‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

‘‘‌ష్యూర్‌! ‌చాల మంచి ప్రశ్నే అడిగావు కుంతలా! ఈ విషయాలన్నీ నీకు పర్సనల్‌గా చెప్పాలనే నిన్ను పిలిపించాను. మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌కూడ నిర్ధారించింది. ‘‘దానివల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి, సైన్స్ అభివృద్ధి చెందుతుంది. రెండు, ఆ వ్యక్తులు మానసికంగా ఆనందంగా ఉంటారు. మూడు, ఇది లీగల్‌ ‌కాబట్టి సంతోషంగా అంగీకరిస్తారు. ఐ.వి.ఎఫ్‌ అం‌టే, ఇన్‌ ‌విట్రా ఫర్టిలైజేషన్‌. ఈ ‌పద్ధతిలో శుద్ధి చేసిన వీర్యకణాల్ని, అండాల్ని లేబరేటర్‌లో ఫలదీకరణ చేసి, కొంచెం ఎదిగిన పిండాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టే పద్ధతి. అక్కడే అది తొమ్మిది నెలలు ఎదుగుతుంది.’’ వివరించింది డాక్టర్‌ ‌వరద.

‘‘ఆ శిశువు ఆడో, మగో అప్పుడే తెలుస్తుందా?’’ ఆతృతగా ప్రశ్నించింది కుంతల.

‘‘తెలుస్తుంది. అయితే అప్పుడే కాదు, శిశువు కనీసం పన్నెండు వారాలయినా ఎదగాలి. మరీ రెండు మూడు వారాల్లో తెలవదు!’’ చెప్పింది.

‘‘అంటే, అప్పటిదాకా గర్భంలో ఎదిగిన శిశువు.. అమ్మ పొట్ట నాకు అత్యంత సురక్షితమనుకుంటూ నిశ్చింతగా ఉండే పసిప్రాణం.. అంతవరకూ అమ్మను తనతో పంచుకున్న నూతన శిశువు.. దాని ఖర్మకొద్ది ఆడపిల్లయితే అప్పుడూ మళ్లీ ఇదే పరిస్థితి పునరావృత మౌతుందిగా?’’ భయంగా ప్రశ్నించింది కుంతల. ఆమె కళ్లనిండా భయం.

డాక్టర్‌ ‌వరద ఆమె తర్కాన్నీ, భయాన్నీ అర్థం చేసుకున్నట్లుగా భుజం తడుతూ, ‘‘తప్పదు, మీ వాళ్లు ‘ఆడపిల్లయినా సరే’ అనుకునేంతవరకు!’’ చెప్పింది.

‘‘వద్దు డాక్టర్‌! ‌నేను ఆడపిల్లను నిరాకరించను. ఆడపిల్లను కన్న అమ్మగా నేనూ ఆడదాన్నే కదా? నా భర్తకు ఆనందాన్నిచ్చి, ఆ ఆనందాన్ని బిడ్డ రూపంలో మోసే నేను ఆడపిల్లను వద్దనుకోలేను. కానీ… కానీ, కేవలం వంశం కోసమంటూ, మా వాళ్ల కోసం భ్రూణహత్యకు గురయ్యే ఆ బిడ్డ పడే నరకయాతనను ఊహించలేను. ఆ ఐ.వి.ఎఫ్‌ ‌విధానంతో సృష్టించే ఆ పిండాన్ని సరోగేట్‌ ‌మదర్‌గా ఉండే ఆమె గర్భంలోనే ప్రవేశపెట్టిండి. ఆ పిల్లనో, పిల్లవాడినో నా ప్రాణంగా నా కోసం నా గర్భం వదిలి మరో తల్లి మాతృగర్భంలో పెరగవచ్చు. అయినా ఈ అమ్మను అమ్మగా చెప్పుకోవడానికి రాబోయే వాళ్లని నా ప్రాణంగా పెంచుతాను’’ చెప్పింది.

ఆ చెప్పటంలో తను కోల్పోయే గర్భిణి అనుభవం కన్నా, ఆ పసిప్రాణం పొందే భద్రత గురించిన చింతన, ఆందోళన కనిపించాయి ఆ డాక్టర్‌కు. ‘‘ఓకే కుంతలా? దురదృష్టవశాత్తు లింగ నిర్ధారణ జరిగి, ఆ శిశువు ఆడపిల్లని తెలిస్తే, మీ వాళ్లు అంగీక రించరు. అప్పుడు గర్భ విచ్ఛిత్తి తప్పదు. డాక్టర్స్ ‌చెప్పకపోయినా, ఎలాగో తెలుసుకుంటున్నారు. అప్పుడు మీరు పడే ఈ మానసిక వేదన కన్నా వద్దనుకోవటం మంచిదే. కానీ, అప్పుడు నీవు పడే దుఃఖం ఆమె పడాలిగా?’’ ప్రశ్నిస్తూ, కుంతలవంక చూసింది.

