నానాటికీ విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వేసవి వచ్చిందంటే జనానికి వణుకు పుట్టేస్తోంది. విపరీతమైన ఎండలు, కాలుష్యం కారణంగా రాత్రి అయినా చల్లబడని భూమి, కనీసం ముఖమాటానికైనా వీచని గాలి తెర… అన్నీ కలిసి ప్రజలకు అనారోగ్య సమస్యలను అందిస్తున్నాయి. కాంక్రీటు జంగిళ్లల్లో జీవించడమే ఆధునికత అనుకుని నగరాలకు వచ్చిన ప్రజల జీవితాలు వేసవి వచ్చిందంటే దుర్భరమవుతున్నాయి. పర్యావరణ కాలుష్యానికి దోహదం చేసే ఎయిర్‌ ‌కూలర్లు, ఎయిర్‌ ‌కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు లేకుండా వేసవి గడవడం లేదు. దీనికి అదనంగా, ఎల్‌నినో వంటి దృగ్విషయాల కారణంగా రుతుపవనాలు కూడా గతి తప్పడంతో ఏడాది పొడవునా వేసవి కాలం ఉన్నట్టే ఉంటున్నది.

ఈ పరిస్థితులకు ప్రధాన కారణాలలో అడవుల నిర్మూలన ఒకటి. పెరిగి పోతున్న జనాభాతో పాటుగా అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు అడవులను నరికివేసి వ్యవసాయం కోసం భూమిని ఉపయోగించడం లేదా ప్రాజెక్టులను, జనావాసాలను నిర్మించడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. బ్రెజిల్‌ ‌తర్వాత అత్యధికంగా అడవులను నరికివేసిన దేశం మనదే. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ చర్య పర్యావరణ, ఆర్ధిక, సామాజిక గతిశీలతకు సంబంధించింది కావడం సహజమే. భారత్‌లో పెరుగుతున్న జనాభా, వ్యవసాయ భూముల డిమాండ్‌ ‌కారణంగా అత్యంత వేగంగా అడవులను నిర్మూలిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అడవుల పెంపకానికి సరైన వ్యూహం లేకుండా ఉన్నవాటిని నిర్మూలించడం అన్నది అక్కడి జీవవైవిధ్యం, జంతువుల సహజ ఆవాసాలు, పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

గణాంకాల ప్రకారం 2001 నుంచి 2023 వరకూ దేశంలో అత్యధిక శాతంలో (60శాతం) అడవిని కోల్పోయిన ప్రాంతాలు 5. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలే ఇందులో ముందున్నాయి. అందులో 324 కిలోహెక్టేర్ల (ఒక కెహెచ్‌ఎ 1000 ‌హెక్టేర్లతో సమానం) మేరకు అడవుల నరికివేతతో అస్సాం మొదటి స్థానంలో ఉండగా, తర్వాత స్థానంలో 312 కెహెచ్‌ఎలతో మిజోరాం, 262 కెహెచ్‌ఎతో అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, 259 ‌కెహెచ్‌ఎతో నాగాలాండ్‌, 240 ‌కెహెచ్‌ఎతో మణిపూర్‌ ‌వరుసగా ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. దేశంలో దీని సగటు 66.6 హెక్టేర్లగా ఉండగా ఈ రాష్ట్రాలలో మాత్రం అత్యధికంగా ఉంది.

గత మూడు దశాబ్దాలలో భారత్‌లో అత్యధికంగా అడవుల నిర్మూలన• జరిగిందని, 2015-2020 మధ్య అత్యధికంగా జరిగిందని యునైటెడ్‌ ‌కింగ్డమ్‌కు చెందిన ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలను పోల్చే ‘యుటిలిటీ బిడ్డర్‌’ అనే వెబ్‌సైట్‌ ‌విడుదల చేసిన నివేదిక పేర్కొంటోంది. ఈ ఐదేళ్లలో 668,400 హెక్టేర్ల అటవీ నిర్మూలనతో బ్రెజిల్‌ ‌తర్వాతి స్థానంలో భారత్‌ ఉం‌దని పేర్కొంది. పామాయిల్‌ ‌సాగు, మాంసం కోసం పశువుల పెంపకం, నిర్మాణం కోసం చెట్లను కొట్టి రవాణా చేయడం కూడా అడవుల నరికివేతకు కారణాలలో కొన్ని. ఈ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 678,744 హెక్టేర్ల అడవుల నరికివేత కొనసాగుతోంది.

