‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

‘‘‌చివరగా ఒకమాట డాక్టర్‌! ఒక తల్లికి ఒకేసారి ముగ్గురూ నలుగురూ పిల్లలు పుడుతూ ఉంటారు. అఫ్‌కోర్స్ అరుదుగానే అనుకోండి! అది ఎలా?’’ ప్రశ్నించింది.

ఆ ప్రశ్నలో ఆసక్తి లేదు. ఆకాంక్ష కనిపించిందా డాక్టర్‌కు.

‘‘ అది సాధ్యమే! అండాశయాలు సాధారణంగా ప్రతి నెలా ఒక్కొక్క అండాన్నే విడుదల చేస్తాయి. గర్భాశయ గోడల్ని ఆనుకుని రెండు అండాశయాలున్నా, అది ఒక్కొక్కటి ఒక్కొక్క నెల విడుదల చేస్తాయి.

‘‘అది ప్రకృతి నియమం. భగవంతుడు మన దేహాన్నే ఓ అద్భుత యంత్రంగా సృష్టించాడు. చాలా అరుదుగా ఒక్కొక్కసారి అండాశయం రెండు అండాల్ని విడుదల చేస్తే, ఆ సమయంలోనే అది ఫలదీకరణకు సిద్ధమయితే కవలలు పుట్టవచ్చు.

‘‘అదీగాక ఒక్కొక్కసారి ఫలదీకరణ చెందిన అండం సెల్స్ ‌డివిజన్‌లో మార్పులు జరిగితే ఒకే తీరు కవలలు పుడతారు. వారినే ‘పౌరుష్య కవలలు’ లేదా ఐడెంటికల్‌ ‌కవలలు అంటారు. ఇది జరిగినప్పుడు కేవలం ఆడపిల్లలు కానీ, కేవలం మగపిల్లలుగాని ఇద్దరేసి పుడతారు తప్ప; ఒక ఆడ, ఒక మగ పుట్టరు. అలాకాక, అరుదుగా అండాశయం రెండు అండాల్ని విడుదల చేస్తే కవలలు పుట్టినా వారిలో ఒక ఆడ, ఒక మగ పుట్టే అవకాశ ముంటుంది. అయితే నీవడిగిన ప్రశ్న- ఇద్దరు, ముగ్గురు, నలుగురు పుట్టేదెలా అన్నదే. ఇలాంటి సంతాన సాఫల్య కేంద్రాల్లో, ఒకే అండంతో ఫలదీకరణం విజయవంతం కాకపోతే ఏమిటి అన్న అనుమానంతో రెండు మూడు అండాలతో ఫలదీకర•ణ జరుపుతారు. ఒక్కొక్కసారి మూడూ విజయవంతమైతే అలా పుడుతుంటారు. ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒకేసారి ఎనిమిది మంది పిల్లల్ని కన్నదొక తల్లి. అందులో ఇద్దరు చనిపోయి, ఆరుగురు బ్రతికారు’’ చెప్పింది డాక్టర్‌ ‌వరద.

‘‘అలా కావటం లక్కీ కదా!’’ అడిగింది గీరా.

‘‘కాదు. అవినీతి, అత్యాశ, అరాచకత్వం. ఒకటి నుంచి మూడు కన్నా ఎక్కువ అండాల్ని ఫలదీకరించటానికి మెడికల్‌ ‌కౌన్సిల్‌ ఒప్పుకోదు. అది లీగల్‌ ‌కాదు. అయినా ఎక్కువమంది పుట్టారంటే, ఆ డాక్టర్‌ ‌కచ్చితంగా అవినీతికి పాల్పడినట్లే. అత్యాశ అని ఎందుకున్నానంటే, ఆ సరోగేట్‌ ‌మదర్‌ ఒకే కాన్పులో ఎక్కువ మందికి సంతానాన్ని అందించిం దంటే అది డాక్టర్‌, ఆ ‘‌మదర్‌’ ‌కలిసే చేయాలి.

‘‘ఇక, అరాచకత్వమని ఎందుకన్నానంటే, ఒకరు లేదా ఇద్దరు కవలలకు అనుగుణంగా మాతృగర్భాన్ని ప్రకృతే సృష్టించింది. అంతకు మించి మరో బిడ్డయితే కొద్దిగా రిస్కుతో కూడుకున్నా, తల్లి గర్భం పెంచి ప్రసవించటానికి, అంటే తాను మృత్యు ముఖంలోకి వెళ్లి, నూతన శిశోదయానికి అవకాశమిచ్చి సృష్టికార్యంలో తల్లిగా తన విధి నిర్వహిస్తుంది.

‘‘అందుకు ప్రకృతి సహాయపడుతుంది.

‘‘ఒక్కొక్కసారి జలప్రళయం వస్తుంది. అందులో అందరూ మృత్యువాత పడరు. కొందరు బ్రతికిపోతారు. దానికి ఆ విలయ తాండవం చేసే ప్రకృతీ, కనిపించని ఆ భగవంతుడూ సహాయ పడతారు. ఇదీ అలాగే!

‘‘కానీ, దానికి విరుద్ధంగా మనిషి నడిస్తే, ప్రకృతి సహించి, భరించలేదు. ఆ తల్లిగాని, డాక్టర్‌గాని అత్యాశలకు పోతే ఏమయింది? ఇద్దర్ని మృత్యువు మింగేసింది. మిగిలినవారు అతి బలహీనంగా, ఎన్నాళ్లుంటారో తెలియని స్థితిలో ఉన్నారు.

‘‘గీరా! డాక్టర్‌కు అవినీతితో గానీ, అత్యాశతో గానీ.. ప్రాణం పోసే హక్కే తప్ప, తీసే హక్కు లేదు. అయితే, ప్రయోగాలు చేసి నూతన ఆవిష్కరణలకు దారితీయటం, అందులో కొన్ని చిన్న చిన్న ఆటంకాలేదురయితే అది దోష నిరూపణ కాదు. కొత్తదారి కనుక్కుంటూ ఉంటేనే, ఆ దారి రహదారిగా మారి అందరికీ ఉపయోగపడేది’’ వివరించింది వరద.

‘‘ఓకే! అండం విడుదల కావటం యుగధర్మం. అసమతౌల్యంతో మరో అండం విడుదల కావటం ప్రకృతినీ సైన్స్‌నీ అధిగమించి సెల్స్‌లో డివిజన్స్ ఏర్పడటంతో కవలలతో పాటు మరొకర్ని అదనంగా కనటం వరకు ఓకే. ఇంకా ఇలా అండాల్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు కారణాలుంటాయా?’ అడిగింది.

గీరా చదువుకున్న యువతి.

ప్రకృతి మార్పులతోబాటు, వైజ్ఞానిక ప్రయోగాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కనబర్చింది.

‘‘చాలా అరుదుగా అదీ జరుగుతుంది. పాలిసిస్టు ప్రెగ్నెన్సి అనేది జరుగుతుంది. ఓకే అండాశయం రెండు అండాల్ని విడుదల చేయవచ్చు’’ వివరించింది.

‘‘నలుగురు లేదా ముగ్గుర్ని ఇప్పుడూ ఒక సరోగసి తల్లి కనే అవకాశముందా?’’ వదలకుండా అడిగింది గీరా.

‘‘చేయవచ్చు. ప్రయోగాల్లో, ప్రకృతి నియమంగా ఉండే గర్భనియమంలో, ఆ అండాలు బలంగా ఉండటానికి, సరిగ్గా విడుదల కావటానికి, అండం విడుదలలో సమతుల్యత లేకపోతే, హార్మోన్‌ ఇం‌జక్షన్స్ ఇచ్చినపుడు, అలా ఎక్కువ అండాలు విడుదలయి, అలా రిలీజయినప్పుడు, ఆ అండాలన్నిటితో ఫలదీకరణ జరిపి, సరోగసి మదర్‌ను ముగ్గురు బిడ్డల తల్లిగాను చూడవచ్చు. అయితే, ఆ తల్లికి, ఆ డాక్టర్‌కు ధైర్యముండాలి. ఆటంకాల్ని తట్టుకోగలగాలి’’ చెప్పింది మెల్లగా ఒక్కొక్కటిగా.

‘‘చెప్పండి, నేనే విషయాలకూ జంకను. ఈ రహస్యాలని  నేనెక్కడా బహిర్గతం చేయను. నాకు కావాల్సింది వివరాలు మాత్రమే!’’ అడిగింది గీరా.

‘‘అవి నీకు పెద్దగా అవసరపడవు. నీవు ఆరోగ్యంగా ఉన్నావు. పోనీ, సరోగెట్‌ అయినప్పుడు నీకా వివరాలే అవసరంలేదు’’ చెప్పింది వరద.

‘‘మీ దగ్గర నేనొక విషయం దాచాను. అది నేను, పెళ్లికాని అమ్మాయినని, అది నిజం కాదు. నాకు, చాలా చిన్న వయసులోనే, పెళ్లి జరిగింది. అది మా తెగల్లో సర్వసాధారణం. నాకు ఊహా తెలవకముందే ఆ పెళ్లి భగ్నమయింది. అందుకే ప్రభుత్వ సహకారంతో చదువుకోవటానికి హాస్టల్‌ ‌కొచ్చాను.

‘‘ఇక్కడి వాతావరణం, ఈ చదువు, విజ్ఞానం నా జీవన దిశను మార్చింది. నేను సైన్సు స్టూడెంట్‌ను కాను. అందుకే అడుగుతున్నాను.’’ అన్నది గీరా.

‘‘హార్మోన్‌ ఇం‌జక్షన్ల ద్వారా ఎక్కువ అండాల్ని విడుదలయ్యేలా చేసి ఫలదీకరించవచ్చు. అయితే, రెండు లేదా మూడు కన్న ఎక్కువ అండాలతో, తల్లి గర్భంలో ఫలదీకరణ జరపకూడదని మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌నిర్ణయించింది’’ చెప్పింది డాక్టర్‌ ‌వరద.

‘‘అరుదుగానే అయినా ఎక్కువగా కూడా పుడుతున్నారు కదా?’’

‘‘అఫ్‌కోర్స్, ‌నిజమే! ధనదాహం, మానవుల నడుమనున్న మమతల విలువల్ని, మంటగలిపి నప్పుడు, దురాశతో ఎక్కువ అండాల్ని ఫలదీ కరించటంతో జరుగుతుందది గీరా! అసలు నీ విషయం చెప్పు, నీ మనసులో ఉన్నదేమిటో, దాని గురించి చెప్తాను’’ చెప్పింది వరద.

‘‘నాకు అలా ఎక్కువమందిని, అదీ వివిధ రకాల తల్లులు, తండ్రులకు సంబంధించిన సంతానాన్ని కనే ప్రయోగంలో పాల్గొనాలనుంది. ఆ మాతృత్వం లోని కదలికల్ని, తల్లి అనుభూతుల్ని పొందాలనుంది’’ చెప్పింది గీరా.

‘‘అది వీలు పడకపోవచ్చు. కారణం డి.ఎన్‌.ఏ అం‌టే, డి ఆక్సిరైబో న్యూక్లిక్‌ ఆమ్లం, ఇవి కొన్ని రకాల యాసిడ్స్ ‌వంశ పారంపర్య లక్షణాల్ని అందించటంతో, డి.ఎన్‌.ఏ ‌ప్రాధాన్యత వహిస్తుంది. వాటిల్లో వచ్చే తేడాలవల్ల, గర్భాలు నిలవకపోవచ్చు’’ వివరించింది డాక్టర్‌ ‌వరద.

‘‘డి.ఎన్‌.ఏను కూడా సమన్వయ పరచగలిగే మందులున్నాయా?’’ ప్రశ్నించింది గీరా.

‘‘ఉన్నాయి. వాటిని తక్కువగానే ఉపయోగిస్తారు. వాటి కన్నా ముందు తల్లి అన్ని రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కారణం వివిధ రకాల డి.ఎన్‌.ఏతో సమస్యలుంటాయి కాబట్టి. అయితే గియితే ప్రయోగం అంటూ జరిపితే, అది నీ మీదే అవుతుంది. దానికి నీవు తల్లిగా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా కష్టపడాల్సి ఉంటుంది.’’ వివరించింది వరద.

‘‘అన్నీ మీ అబ్జర్వేషన్‌లోనే కదా?’’

‘‘ష్యూర్‌! ఇరవై నాల్గు గంటలూ నా కళ్లముందుం టావు. నీ కడుపులోని ప్రాణి కదలికల్ని ప్రారంభించిన క్షణం నుంచి నీవు ప్రసవించే వరకు, నీవు, నీ బిడ్డ నా ఆధ్వర్యంలో ఉంటారు. మీ ఏ సమస్యలకయినా బాధ్యత నాదవుతుంది’’ చెప్పింది.

‘‘అందుకు నేను తయారుగా ఉన్నాను డాక్టర్‌. ‌ముగ్గురు దంపతులకు నేను తల్లిగా బిడ్డల  నందించగలను’’ జవాబిచ్చింది గీరా.

వరద లేచి, ఆలోచనగా చేతులు కట్టుకుంటూ ‘‘అలాంటి దంపతులడిగినపుడు నీకు తెలియజేస్తాను’’ అంది. ఇద్దరి మధ్య ‘మీకు మీరు’ అని మన్నించే మర్యాద ప్రస్థావనలు ఎప్పుడు ఆగిపోయాయో వారికే గుర్తులేదు.

‘‘డాక్టర్‌గారూ! నేను డబ్బు సంపాదన కోసమే అనుకుంటే ఓ ఉద్యోగం చేస్తాను. ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ ‌మార్గదర్శకాల ప్రకారం నేను మూడుసార్లు కన్నా ఎక్కువగా సరోగెట్‌ ‌మదర్‌లా మారటానికి వీల్లేదు అంటే  మూడుసార్లు మాత్రమే సంతానాన్ని ఇవ్వగలను.

‘‘ఈ లెక్కన నాకొచ్చే డబ్బులు కూడా తక్కువే! అలా అని నేను దీన్ని, జాలిపడో, సహాయం చేయాలన్న సానుభూతితో చెయ్యడం లేదు.

‘‘నా స్వార్థం కోసం, అంతో ఇంతో  నా సంపాద నతో పాటు, అమ్మదనంలోని కమ్మదనాన్ని అనుభ వించటానికి చేస్తున్నాను. మూడు జంటలకు నేను ఒకే కాన్పులో అంటే, తొమ్మిదినెలల్లో సంతానాన్ని ఇవ్వగలిగితే ఎంత థ్రిల్‌… ఎం‌త గొప్పదనం.

‘‘అలా మూడుసార్లు సరోగేట్‌నయితే నాకు అవసరమయినంత డబ్బు కూడా దొరుకుతుంది. ఆ తరువాత నేను పెళ్లి చేసుకుని సెటిలయిపోయి హాయిగా నా భర్తతో గడుపుతూ నా సంతానాన్ని కని పెంచుకోవచ్చు కదా?’’ ప్రశ్నించింది.

‘‘నిజమే! కానీ దానికి నీవు, నీ ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. అందుకే మెడికల్‌ ‌కౌన్సిల్‌ ఆ ‌నిబంధనల్ని విధించింది. అఫ్‌కోర్స్! ఇదొక ప్రయోగంగా తీసుకుని, నేను పర్మిషన్‌ ‌తీసుకోవచ్చు. నీకూ… అంగీకారంగా ఉంది. ఆరోగ్యంగా ఉన్నావు. నీ ప్రాణాలకు నాది హామీ. కాని, అంత తీవ్ర పరిస్థితులెదురయినప్పుడు మాత్రం గర్భస్రావం చెయ్యాల్సి వస్తుంది’’ వివరించింది.

‘‘నేను, మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌నిబంధనల ప్రకారమే తల్లినౌతాను. ఇన్ని సంవత్సరాల వయసొచ్చినా భర్త, సంసారం, సంయోగ సాంగత్యాలు లేకుండా ఉన్నాను. మా తెగల్లో  అక్రమ సంబంధాలు, తద్వారా సంతానాలు సర్వసాధారణం. కాని, నేను చదువుకున్నాను. అందుకే నేనేది చేసినా, లీగల్‌గా, వాటిని నైతిక జీవన విలువల కనుగుణంగా ఉండాలనుకునే ఇన్నాళ్లూ వాటికి దూరంగా ఉండిపోయాను. కానీ, నాకూ మాతృత్వాన్ని స్వంతం చేసుకోగల అవకాశం ఉందన్న మాట వాస్తవం. అయితే అది సామాజిక నియమాలకనుగుణంగా కాదు. అందుకే నేను కేవలం మాతృసాధన కోసమే ఇలా ఉన్నాను.  ఇప్పుడు దీనికి  ఒప్పుకున్నదీ అందుకోసమే!’’ చెప్పింది గీరా వివరంగా.

-సంబరాజు లీల (లట్టుపల్లి)

About Author

By editor

Twitter
YOUTUBE