కుంతల తలఎత్తింది. ఆ కళ్లు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. దుఃఖంతో వణికే పెదవులతో పలచగా నవ్వింది. అయితే, అది ఎవ్వరిని కించపరిచేదిగా లేదు.

‘‘నిజమే డాక్టర్‌! అమ్మతనంలోని కమ్మద•నం, బాధ, అనుభూతులు, స్పందనలూ అందరికీ ఒక్కటే. లింగనిర్ధారణ జరిగే వయసుకు వచ్చే సరికి ఆ బేబిలో కదలికలు మొదలవుతాయి. ఆ కదలికలు తల్లిని చేరి, ఆమెలో స్పందనల్ని నింపుతాయి. వాటినెలా మరిచిపోగలదా స్త్రీ?

‘‘అయితే, ఇక్కడ అమ్మతనానికి, కమ్మదనానికి మధ్య ధనపు పొరలు కమ్ముకున్నాయి. నిర్దాక్షిణ్యంగా మాతృత్వాన్ని పంచి వదులుకుని పోగల ఆ స్త్రీ మూర్తి మనసు డబ్బు పొరలతో నిండిపోయి ఉంటుంది. అందుకే ధైర్యంగా మగపిల్లవాడినే కనిస్తానని ఒప్పుకుంది. అంటే, ఆడపిల్లయితే చిదిమివేయవచ్చన్న వాదానికి అంగీకరించినట్లే. ఇక్కడ ఆమె అమ్మకాదు. అమ్ముకోవటానికో అమ్మ లేదా అద్దెకో అమ్మగా మాత్రమే గుర్తించబడింది. అమ్మతనానికి దూరంగా నిలబడి మాతృదానం చేస్తున్న స్త్రీ అంతే!’’ కచ్చితంగా అంది కుంతల.

ఆ వాదన కొంతవరకు డాక్టర్‌కు సమంజసంగానే అనిపించింది. రోజూ సరోగేట్‌ ‌మదర్స్‌తో మాట్లాడే తను, ఓ వ్యక్తిగా, డాక్టర్‌గా వారి మధ్య అనుసంధా నంగా ఉంటుందే తప్ప మనిషిగా వీటి గురించి ఆలోచించలేదు.

వెంటనే దుష్యంత్‌కు మెయిలిచ్చి కుంతలను విడిగా గదిలో విశ్రాంతి తీసుకోమని పంపింది.

దుష్యత్‌ ‌వచ్చాక అతనికి కాఫీ ఆఫర్‌ ‌చేసి రిలాక్సవుతూ, ‘‘మిష్టర్‌ ‌దుష్యంత్‌! ‌మీ భార్య గర్భాశయం పదే పదే గర్భస్రావాల వల్ల, అండ వాహికలు మూసుకుపోయాయి. వాటిని వైద్యం ద్వారా తెరిపించవచ్చు. కానీ, అందుకామె మానసికంగా సిద్ధంగా లేదు. వైద్యానికి కూడా సిద్ధంగా లేదు కాబట్టి, సరోగసి ద్వారా, అంటే, అద్దె అమ్మ ద్వారా మీ సంతానాన్ని మీకిప్పించగలను. అంటే మీ సంతానాన్ని మరో అమ్మ తన గర్భంలో మోస్తూ తన మాతృత్వాన్ని మీకు దానంగా ఇస్తుంది. అఫ్‌కోర్స్, అది డబ్బు ఒప్పందం ద్వారానే! మీకంగీకారమేనా?’’ అడిగింది.

‘‘అంగీకారమే! ఆమెను నేను చూడవచ్చా? మాట్లాడవచ్చా?’’ అడిగాడు దుష్యంత్‌ ఆతృతగా.

‘‘నో! మాట్లాడలేరు. చూడలేరు. మీకు సంతానాన్ని కనివ్వడం వరకే ఆమెతో ప్రమేయం. ఆనక మీరిచ్చే డబ్బు తీసుకుని వెళ్లిపోతుంది. అంతకుమించి ఇద్దరి మధ్య అవసరాలుండవు. ఏది చేయాలన్నా, మీడియేటర్‌గా నాతోనే సంప్రదించాలి. ప్రతి విషయం నా ద్వారానే ఆమె నుంచి మీకు, మీ నుంచి ఆమెకు సమాచారం చేరుతుంది. మీ ఉనికి ఆమెకూ, ఆమె ఉనికి మీకూ తెలియదు. అంతా గోప్యంగా ఉంటుంది’’ చెప్పింది.

‘‘నా సంతానాన్ని మోస్తున్న ఆ స్త్రీని నిండు గర్భంతో తిరుగుతుంటే ఒకసారి కంటి నిండుగా చూసి ఫోటో తీసుకోవాలనుకుంది’’ ఆశగా చెప్పాడు.

‘‘అది మీ దురదృష్టం. అందుకే అది మీరు చూడలేరు. మనం చేతులారా చేసుకున్నవే మనకు శాపాలుగా మారి, ఆమెచే మాతృదానం చేయించు కుంటున్నారు. అందుకు కృతజ్ఞతగా ఈ విషయాన్ని వీలయినంతగా మీరు అడగక పోవటమే మంచిది. అదామె భవిష్యత్తుకు ప్రమాదం కదా! ఈ విషయంలో నేనేం చెయ్యలేను’’ చెప్పింది.

అతడు నిస్సహాయంగా చూశాడు.

అదామెకు బాధగా అనిపించి ‘‘మీకా అదృష్టం ఉంటే, దాన్ని మీ భార్యలోనే చూసేవారు. ఆ అవకాశం చేజార్చుకున్నారు. కుంతల దుఃఖం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది’’ అంది లేస్తూ.

దుష్యంత్‌ ‌తనూ లేచి ఆమెకు చెప్పి వచ్చేశాడు.

ళి       ళి       ళి

సత్యవతి కుటుంబంలో అంతా సమావేశ మయ్యారు. చిన్న కొడుకు రాష్ట్రాయ్‌, ‌కోడలు గాంధారి, సత్యవతి అంతా గంభీరంగా ఉన్నారు. అదేదో పెద్ద సమావేశమే జరిగినట్లుగా అందరిముందు, ఫ్రూట్‌ ‌జ్యూస్‌ ‌గ్లాసులు, బిస్కట్లు ఉన్నాయి. అందరిలోకి సత్యవతి కాస్త యాక్టివ్‌గా ఉంది.

 సత్యవతి ఆ కాలంలోనే డిగ్రీ పూర్తి చేసింది. మహిళా డిగ్రీ కాలేజ్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆమెను ఎప్పటికప్పుడు చైతన్యంతో నింపుతుంటుంది. అందుకే ఆమె ఆలోచనలు నిత్యనూతనంగా ఉంటాయి. ఆధునిక భావాలతో ఎప్పుడు చైతన్యమూర్తిలా ఉంటుంది. ఎంత సామాజిక స్పృహతో జీవిస్తుందో, అంతగా కుటుంబం గురించి ఆలోచిస్తుంది.

ఈ కుటుంబమే సమాజానికి ఆధారమను కుంటుంది. ఆమె పెద్ద కొడుకే డాక్టర్‌ ‌వ్యాస్‌. ఇం‌టి ప్రథమ సంతానం అలా కుటుంబం లేకుండా, ఒంటరిగా ఉండటం ఆమెకెప్పుడూ అశాంతిని కలిగిస్తూ ఉంటుంది.

అందుకే అతన్ని పెళ్లి చేసుకొమ్మని పోరు తుంటుంది. ఇన్ని రోజులు, సంవత్సరాలు తల్లి ఆలోచనల కోసం పరుగుపెట్టని వ్యాస్‌ ‌వారం క్రితం ప్రపంచ ప్రభుత్వాల అభ్యర్థన మేరకు, తన స్పెర్మ్ ‌డొనేట్‌ ‌చేసి, రిజర్వు చేయటానికొప్పుకున్న విషయం న్యూస్‌లో విన్నాక అదే విషయం అతన్ని అడుగుతూ, ‘‘వ్యాస్‌! అం‌దరిలా పెళ్లి చేసుకుంటే నీ జీవితంలో లోటు భర్తీ అవుతుంది. నా ఇంటి వారసత్వం ఎక్కడో ఉదయించటం కాదు, ఆ శిశోదయం నా ఇంట్లో జరగాలి. నేను వారసులకు వైభవంగా అన్ని వేడుకలు జరుపుకోవాలి. ఈ సమాజంలో నా వంశాంకురం ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందో నేను చూసుకోవాలి. నీలా మరో గొప్ప శాస్త్రవేత్త నా ఇంట్లో పుట్టాలి. నీ తమ్ముడికి ఇప్పుడు వచ్చిన జబ్బువల్ల వారసులు కలగరు.

‘‘ఆ విషయం తెలిసే గాంధారి అతన్ని చేసుకుంది. కానీ ఎందుకో ఈ మధ్య ఒంటరిగా ఫీలవుతోంది. ఆమెకే కాదు, నాకు అలాగే ఉంది.

‘‘మిమ్మల్ని పెంచాను. పెద్దవాళ్లయి, మీ జీవి తాల్లో స్థిరపడ్డారు. మరి మాకూ మా మనవలతో వారి పెంపకంలో మీ బాల్యాల్ని చూసుకోవా లనుటుంది. అది జరగాలంటే మనింట్లో పిల్లలు రావాలి.’’ ఆమె గొంతు దుఃఖంతో మూగపోయి నట్లయింది.

‘‘విషయమేమిటి?’’ ప్రశ్నించాడు వ్యాస్‌.

‘‘‌వాడికి పిల్లలు కలగకపోవటానికి కారణం వాడిదే! నీకేమో కుటుంబమే లేదు. వాడలా, నువ్విలా. ఇద్దరికిద్దరూ ఇలా ఉంటే వంశాభివృద్ధి ఎలా?’’ ప్రశ్నించింది.

‘‘దానికోసం నన్నా బంధనాల్లో ఇరుక్కోమంటే ఒప్పుకోనంటావ్‌. ‌సంసారిగా కుటుంబానికి ఉపయోగపడేకన్నా, ఓ శాస్త్రవేత్తగా, జీవితాంతం మాతృభూమికి సేవచేస్తూ, ఆ రుణం తీర్చుకోవటం గొప్పగా ఉంటుందని చెబుతావ్‌. ‌దేశానికి ఉపయోగపడే వ్యక్తిలో జీవించాలనుంది తప్ప, ఒక చిన్న సంసార బంధంలో చిక్కుకుని నిరుపయోగంగా ఉండాలని లేదని చెబుతున్నావ్‌. ‌పెళ్లి చేసుకొని భార్యా పిల్లలతో పొందే సుఖసంతోషాల కన్నా మాతృదేశం కోసం ప్రయోగశాలలో ఓ పరికరంగా బ్రతకటం ఇష్టం అని కూడా అంటావ్‌.’’ ఒక క్షణం ఆగి ఆమె అన్నది.

‘‘మాతృదేశ సేవ… గొప్పది. ఒప్పుకుంటాను. అలాంటి సంతానాన్ని, ఈ గర్భాన మోసి కన్నందుకు, నిన్ను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్న తరుణంలో ఎంతో పొంగిపోతుంటాను. కానీ మరి… మా ఆశ, కోరిక తీరేదెలా?’’ దీనంగా ప్రశ్నించింది.

‘‘దానికిప్పుడు, ఎన్నో సంతాన సాఫల్య కేంద్రా లున్నాయి. ఏదో ఒక ప్రత్యామ్నాయం దొరుకుతుంది’’ చెప్పాడు.

‘‘నేను కూడా నీవు చెప్పిన ఆ మాట గురించి ఆలోచించాను. అదే, నీవు స్పెర్మ్‌స్టోరేజి విషయంలో అమెరికాలో చేసుకున్న ఒప్పందం. నీ ప్రథమ సంతానం, భారతదేశానికే చెందాలన్నది. ఆ విషయంలో ఐ.వి.ఎఫ్‌ ‌పద్ధతిలో మన ఇంట్లోనే ఆ శాస్త్రవేత్తకు జన్మనీయోచ్చుగా?’’ ప్రశ్నించింది.

‘‘అదీ… ఆలోచించవచ్చు, నీ కోరికా తీరుతుంది. అందరూ ఒప్పుకుంటే…’’ చెప్పాడు.

‘‘దానికి నేను ఒప్పుకోను అత్తయ్యగారూ! నాకు కొన్ని నమ్మకాలున్నాయి. ఆ పద్ధతిలో నేను మోసే గర్భం, ప్రతి క్షణం, తన ఉనికిని నాకు గుర్తు చేస్తుంటుంది. అప్పుడు నేనూ మనశ్శాంతిగా ఉండలేను. దాని కన్నా సరోగేట్‌ ‌మదర్‌ని ఆశ్రయించ వచ్చు’’ చెప్పింది గాంధారి అనిష్టం కనబర్చి.

‘‘సరే! గాంధారి! నీ అభిప్రాయాల్ని కాదనను. ఏదో రూపంలో నా కుటుంబ వారసత్వం నాకందితే చాలు. నీ అండాలతో వ్యాస్‌, ‌జన్యుకణాలతో ఫలదీ కరించిన ఫలాన్ని సరోగెట్‌ ‌ద్వారా పొందుదాం. అప్పుడందరి సంశయాలు తీరి సంతోషం కలుగు తుందిగా’’ ఒప్పుకుంది సత్యవతి.

‘‘ఏమయితే నేం? నేనయితే అమ్మను కాలేనుగా?’’ బేలగా అంది గాంధారి.

– సంబరాజు లీల (లట్టుపల్లి)

About Author

By editor

Twitter
YOUTUBE