అడవుల నరికివేత కారణంగా ఏర్పడే నష్టాలు అనేకం. పర్యావరణపరంగా చూసినప్పుడు చెట్ల నీడ లేకపోవడంతో స్థానికంగా వేడిపెరిగిపోతుంది. ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల అంటే, భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడమే, గ్లోబల్‌ ‌వార్మింగ్‌ అం‌టే ఇదే. ఇది మన స్వయంకృతాపరాధమేననడం అతిశయోక్తి కాదు.

పెరుగుతున్న ఉపరితల తాపమానాలు- తీవ్రమైన వడగాలులకు (హీట్‌వేవ్‌), ‌మారిన వాతావరణ పద్ధతులకు దారితీసి పర్యావరణ వ్యవస్థకు, జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తాయి.

వర్షపాతం తరుగుదల

నీటి ఆవృత్తిలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. వాటి నష్టం అవక్షేపణను తగ్గిస్తుంది, ఇది వేడిని పెంచుతుంది. దీనికి తోడుగా అడవుల నిర్మూలన, పర్యావరణ మార్పులవల్ల వానలు తగ్గి కరువులు, జీవావరణ నష్టానికి కారణమయ్యి, వ్యవసాయం, నీటి సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. అడవుల నరికివేత వలన వృక్షాల వ్యాప్తి తగ్గిన ఫలితంగా నీటి చక్రానికి అంతరాయం ఏర్పడుతుంది. ఇది మేఘాలు తక్కువగా ఏర్పడటానికి, స్వల్ప వర్షపాతానికి దారి తీస్తుంది.

ఆవాసాల విధ్వంసం, కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవులు అతి దోపిడీ వల్ల జీవవైవిధ్యం కోల్పోవడం వలన పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. జీవవైవిధ్యం పర్యావరణ వ్యవస్థలను బలహీనపరిచి, పరాగసంపర్కం, నీటి శుద్దీకరణ, వాతావరణ క్రమబద్ధీకరణ వంటి సేవలను దెబ్బతీయడమే కాక మానవ, భౌగోళిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

అడవులను నిర్మూలించినప్పుడు, ఈ పర్యావరణ వ్యవస్థలలో నివసించే విభిన్న జాతులు స్థానభ్రంశం చెంది నిరాశ్రయం అవుతాయి లేదా నశిస్తాయి. ఫలితంగా జీవ వైవిధ్యం గణనీయంగా క్షీణిస్తుంది. తగ్గిన జీవవైవిధ్యం జన్యు వైవిధ్యాన్ని పరిమితం చేసి, మారుతున్న వాతావరణాలకు అనుగుణంగా జాతుల సామర్థ్యాన్ని అడ్డుకుని పర్యావరణ క్షీణతను మరింత పెంచుతుంది.

అడవుల నిర్మూలన కారణంగా వాతావరణానికి బహిర్గతమయ్యే నేలలు భూక్షయానికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇది భూమి నాణ్యతను మరింత క్షీణింపచేస్తుంది. అటవీ నిర్మూలన ప్రధాన దుష్ప్రభావం భూక్షీణత, ఇది పర్యావరణ ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పాదకతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. అడవులను నరికినప్పుడు, నేల మూలకాలకు బహిర్గతమవుతుంది. చెట్ల రక్షణ కవచం, వేర్లకు బంధన స్వభావం లేకపోవడంతో, నేల త్వరగా దాని సమగ్రతను కోల్పోయి కోతకు, పోషకపదార్ధాల క్షీణతకు, భూసార తగ్గుదలకు దారితీస్తుంది.

అడవుల నిర్మూలన అనేది అడవి, దాని చుట్టుపక్కల ప్రాంతాల సూక్ష్మ వాతావరణాన్ని మార్పునకు లోనుచేసి, స్థానిక వాతావరణ పరిస్థితులు సహా, మొత్తంగా ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. ప్రకృతి సహజమైన అడవులు, జలాశయాలు, స్థలాకృతి కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కన్నా భిన్నంగా ఉండే స్థానిక వాతావరణ జోన్లను సూక్ష్మవాతావరణాలు అంటారు.

