అసత్యాలు, అర్థసత్యాలు, విషపు వ్యాఖ్యలు, ఒక వర్గంపై మరొక వర్గానికి ద్వేషం కలిగించే ప్రచారాలు, అబద్ధపు హామీలు, మంచినీళ్లలా డబ్బు ఖర్చు.. ఇంత కష్టపడ్డా ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలలో కూడా ఫలితం దక్కలేదు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి విజయవంతంగా ప్రమాణ స్వీకారం చేశారు. వంద సీట్లు కూడా సాధించలేని పార్టీ, 240 స్థానాలను ఒంటిచేత్తో గెలిపించిన మోదీది నైతిక పరాజయమంటూ తన అక్కసును వెళ్లగక్కుతోంది. పదేళ్లపాటు అవినీతి, స్కాంలు అనే మాటలకు తావివ్వకుండా, ‘అభివృద్ధి’ మంత్రంతో దేశ ఆర్ధిక వ్యవస్థను పైపైకి తీసుకువెడుతున్న ప్రధాని మోదీ వైఖరి పలు పాశ్చాత్య దేశాలకు కూడా నచ్చడం లేదని ఈ ఎన్నికలలో బయటకు వచ్చిన విషయాలను బట్టి స్పష్టమవుతోంది.

పైకి చిరునవ్వులు చిందిస్తూనే లోపలి నుంచి విషాన్ని ఎక్కించేందుకు అవి కూడా ప్రతిపక్షాలకు సహకరించాయి. ముఖ్యంగా భారతీయుల జాతీయతా భావాన్ని, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు పాటుపడిన శక్తిమంతులు అనేకులు. పాశ్చాత్య మీడియా, డబ్బు, థింక్‌ ‌ట్యాంక్‌లు, మేధావులు, ర్యాంకింగ్‌ ‌సంస్థలూ అన్నీ కలిసి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా, వారి అబద్ధపు గోడలను బద్దలు చేసి తిరిగి బీజేపీనే గెలిచింది. బీజేపీ సంపూర్ణ మెజారిటీ స్వంతగా తెచ్చుకోలేదని నిరాశపడేవారికి ఈ ఎన్నికల వెనుక ఏం జరిగిందో, ప్రధాని ఎంతటి శక్తిమంతులతో తలపడి ఈ విజయాన్ని సాధించారో తెలుసుకోవడం అవసరం. ఇలా ఏ రకంగా చూసినా మోదీనే విజేత అన్నది వాస్తవం.

