బహుళ ధృవ ప్రపంచం దిశగా సమీకరణాలు వేగంగా మారుతున్న క్రమంలో, తాను ఇంక ఎంత మాత్రం పెద్దన్నగా వ్యవహరించలేనని తెలిసినా, చింతచచ్చినా పులుపు చావదన్నట్టుగా అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో మోకాలు అడ్డుతూనే ఉంది. ఇటీవలే ఇరాన్‌తో చాబహార్‌ ‌రేవు అభివృద్ధి, నిర్వహణ కోసం ఇరాన్‌తో భారత్‌ ‌చేసుకున్న పదేళ్ల ఒప్పందంతో ఉలిక్కిపడిన అమెరికా భారత్‌పై కూడా ఆంక్షలు విధిస్తానని హెచ్చరించింది. ఈ పరిణామాలు చోటు చేసుకున్న రెండు వారాలలోపే ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ‌ప్రమాదంలో మరణించడంతో పలు కుట్ర సిద్ధాంతాలు అంతర్జాతీయ గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో  ఈ ప్రమాదం వెనుక అమెరికా అదృశ్య హస్తం ఉన్నదన్నది ఒకటి. ఇక సహజం గానే, హమాస్‌కు ఇరాన్‌ ‌మద్దతు ఇస్తోందన్న అక్కసుతో ఇజ్రాయెలే చేసిందన్నది మరొకటి. ఇలా అనేకం వినిపిస్తున్నా, అందరి కళ్లూ మాత్రం కొత్తగా ఇరు దేశాలూ చేసుకున్న ఒప్పందం పురోగమిస్తుందా లేదా అన్నదాని మీదే ఉండడం దాని ప్రాముఖ్యతను చెప్పకనే చెప్తుంది.

ఏమైనప్పటికీ, ఒక చారిత్రిక కీలక మలుపులో ఈ ఘటన చోటు చేసుకోవడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అందుకు కారణం చాబహార్‌ ‌రేవుకు, దానితో పాటుగా నిర్మించినున్న నార్త్‌సౌత్‌ ‌కారిడార్‌కు గల భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యమే. భారత్‌ ‌దృష్టిలో కీలక వ్యూహాత్మక ప్రాముఖ్యం కలిగిన పశ్చిమ ఆసియా అన్నది తన పొరుగు విస్తరణే. ముఖ్యంగా, ఇరాన్‌ ‌ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి కూడా దోహదం కీలక మిత్రదేశం. ఈ ప్రాంతంలో వివిధ దేశాలను కలుపుకునే గతిశీలత, భౌగోళిక రాజకీయ అంచనాలన్నీ కూడా ఇరాన్‌ ‌ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జరగాలని జియోపొలిటికల్‌ ‌విశ్లేషకులు అంటున్నారు. అటు రష్యాతో, చైనాతో, భారత్‌తోనూ సత్సం బంధాలు నడుపుతున్న ఇరాన్‌కు బుద్ధి చెప్పాలనుకున్న అమెరికా వ్యూహాత్మకంగా ఇండో-పసిఫిక్‌ ‌భావనను రూపొందించి, అందులో చైనాకు వ్యతిరేకంగా ఉన్న తమ కూటమిలో భారత్‌ను కూడా చేర్చింది. కానీ, 2021లో లద్దాక్‌తో జరిగిన ప్రతిష్టంభన తర్వాత, చైనాకు వ్యతిరేకంగా బలమైన దేశాలతో కలవడం తన ప్రయోజనాలకు మంచిది కాదనే విషయాన్ని భారత్‌ ‌గ్రహించిందని విశ్లేషకులు చెప్తున్నారు.