కర్బనవాయువు స్థాయు పెరుగుదల అన్నది మానవులకే కాదు పర్యావరణానికి కీడు చేసే అంశం. అడవుల నరికివేత వాతావరణంలోని కర్బనవాయువు (సిఒ2) స్థాయులు పెరగడానికి దోహదం చేస్తుంది. గ్లోబల్‌ ‌వార్మింగ్‌కు కారణమైన హరిత గృహ వాయువుకు ప్రాథమిక కారణం ఇదే.

నిజానికి అడవులు వాతావరణం నుంచి కర్బన వాయువులను పీల్చుకొని, ప్రధానంగా తమ జీవద్రవ్యంలోనూ, మట్టిలోనూ నిల్వ చేస్తాయి. అడవులను నిర్మూలించినప్పుడు, చెట్లలో నిల్వ చేసిన కార్బన్‌ ‌వాతావరణంలోకి విడుదల అవుతుంది. అడవులను దహనం చేయడం లేదా లేదా విచ్ఛిన్నం చేయడం ద్వారా నిర్మూలించినప్పుడు అవి కర్బన వాయువును నిల్వచేసే సామర్థ్యాన్ని చాలావరకూ కోల్పోతాయి.

అడవుల నిర్మూలన వన్యప్రాణుల ఆవాసాలు నష్టానికి ప్రత్యక్షంగా దారితీస్తుంది. ఇది పర్యావరణంపై తక్షణ, తిరుగులేని ప్రభావాన్ని చూపిస్తుంది. ఆశ్రయం, ఆహారంతో పాటుగా విస్తారమైన జీవులకు పోషక స్థలంగా ఆడవులు సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఈ అటవీ ప్రదేశాలను నరికివేయడం అన్నది, వాటిపై ఆధారపడిన వివిధ జాతుల జీవులు మరొక చోటును వెతుక్కుంటూ వెళ్లడానికి లేదా అంతరించి పోవడానికి కానీ ప్రత్యక్ష, ప్రధాన కారణమవుతుంది.

అడవుల కొట్టివేత అన్నది నీటి చక్రాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపడమే కాదు, జలవనరుల లభ్యత, పంపిణీని గణనీయంగా మారుస్తుంది. వర్ష పాతాన్ని గ్రహించి, నీటి ఆవిరిని తిరిగి వాతావరణం లోకి విడుదల చేయడం ద్వారా జలసంబంధ చక్రంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయి.ఈ పక్రియ వాతావరణంలో తేమ స్థాయిను నిర్వహించడమే కాక, వాటర్‌షెడ్‌ల (పరీవాహక ప్రాంతాల మధ్యస్థలం)లో నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.

అడవుల నిర్మూలన ద్వారా వృక్ష, జలసంపద ఎలా నష్టపోతామో క్లుప్తంగా-

అడవులలో జీవించే అనేక జాతులు ఇతర వాతావరణాలలో జీవించలేవు, మనలేవు. వాటి ఆవాసాలు, ఆశ్రయాలు ధ్వంసం అయినప్పుడు అవి కొత్త పరిసరాలలో ఇమడలేకపోవడం అన్నది వాటి జనాభా క్షీణతకు దారి తీస్తుంది.

చెట్లు, ఇతర వృక్షాలను తొలగించడం అన్నది ఈ పర్యావరణ వ్యవస్థలకు ప్రత్యేకమైన మొక్కలు, జంతువులను తొలగించడం ద్వారా జీవవైవిధ్యం తగ్గుతుంది.

అడవుల నిర్మూలన వల్ల తరచుగా అడవులలోని మిగిలిన ప్రాంతాలు ఛిన్నాభిన్నం అవుతాయి. దీనివల్ల భిన్న జాతులు చిన్న సమూహాలుగా వేరు అవుతాయి. జన్యుపరంగా తక్కువ వైవిధ్యం కలిగి ఉండేవి, అంతరించిపోయే ప్రమాదాన్ని ఎక్కువ కలిగి ఉంటాయి.