 ఇవన్నీ ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించేందుకు విదేశీ మద్దతుతో మన ఘనమైన ప్రతిపక్షాలు చేసిన పనులు. కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పదేపదే విదేశాలకు వెళ్లడం, భారత్‌లో ప్రజాస్వామ్యం దిగజారిపోతోంది కనుక విదేశాలు జోక్యం చేసుకొని కాపాడాలని విదేశీ గడ్డ మీద నుంచి విజ్ఞప్తులు చేయడాన్ని ప్రజలు ఇంకా మరచిపోయి ఉండరు. ఒక పథకం ప్రకారమే విదేశాలలో ఉన్న చీకటిశక్తులతో కలిసి కాంగ్రెస్‌ ‌వంటి పార్టీలు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రకరకాల ప్రచారం చేశాయి. భారతీయ ప్రజాస్వామ్య క్రియా శీలతను, మాన్యతను సవాలు చేసేందుకు భారత్‌లో ప్రజాస్వామ్యం దిగజారిపోతోంది, మోదీ నియంత, పెరుగుతున్న అసహనం, ద్వేషం వంటి మాట లన్నింటినీ సాధారణీకరించడంలో ప్రతిపక్షాలు విజయవంతమయ్యాయి. వీటికి తోడుగా స్వీడెన్‌కు చెందిన వీ-డెమ్‌ ‌వంటి విదేశీ థింక్‌ ‌ట్యాంక్‌లు పాశ్చాత్య దేశాలలో  జరుగుతున్న అరాచకాలను విస్మరించి భారతదేశంలో ప్రజాస్వామ్యం ర్యాంకింగ్‌ను అట్టడుగున ఉంచే ప్రయత్నం చేశాయి. అంతేనా? భారత్‌పై ఎప్పుడెప్పుడు బురదజల్లుదామా అని గోతికింద నక్కలా వేచి ఉండే పాకిస్తాన్‌కు కూడా ప్రధాని మోదీ నియంత కనుక రాహుల్‌ ‌ప్రధాని అయితే పరిస్థితులు చక్కపడతాయంటూ వ్యాఖ్యానించే అవకాశాన్ని ప్రతిపక్షాలు అనడం కంటే కాంగ్రెస్‌ ‌కల్పించిందనడం సమంజసం.అన్ని మార్గాలూ భగవంతుడి దగ్గరికే దారి తీస్తాయని విశ్వసించే భారతీయులు అనాదిగా సెక్యులరిస్టులే. కనుకనే, ఇన్ని మతాలు ఈ గడ్డమీద ఎటువంటి సమస్యా లేకుండా మనగలగడమే కాదు, మెజారిటీ ప్రజలను శాసిస్తున్నాయి. అయినప్పటికీ, హిందువులు సహిస్తూనే వస్తున్నారు. అటువంటి ప్రజలు తాము హిందువులమైనందుకు గర్వపడకూడదట! అలా వారు తమ అస్తిత్వాన్ని ప్రకటించుకుంటే మైనార్టీలకు అన్యాయం చేస్తున్నట్టే. ఈ ఎన్నికలలో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతున్నట్టుగా ప్రచారం జరగడానికి కారణమిదే. తమ మతమే అత్యున్నత మతమని, తమ మతంలో లేనివారంతా కాఫిర్లనీ భావించే మైనార్టీలుగా చెప్పుకునే ఇస్లామిస్టులు, వీరికి మద్దతు పలికే సెక్యులరిస్టులలో 85-90శాతం మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అయినా, ప్రస్తుత మోదీ కేబినెట్‌లో మైనార్టీలకు ప్రాతినిథ్యం లేదని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నిలబెట్టిన మైనార్టీ అభ్యర్ధికి బుద్ధి చెప్పేందుకు అతడికి ఓటు వేయనిది వారే అయినా, తప్పు బీజేపీది అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, ప్రపంచ యవనికపై తన ముద్ర వేస్తున్న భారత్‌ను నిలవరించ డమే లక్ష్యంగా పని చేస్తున్న విదేశీ శక్తులకు ఇక్కడి ప్రతిపక్షాల మద్దతు సంపూర్ణంగా లభించడంతో, ప్రధాని మోదీపై, భారత్‌లో పరిస్థితులపై బురద జల్లేందుకు మంచి అవకాశం కలిగింది. దీనితో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రచారం రకరకాల రూపాలను సంతరించుకుంది. భారత్‌లో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా తెలుసుకోకుండా, అధికార పార్టీ వ్యతిరేక శక్తుల మాటల్లో సత్యమెంతో చూడకుండా అక్కడి విద్యావేత్తలు, వార్తాపత్రికలు తాము అనుకున్న కోణంలో వార్తలు పత్రికలలోనూ, సోషల్‌ ‌మీడియా వేదికలపైన ప్రచారం చేశాయి. భారత్‌లో ఏవో ఘోరాలు జరిగిపోతున్నట్టు కొందరు యూట్యూబర్లు, ఎక్స్, ‌ఫేస్‌బుక్‌ ‌వంటి వేదికలపై లక్షలాదిమంది ఫాలోవర్లు కలిగిన ఇన్ఫ్లూయెన్సర్లు, బాట్‌ (‌యాంత్రిక వ్యవస్థ)ల ద్వారా ప్రచారం చేయించారు. అవినీతికి చోటు పెట్టకుండా, అభివృద్ధి గురించి మాత్రమే యోచించి పనిచేస్తూ, వాటి ఆధారంగానే ఎన్నికలలో విజయం సాధించే, భారతీయ అస్తిత్వాన్ని నిలపాలని అహరహం తపించే నరేంద్ర మోదీ అనే నాయకుడి పట్ల కలిగిన ద్వేషమే వారి చేత ఈ పనులు చేయిస్తోందన్నది నిర్వివాదం.