క్వాడ్‌ (‌క్వాడ్రిలేటరల్‌ ‌సెక్యూరిటీ డైలాగ్‌) ‌వంటి వేదికలన్నీ తమ భద్రతా ప్రాముఖ్యతను కోల్పోయిన ఫలితంగా, చైనాకు వ్యతిరేకంగా ఎటువంటి సముద్ర సంఘటనలో చేరేందుకు భారత్‌ ‌విముఖతను ప్రదర్శించడంతో యుఎస్‌ ఆకస్‌ (ఎయుకెయుఎస్‌), ‌స్క్వాడ్‌  (ఎస్‌క్యూయుఎడి) వంటి వేదికలను ఏర్పాటు చేస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి ఆందోళనకరమైనదే అయినా, యుఎస్‌,                     ‌యుకెతో పాటుగా ఫ్రాన్స్, ‌జర్మనీల ఉనికి కూడా అంతే ఇబ్బందికరమైనది. ఈ క్రమంలో హిందూ సముద్ర తీరప్రాంతాన్ని సామ్రాజ్యవాద శక్తులు ఆక్రమించకుండా,  దానిని కాపాడేందుకు సహక రించుకునేందుకు మనం ప్రాంతీయ సహకారాన్ని కూడగట్టుకోవడం అత్యవసరం. అందుకే, హిందూ మహాసముద్ర పశ్చిమ ప్రాంతంలోని దేశాలతో భారత్‌ ‌ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పుకున్నది.  సౌదీ అరేబియా, యుఎఇ, ఒమన్‌, ఇరాన్‌లతో కలిసి సముద్ర విన్యాసాలు నిర్వహిస్తున్నది కూడా ఇందుకే.

 భారత్‌తో గల బలమైన ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకోవాలన్నది ఇరాన్‌ ‌దివంగత అధ్యక్షుడు రైసీ భావించారు. అంతేకాదు, ఎదుగుతున్న భారతదేశాన్ని గుర్తించడమే కాకుండా, కశ్మీర్‌ ‌సమస్యను సానుకూల దృక్కోణంలో చూసి, చాబహార్‌ను భారత్‌ ‌మరింతగా అభివృద్ధి చేయాలని కోరుకున్నారని, అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, 2023లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ ‌సదస్సులో ఇరాన్‌ అభ్యర్ధిత్వాన్ని సమర్ధించి, దానిని సభ్యదేశంగా ఆహ్వానించిన అనంతరం,   ప్రధాని మోదీ, అధ్యక్షుడు రైసీ విరామంలో కలుసుకున్నారు. అనంతరం, వారు గాజాలో పరిణామాలతో పాటు, రెడ్‌సీలో హూతీ దాడులను గూర్చి కూడా చర్చించినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, అమెరికా ఆంక్షలకు జడవకుండా చాబహార్‌ ఒప్పందంతో ముందుకు పోవడం అన్నది ఇరాన్‌ ‌పట్ల పెరుగుతున్న విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.

భారత్‌తో ఇరాన్‌ ‌సంబంధాలు:

భారత్‌, ఇరాన్‌ల మధ్య సంబంధాలు ప్రాచీనమైనవి. ఇరుదేశాల మధ్య రాకపోకలు సహా అర్థవంతమైన సంబంధాలు ఉండేవి. 1947 వరకూ సరిహద్దులను పంచుకోవడంతో ఇరు దేశాలలో భాష, సంస్కృతి, సంప్రదాయాల మధ్య సంబంధాలు కనిపిస్తాయి. మార్చి ,1950లో దౌత్యపరమైన సంబంధాలను ఏర్పరచుకున్నప్పటి నుంచీ ఎన్నో ఒడుదుడుకులను దాటుకుని వచ్చాయి.

ప్రచ్ఛన్న యుద్ధకాలం (1950-1990)లో భారత్‌ ‌తటస్థ విధానాన్ని (నాన్‌- అలైన్‌మెంట్‌) అవలంబించినప్పటికీ, సోవియట్‌ ‌యూనియన్‌ (‌యుఎస్‌ఎస్‌ఆర్‌)‌తో  బలమైన సంబంధాలను కలిగి ఉండగా, ఇరాన్‌ ‌వెస్టర్న్ ‌బ్లాక్‌లో బహిరంగ సభ్య దేశంగా ఉంటూ యునైటెడ్‌ ‌స్టేట్స్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఈ కాలంలో భిన్న రాజకీయ ప్రయోజనాల కారణంగా భారత్‌, ఇరాన్‌ల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి.  ప్రచ్ఛన్న యుద్ధకాలానంతరం కూడా పరిస్థితి అంతగా మెరుగుపడలేదు. భారత్‌-‌పాకిస్తాన్‌ ‌సరిహద్దు ఘర్షణలలో ఇరాన్‌ ‌పాకిస్తాన్‌కే మద్దతు ఇస్తూ వచ్చింది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని భారత్‌ ‌బలంగా వ్యతిరేకించడం వెనుక ఉన్న కారణమిదే. దానికి తోడుగా, ఇరాన్‌-ఇరాక్‌ ‌యుద్ధ సమయంలో ఇరాక్‌కు భారత్‌ ‌మద్దతు ఇవ్వడం కూడా సంబంధాలను దెబ్బ తీసింది.