సారవంతమైన భూములు ఎడారులుగా మారే మరుభూమి పక్రియను అడవుల నిర్మూలన గణనీయంగా ప్రోత్సహిస్తుంది. సాధారణంగా అడవుల నిర్మూలన, కరవు, ఆ భూమికి తగని సాగు చేపట్టడం వంటి కారణాల ఫలితంగా ఈ పరివర్తన సాధ్యమవుతుంది. అడవులను కొట్టివేసినప్పుడు, వృక్ష ఛాయ లేకపోవడం అన్నది భూసార క్షీణతకు దారి తీయడమే కాదు, తేమను ఎక్కువకాలం నిలిపి ఉంచలేకపోవడం వల్ల ఎడారి వంటి పరిస్థితులు విస్తరించడానికి దోహదం చేస్తుంది.

వాయు కాలుష్యం పెరుగుదల

అడవుల నిర్మూలన అనేది వాయు కాలుష్యానికి గణనీయంగా దారి తీస్తుంది. విస్తృత స్థాయిలో అడవులను తొలిగించిన ఫలితంగా వచ్చే ఈ పరిణామాన్ని సాధారణంగా పరిగణనలోకి తీసుకోరు. చెట్లు సహజంగా గాలి నుండి కాలుష్య కారకాలను సహజంగా వడపోసి, కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ‌వంటి వాయువులను గ్రహించి, ఆక్సిజన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి.చెట్లను నరికివేసినప్పుడు, ఈ సహజ వడపోత వ్యవస్థను కోల్పోవడమే కాక, అటవీ నిర్మూలన చర్య తరచుగా వాయు కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది.

ఆరోగ్య పరిణామాలు

శరీరం సహజంగా తగినంతగా చల్లబడి, సాధారణ ఉష్ణోగ్రతను కలిగి ఉండనప్పుడు ఉష్ణ ఒత్తిడి ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన ఈ పరిస్థితిని తీవ్రం చేయడంతో, ఇది స్థానిక- భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదం చేస్తుంది.

చెట్లు, అడవులు నీడను అందించడం, జల విసర్జన ద్వారా తేమను విడుదల చేయడంవల్ల తగిన, సాధారణ వాతావరణం ఏర్పడుతుంది. ఇది పర్యా వరణాన్ని చల్లబరుస్తుంది.

శ్వాసకోశ సమస్యలు

ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే శ్వాసకోశ రుగ్మతలు అటవీ నిర్మూలన వంటి పర్యావరణ కారకాల వల్ల మరింత తీవ్రమవుతాయి. అడవులను నరికివేయడం వల్ల వాయు కాలుష్యం-పార్టిక్యులేట్‌ ‌మ్యాటర్‌, ‌కార్బన్‌ ‌మోనాక్సైడ్‌, ఓజోన్‌, అస్థిర కర్బన సమ్మేళనాలు అన్నీ పెరిగి శ్వాసకోశ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అటవీ నిర్మూలనతో ముడిపడి ఉన్న శ్వాసకోశ రుగ్మతలను ఎదుర్కోవ డానికి, అడవుల పెంపకం, కఠినమైన భూవిని యోగం, చెత్తను దహనం చేయడంపై నియంత్రణల ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచడం అవసరం.

నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు

అటవీ నిర్మూలన వలన నీటి నాణ్యత క్షీణించి, కలుషిత నీటి సరఫరా వల్ల నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరిగే అవకాశముంది. అడవులను నరికి వేయడం వలన వర్షపాతాన్ని గ్రహించి, కాలుష్య కారకాలను వడపోసే చెట్లు తగ్గి, కాలుష్యాల ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది నదులు, సరస్సుల వంటి నీటి వనరులను కలుషితం చేస్తుంది.