దిగజారుతున్న ప్రజాస్వామ్యం ముసుగులో…

వీరి ప్రచారమంతా దిగజారిపోతున్న భారతీయ ప్రజాస్వామ్య పరిస్థితి ముసుగులో సాగిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వ్యాఖ్యలు చేయడమన్నది కూడా నిజమైన ఆందోళన అనిపించేలా చేశారు. పాశ్చాత్య దేశాలు ఈ పనులు చేశారంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, వారు ఇంకా భారత్‌ ‌వలసదేశమనే భావనలో నుంచి బయటకు రాలేదు, ఇక్కడి మేధావులు కూడా అందుకు సహకరించారు. భారత్‌కు వ్యతిరేక ప్రచారాలు చేయడానికి, దేశంలో ఉన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపించి వోటరును భయపెట్టడానికీ విదేశీ శక్తులు చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశంలో ఉంటున్న రాజకీయ పార్టీలు సహకరించడమే అత్యంత హేయమైన విషయం.

ఇందులో వాస్తవావాస్తవాలు భారతీయులకు తెలియనివి కావు. అధికార యంత్రాంగానికి తెలిసినా వారు సాధారణ వ్యాఖ్యలకు మించి చేయలేదు. విదేశీ శక్తులు తమ అభిప్రాయాలను ప్రకటించడమే కాదు, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నా యంటూ ప్రధాన మంత్రి అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌. ‌జయశంకర్‌ అం‌తర్జాతీయ ఖాన్‌ ‌మార్కెట్‌ ‌గ్యాంగ్‌ అం‌టూ విదేశీ శక్తులు ఆడుతున్న మైండ్‌ ‌గేమ్స్‌ను పట్టి చూపుతూ, వారికి భారత్‌లో అధికారంలో కొందరు వ్యక్తులు ఉండటం కావాలని, కానీ భారతీయ వోటర్లు అందుకు భిన్నమైన తీర్పును ఇస్తే వారు సహించలేరంటూ ఒక సందర్భంలో వివరించారు. సాధారణంగా అత్యంత సంయ మనాన్ని, అప్రమత్తతను పాటించే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన యుఎస్‌ ‌కమిషన్‌ ఆన్‌ ఇం‌టర్నేషనల్‌ ‌రెలీజియస్‌ ‌ఫ్రీడం (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌)‌ను రాజకీయ అజెండా కలిగిన పక్షపాత వైఖరి కలిగిన సంస్థ అని బహిరంగంగా పేర్కొనడమే కాదు, భారతీయ ఎన్నికల పక్రియలో అది జోక్యం చేసుకుంటోందంటూ ఆరోపించింది. తాజాగా యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ ‌వెలువరిచిన నివేదికలో భారత్‌ను ఆందోళన కలిగించే దేశంగా వర్గీకరించడమే కాదు, దానిని బర్మా, చైనా, క్యూబా, ఇరాన్‌, ‌నికరాగువా, పాకిస్తాన్‌, ‌రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్‌, ‌తుర్కమెనిస్తాన్‌ ‌సరసన నిలిపింది.

నిజానికి ఈ రకమైన ప్రభావితం చేసే కార్య కలాపాలు బహిరంగం కావు, చర్చకు రావు. కానీ, వోట్ల లెక్కింపు రోజుకు ఒక్కరోజు ముందు, భారత్‌లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు అమెరికా, యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దేశాలు పాశ్చాత్య మీడియా సంస్థలకు, థింక్‌ట్యాంక్‌ ‌లకు, మేధావులకు, విద్యావేత్తలకు లక్షలాది డాలర్లను ఎలా కుమ్మరించాయో బహిరంగమైంది.