కాగా, 2019లో ఇరాన్‌పై యుఎస్‌ ఆం‌క్షలు విధించడంతో భారత్‌ ఆ ‌దేశం నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవడం నిలిపివేసింది. 2019కి ముందు ఇరాన్‌ ‌నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో రెండవ అతిపెద్ద కొనుగోలుదారు భారత్‌. ఇటీవలి కాలంలో, అంటే 2021లో ఇరు దేశాలూ తాలిబన్‌ ‌తిరిగి అప్ఘాన్‌ను తిరిగి కైవసం చేసుకునే వరకూ ఉన్న తాలిబన్‌ ‌వ్యతిరేక ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి.

ఇరుదేశాల మధ్య చమురేతర వాణిజ్యం కొనుసాగుతూనే ఉన్న 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 4.8 బిలియన్‌ ‌డాలర్లుగా ఉన్న వాణిజ్యం 2020-21 వచ్చేసరికి 56శాతం పడిపోయి 2.1 బిలియన్‌ ‌డాలర్లకు క్షీణించింది. మన దేశం నుంచి బియ్యం, తేయాకు, చక్కెర, తాజా పళ్లు, మందులు/ ఔషధాలు, చేతితో చేసిన స్టేపుల్‌ ‌ఫైబర్లు, ఎలక్ట్రికల్‌ ‌యంత్రాలు, కృత్రిమ ఆభరణాలు,   తదితరాలను ఎగుమతి అయ్యేవి. అక్కడి నుంచి మనం డైఫ్రూట్స్, ‌కర్బేనరత/ సేంద్రియ రసాయనాలు, గాజు, గాజు సామాగ్రి, సహజమైన, కృత్రిమ ముత్యాలు,  సహజమైన, కృత్రిమ రత్నాలు, లెదర్‌, ‌జిప్సం తదితరాలను దిగుమతి చేసుకుంటాం.

మారుతున్న ప్రపంచ సమీకరణాలను గుర్తించిన దివంగత అధ్యక్షుడు రైసీ భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే విధానాలను రూపొందించారు. దీనితో, 2023-24లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 2.33 బిలియన్‌ ‌డాలర్లకు పెరిగింది. ఈ క్రమంలోనే చాబహార్‌ అభివృద్ధికి 2016లోనే అత్యున్నత నాయకుడు ఖొమైనీ మార్గదర్శనంతో నాటి ఇరాన్‌ అధ్యక్షుడు, నాటి అఫ్ఘాన్‌ అధ్యక్షుడు ఒప్పందం చేసుకున్నారు. తాజాగా, మధ్య ఆసియా ప్రాంతానికి ప్రధాన ద్వారంగా కాగల చాబహార్‌ ‌రేవు అభివృద్ధికి ఒప్పందం చేసుకొని, ప్రాంతీయ స్థిరత్వం కోసం రైసీ ఒక అడుగు వేశారు.

రైసీ మరణంతో సంబంధాలు మారుతాయా?

ఈ సమయంలో ఆయన మరణం కారణంగా, ప్రాంతీయ సుస్థిరత, ఇంధన భద్రత, అనుసంధానంతో భారత్‌ ‌సంబంధం దెబ్బతింటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా, ప్రాంతీయ సంఘర్షణలపై ఇరాన్‌ ‌వైఖరి మారినా, అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకున్నా, మధ్యఆసియాకు సంబంధించి భారత్‌ ‌తీసుకున్న విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రాంతీయ సంఘర్షణల పట్ల దాని విధానంలో మార్పు లేదా, ఇతర దేశాలతో దాని సంబంధాలు భారత్‌ ‌భద్రతా లెక్కలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉన్నది. అయితే, ఇరాన్‌ అత్యున్నత నాయకుడు ఖమైనీనే విదేశాంగ, వాణిజ్య విధానాలపై అంతిమ నిర్ణయాలను తీసుకుంటారని, ఆయన మార్గదర్శనంలోనే చాబహార్‌ ‌రేవు ఒప్పందం జరిగిందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కనుక, ప్రాంతీయ వాణిజ్యానికి, భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకమైన చాబహార్‌ ‌రేవు వంటి ఆర్ధిక ప్రాజెక్టులకు భారత్‌ ఇప్పుడు దీర్ఘకాలిక ఒప్పందాలు, పెట్టుబడులతో ప్రాధాన్యత ఇవ్వవలసి ఉం టుంది. అంతేకాదు, యుఎస్‌తో సంబంధాలు, ఇరాన్‌తో బంధాల మధ్య సున్ని తమైన సమతుల్యతను నిర్వహిస్తూ, ఈ ఆంక్షల మధ్య ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది.