ఆహార భద్రతా సమస్యలు

అడవీ నిర్మూలన పర్యావరణ వ్యవస్థలను, వ్యవసాయ ఉత్పత్తిని భంగపరిచి ఆహారభద్రతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అంటే, పోషకాహార అందుబాటును పరిమితం చేస్తుంది. చెట్లను కొట్టడమన్నది భూకోతకు , నీటి చక్రాలలో మార్పుకు, పర్యావరణ మార్పులకు దారి తీసి పంట సేద్యాన్ని, పశుసంపద పెంపకాన్ని ప్రభావితం చేస్తుంది. ఇటువంటి ప్రాంతాలలో ఆహార భద్రతా సమస్యను పరిష్కరించేందుకు స్థిరమైన భూ నిర్వహణ, అడవుల పెంపకం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అవసరం అవుతాయి.

ఇక. అడవుల నిర్మూలన వ్యక్తులను, భూములను ప్రమాదకర అల్ట్రావయొలెట్‌ (‌యువి) కిరణాలకు కూడా బహిర్గతం చేస్తుంది. చర్మ కాన్సర్‌, ఇతర ఆరోగ్య సమస్యలు దీనివల్ల పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. చెట్లు, అడవులు అనేవి భూమికి సహజమైన పందిరిలా ఉండి దానిని ప్రత్యక్ష సూర్యరశ్మి నుంచి కాపాడతాయి. ఈ చెట్లను తొలగించినప్పుడు, ఈ రక్షణ కవచం తొలిగిపోయి యువి రేడియేషన్‌కు ఎక్కువగా బహిర్గతం అవుతాం.

ఔషధ వనరుల నష్టం

అడవుల నిర్మూలన వల్ల ఔషధ వనరులను కోల్పోవడం అన్నది ఆరోగ్య సంరక్షణ, సాంప్రదాయ వైద్యంపై గణనీయమైన ప్రభావాలను చూపుతుంది. ఔషధ మొక్కలు, మూలికలు సాంప్రదాయ చికిత్సలలో, ఔషధ పరిశోధనలలో ఉపయోగించే ఇతర సహజ సమ్మేళనాల వంటి గొప్ప వనరులకు అడవులు మూలంగా ఉంటాయి. ఈ విలువైన వనరులను కోల్పోవడం వైద్యపరమైన ఆవిష్కరణలను పరిమితం చేయడమే కాక అటవీ-ఆధారిత చికిత్సలపై ఆధారపడే సమాజాలను ఆటంక పరుస్తుంది. విస్త్రత ప్రజారోగ్య ప్రభావాలను అడవుల నిర్మూలన పట్టి చూపుతుంది.

గ్లోబల్‌ ‌వార్మింగ్‌

అడవుల నిర్మూలన వాతావరణంలోకి గణనీయమైన మొత్తంలో కార్బన్‌ ‌డయాక్సైడ్‌ (‌సీఓ2)ను విడుదల చేయడం ద్వారా గ్లోబల్‌ ‌వార్మింగ్‌కు దోహదం చేస్తుంది. అడవులు సీఓ2ని గ్రహించే కార్బన్‌ ‌సింక్‌లుగా పనిచేస్తాయి. అయితే చెట్లను కొట్టివేసినప్పుడు లేదా కాల్చినప్పుడు, అవి నిల్వ చేసిన కార్బన్‌ను విడుదల చేసి, హరితగృహ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయి. ఈ పక్రియ హరిత గృహ ప్రభావాన్ని తీవ్రతరం చేసి, ఉష్ణోగ్రతలు పెరగడానికి, వాతావరణ నమూనా లను మారడానికి దారితీస్తుంది.

భారతదేశంలో అటవీ నిర్మూలన వాతా వరణ మార్పులను మరింత తీవ్రతరం చేసి, వడ గాలులు, అనూహ్య వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై, మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలకు దారితీస్తోంది. అటవీ విధ్వంసం అన్నది జీవవైవిధ్య నష్టం, వాతావరణ మార్పు వనరుల క్షీణతతో సహా శాశ్వత పర్యావరణ హానిని కలిగించి, భవిష్యత్తు తరాలకు భారం అవుతుంది. ప్రకృతి ప్రకోపాల నుంచి రక్షిత అడ్డంకులుగా అడవులు పని చేస్తాయి. వీటిని తొలగిస్తే, కొండచరియలు విరిగిపడటం, వరదల, భూక్షయ ప్రమాదం తీవ్రతరమవుతుంది. అందుకే, ‘‘వృక్షో రక్షతి రక్షిత:’’ అన్నారు పెద్దలు!

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అనేక లాభాలు కనిపిస్తున్నాయి.

గాలి నాణ్యత పెరుగుదల

మానవజాతికి సైన్స్ అనేది ఒక గొప్ప వరం. అయితే, దానివల్ల సంభవిస్తున్న కాలుష్యం శాపంగా మారుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచంలోని 15 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 14 భారత్‌లోనే ఉన్నాయి. గాలి కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు, కేంద్ర ప్రభుత్వం జనవరి 2019లో జాతీయ స్వచ్ఛ వాయు కార్య క్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ఐదేళ్ల ప్రణాళిక కింద 2024 నాటికి పీఎం 2.5, పీఎం 10 కాలుష్య స్థాయిలను 20-30 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత 102 నగరాల్లో అమలు చేసిన ఈ పథకాన్ని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా 122 నగరాలకు విస్తరించారు. వాయుకాలుష్యాన్ని నియంత్రించి, కాలుష్య నిర్వహణ చర్యలు ఈ కార్యక్రమంలో భాగం. ఫలితంగా దేశంలో మంచి గాలి నాణ్యత ఉన్న రోజులు 2016లో 106 ఉంటే, అవి 2020 నాటికి 218కి పెరిగాయి. గాలి నాణ్యత లేని రోజులు 156 నుంచి 56కి దిగొచ్చాయి. కాలుష్య నివారణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు సఫార్‌, ‌సమీర్‌ ‌యాప్‌లను కూడా కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.

విద్యుత్‌ ‌వాహనాలకు ప్రోత్సాహం

దేశంలో పలు పర్యావరణ సంస్థలు విడుదల చేసిన వివిధ నివేదికల్లో, 61 శాతం గాలి కాలుష్యం వాహనాల పొగ వల్లనే ఏర్పడుతుందని వెల్లడైంది. ఇది గుర్తించిన ప్రభుత్వం, భారత్‌లో వేగంగా హైబ్రిడ్‌, ‌విద్యుత్‌ ‌వాహనాలను ప్రవేశపెట్టి, వాటి తయారీని చేపట్టడం కోసం నేషనల్‌ ఎలక్ట్రిక్‌ ‌మొబిలిటీ మిషన్‌ ‌ప్లాన్‌ ‌కింద ఫాస్టర్‌ అడాప్షన్‌ అం‌డ్‌ ‌మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌(‌హైబ్రిడ్‌) అం‌డ్‌ ఎలక్ట్రిక్‌ ‌వెహికల్స్(‌ఫేమ్‌) ‌పథకాన్ని ఆవిష్కరించింది. మార్చి 31, 2019న ఈ పథక తొలి దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండో దశ ఏప్రిల్‌ 1, 2019 ‌నుంచి ప్రారంభమైంది. దీంతో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజల డబ్బును, ఆరోగ్యాన్ని కాపాడవచ్చని భావిస్తోంది.

బ్యాటరీ నిల్వ సాంకేతికత…

అడ్వాన్స్‌డ్‌ ‌కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ)లు నూతన తరం అధునాతన నిల్వ సాంకేతికతలు. ఇవి విద్యుత్‌ ‌శక్తిని ఎలక్ట్రోకెమికల్‌ ‌లేదా రసాయన శక్తిగా నిల్వ చేయగలగడమే కాక అవసరమైనప్పుడు దానిని తిరిగి విద్యుత్‌ ‌శక్తిగా మార్చగలవు. కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, ‌విద్యుత్‌ ‌వాహనాలు, అధునాతన విద్యుత్‌ ‌గ్రిడ్లు, సోలార్‌ ‌రూఫ్‌ ‌టాప్‌ (ఇం‌టిపైన) వంటివి బ్యాటరీని భారీగా వినియోగించే రంగాలుగా ఉన్నాయి. ఇవన్నీ రానున్న సంవత్సరాలలలో భారీ వృద్ధిని సాధించగలవని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వృద్ధి రంగాలను బ్యాటరీ సాంకేతికతలు నియంత్రిస్తాయని అంచనా.

About Author

By editor

Twitter
YOUTUBE