. ఈ చర్యలు, ధర్మం పట్ల సానుకూలత కారణంగా ఆధ్యాత్మిక, మతభావన పెరిగాయి. అయితే, మన సాంస్కృతిక జాతీయతావాదం దేనిపై ఆధారపడి ఉన్నదో దానికి సంబంధించిన కీలక అంశాలపై దృష్టి పెట్టలేదు. చర్చల్లో పాయింట్లు గెలుచుకున్నా, వాటిపై చర్య తీసుకోకపోవడం వల్ల ఎవరికీ మేలు జరుగదు.
ఈ విషయంపై కీలక ఓటర్ బేస్ చాలా విచారంగా ఉన్నది. ఉదాహరణకు, ధార్మిక జ్ఞాన వ్యవస్థలను లేదా విద్యను సెక్యులర్ ప్రభుత్వాలు పెంచి పోషించవు . ఆ పని హిందువులు చేయాలి. కానీ, హిందూ దేవాలయాలలో భక్తులు సమర్పించుకునే డబ్బు అంతా ప్రభుత్వాల వద్ద ఉంటుంది. హిందువులకు కంటి తుడుపుగా ఆ నిధులను వినియోగించి, ఎక్కువ నిధులను ఇతర సెక్యులర్, హిందువేతర ప్రయోజనాకు ప్రభుత్వం వినియోగి స్తుంది. కళ, సంస్కృతి, విద్య, పరిశ్రమలకు ఆలయాలను కేంద్రంగా చేయాలన్న ఆలోచన సాకారం కావాలంటే ముందుగా వాటిని ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలి.
– ఏళ్ల తరబడి విద్యా వ్యవస్థ, పాఠ్యపుస్తకాల గురించి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విమర్శల వర్షం కురిపించాయి. నూతన విద్యావిధానం రూపకల్పనే ఎక్కువ సమయం తీసుకుంది. దానిని ఇంకా అమలు చేయవలసి ఉంది. కానీ, సిబిఎస్‌ఇ పుస్తకాలను మార్చడం నుంచి బీజేపీని ఎవరు ఆపారు? కొత్త పాఠ్యపుస్తకాలను అందించడం ఆర్‌ఎస్‌ఎస్‌కు సాధ్యమవుతుందా? విచారకరమైన విషయం ఏమిటంటే, అదే వామపక్షవాదులు, సెక్యులరిస్టులు ఏడాది కింద వరకూ తమ బోర్డుల్లో ఉన్నారని ఎన్‌సిఆర్‌టి ఖరారు చేసింది. 2014 నుంచి ఒక తరం విద్యార్జన చేయడమే కాదు ఆ పక్షపాతపూరిత కథనంతో ప్రభావితమైంది.
– గోవును అక్రమ రవాణా చేసేవారికన్నా గోవును పరిరక్షించేవారు ఎక్కువమంది మరణిం చారు. వారి పట్ల ఎటువంటి సానుభూతి చూపలేదు.
– ఎఎస్‌ఐ ఆస్తులపై తప్పుదోవ పట్టించే బోర్డులను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మార్చలేక పోయింది. మొగలు కట్టడాలను పరిరక్షించి, సుందరీకరణ కోసం ఆగా ఖాన్ ఫౌండేషన్ నుంచి నిధులు అందుకుంది. కానీ ప్రాచీన హిందూ కోటలు, ఇతర కట్టడాలకు అంత అదృష్టం లేదు. చాలావరకూ అవి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
– ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఏ ఆస్తులనైనా కబ్జా చేసేందుకు వక్ఫ్ చట్టం ముస్లింలకు అనుమతిస్తుంది. ఈ భూకబ్జా చట్టాన్ని తాకను కూడా తాకకుండా అలా వదిలివేయడమే కాదు, దానిలో మార్పులు చేస్తారా, రద్దు చేస్తారా అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
విభజన రాజకీయాల నుంచి ముప్పు
విద్యా హక్కు చట్టంలో మైనార్టీలపై దానిని అమలు చేసేందుకు మినహాయింపును 93ఎ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. తమ వ్యవస్థలను కాపాడుకోవడానికి అనేకమంది హిందూ మార్గాన్ని వదిలిపెట్టారు. ఈ మినహాయింపును తొలగించడం అన్నది సెక్యులరేతర లేదా మతపరమైన చర్య అయ్యేది. అనేక అద్భుతమైన మైనార్టీ సంస్థలు కూడా పేదలకు సేవ చేయాలి.
అటువంటి అజెండాతో సమాజంలో విధ్వం సాన్ని సృష్టించాలని భావిస్తున్నారా అన్న విషయం గురించి కాంగ్రెస్, దాని స్నేహితులు ఆలోచించాలి. ఈసారి ఎన్నికలలో వారు రాణించారు. వారు అదే అజెండాని ముందుకు తీసుకువెళ్లడానికి ఇష్టపడతారు కానీ, దాని మూల్యం? వారు తిరిగి వివేకవంతమైన రాజకీయాలకు తిరిగి రావాలి. తర్కంతో, డేటాతో బీజేపీ వారిని తీవ్రంగా ఎదుర్కొనాలి. కార్టూన్లు గీయడం, మెమెలు సృష్టించడం అన్నది మంచి స్పందన కాదు. ఐటి సెల్‌ను పునర్వ్యవస్థీకరించి, పున:శిక్షణకు పంపవలసి ఉంది. కులం, మతం ఆధారంగా ప్రతిపక్షం ఆడుతున్న ఆటలకు స్పందన తగినంతగా లేదు.
1960ల నాటి భావనల వల్ల ఆర్ధిక అశాంతికి ఆస్కారం ఏర్పడింది. 1960ల నాటి కమ్యూనిస్టు నమూనా దాదాపు 11 కోట్లమంది అమాయక పౌరుల మరణానికి దారి తీసిందన్న విషయాన్ని మోదీజీ లేవనెత్తి, పట్టి చూపేవరకు గుర్తించలేదు. అది మేధోపరమైన అలసత్వమా?
బీజేపీని, హిందువులను ఫాసిస్టులుగా ముద్రవేసేందుకు అంతర్జాతీయ యత్నాలు, కృత్రిమ మేధస్సు నుంచి ముప్పు
ఈ ముప్పు కనిపిస్తున్నప్పటికీ, సానుకూల చర్యలు లేకపోవడమన్నది తీవ్రమైన సామాజిక సమస్యలకు దారి తీసింది. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన పది శాతం ఓట్లను, పెద్ద సంఖ్యలో సీట్లను కూడా బీజేపీ కోల్పోవడమే కాదు, తన పట్ల అనుమానాలు తలెత్తడాన్ని కూడా ఎదుర్కొంది. సామాజిక వేదికలు, ఎన్నికల వేదికలపై ఖండనలు సరిపోవు. దీనికి గంభీరమైన ప్రతిస్పందన ఉండాలి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారనే తప్పుడు వార్తలను మొత్తం ఎన్నికల సమయంలో ప్రచారం చేసినటువంటి వ్యక్తులను బీజేపీ తక్షణమే కోర్టుకు లాగాలి. ప్రతిపక్షం కూడా ఇది రెండువైపులా పదనున్న కత్తి అని, అది తమను కూడా గాయపరచగలదనే విషయాన్ని గుర్తించాలి. అది మన సమాజాన్ని, దేశాన్ని తప్పనిసరిగా బాధపెడుతుంది. ఎఐ ఉత్పత్తి చేసిన తప్పుడు/ అబద్ధపు కథనాలను, ఫేక్ వీడియోలను, తప్పుడు వార్తలపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ప్రత్యామ్నాయంగా ఈ దేశానికి, రాజ్యాంగానికి తామే కస్టోడియన్లమని ప్రతిపక్షం భావిస్తే, అది అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఇటువంటి విధ్వంసక పద్ధతులను మానుకోవాలి. ఈ కొత్త సవాళ్లకు బీజేపీ ఎంత చురుకుగా సమాధాన మిస్తోందో చూస్తున్నాం. తమ లోటుపాట్లను అంగీకరించి, దిద్దుబాటు చర్యలు తీసుకునే నిజాయితీ బీజేపీకి ఉంది. అందువల్లనే ఎన్నో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొని అది ఉన్న చోటుకు చేరుకో గలిగింది. ఈ తాత్కాలిక వైఫల్యాన్ని కూడా అది అధిగమించగలదు. కఠిన పరిశ్రమతో అది నూతన ప్రాంతాలలో గెలుపొందడం అన్నది సానుకూల వార్త. అయితే, అబద్ధపు వార్తలు, పెద్దగా పట్టించుకోని స్థానిక నాయకుల కారణంగా తాను మద్దతు కోల్పోయిన ప్రాంతాలలో ప్రజల విశ్వాసాన్ని తిరిగి అది చూరగొనగలగాలి. తన కీలక సైద్ధాంతిక అంశాలపైన పునఃశిక్షణ, బృందాలను పునర్వ్యవస్థీక రించడంతో బలంగా తిరిగి వచ్చి ప్రజల, శ్రేయోభి లాషుల మనసులను గెలుచుకుంటుందనే నమ్మకం నాకుంది.
- రతన్ శార్దా
ఆర్గనైజర్ – జూన్ 16, 2024