కుల గణనే ట్రంప్‌కార్డని భావించిన రాహుల్‌

‌రాహుల్‌ ‌గాంధీ తన రాజకీయ భవిష్యత్తును కుల గణనపై పణంగా పెట్టి తన ప్రచారాన్ని అంతటినీ దాని ఆధారంగానే చేసుకున్నారు. దేశంలో ఇప్పుడిప్పుడే తలెత్తుతున్న హిందూ అస్తిత్వ భావనను ధ్వంసం చేసి, తిరిగి వారిని కులాల వారీగా విభజించడం ద్వారా లబ్ధి పొందాలన్నదే వారి ఎత్తు. ఇదే పంథాను ఇతర ప్రతిపక్షాలు అనుసరించడం గమనార్హం కూడా. దీనివెనుక ఉన్న విదేశీ ఇండాలజిస్టు జెఫర్‌లా ఈ భావనను ఒక పథకం ప్రకారం బహిరంగ వేదికపైకి తేగా, ప్రతిపక్షాలు దానిని అందుకుని ప్రచారం చేశాయి. భారతదేశంలో గల అశోకా యూనివర్సిటీలోని త్రివేదీ సెంటర్‌ ‌జెఫర్‌లాకు తోడ్పడింది. వారు రూపొందించిన తప్పుల తడికల పరిశోధన, నివేదిక వివాదాస్పదం అయ్యాయి కూడా. ఒకవైపు కులమత భేదం లేకుండా అందరికీ సమానమైన లాభాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోతోందన్న భావనను పెంచేందుకు భారత్‌ ‌వ్యతిరేక శక్తులైన ఐఎస్‌ఐ ‌గూఢచారులు లేక అతివాద ఇస్లామిస్టులు వీధి ప్రదర్శనలు సహా రకరకాలుగా పాటుపడ్డారు. రష్యా నుంచి భారత్‌ ‌చమురును కొనుగోలు చేయడానికి వ్యతిరేకంగా ఐరోపాలో ప్రచారం చేయడంలో, విస్త్రత, సూక్ష్మ ఇతివృత్తాలను నిర్మించి వాటిని ప్రచారం చేయడంలో కొందరు మోదీ వ్యతిరేక భారతీయ మేధావులు కోట్లు సంపాదించి ఉంటారనడం అతిశయోక్తి కాబోదేమో!

రికార్డు స్థాయిలో ఎన్నికలు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 64.2 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ప్రపంచ రికార్డు. ఎందుకంటే, ఇది జి7 దేశాలు మొత్తం ఓటర్ల సంఖ్య కంటే 1.5 రెట్లు ఎక్కువ కాగా, 27 ఐరోపా యూనియన్‌ ‌దేశాలలో వోటర్ల కంటే 2.5 శాతం ఎక్కువని భారతీయ ఎన్నికల కమిషన్‌ ‌వెల్లడించింది. ఎటువంటి అవకతవకలు, దుర్ఘటనలు జరుగకుండా ఇంత భారీ ఎత్తున ఎన్నికల నిర్వహించిన రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ ‌విశ్వసనీయతను కూడా సిగ్గు అంటే ఏమిటో తెలియని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు వోటింగ్‌ ‌చేసినవారిలో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. కాగా, మండువేసవిలో 1.5 కోట్లమంది పోలింగ్‌, ‌పోలీసు, పారా మిలటరీ సిబ్బంది 44 రోజులలో ఏడు దశలలో ఎన్నికలు నిర్వహించేందుకు అహర్నిశం శ్రమించారు. దాదాపు 68,763 పర్యవేక్షణ బృందాలు, 135 ప్రత్యేక రైళ్లు, నాలుగు లక్షలకు పైగా వాహనాలు, 1,692 విమానాల రాకపోకలు ద్వారా ఎటువంటి ఆటంకాలూ లేకుండా ఎన్నికల జరిగాయి. నిజానికి, 140 కోట్లమంది ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాపాడటంలో ఉన్న సంక్లిష్టతను, పరిమాణాన్ని అర్థం చేసుకుంటే, ఏ దేశం కూడా భారత్‌తో సరిసమానం కాదనే విషయం అర్థమవుతుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు భారత్‌లో ప్రజాస్వామ్యం లేదని ప్రచారం చేసి, ఆందోళన చెందడంలోని వాస్తవాన్ని ప్రజలు గుర్తించడం వారి బాధ్యత.

ఎన్నికలో మోదీ విజయాలు

2019లో గెలుచుకున్న 303 స్థానాల్లో బీజేపీ 208 స్థానాలను నిలుపుకుని, 68శాతం నిలకడను ప్రదర్శించింది. అంటే, మోదీకి లేక బీజేపీకి వ్యతిరేకత అంత తీవ్రంగా లేదనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాదు, 33 స్థానాల వ్యాప్తంగా 6 లక్షల ఓట్లు వచ్చి ఉంటే బీజేపీకి స్వంతంగా మెజారిటీ వచ్చి ఉండేది. ఈ స్థానాలలో కేవలం 2000 నుంచి 8000 వేల ఓట్లతో బీజేపీ ఓడిపోయింది. అంటే దేశ్యాప్తంగా అధికార వ్యతిరేక లేదా మోదీకి లేక బీజేపీకి వ్యతిరేకత అంత తీవ్రంగా లేదని తెలుస్తోంది. దాదాపు 11 రాష్ట్రాలు- యూటీలలో 32 కొత్త నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుందంటే దాని అర్థం దేశవ్యాప్తంగా బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే భావన నెలకొందన్న మాట. ఇవి భిన్న రాష్ట్రాలలో ఉన్నవి. రాష్ట్రాలలో గతంలో ఏరకంగానూ ఉనికి లేని బీజేపీ ఎదుగుతున్నదన్నమాట.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్‌ ‌పార్టీతో నేరుగా తలపడిన 92 స్థానాలలో బీజేపీ కేవలం 42 స్థానాలను మాత్రమే కోల్పోయింది. అంతేకాదు, కాంగ్రెస్‌తో నేరుగా తలపడినప్పుడు బీజేపీనే ప్రజలకు మొదటి ఎంపిక. ఉత్తరాది పార్టీ అని ముద్ర వేసిన బీజేపీకి దక్షిణాదిలో వచ్చిన మొత్తం ఓట్లు 39,465,778 కాగా, కాంగ్రెస్‌కు పోలైనవి 39,165,682 మాత్రమే. అక్కడ గల మొత్తం 131 స్థానాలలో కాంగ్రెస్‌ 94‌లో, బీజేపీ 88లో పోటీ చేయగా పోలైన ఓట్లు ఇవి. దాదాపు 3 యూటీలలో, 7 రాష్ట్రాలలో 50శాతం ఓట్లతో బీజేపీ ముందుండగా, కాంగ్రెస్‌ 2 ‌యూటీలు, ఒక రాష్ట్రంలో అటువంటి ఫలితాన్ని చూపింది. అంటే, చాలా ప్రాంతాలలో ప్రజలు బీజేపీ పక్షానే ఉన్నారన్నమాట. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్‌ ఎం‌త విఫలమైందో దానికి వచ్చిన 21.9 శాతం ఓట్లే చెప్తున్నాయి. బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 36.5 శాతంగా ఉంది. ఇక మహిళా వోటర్లు పురుషులకన్నా 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఎన్డీయే 22 స్థానాలలో 18 (82శాతం) సాధించిందంటే, వారు మెజారిటీ వోటర్లుగా ఉన్న ప్రాంతాలలో మహిళా ఓటర్లు బీజేపీనే విశ్వసించారన్న మాట.

చిత్రమైన విషయం ఏమిటంటే, 2004లో మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రధాని అయినప్పుడు ఆయన పోటీ చేసి గెలవలేదు. ఆయన ఎంపిక అయ్యారు తప్ప ఎన్నిక కాలేదు. ఆయన పోటీ చేసిన 2009లో కాంగ్రెస్‌ ‌పార్టీకి మెజారిటీ తెప్పించలేకపోయినా, నిర్మొహమాటంగా ప్రమాణ స్వీకారం చేశారు.

సౌకర్యవంతంగా ఈ విషయాలన్నీ మరచిపోయి ప్రతిపక్షాలలోని అనేకమంది ప్రధాని మోదీ మూడవ పర్యాయం ప్రధాని బాధ్యతలు స్వీకరించడానికి ఆయనకు అధికారమే లేనట్టు వేలెత్తి చూపిస్తున్నారు.

తన జాతీయ శక్తిని పెంచుకుని, ప్రజాస్వామ్య విలువలను నిలబెడుతున్న క్రమంలో జాతి వ్యతిరేక శక్తులను ఏరిపారేసేందుకు కఠినమైన చర్యలు తీసుకో వలసిన సమయం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌కు ఆసన్నమైంది.

-జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE