‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

‘‘అం‌దుకే నేను చెప్పేది. ఇదిప్పుడు అందరూ చేస్తున్నదే! ఇందులో మరో మగవాడి స్పర్శ ఉండదు. మనం తప్పు చేశామన్న భావనా ఉండదు. నాకు పూర్ణగర్భంతో ఇంట్లో తిరుగుతుండే కోడల్ని చూసుకోవాలనుంది’’ నచ్చజెప్పింది సత్యవతి.

‘‘మీరెంత చెప్పినా ఈ విషయంలో నా మనసంగీకరించటం లేదు. ఆ వ్యక్తి కంటికి కనిపించకపోవచ్చు. చేతితో స్పర్శించకపోవచ్చు. రేపెవరయినా ఆ పుట్టే బిడ్డ అచ్చం మీ వ్యాస్‌లా ఉన్నారంటే నేనేం సమాధానం చెప్పుకోవాలి? నా కది అవమానంగా ఉంటుంది’’ చెప్పింది కచ్చితంగా.

‘‘పోనీ! రాష్ట్రాయ్‌, ‌నీ అభిప్రాయం చెప్పరా! సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదిస్తే ఆ జీవకణాలు ఎక్కడివో, ఎవరివో అనుకునేకన్నా, అది నా ఇంట్లోనిదే అనుకుంటే సంతోషం కాదా? ఈ సంతృప్తి కోసం కాకున్నా; వాడి తెలివి, మేధస్సును ఉపయోగించుకోవాలని, వాడి స్పెర్మ్ ‌ప్రపంచమంతా నిలువచేసుకొని ఉపయోగించుకోవాలను కుంటున్నప్పుడు, అలాంటి తెలివైన, ఆరోగ్యవంతమైన జీవ పదార్థాన్ని మనం ఉపయోగించుకోవటంలో తప్పులేదు. దీని ద్వారా రెండు లాభాలు. ఒకటి, మన ఇంటి సంతానమే మనంటికొస్తుంది. రెండు- ప్రపంచమే ఉపయోగించుకోవాలనుకుంటున్న శాస్త్రవేత్త, మనింట్లోనే పుట్టొచ్చు. అందులో తప్పేమిటి? గాంధారి అనవసరంగా భయపడు తోంది’’ నచ్చచెప్పింది సత్యవతి.

‘‘గాంధారి అభిప్రాయం, భయం, సహజమైనవి. భారతీయ నైతిక జీవన విధానం ఈ విలువలు కూడుకున్నది. ఇక నా విషయానికి వస్తే, పసితనంలో వచ్చిన జబ్బు వల్ల నాలో ఆ లోపం ఏర్పడింది. గాంధారి చాలా పెద్ద మనసుతో అర్థం చేసుకుని నాకు భార్యగా వచ్చింది. ఆ లోపాన్ని, నేనేవిధంగాను సరిచేయలేను.

‘‘ఇక ఐ.వి.ఎఫ్‌ ‌పద్ధతి అనుకుంటే నాది కానప్పుడు అది ఎవరిదైనా ఒకటే! ఇక్కడ వ్యక్తిగత సంబంధాలుండవు. తెలిసినప్పుడు బాధ, తెలవకుంటే అలాంటి స్పందన ఉండదంతే!

‘‘పైగా ఇదంతా రహస్యంగానే ఉంటుంది. నేనామెను కట్టుకున్నందుకు స్త్రీగా, భార్యగా ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి. అమ్మను చేయాలి.

‘‘అమ్మ కోరికలో కూడ తప్పేమి లేదు. గాంధారి వీటిల్లో దేనికంగీకరించినా నాకు సమ్మతమే’’ రాష్ట్రాయ్‌ ‌జవాబిచ్చాడు.

‘‘ఒప్పుకుంటాను. నన్నిలా గౌరవిస్తున్నందుకు కృతజ్ఞురాలిని. మీ లోపాన్ని మీరు దాచలేదు. నన్ను మోసం చేయలేదు. అన్నీ తెలిసి చేసుకున్నాను కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సింది నేనే.

‘‘నాకే అమ్మననిపించుకోవాలని, అలా పిలిపించుకోవాలనిపించింది. అందుకే ఇలా ఇబ్బంది పడుతున్నాను. అయితే, సరోగేట్‌ ‌మదర్‌గా వచ్చే తల్లికి నా ‘ఎగ్‌’ ‌డొనేట్‌ ‌చేస్తాను. మీరు చెప్పినట్లే మనింటి వారసుడు, మన ఇంటనే రూపుదిద్దు కుంటాడు’’ అంగీకరించింది.

‘‘అమ్మా! ఒప్పుకున్నావు చాలు. ‘పృథ్వీ ప్రతిసృష్టి’ కేంద్రానికి దీని విషయంలో చాలా పేరుంది. వెళ్లి కలిసిరండి’’ అంది సత్యవతి.

అప్పటి కథ ఇక ముగిసిపోయింది.

                                                                                 *     *     *

టి.వి. చూస్తున్న గీరా టక్కున దాన్ని పాజ్‌ ‌జేసింది. క్రింద వచ్చే స్క్రోలింగ్‌ ఆగింది. అది ఒక ప్రకటన. ఇలా ఉంది.

అమెరికాలోని రాకెట్‌ అం‌తరిక్ష ప్రయోగశాలలో పనిచేస్తున్న డాక్టర్‌ ‌వ్యాస్‌, ‌వయసు 36 సంవత్సరాలు.. మంచి అందం, చదువు, ఆరోగ్యం, హోదా ఉన్న ఈ యువకుడికి, సుమారు ఇరవై ఐదు, ముప్పయి సంవత్సరాల అందం, చదువు ఉన్న యువతి భార్యగా కావాలి. అయితే, భర్తతోనే కలిసుం డాలనే నియమం పెట్టుకుంటే కుదరకపోవచ్చు. అతడికి రాకెట్‌ ‌ప్రయోగాలంటే ప్రాణం. ప్రయోగశాలే అతని నివాసం, ఇరవై నాలుగు గంటలు అందులోనే గడుపుతాడు కాబట్టి. ఆమెకెక్కువగా భర్తతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అందుకంగీకరించిన యువతికి ఆమె జీవితాంతం సాంఘిక, ఆర్థిక భద్రత, అతని సంపాదనలో రాయల్టీ, పిత్రార్జితా మాదిరిగా అతని ఆస్తిపాస్తుల్లో అన్ని రకాల హక్కులు అతని భార్యగా ఆమెకు లభిస్తాయి.

అతని కుటుంబంలోని వ్యక్తిగా అన్ని హక్కులు కల్పిస్తూ, ఆ కుటుంబంలోని వ్యక్తిగానే గౌరవం ఉంటుంది. ఒక రకంగా ఇది కాంట్రాక్టు పెళ్లి అనుకోవచ్చు. దీనికి అంగీకరించిన వాళ్లు ఈ క్రింది అడ్రస్‌ను సంప్రదించవచ్చు.

 అంటూ ఫోన్‌ ‌నంబర్‌, అ‌డ్రస్‌ ‌వివరాలు క్లియర్‌గా ఉన్నాయి.

మంచి హోదా, చదువు, అందం, ఆరోగ్యం పేరు ఉన్న యువకుడు అలాంటివాడికి భార్యగా ఉండాలంటే తన లాంటివాళ్లు ఎన్ని జన్మలెత్తాలి?

అతని తదనంతరం అతని వారసత్వపు జీవకణాల కోసం ప్రపంచ మంతా తల్లడిల్లుతూ అర్థిస్తున్నది. మరి అలాంటివాడితో కొద్దికాలం బ్రతికినా చాలు. కాకిలా కలకాలం బ్రతికేకంటే, హంసలా ఆరునెల్లు బ్రతికితే చాలంటారు.

అంతటి సుదీర్ఘ జీవన యానంలోని అందమైన బ్రతుకులో కొద్దికాలం అతని భార్యగా జీవించటానికి అభ్యంతరమేముంటుంది? అందులోనూ ఏ ఆధారం లేని తనలాంటి యువతికి! ఆలోచిస్తూనే అద్దం చూసుకుంది. మరీ తెల్లనిది కాకపోయినా తెల్లనిదే! చక్కటి రూప సౌష్టవం. తెలివిగా కళగా ఉండే ముఖం, ఆరోగ్యంగా తొణికిసలాడే యౌవ్వనం.

స్థూలంగా చాలా అందమైందే!

‘‘చదువుకున్నది, బ్రతుకులో స్థిరపడాలను కుంటున్నది ఎవరైనా ఇందుకు ప్రయత్నించటంలో తప్పులేదు కదా?’’ అనుకుంటూ, తన ఫ్రెండ్స్ ‌వరూధిని, కల్పలత, నాన్సి, భద్రలకు మెయిల్‌ ‌కొట్టింది.

వాళ్లొచ్చాక అందరూ కలిసి ‘లాన్‌’‌లోకి వెళ్లి కూర్చున్నాక విషయం చెప్పింది. ‘‘వావ్‌! ఇతని కోసం దేశాలే కొట్టుకుంటున్నాయి కదే?’’ అంది వరూధిని ఉత్సాహంగా.

‘‘మా ఇంట్లో ఒప్పుకోరు. కానీ, ఎలాంటి ఆంక్షలు, కొరతాలేని ఇతనితో జీవితం స్వర్గమే! వెంటనే ప్రయత్నించు గీరా!’’ మరో మాట ఆలోచించకుండా చెప్పేసింది భద్ర.

‘‘ఆలోచించుకో గీరా! పెళ్లి అంటే కలిసి జీవించటం. అది లేనప్పుడు, అతనితో బ్రతుకును పంచుకోవటంలో అర్థం లేదు.

‘‘అతనితోడి బ్రతికితేనే జీవితంలోని అందం తెలుస్తుంది. అది లేనప్పుడు అతని కుటుంబ సభ్యురాలివవుతావు. అతని ఆస్తులకు వారసురాలు వవుతావు. కానీ అతనితో జీవించాలన్నా, కలిసుండాలన్నా ఎదురుచూడాల్సిందే! సంసారంలో భర్త కోసం ఎదురుచూడటం కొద్దికాలం ఐతే విరహంలో అందంగా ఉంటుందేమో కాని జీవితం మొత్తం భర్త కోసం ఎదురుచూడటం భరించలేని స్థితి’’ హెచ్చరించింది కల్పలత.

‘‘గాడిద గుడ్డు. ఇలాంటి అవకాశమొస్తే వెంటనే చేతులు చాచి అందుకోవాలిగాని, ఆలోచించకూడదు. గీరా! నీకు పెళ్లి చేసుకుని, కుటుంబ జీవనం గడపాలనుంది. కాబట్టి, అందుకు స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నావు. అలాంటి నీకిది సువర్ణావకాశం జారవిడుచుకోకు.

‘‘అనంగీకారమేదైనా ఉంటే, అది ఆ వైపు నుంచే రాని కానీ, నీ వైపు నుండి వద్దు. హాయిగా ప్రొసీడయిపో!’’ చెప్పింది నాన్సి.

గీరా ఇక ఆలోచించలేదు.

వాళ్లను పంపేసి, ఆ నంబర్‌కు ఫోన్‌ ‌చేసింది. వెంటనే తన ఫోటో వివరాలు మెయిల్లో పంపింది ఫోన్లో. పనమ్మాయి కాబోలు ఎత్తింది. విషయం విని ‘‘అమ్మగారిని పిలుస్తాను’’ అంటు చెప్పింది.

‘‘హలో!’’ అతి మృదువుగా వినిపించింది అవతలివైపు నుంచి సత్యవతి కంఠం. గీరా విషయం చెప్పగానే, ‘‘ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు. కారుతో డ్రయివర్‌ను పంపిస్తాను, వెంటనే వచ్చెసెయ్యి. మీకన్ని రకాలుగా అంగీకారమయితేనే ప్రొసీడవుదాం. డ్రయివర్‌ ‌పేరు పరమేష్‌. ఒక్క గంటలో వస్తాడు!’’ అంటూ కారు నంబర్‌, ‌వివరాలిచ్చి మరో మాటకవకాశం లేకుండా ఫోన్‌ ‌పెట్టేసింది సత్యవతి.

‘‘నీ అదృష్టం పండింది. జాగ్రత్తగా డీల్‌ ‌చేసుకో. అవకాశం అందరికీ ఎప్పుడోగాని రాదట. అందరికి అన్నిసార్లు రాకుండా అప్పుడప్పుడూ వెతుక్కుంటూ వస్తుందట. అదృష్టం ఒక్కసారి వస్తుందట. దురదృష్టం పదిసార్లు తలుపు తడుతుందట’’ అంటూ ఫోన్లో ప్రోత్సహించింది కల్పలత.

గీరా కూడా ఇక ఆలోచించకుండా లేచింది. కప్‌బోర్డస్ అన్నీ తీసి, డ్రస్‌లు, చీరలు బైటకు తీసింది. ఇలాంటి విషయం మాట్లాడాలంటే చీరలో సాంప్రదాయకంగా వెళ్లాలా? లేక క్యాజువల్‌గా వెళ్లాలా?

ఎంతయినా కాబోయే కోడల్ని అందంగా, ఆకర్షణీయంగానే చూడాలనుకుంటారు. ఫస్టు ఇంప్రెషనీజ్‌ ‌బెస్టు ఇంప్రెషన్‌. ‌మొదటే సాంప్రదాయి కంగా వెళ్తేనే బాగుంటుంది. మరీ క్యాజువల్‌గా వెళ్తే, కాంట్రాక్టు పెళ్లికి ఒప్పుకోలేదనుకుంటారేమో! ఎందుకైనా మంచిది. వారి కుటుంబంలోకి వెళ్లే వ్యక్తిలా కనిపించటమే మంచి అనుకుంటూ గులాబిరంగుకు నల్లని అంచున్న కశ్మీరీ చీరకట్టుకుని బయలుదేరింది.

తను సిద్ధమయినట్లు మిస్‌డు కాల్‌ ఇవ్వగానే ‘‘డ్రయివర్‌ ‌మీ హాస్టల్‌ ‌ముందున్నాడు.

యూనిఫాం ఉంటుంది’’ అంటూ వివరాలు చెప్పింది సత్యవతి.

ఆ అడ్మినిస్ట్రేషన్‌ ‌సిస్టమ్‌కు, సమయ పాలనకు ఆశ్చర్యపోయి బైటకొచ్చింది. అత్యంత ఖరీదైన కారు, చాక్‌లెట్‌ ‌రంగులో పెద్ద ఓడలా హాస్టల్‌ ‌ముందు నిలబడుంది.

ఆమెను చూసి వినయంగా వెనుక డోర్‌ ‌తెరిచాడు డ్రయివర్‌ ‌పరమేష్‌. ‌కూర్చోగానే స్టార్టయింది. ఎ.సి.తో లోపలంతా చల్లగా ఉంది. ఆ చల్లదనానికి కళ్లు మూసుకుపోయి సేద దీరాయి.

కళ్లు తెరిచేసరికి బంజారాహిల్స్‌లోని వి.ఐ.పి. కాలనీలో రోడ్‌ ‌నెం. త్రి లో ఆగింది.

-సంబరాజు లీల (లట్టుపల్లి)

About Author

By editor

Twitter
YOUTUBE