ఇరాన్‌ -‌పశ్చిమ ఆసియా పరిణామాలు:

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రమైన సమయంలో ఈ ప్రమాదం జరగడం ఒక కీలకాంశం. ఇజ్రాయెలీ నగరాలపై హమాస్‌ ‌దాడుల ఫలితంగా గత ఏడు నెలలుగా, ఇజ్రాయెల్‌, ‌గాజాల మధ్య యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో  హెజ్‌బుల్లాకు మద్దతునిస్తూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌ ‌మరొక యుద్ధ క్షేత్రాన్ని తెరిచిందనే ఆరోపణలను ఇరాన్‌ ఎదుర్కొంటున్నది. ఈ ఉద్రిక్తతల నేపథ్యమే రైసీ మరణం ద్వారా ఏర్పడబోయే పరిణామాలను అర్థం చేసుకోవడానికి కీలకం. గత నెలలో ఇజ్రాయెల్‌పైకి ఇరాన్‌ ‌క్షిపణులను ప్రయోగించడం, వాటిని ఇజ్రాయెల్‌ ‌డోమ్‌ ‌రక్షణ వ్యవస్థ ఆటంక పరచడం జరిగాయి. సిరియాలో గల ఇరాన్‌ ‌దౌత్య కార్యాలయంపై బాంబు దాడికి ప్రతిగా ఈ దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. దీనికి స్పందనగా, ఇరాన్‌లో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌ ‌ప్లాంట్‌ (‌యురేనియం శుద్ధికేంద్రం) గత ఇస్ఫహాన్‌ ‌ప్రావిన్సుపై ఇజ్రాయెల్‌ ‌పరిమిత దాడి చేసింది. ఈ కుక్క కాటుకి చెప్పుదెబ్బ చర్య ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తీవ్రం చేసిన క్రమంలో రైసీ మరణించడంతో ఇవి ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇరాన్‌లో అస్థిరత కొనసాగుతుందా?

దానితోపాటుగా, ఇరాన్‌లో కూడా కొంతకాలం పాటు అంతర్గతంగా అస్థిరత ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా, నాయకత్వ బదలాయింపు పక్రియను ప్రపంచమంతా సన్నిహితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే, అదే ఇరాన్‌ ‌దేశీయ విధానాలను, అంతర్జాతీయ దౌత్య సంబంధాల పద్ధతిని ప్రభావితం చేస్తుంది. అణు కార్యక్రమం, ఇజ్రాయెల్‌తో సంబంధాలు, యుఎస్‌తో చర్చలవంటివన్నీ కూడా భౌగోళిక రాజకీయ క్షేత్రాన్ని మలచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, ఈ ఘటన కారణంగా ఇరాన్‌ అం‌తర్గత భద్రత, రాజకీయ గతిశీల తలపై నిశిత పరిశీలన, స్పెక్యులేషన్‌కు తావిస్తుంది. ఎక్కడైనా బలహీనత లేదా అస్థిరత ఉందనే వదంతి వచ్చినా, అది శత్రువులకు మరింత ధైర్యాన్నిచ్చి,  ప్రాంతీయ, అంతర్జాతీయ సంబంధాలగుండా పయనించేందుకు ఇరాన్‌ ‌చేస్తున్న ప్రయత్నాలను సంక్లిష్టం చేస్తుంది.

భారత్‌, ఇరాన్‌, ‌మధ్య ఆసియా దేశాలకు లబ్ధిని చేకూర్చే ఈ అనుసంధాన ప్రాజెక్టు కొనసాగాలని ఇరానియన్లు కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే, రేవుతో పాటు, రష్యా వరకూ సాగే కారిడార్‌ ‌నిర్మాణం కూడా సాకారమయ్యి ఈ ప్రాంతమంతా సిరులపంటగా మారే అవకాశముంది.  అమెరికా ఆంక్షలతో ఆర్ధికవ్యవస్థ చెప్పుకోదగిన ఒత్తిడిలో ఉండటమే కాదు, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌ ‌ప్రజల మద్దతును కూడగట్టుకోవడం అక్కడి ప్రభుత్వానికి కష్టంగా ఉన్నదన్నది వాస్తవం.

-జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE